దిక్కు తోచని స్థితిలో పోలవరం నిర్వాసితులు

ఆశలు సైతం అంతమవుతున్న వేళ…

(జువ్వాల బాబ్జీ )

అవును నిజమే, పోలవరం నిర్వాసితుల ఆశలు ఆవిరి అవుతున్నాయి. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. గోదావరి వరదలు, కాఫర్ డామ్ నిర్మాణం వలన వచ్చే బ్యాక్ వాటర్ కలిపి గ్రామాల్లో ఉండనిచ్చే పరిస్థితి లేదు. మరొక వైపు అరకొర సౌకర్యాల తో పునరావాస కాలనీల లో అక్కడ ఎలా ఉండాలి? తీరా అక్కడకు వెళ్ళాక ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తుందా? తమ సాగులో ఉన్న పోడు భూములకు నష్ట పరిహారం వస్తుందా? పెండ్లి అయిన ఆడ పిల్లల పేర్లు తిరిగి చేరుస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అధికారుల నుండి దొరకక ఆందోళన చెందుతున్నారు . ఎవరో ఒకరు వస్తారు మా గోడు వినక పోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి పరిస్థితి తెలిసి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బయట ప్రజలకు ఒక అద్భుతం. కానీ ఇక్కడ భూమి, అడవి, గ్రామాలూ, జీవనోపాధి సర్వం కోల్పోయే వారికి మాత్రం ఒక శాపం అనే చెప్పాలి.

ఏనాడైతే పోలవరం ప్రాజెక్టు శంకు స్థాపన జరిగిందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఇక్కడ ప్రజలు మనశ్శాంతిగా ఉన్నది లేదు. ప్రతిరోజూ, నా భూమికి డబ్బులు రాలేదని, లేదా నా సాగులో ఉన్న భూమికి వేరే వారి పేరు పడిందని, నాకు భూమికి భూమి ఇవ్వలేదని, నేను సాగు చేస్తున్న పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని, మా ఆడ పిల్లల పేర్లు తొలగించారని, నేను పనికోసం వేరే ఊరు వెళితే సర్వే లిస్టు లో నేను ఈ ఊరు వాడినికాదని తీసి వేసారని, భూములు చూపించారు కానీ పొజిషన్ లో స్థానిక గిరిజనులు ఉన్నారని ఇలా ఎన్నో రకాల సమస్య లు పరిష్కారం కోసం ఆర్జీలు పట్టుకొని రాజమండ్రీ, కొవ్వూరు,రంపచోడవరం, చింతూరు, జంగారెడ్డి గూడెం కాకినాడ, ఏలూరు, కోట రామచంద్రా పురం అధికారుల దగ్గరకు గత పదిహేడు సంవత్సరాలుగా నిర్వాసితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అక్కడ వారికి దొరికే సమాధానం ఒక్కటే, మీ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకు వెళతానని. ఆ పై వారు ఎవరో నిర్వాసితుల కు దొరకటం లేదు.

ఎల్ల ప్ప గూడెం నీటి ముంపు పరిస్థితి

అధికారులు వస్తున్నారు!. పోతున్నారు!! ఫలితం శూన్యం!!!.

ఎంత వేడుకున్నా ఇక్కడ పని చేసే అధికారులు నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయలేక పోతున్నారు. ఒకటీ వారికి చట్టం పై అవగాన ఉండడం లేదు. అధికారం లోకి వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్య లపై ఎలా పనిచేయాలి అనే విషయం లో చిత్త శుద్ధి లేదు. ఏదైతేనేం
నిర్వాసితుల సమస్య లు మాత్రం పరిష్కారం కావటం లేదు. ఇది చూస్తే “ఎవడికి పుట్టిన బిడ్డో వెక్కి వెక్కి ఏడుస్తుంది” అన్నట్లుగా ఉంది.

ఎల్ల ప్ప గూడెం నీటి ముంపు పరిస్థితి

సరిగ్గా 08/12/2004 నాడు అప్పటి దివంగత ముఖ్య మంత్రి శ్రీ వై యస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు భూమిపూజ కోసం వచ్చారు. ఆ రోజు వేలాది మంది గిరిజనులు మాకు పోలవరం ప్రాజెక్టు వద్దని నిరసన కార్యక్రమాలు చేశారు. పోలీస్ లు పెద్ద ఎత్తున మొ హరించారు. కొంత మంది ని అరెస్టు చేశారు. ప్రాజెక్ట్ కు అనుకూలంగా ఒక సినిమా కూడా తీశారు. ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం బాలరాజుగారు ప్రాజెక్ట్ కోసం పురుగు మందు తాగే చిన్న పాత్ర కూడా అందులో చేశారు.అయితే పాపం గిరిజన నిర్వాసితుల కోసం ఆ పని ఆయన కానీ, లేదా మాజీ ఎమ్మెల్యే మోడియం శ్రీను కానీ ఎందుకు చెయ్యరా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఖచ్చితమైన పరిష్కార మార్గాలు నిర్వాసితుల కు దొరకటం లేదు. మొదట్లో పాత భూసేకరణ చట్టం 1894 అమలులో ఉంది. కాబట్టి ప్రభుత్వం కావాలనుకుంటే మీ భూమి తీసుకోవచ్చని అధికారు లు నిర్వాసితల ను భయపెట్టారు. దానితో గ్రామాల లో ప్రజలు ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు. నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ ఈ ప్రాంతానికి వచ్చి గిరిజన నిర్వాసితుల ను కలిసి, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ వృత్తి దారుల యూనియన్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిపి నిర్వాసితుల కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్య ను జాతీయ స్థాయి కి తీసుకు వెళతానని చెప్పి ఇక్కడ సంస్థ లు, సంఘాల నాయకుల తో కలిసి ప్రభుత్వం తో చర్చలు జరిపారు. దానితో

నష్ట పరిహారం కోసం అవసరమైన జీ. ఓ. నెం:68

తేది:08/04/2005 ప్రభుత్వం ప్రకటించింది. చర్చల సందర్భంగా రాజశేఖర్ రెడ్డి తాము నిర్వాసితులు కోసం అవసరమైన దానికంటే ఎక్కువగా చేస్తామని, ఇది దేశం లో ఎక్కడా లేని జీ. ఓ.అనిగొప్పలు చెప్పారు.
అయితే, దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే అప్పట్లో మెరుగైన నష్ట పరిహారం తప్పా సమగ్ర పునరావాస విధానం కాదు.
అప్పట్లో భూమి మార్కెట్ రేటు ఎకరాకు రూ; ఒక లక్షా పదిహేను వేలు ఇచ్చారు. రైతులు నుండి భూములు తీసుకున్నారు. చేసేదేమీ లేక నిర్వాసితులు చూస్తూ ఉండి పోయారు.

ఎల్ల ప్ప గూడెం నీటి ముంపు పరిస్థితి

వారికే ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలు మేము అధికారం లోకి వచ్చిన వెంటనే గతంలో తక్కువ రేటుకు ఇచ్చిన భూములకు మరలా ఎకరాకు రూ;500000 లు ఇస్తామని ఆశలు పెంచుతూ హామీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు.

పోలవరం ప్రాజెక్టు సాగు నీరు కోసమేనా? అయితే ఎత్తిపోతల పథకాలు ఎందుకు?

చాలామంది అనుకుంటారు… పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే లక్షలాది ఎకరాలకు సాగు నీరు వస్తుందని.ప్రభుత్వం కూడా 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని డి. పి. ఆర్ లోపేర్కొంది. మరి అదే సమయంలో గోదావరి నది పై నిర్మించే ఎత్తిపోతల పథకాలు అయిన, పుష్కర, పురుషోత్తమ పట్నం, పట్టిసీమ, తాడిపూడి, చింతలపూడి కాలువల ద్వారా ఏ భూముల కు నీరందిస్తారని ఒక్కరూ ఆ లోసించక పోవడం/ ప్రశ్నించక దురదృష్ట కరం.

వరదలు వచ్చినప్పుడు మాత్రమే హడావిడి

ప్రతీ ఏడాది జూలై నెలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసి కూడా అధికారులు పునరావాస కాలనీల లో భూసేకరణ చట్టం ప్రకారం చర్యలు పూర్తి చేయటం లేదు. ఒక వైపు నిబంధన లకు విరుద్ధంగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు బ్యాక్ వాటర్ వచ్చి పూర్తిగా కొన్ని గ్రామాలూ మునిగిపోయాయి. పోలవరం మండలం లో29 గ్రామాలూ మునిగిపోయాయి. కుకునూరు మండలం లో గొమ్ముగూడెం, సీతారాం పురం, దాచారం, చీరవల్లి , ఎల్లప్పగూడెం గ్రామాలు, దేవిపట్నం మండలం లో అనేక గ్రామాలు నీట మునిగాయి. ఎంతో మంది గిరిజనులు పునరావాస కాలనీల కు గత్యంతరం లేక వచ్చారు. కొంత మంది గుట్టల పై గుడారాలు వేసుకుని అక్కడే ఉన్నారు. వారి పశువు లు తరలించుకో లేక అక్కడే వదిలి వేశారు. ఆ కోవలోనే ములగల గూడెం, తూటిగుంట, ఎర్రవరం, వాడపల్లి, కోండ్రుకోట గ్రామాలూ సంవత్సరం క్రితం వచ్చారు. కానీ ఇప్పటికీ పునరావాస కాలనీలలో ఏ పనులు పూర్తి కాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది.

రాజకీయ పార్టీల వైఖరి

మొదట్లో 2004 లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉంది, అప్పుడు వారు దీనిని జలయజ్ఞం అన్నారు. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ దానిని ధన యజ్ఞం అని విమర్శించారు.2014 లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చి సోమ వారం- పోలవరం అన్నారు. అప్పుడు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారం వారం_ పోలవరం కమీషన్ లు అని అన్నారు. ఇలా విమర్శించు కోవడమే కానీ ఇక్కడ ప్రజల కోసం ప్రశ్నించ లేదు. అయితే అందరూ శాఖాహారులే.. మరి గంపలో రొయ్యలు ఏమయ్యాయో చెప్పరు.

కుకునూరు మండలం, వెంకటాపురం పునరావాస కాలనీలో వ్యాసకర్త

భూసేకరణ లో జరిగిన అవినీతి పై  విచారణ జరపరు:

అవును, ఈ విషయం గురించి ఎవ్వరూ నోరుమెదపరు ఎందుకంటే, గిరిజన చట్టాలు కు (1/70 ) విరుద్ధం గా ఉన్న భూములకు అన్ని పార్టీల నాయకులు ,కార్యకర్తలు( నాన్ ట్రైబల్) డబ్బులు తీసుకున్నారు. అందరూ దొంగలే. ఇందులో ఏ ఒక్కరూ కూడా మినహాయింపు కాదు.ఆ పార్టీ ,ఈ పార్టీ అనేమి లేదు.కాబట్టి ఇంకా ఏమి విచారణ అడుగుతారు.

ఒకరిని ఒకరు విమర్శించు కోవడమే కానీ, కనీసం నేను పైన ప్రస్తావించిన సమస్య ల పరిష్కారం కోసం అయినా తమ తమ పార్టీ కార్య క్రమాలు చేపట్టరు. అవసరమైన ఒత్తిడి ప్రభుత్వం పైన తేవడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం ఇంటింటికీ తిరిగి మాకు ఓట్లు వేయండని అడుగుతుంటారు.

అపరిష్కృతంగా ఉన్న సమస్య లు:

భుసేఖరణ చట్టం ప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలు 25 ఉన్నాయి. కానీ ఇక్కడ కేవలం నాలుగు లేదా ఐదు రకాల సౌకర్యాలు పూర్తి చేశారు.

  1. నేను ఇటీవల 41.15 కాంటూరు పరిధిలో ఉన్న గ్రామాల కు వెళ్ళి అక్కడ ప్రజల తో మాట్లాడటం జరిగింది. అనేక మంది మాకు ఇక్కడ పని దొరకటం లేదని వాపోయారు. పోలవరం మండలం నుంచి, బుట్టాయ గూడెం మండలం, గణపవరం పంచాయితీలో పునరావాస కాలనీకి వచ్చిన పల్లపూరు గ్రామస్తులు కొండ రెడ్డి గిరిజనులు. సుమారు 52 కుటుంబాలు.వీరిలో40 కుటుంబాల వారు భూమి లేని వారు ఉన్నారు. వారి గ్రామం లో విస్తార మైన అడవి ఉంది. దానిపై ఆధారపడి బ్రతికే వారు. ఇప్పుడు పునరావాస కాలనీ లో అడవి అందుపాటులో లేదు. పశువులకు మేత లేదని అమ్మివేశారు. అక్కడ వారికి 2009 సం లో ఫారెస్ట్ రైట్స్ చట్ట ప్రకారం 722 ఎకరాలకు(వి. ఎస్. ఎస్) హక్కుపత్రాలు ఇచ్చారు. ఆ భూముల్లో జీడి తోటలున్నాయి. చట్ట ప్రకారం వాటికి నష్ట పరిహారం రావాలి కానీ ఇవ్వలేదు. వాటిని వదిలి వచ్చి ఇక్కడ ఉపాథి లేక కష్టాలు పడుతున్నారు. చివరికి గ్రామీణ జాతీయ ఉపాథి హామీ పథకం కూడా అమలు లో లేదు. చనిపోయిన వారికి స్మశాన వాటిక స్థలం లేదు.

2) పోలవరం మండలం, ఎర్రవరం గిరిజనులను జీలుగు మిల్లి మండలం లో ఉన్న పునరావాస కాలనీ కి తరలించారు.95 కుటుంబాలు. వారు వచ్చి సంవత్సరం అవుతుంది.బడి లేదు, గుడి లేదు.డ్రైనేజీ లేదు.పి.డి.యస్ షాప్ లేదు.పెండ్లి అయ్యిందని 18 సం.లు నిండిన ఆడ పిల్లల పేర్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లిస్టు నుండి 18 తొలగించారు.స్మశాన భూమి లేదు.పశువు లకు మేత భూమి లేదు.కొంత మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చారు, ఇంకా 12 మందికి ఇవ్వాలి. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు 20 మంది పిల్లలు చదువు కోసం నడిచి వెళుతున్నారు.అదే పోలవరం మండలం నుంచి వచ్చిన వాడపల్లి గ్రామస్తుల కు ఇటీవల ఒకరు చనిపోతే స్మశాన వాటిక స్థలం లేక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన వ్యసాయ భూమిలో పాతిపెట్టారు.

3) కుకూనూర్ మండలం బోనగిరి గ్రామస్తుల కు అదే మండలం లో వెంకటాపురం లో పునరావాస కాలనీ కట్టారు. సౌకర్యాల కల్పన లేదు.96 కుటుంబాలు. గతం లో కొంత మంది కి ఫారెస్ట్ రైట్స్ చట్ట ప్రకారం వ్యక్తి గత హక్కు పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు వాటికి నష్ట పరిహారం ఇవ్వలేదు. కొంత మంది సొంత పట్టా భూముల కు భూమికి భూమి గణప వరం అనే గ్రామం లో చూపించారు. పునరావాస కాలనీ కి ఈ గ్రామానికీ 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడనుండి ఇక్కడకు వచ్చి ఎలా వ్యవసాయం చేసుకుంటారో తెలియదు.ఆశ్చ ర్యమేమంటే గణపవరం కూడా ముంపులో ఉంది. ఇక్కడ భూమికి భూమి చూపించారు.

4) కుకునూర్ మండలం, మొదట ఎల్ల ప్ప గూడెం గ్రామం 41.15 కాంటూరు పరిధిలో ఉన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 76 కోయ కుటుంబాలు. తర్వాత దానికి ఎగువలో ఉన్న దామరచర్ల గ్రామం లోని గిరిజ నేతరుల పేర్లు ఎల్ల ప్పగూడెంలో చేర్చి అర్హులైన గిరిజనుల పేర్లు తొలగించారు. ఆగ్రహంతో గ్రామ సభ జరగకుండా గిరిజనులు టెంట్లు పీకేశారు. దీనికోసం గత నాలుగురోజులుగా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు.

పెంచిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ 10 లక్షల మాట:

ప్రజల నుండి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచ మని డిమాండ్ రావడం, అఖిల పక్ష కమిటీ పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలలో పర్యటిస్తారని తెలిసీ, రాష్ట్ర ప్రభుత్వం జీ. ఓ. ఆర్. టి. నెంబరు:224, తేది 30/06/2021 నాడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచినట్లు గానూ,దానికోసం రూ;550 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించింది. దానితో ఆ పార్టీ వారు గ్రామాలలో వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. కానీ పెంచిన డబ్బులు ఇప్పుడే కాదు మీరు పునరావాస కాలనీల కు వెళ్ళాక ఇస్తామంటున్నారు. అట్టు చూపించి గట్టెక్క మన్నడంటా వెనకటికి ఒకడు అట్లా ఉంది ప్రభుత్వ తీరు. ఇప్పటికే అధికార్లను నమ్మి వచ్చిన పోలవరం మండలం గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన 41.15 కాంటూరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు మాకు అన్నీ కలిపి ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదే చట్టం కూడా నిర్వాసితుల ను పునరావాస కాలనీల కు తరలించే నాటికి 6 నెలల ముందు గానే అన్ని పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

అధికారులు చట్ట విరుద్ధం గా పనిచేస్తే ప్రజలు చట్ట పరిధిలో పోరాడి హక్కులు సాధించు కోవాలి. అవసరం అయితే కోర్టులో కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలియ చేయాలి. ఇలా ఎన్నో రకాల సమస్య లు పోలవరం నిర్వాసితులు ఎదుర్కొంటున్నారు.

(జువ్వాల బాబ్జీ, అడ్వకేట్, తాడేపల్లి గూడెం, 9963323968)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *