6.8 లక్షల మందితో తెలంగాణ కాషాయ సైన్యం

6.8 లక్షల మందితో కాషాయ దళం
-ఒక్కో బూత్ కమిటీకి 20 మంది సభ్యుల నియామకం
-34 వేల బూత్ కమిటీల నియామకాలను పూర్తి చేసే ప్రక్రియ ప్రారంభం
-వేములవాడ నియోజకవర్గంలో లాంఛనంగా రెండు బూత్ కమిటీల నియామకాన్ని పూర్తి చేసిన బండి సంజయ్
– బూత్ కమిటీల ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రానికి ప్రధానిని ఆహ్వానించే యోచన
-ఎములాడ రేణుకా ఎల్లమ్మ పట్నాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులందుకున్న బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికార టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందించడంలో సఫలీక్రుతమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రస్తుతం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంపై ద్రుష్టిని కేంద్రీకరించారు.

అందులో భాగంగా పార్టీకి వెన్నుముకగా భావిస్తున్న పోలింగ్ బూత్ అధ్యక్షుల నియామక ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేసిన బండి సంజయ్ ప్రస్తుతం బూత్ కమిటీల నియామకంపై కసరత్తు ప్రారంభించారు.

• రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల పైచిలుకు బూత్ కమిటీలున్న సంగతి తెలిసిందే. ఒక్కో బూత్ కమిటీకి 20 మంది సభ్యులను నియమించడం ద్వారా 6.8 లక్షలకుపైగా బాధ్యులను కదన రంగంలోకి దింపేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో శ్రీరాం నగర్(ఫాజిల్ నగర్)కు వెళ్లిన బండి సంజయ్ పోలింగ్ బూత్ అధ్యక్షులను కలుసుకున్నారు. వారితో మాట్లాడి ఒక్కో బూత్ కు 20 మంది చొప్పున రెండు పోలింగ్ బూత్ ల కు (146, 148 పోలింగ్ కేంద్రాలు) కమిటీలను నియమించారు.

• పార్టీ బలోపేతానికి సమయం కేటాయించే వారిని మాత్రమే పోలింగ్ బూత్ కమిటీలో నియమించారు. స్థానిక పోలింగ్ కేంద్రంలోని ఓటర్లను మాత్రమే సంబంధిత కమిటీలో నియమించారు. స్థానికంగా నివాసం లేని వారిని, పోలింగ్ బూత్ కేంద్రంతో సంబంధం లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆయా కమిటీల్లో అవకాశం కల్పించరాదనే నిబంధనను విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 34 వేలకుపైగా పోలింగ్ బూత్ కమిటీల నియామకంలోనూ ఇదే పంథాను కొనసాగించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

• మరోవైపు బీజేపీ విధి విధానాలను ప్రతి గడప గడపకూ తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్న బండి సంజయ్ బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల ద్వారా ప్రతి ఇంటికీ స్టిక్కరింగ్ వేసే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతి ఇంటికీ వేసే స్టిక్కర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు జేపీ నడ్డా, బండి సంజయ్ ఫొటోలతోపాటు స్థానిక జిల్లా, మండల, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీ అధ్యక్షుల ఫొటోలను ముద్రించనున్నారు. వీటోతోపాటు పార్టీ విధి విధానాలను కూడా స్టిక్కరింగ్ లో పొందుపర్చనున్నారు.

• దీంతోపాటు ఓటర్ లిస్టులోని ప్రతి రెండు పేజీలకో పన్నా కమిటీని నియమించి ఓటర్లను ఆకట్టుకునేలా కార్యాచరణను రూపొందించనున్నారు. అట్లాగే ప్రతి మూడు బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఇంఛార్జీని నియమించడంతోపాటు ఆయా బూత్ కమిటీల నిర్మాణం, పనితీరును పరిశీలించడంతోపాటు రాష్ట్ర, జిల్లా నాయకత్వం నుంచి వచ్చే ఆదేశాలు, సూచనలతో క్షేత్రస్థాయిలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ఆయా కమిటీలను సిద్ధం చేయనున్నారు. బూత్ కమిటీల నియమాక ప్రక్రియ పూర్తయ్యాక ప్రధానమంత్రి నరేంద్రమోదీని రాష్ట్రానికి ఆహ్వానించాలని బండి సంజయ్ యోచిస్తున్నారు.

• మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు వేములవాడలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. గౌడ కులస్తులు ఆరాధ్య దైవంగా భావించే అమ్మవారి ఆలయాన్ని సందర్శించడంతోపాటు పట్నాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలని వేడుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *