తిరగబడ్డ కొలంబో, అధ్యక్షుడు పరారీ

 

 

*నాడు అన్నయ్య, నేడు తమ్ముడు పరారీ

*బారికేడ్లు ధ్వంసం చేసి అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న భారీ ప్రజావెల్లువ

*ఈ వార్త టైపింగ్ చేసే సమయంలో ఉద్రిక్తంగా శ్రీలంక*

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

ఈ రైటప్ ని టైప్ చేస్తున్న సమయంలో కొలంబో అగ్ని పర్వతం వలె మండుతోంది. మరో గంటలో శ్రీలంకలో ఏం జరుగుతోందో తెలియదు. పరిస్థితి మహాద్రిక్తంగా, ఉత్కంఠగా మారింది.

గత వారం రోజులుగా శ్రీలంకలో కొనసాగే వరస రాజకీయ పరిణామాల్ని పరిశీలిస్తే అదో మహాగ్ని పర్వతంలా పేలనున్నదనే సందేహం కలుగుతోంది. నిన్నటి నుంచి మరింత బలం చేకూరుస్తోంది. ఈ ఉదయం నుంచే ఏదో మహా జనప్రళయం పోటెత్తే పరిస్థితి ఉందని రాజకీయ జ్యోతిస్కులు ఊహిస్తున్నదే. ఈరోజు సూర్యోదయానికి ఊహకు అందకపోయినా, పరిస్థితి బయటకు గుంభనంగానే ఉన్నా, గంటగంటకూ ఉద్రిక్తంగా మారుతూ వచ్చింది. సూర్యుడు పైకి వస్తోన్నకొద్దీ ప్రజా వెల్లువ మండే సూర్యుడు వలె భగభగమంటూ ఎగిసి పడసాగింది. ఈరోజు మధ్యాహ్నం కొలంబోలో అధ్యక్ష భవనం ఎదుట నిర్మించిన భారీ బారికేడ్లు వద్ద జనాగ్రహ దృశ్యాల్ని చూస్తే ఏదో జరుగుననే అంచనాలకు రావడం సహజమే. అదే జరిగింది. లాఠీలు, తూటాలు, బాష్పవాయు గోళాల మస్దయా జనవాహిని బారికేడ్లు బద్దలుకొట్టింది. అధ్యక్ష భవనంలోకి జనం దూసుకెళ్లింది. రాజకీయ నిశిత పరిశీలకులు ఏదో జరుగుతుందని కొద్ది రోజులుగా ఊహిస్తున్నదే. కానీ ఇంతటి అసాధారణ జనప్రళయం కొలంబోను ముంచెత్తుతుందని వారు సైతం ఊహించలేదు.

కాకతాళీయంగానైనా సరిగ్గా రెండు నెలలకు చరిత్ర పునరావృతం ఐనది. అదీ 9వ తేదీయే. ఇదీ 9వ తేదీయే. రెండు నెలల క్రితం మే 9న దేశ ప్రధాని మహేంద రాజపక్ష పరారీ అయ్యాడు. నేడు జులై 9వ తేదీ. ఈరోజు దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్ష కూడా పరారీ అయ్యాడు. దేశ ప్రధాని మహేంద రాజపక్ష అన్నయ్య. దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్ష తమ్ముడు. 60 రోజుల క్రితం ప్రజా వెల్లువను చూసి అన్నయ్యను రాజీనామా చేయించి, తాను పీఠం కదలకుండా కూర్చుండి పోయాడు. అదో ప్రహసనం. ఈరోజు తమ్ముడు కూడా పరారీ అయ్యాడు. ఆనాటి రాజకీయ ప్రహసనాన్ని పరిహసించిన ప్రజా చరిత్ర యిది.

ప్రపంచాన్ని క్రమంగా నేడు ఆర్ధిక సంక్షోభం అవరిస్తోంది. భారత్ సహా ఏ ఒక్క దేశమూ అట్టి విషవలయం నుండి బయటపడలేని సంక్లిష్ట పరిస్థితుల్లోకి ఈడ్చబడే సంకేతాలు వెలువడటం తెల్సిందే. అందుకొక కొత్త సంకేతం తాజా శ్రీలంక!

ఈ వ్యాసం టైపింగ్ చేసే సమయంలో కొలంబోలో దేశ అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన అశేష జన సందోహపు దృశ్యాన్మి తెలిపే ఒక ఫోటోను కూడా పంపిస్తున్నా.

ఈ ప్రజావెల్లువ పై విశ్లేషణ, వివరణ, దిశా నిర్దేశం వగైరా విషయాల గూర్చి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ వెల్లువ మంచిచెడుల పై తర్వాత సమీక్షిద్దాం. కానీ ఓ పరమ నిరంకుశ, పచ్చి నియంతృత్వ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రజా చైతన్యం ఎదుట నేడు కుప్పకూలి పోతున్నది. అదో భౌతిక సత్యం. ఈ గొప్ప ప్రజా వెల్లువను సైతం సామ్రాజ్యవాద శక్తులు తమ ఆధిపత్య లక్ష్యాలకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకో జూస్తాయో, వాటి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తదితర విషయాల్ని ఆ తర్వాత చర్చిద్దాం. ముందుగా శ్రీలంక ప్రజా వెల్లువకు జేజేలు పలుకుదాం. వారి ప్రజాస్వామిక పోరాటాన్ని వేనోళ్లుగా కీర్తిస్తూ ప్రచారం చేద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *