జగన్ వికేంద్రీకరణ: ఇద్దరు ప్రొఫెసర్ల వాదన

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం   2019లో ఏర్పాటయినప్పటి నుంచి పరిపాలనను  వికేంద్రీకరణ అనే మాటచుట్టూ నడిపిస్తున్నారు. పరిపాలన  ‘వికేంద్రీకరణ’ అంటూ అనేక కార్యక్రమాలు చేపట్టారు.  ముమ్మరంగా   అమలుచేస్తున్నరు. గ్రామసచివాలయాలఏర్పాటు, వైఎస్ ఆర్ చేయూత, మూడు రాజధానులు, కొత్త జిల్లాలు, వగైరా అన్నీ వికేంద్రీకరణ చుట్టు అల్లుకుంటున్నవే.

ఈ  విధానాలను  కొన్ని రాజకీయపక్షాలు విపరీతంగా ప్రశంసించడం, ఇతర పక్షాలు విపరీతంగా విమర్శించడం రోజూ చూస్తున్నాం. వికేంద్రీకరణ అనేది ఎప్పటినుంచో వినబడుతున్న చెవులకింపైన మాట. బాగా విమర్శలకు గురవుతున్న మాట కూడా ఇదే.  రాజీవ్ గాంధీ ప్రభుత్వం  1993లో స్థానిక సంస్థలను పటిష్టంచేసేందుకు  73, 74వ రాజ్యంగ సవరణలను తీసుకువచ్చింది. అవొక మైలు రాయి అన్నారు. దేశమంతా పెద్ద చర్చ జరిగింది. అయితే,  అవి అమలుఅయిన తీరుచూస్తే వికేంద్రీకరణ   అనే అందమయిన మాటని నిజాయితీగా ఆచరణలో పెట్టడం సాధ్యం కాదని అర్థమవుతుంది. అయినా సరే, ప్రభుత్వాలు ఈ వికేంద్రీకరణ జపం చేస్తూనే ఉన్నాయి. ఇపుడు ఆంధ్రలో కూాడా నిత్యం వినబడుతూన్న మాట వికేంద్రీకరణ.

2019లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా విరివిగా ప్రయోగించిన మాట వికేంద్రీకరణ. వికేంద్రీకరణ పేరుతోనే ఆయన అమరావతి స్థానంలో జ్యుడిషల్ క్యాపిటల్, ఎడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటూ మూడు రాజధానులు ప్రకటించారు. మునుపటి చంద్రబాబు ప్రభుత్వం  అమరావతి ని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటూ ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని జగన్ ప్రభుత్వం వికేంద్రీకరించింది. దీని మీద పెద్ద చర్చ ప్రారంభమయింది. ‘రాజధానిని మూడుముక్కలుచేయడం వికేంద్రీకరణ కాదు, ఇది ధ్వంసం,’ అని కొందరన్నారు. చిన్నవో పెద్దవో మూడు ప్రాంతాలకు రాజధానులను కేటాయించడం వికేంద్రీకరణ అని దాని అడ్డుకోవడం కుట్ర అని రూలింగ్ పార్టీ వాళ్లు గొడవపడ్డారు. కథ కోర్టుకు వెళ్లింది. మూడు రాజధానులు ఆగిపోయయి. చట్టాన్ని ఉపసంహరించుకున్నారు. అమరావతియే మిగిలింది. జగన్ అతి పెద్ద కార్యక్రమం అయిన రాజధాని వికేంద్రీకరణ  ఇక్కడ ఆగిపోయింది. ఇలాగే జగన్ ప్రభుత్వం వికేంద్రీకరణ అంటూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం, ఇపుడు 13 జిల్లాలను 26  జిల్లాలుగా విభజించడం చేయడం జరిగింది.

