వర్ల రామయ్య చెప్పే ‘ఇన్ సైడ్’ స్టోరీ నిజమేనా?

“పద్మ వ్యూహంలో ముఖ్యమంత్రి జగన్! ఆ ఆరుగురిలో ఎవరిని పీకినా   ముప్పు తప్పదు. తేనేతుట్టెను కదిపారు, ఇక మీకు ఆ దేవుడేదిక్కు”

( వర్ల రామయ్య)

రాష్ట్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు. ప్రస్తుత మంత్రివర్గంలో కీలకమైన ఆరుగుర్ని తొలగిస్తే ఆయన పదవికి ముప్పు తప్పేలా లేదు. మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో ఆయన ఒకరకంగా తేనేతుట్టెనే కదిలించారు. 2019 జూన్ 6న జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. రెండున్నరేళ్ల తర్వాత పూర్తి మంత్రివర్గాన్ని మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే కీలకమైన ఓ ఆరుగురు మంత్రులను తొలగిస్తే ఆయన పీఠం కదిలిపోయేలా ఉంది. నిన్న నంద్యాల సభలో గౌరవ ముఖ్యమంత్రి ఎవరూ నా వెంట్రుక పీకలేరు అన్నారు. తాజా పరిస్థితులను బేరీజువేస్తే ఆ మాట మంత్రివర్గం విషయంలో ఆయనకే వర్తించి ఎవరినీ పీకలేని పరిస్థితులు నెలకొన్నాయి.

1). పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: ఈయనకు అధికారపార్టీ శాసనసభ్యుల్లో ముఖ్యమంత్రితో సమానమైన బలం ఉంది. ఈయనను తొలగిస్తే జగన్ కు పదవీగండం ఖాయం. ప్రభుత్వం అతలాకుతలమవుతుంది.

2). బొత్స సత్యనారాయణ: తెరవెనుక అగ్గిపెట్టడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య, వైఎస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వరకు కాంగ్రెస్ హయాంలో ఈయన ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా తెరచాటున చేసిన రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఈయనను తొలగిస్తే అసంతృప్తివాదులను కలుపుకుని సిఎంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారు.

3). ధర్మాన కృష్ణదాస్: ఈయన ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జలను కలిసి తన కుటుంబానికి కాకుండా మరొకరికి ఆ జిల్లాలో మంత్రి పదవి ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి.

4). ఆదిమూలపు సురేష్: గతంలో ఇన్ కంటాక్స్ విభాగంలో పనిచేసిన నేపథ్యంలో డిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడి)లోని కొందరు అధికారులతో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిపై ఉన్న ఈడి కేసుల విచారణ వేగవంతమవుతున్న నేపథ్యంలో సురేష్ ను తొలగిస్తే లాబీయింగ్ చానల్ దెబ్బతిని మొదటికే మోసం రావచ్చు.

5). బాలినేని శ్రీనివాసుల రెడ్డి: ముఖ్యమంత్రి జగన్ కుటుంబంలో విభేదాల తర్వాత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల హైదరాబాద్ వెళ్లిపోయాక జగన్ వద్ద ఉన్న ఏకైక కుటుంబీకుడు. పైగా సిఎంకు బినామీగా ఉంటూ నల్లధనాన్ని తమిళనాడు గుండా విదేశాలకు తరలించి వ్యవహారాలను చక్కబెడుతున్నట్లుగా చెప్పబడుతున్న ఈయనను కదిలిస్తే ఆ డొంక కదిలి సిఎం మరికొన్ని కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.

6).  కొడాలి నాని: ముఖ్యమంత్రి జగన్ తన ప్రత్యర్థి చంద్రబాబును తిట్టడం కోసమే ఆ సామాజికవర్గం నుంచి ఇతడ్ని పెట్టుకున్నారు. అతడ్ని తొలగిస్తే గత మూడేళ్లుగా తనను ముఖ్యమంత్రి ఏవిధంగా ఉపయోగించింది ఆయన బయటపెట్టే అవకాశమున్నందున సిఎం కొడాలిని తొలగించే సాహసం చేయలేరు.

ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేయడం కొరివితో తలగొక్కోవడమే. ప్రస్తుతం సిఎం జగన్ పరిస్థితి ముందునుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఇప్పటి పరిస్థితుల్లో ఆయనను ఆ భగవంతుడే కాపాడాల్సి ఉంటుంది. 151మందితో అత్యంత బలమైన వాడిగా చెప్పుకునే సిఎం అత్యంత బలహీనుడని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పై ఆరుగురిలో ఏ ఒక్కరినీ తొలగించే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు.

(వర్ల రామయ్య, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *