మహబూబ్ నగర్ జిల్లాల మూడు నెలల్లో 26 పోక్సో కేసుల నమోదు
(వెంకటేశ్వర్లు, ఎస్పీ, మహబూబ్‌నగర్)
గత నెలలో మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని(17) బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలిక ఉండే ప్రాంతానికి సమీపంలో ఉండే యువకుడు(24) ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.
ఆమెను నమ్మించి హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. బాలిక కనిపించటం లేదని తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ విషయం తెలిసిన యువకుడు బాలికను జిల్లాకేంద్రంలో వదిలి పెట్టి వెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
జిల్లాకేంద్ర సమీపంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక(15) పదో తరగతి చదువుతోంది. హన్వాడ మండలానికి బస్సు నడిపే డ్రైవర్(23)కు బాలిక ఉంటున్న ప్రాంతం వద్ద బంధువులు ఉన్నారు. అప్పుడప్పుడు అతను వెళ్లి బాలికతో చనువుగా మాట్లాడేవాడు. అలా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. బాలికను నమ్మించి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల పాటు ఆ బాలికతో గడిపిన యువకుడు తర్వాత మహబూబ్‌నగర్‌కు తీసుకొచ్చి వదిలిపెట్టాడు. తల్లిదండ్రులతో కలిసి ఆ బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువకుడిపై కేసు నమోదు చేశారు.
..ఇలా యువకులు ప్రేమ పేరుతో విసురుతున్న వలకు చిక్కి బాలికలు బలవుతున్నారు. ఏది మంచో, ఏదో చెడో తెలియని వయసులో మాయదారి మాటలకు నమ్ముతున్నారు. ఆకర్షణకు లోనై జీవితాలు చీకటిమయం చేసుకుంటున్నారు. పదో తరగతి, ఇంటర్ చదువుతున్న వయసులోనే పలువురు బాలికలు బిడ్డలకు జన్మనిస్తున్నారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోనే మూడు నెలల వ్యవధిలోనే బాలికల అహపరణ, అత్యాచారం ఘటనలపై 26 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇంకా వెలుగుచూడని ఘటనలు, పోలీసు ఠాణాల గడప ఎక్కని బాధితులు ఎందరో ఉన్నారు.
2019లో 88 పొక్సో (Protection of Children from Sexual Offences Act, 2012 (POCSO) కేసులు, 2020లో 77 కేసులు, 2021లో 118 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది కూడా జిల్లాలో పోక్సో కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
సామాజిక మాధ్యమాల ప్రభావం..
ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి వద్ద చరవాణి ఉంటోంది. వాటితో లాభాలతో పాటు నష్టాలున్నాయి. చాలా మంది విద్యార్థులు చరవాణులకు బానిసలుగా మారుతున్నాయి. ప్రతి ఫోన్‌లో అంతర్జాల సౌకర్యం ఉండటంతో సామాజిక మాధ్యమాలు, సినిమాల ప్రభావానికి గురవుతున్నారు. చెడు మార్గాల వైపు పయనిస్తున్నారు. ప్రేమ అనే అక్షరాలకు ఆకర్షితులవుతున్నారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విలువైన బాల్యాన్ని వృథా చేసుకుంటున్నారు. వలపు వలకు చిక్కి అష్టకష్టాలు పడుతున్నారు. మోసపోయామని తెలిశాక లబోదిబోమంటున్నారు. కుటుంబాలు తీరని మనోవేధనకు గురవుతున్నాయి. అందువల్ల పిల్లలకు సాధ్యమైనంత వరకు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలి.
కొరవడిన తల్లిదండ్రుల పర్యవేక్షణ..
పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతోనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు, మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు, ఏదో వృత్తి చేయాల్సి వస్తోంది. ఫలితంగా పిల్లలపై పర్యవేక్షణ, వారితో గడిపే సమయం కూడా తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో పిల్లలు ఇతరుల వైపు ఆకర్షణకు లోనవుతున్నారు. రోజూ పిల్లల కదలికలు, నడవడిక, ప్రవర్తనపై దృష్టిసారించాలి. ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే ఆరాతీయాలి. మంచి చెడులను విడమరచి పిల్లలకు చెప్పాలి. స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గాథలు, కథలు చెప్పాలి. ఆదర్శాలు, ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లేలా బలమైన పునాదులు వేయాలి.
జీవితాన్ని చీకటిమయం చేసుకోవద్దు
విద్యార్థులు, యువకులు మంచి అంశాలపై దృష్టి సారించాలి. తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఆసక్తి చూపాలి. చదువుకోవాల్సి వయసులో ప్రేమ పేరుతో సమయం వృథా చేసుకుంటే అనేక రకాల సమస్యలు వస్తాయి. యువకులు మైనర్ అమ్మాయిలకు ఏమాత్రం ఇబ్బందులు కలిగించినా కఠినమైన చర్యలు తప్పవు. భవిష్యత్తును చీకటిమయం చేసుకోకుండా చదువుపై దృష్టిపెట్టాలి. తల్లిదండ్రుల ఆశలకు ముందుకు వెళ్లాలి. మీ జీవితాలు మీరే బంగారు బాటలు వేసుకోవాలి.