ఈ నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ ఉంది. అధికారంలో ఉన్న వైసిపి పార్టీ బలంగా సమర్థిస్తూ ఉంది. ఈ నిర్ణయాలను  పార్టీల రంగు అంటుకోకుండా పరిశీలించి ఎక్కడ తప్పు జరుగుతున్నదో చెప్పే  ప్రయత్నమూ జరుగుతూనే ఉన్నది. అయితే, తటస్థ వైఖరితో ఉండే  వాదనలు ఇపుడున్న రాజకీయ రొదలో వినిపించవు. ఇపుడు తొలిసారిగా ఇద్దరు బాగా తలపండిన పరిశోధకులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఆచార్యులు ఆ ప్రయత్నం చేశారు. ఇందులో ఒకరు  సోషాలజీ విభాగానికి చెందిన పురేంద్ర ప్రసాద్. మరొకరు ప్రస్తుతం అమెరికా మెస్సాచుసెట్స్ యూనివర్శిటీలో పనిచేస్తున్న ఆచార్యులు వంశీ వకుళాభరణం .  జగన్ వికేంద్రీకరణ ప్రాజక్టు ఎలా పనిచేస్తున్నదో  జిల్లాలలోపర్యటించి ఒక విశ్లేషణ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన  మూడు వికేంద్రీకృత విధానాలు అభివృద్ధిపరంగా, పాలనాపరంగా ప్రజలకు ఎంతవరకూ మేలు చేయగలవు అనే విషయాన్ని ప్రొఫెసర్ పురేంద్ర ప్రసాద్, ప్రొఫెసర్ వంశీ వంవకుళాభరణం పరిశీలించారు.

తమ పరిశీలన ఆధారంగా వారు రాసిన వ్యాసం ‘ఆంధ్రజ్యోతి‘ దినపత్రికలో అచ్చయింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక అంటూనే చాలామందికి ‘తెలుగుదేశం’ వాసన వేస్తుంది. ఆంధ్రజ్యోతిలో వచ్చినంత మాత్రాన ఈ ఇద్దరు మేటి ప్రొఫెసర్లు ఫీల్డ్ వర్క్ ఆధారంగా చేసిన విశ్లేషణను విస్మరించడానికి వీల్లేదు. తెలుగుదేశం అనుకూల విధానం పాటిస్తున్నా, ఆంధ్రజ్యోతి కూడా అపుడపుడు ఇలాంటి గొప్ప విశ్లేషణలకు వేదికగా ఉంటూన్నది. ప్రొఫెసర్ పురేంద్ర ప్రసాద్ గాని, ప్రొఫెసర్ వంశీ వకుళాభరణం భరణం ఒక పార్టీకి చెందిన వాళ్లు కాదు, దగ్గిర వాళ్లు కూడా  కాదు. అందుకే వాళ్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ  వికేంద్రీకరణ ప్రతిపాదనను స్వాగితిస్తూనే, ఈ నిర్ణయాల అమలులో  ఎక్కడ  పెడాదారి పడుతున్నాయో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాసం ప్రభుత్వానికి,  శాసన సభ్యులకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలు ఎలా అమలు జరగుతున్నాయో తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్న వాళ్లకు బాగా పనికొస్తుంది.  అందుకే అంతా చదవాల్సిన వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇంగ్లీష్  లో  Institute for Research on Andhra Pradesh వెబ్ సైట్ లో చదవవచ్చు.

వికేంద్రీకరణ ఎందుకు?

నిర్ణయాలు తీసుకునే  అధికారంలోనూ, సమాజ సాధికారతలో , ప్రజాస్వామ్యీకరణ ప్రక్రియలో ప్రజలని భాగస్వామ్యులు చేయడం వికేంద్రీకరణ  లక్ష్యం. ఇలా ఒకేచోట కేంద్రీకృతమయిన అధికారాల, నిధుల, నిర్ణయాలు తీసుకునే అధికారాల బదలాయింపు వల్ల సామాజిక ప్రయోజనాలు నెరవేరతాయి. మరీ ముఖ్యంగా అట్టడుగున ఉన్న మహిళల, వెనుకబడిన కులాల, మైనారిటీల, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల  ప్రయోజనాలు నెరవేరతాయి. (An essential component of decentralisation should be participation of people in decision-making, empowerment of the community and democratisation of society. This is because the transfer of powers takes place for the benefit of the community, including and especially the marginalised – women, disadvantaged castes, minorities and those from economically backward regions.)

మరిఇపుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం గర్వంగా పదే పదే చెబుతున్న వికేంద్రీకరణ వల్ల ఈ లక్ష్యం నెరవేరుతున్నాదా, ఈ ప్రయోజనాలు నెరవేరతున్నాయా అనే విషయం  వారు పరిశీలించారు. వారి పరిశీలనలో ఏం వెల్లడయిందంటే…

గ్రామసచివాలయాలు

ఏపీ ప్రభుత్వం గ్రామ–వార్డు సచివాలయాల ఏర్పాటు మంచి నిర్ణయం. అయితే, ఇది ప్రజలకు సాధికారతని కల్పించే విధంగానూ, స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపుకి దోహదపడే విధంగానూ ఉందా అంటే లేదని వారు చెప్పారు. ఎలాగంటే…

“ఇక రైతు భరోసా కేంద్రాలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరాను సులభతరం చేయడం కంటే మరిన్ని కొత్త అడ్డంకులను సృష్టిస్తున్నాయి. ఎందుకంటే, ఈ కేంద్రాలు ప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని కంపెనీల వ్యవసాయ ఇన్‌పుట్‌లను మాత్రమే నిల్వ చేస్తున్నాయి. రైతులు వీటిని మాత్రమే కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా రైతులు మాకు వెల్లడించారు. ఇంతకుముందు, స్థానిక డీలర్లు ఈ ఇన్‌పుట్‌లను అప్పు రూపంలో ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా నిర్దిష్ట కంపెనీల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నది. పైగా నగదు చెల్లించిన వారికి మాత్రమే ఈ ఇన్‌పుట్‌లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందువల్ల చిన్న, సన్నకారు, కౌలు రైతులకి ఈ కేంద్రాల వద్ద ఇన్‌పుట్‌ ఎంపికకు పెద్దగా ఆస్కారంగానీ, కొనుగోలుకి వెసలుబాటుగానీ లేకుండాపోయింది.”

వైఎస్ ఆర్ చేయూత

ఇలాంటిదే వైఎస్ ఆర్ చేయూత పథకం. “వై‍ఎస్‌ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల్లో ఎంట్రప్రెన్యూర్షిప్‌నీ ప్రోత్సహించడానికి రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, పీ అండ్ జీ, ఐటిసి వంటి కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా, రిలయన్స్ కంపెనీ తన కొన్ని సర్వీసులని గ్రామ సచివాలయాల ద్వారా సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి గమనిస్తుంటే, ఈ విధానాలన్నీ కార్పొరేట్లు సునాయాసంగా పల్లెల్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసేందుకా అన్న ప్రశ్న తలెత్తకమానదు.” అని వ్యాఖ్యానించారు.

మూడు రాజధానుల కార్యక్రమం

ఇక అమరావతి స్థానంలో మూడు ప్రాంతాల అభివృద్ధి, మరీ ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి పేరిట, ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల వికేంద్రీకరణ ప్రక్రియ మొదలుపెట్టింది.  “అయితే, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన భూసమీకరణలో భాగమై ఉన్న చిన్న సన్నకారు రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుందో ప్రస్తుత ప్రభుత్వం నిర్దిష్టంగా చెప్పడంలేదు. ఈ పరిస్థితుల వలన, రాజధాని ప్రాంతంలో ఉన్న కౌలుదార్లు, భూముల్లేని దళితులు, వ్యవసాయ కూలీలైన స్త్రీలు ఎక్కువగా నష్టపోయారు. ఇప్పటికే నిర్వాసితులైన రైతులు, జీవనోపాధి కోల్పోయిన రోజువారీ కూలీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనూ ఇవ్వకపోగా, వారి నిరసనల్ని అణచివేయడం ఈ ప్రభుత్వం నియంతృత్వ ధోరణులకి సంకేతం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో భూ బదిలీలకు– అంటే అమ్మకాలకు, ఆక్రమణలకు, కొనుగోళ్లు, తనఖాలకు, భూ సమీకరణకు విశాఖపట్నం కేంద్రంగా మారింది. ఏపీ ప్రభుత్వం కొండలను దూకుడుగా ఆక్రమించుకోవడం, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టడం, విశాఖపట్నం కొత్త గ్రోత్ ఇంజనుగా మారుతున్నదనే సాకుతో భూ లావాదేవీలను సులభతరం చేయడం చూస్తుంటే, టీడీపీ హయాంలో చేపట్టిన అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు దూరమైన వారంతా ఇప్పుడు విశాఖపట్నాన్ని ప్రత్యామ్నాయ ‘అభివృద్ధి నమూనా’గా ఎంచుకున్నారా అన్న అనుమానం కలగక మానదు.

అంతేగాక– ఉపాధి కల్పించే కార్యకలాపాలపై, అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం, కార్పొరేట్‌లకు ప్రయోజనం చేకూరేలా భూ ఒప్పందాలు చేయడం, ‘పేదలకు ఇళ్ల స్థలాల’ పేరుతో దళితుల నుంచి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలన్నీ ప్రభుత్వ అసమగ్ర ఆర్థిక విధానాలకు అద్దం పడుతున్నాయి,” అని  వారు వ్యాఖ్యానించారు.

కొత్త జిల్లాలు ఎలా ఏర్పాటవుతున్నాయి?  

ఇక కొత్త జిల్లాల ఏర్పాటు  పార్లమెంటరీ నియోజకవర్గాలనే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రాతిపదికగా చేసుకోవడమే ఒక ప్రధాన తప్పిదమని ప్రొఫెసర్ పురేంద్ర ప్రసాద్, ప్రొఫెసర్  వంశీ వకుళాభరణం అన్నారు. ప్రజా సంప్రదింపులతో, ప్రతి ప్రాంత భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యతలు, సహజ వనరులు, నీటిపారుదల సౌకర్యాలను పరిగణించి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేసి ఉండాల్సింది. అలా చేయకుండా  కొత్త జిల్లాలను ఏర్పాటుచేయడంతో అనేక ప్రదేశాలు కొత్త  జిల్లాల ప్రధాన కార్యాలయాల నుంచి చాలా దూరంలో పడిపోయాయి . “పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 (పెసా), అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన గ్రామసభలకు ఉన్న సార్వభౌమాధికారాన్ని కొత్త జిల్లాల ప్రక్రియలో పరిగణలోకి తీసుకోలేదు. అందుకే, కొత్త జిల్లాల ఏర్పాటు తమ హక్కులను కాలరాస్తుందని ఆదివాసీలు భయపడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకోసం అవసరమయ్యే కొత్త కొత్త నిర్మాణాల వలన భూ సేకరణలు, రియల్‌ ఎస్టేట్ మార్కెట్, భూమి విలువ పెరగడం వంటివి ఊపందుకుంటాయి. పర్యవసానంగా, ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురవుతాయి. ఇది మరో సమస్య.” అని వారు పేర్కొన్నారు.

 ముగింపు

ప్రజాస్వామ్యయుతంగా వికేంద్రీకరణ జరపటమన్నది ఖచ్చితంగా అవసరం అని చెబుతూ  అదేమంత కష్టసాధ్యమయింది కాదని వారు అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణ అనేది  ప్రాంతీయ అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, పర్యావరణ సమతుల్యతని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పరిచే ప్రాంతీయ అభివృద్ధి బోర్డుల వల్ల మాత్రమే సాధ్యమవుతుందని కూడా వారు సూచించారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరూట్ లో వెళ్లకుండా  కార్పొరేట్లకు, రియల్‌ ఎస్టేట్ వ్యక్తులకి, రాజకీయంగా లబ్ధిపొందాలని చూసే ఉన్నత కులాల, వర్గాల వారికి మాత్రమే ఉపయోగపడే అభివృద్ధి బాట పట్టింది. ఇలాంటి నమూనా అమలు చేస్తే  ప్రయోజనం ఉండదని వారు అభిప్రాయపడ్డారు.

(ప్రొఫెసర్ పురేంద్ర, ప్రొఫెసర్ వంశీ రాసిన పూర్తి వ్యాసం ఇక్కడ ఉంది.)

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *