ఆయన సంకీర్తనలు మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి కృషి
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 614వ జయంతి ఉత్సవాలు ఎప్పటిలాగే ఈ సారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని టీటీడీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అన్నమాచార్యుల వారు రచించిన సంకీర్తనలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి పెద్ద ఎత్తున కృషి జరుగుతోందని టీటీడీ తెలిపింది.
మే 16 నుండి 22వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, రాజంపేట బైపాస్ లోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మే 16 వ తేదీన తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం 10 గంటలకు శ్రీవారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. మే 16 నుండి 18వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు సంగీత,సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.
రాజంపేట బైపాస్ రోడ్డులో ఉన్న 108అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద కూడా సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా,తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 16 నుండి 22వ తేదీ వరకు ఉదయం 9 గంటలకు, రాత్రి 7 గంటలకు సంగీత కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు సాహితీ సదస్సు నిర్వహించడం జరుగుతోంది.
మహతి కళాక్షేత్రంలో మే 16 నుండి 22వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ విద్వాంసులచే గాత్ర, వాద్య, నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో పెద్ద సంఖ్యలో భక్తులు, అన్నమాచార్య సంకీర్తనల ప్రియులు పాల్గొంటున్నారు.
గత ఏడాది కాలంలో అన్నమాచార్య సంకీర్తనల్లోని 1 నుంచి 512 సంకీర్తనలకు అర్థ, తాత్పర్యంతో పుస్తకం ప్రచురించడానికి టీటీడీ ప్రత్యేక కృషి చేసింది. ఈ పుస్తకం అన్నమయ్య జయంతి ఉత్సవాల్లోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా 280 అన్నమాచార్య సంకీర్తనలను కొత్తగా రికార్డ్ చేయించి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. అన్నమాచార్యుల సంకీర్తనలు అందరికీ అర్థమయ్యేలా ప్రతి పదానికి అర్థ, తాత్పర్యాలను ముద్రించే మహా కార్యం కొనసాగుతున్నది.
అదివో అల్లదివో కార్యక్రమం ద్వారా యువ కళాకారులను భక్తి మార్గం వైపు నడిపించడానికి అన్నమయ్య సంకీర్తనలపై పోటీలు నిర్వహించి, ఈ కార్యక్రమం ఎస్వీబీసీ లో ప్రసారం చేయడం జరిగింది.
వాస్తవాలు ఇలా ఉంటే కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తి గత ప్రచారం కోసం టీటీడీ అన్నమాచార్య జయంతి వేడుకల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది.