‘టీఆర్ఎస్ వడ్ల రాజకీయం కుట్ర’

బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కు. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా ప్లాన్

-బండి సంజయ్

యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసివేయడం వెనుక మహా కుట్ర దాగి ఉంది. పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో పనిలేకుండా తక్కువ ధరకే బ్రోకర్లకు (దళారులకు) అమ్ముకునేలా రైతులకు అనివార్య పరిస్థితులు స్రుష్టించి పెద్ద ఎత్తున లబ్ది పొందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పథకం రచించారు. బ్రోకర్ల మాఫియాతో కలిసి పెద్ద స్కెచ్ వేశారు. దీనివెనుక వందల కోట్ల రూపాయలు కమీషన్ల పేరిట ప్రభుత్వ పెద్దలకు ముట్టబోతున్నాయి. యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం అందులో భాగమే. అయితే రైతులు పంట ఎందుకు కొనడం లేదని నిలదీసే అవకాశం ఉన్నందున… ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది బదనాం చేయడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు పేరిట డ్రామాలాడుతున్నారు.

• క్వింటాలు వడ్లకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే కనీస మద్దతు ధర 1960 రూపాయలు. ఇప్పటికే రైతుల పంట చేతికొచ్చింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వడ్లు మార్కెట్ కు రావడం మొదలైంది. ఐకేపీ కేంద్రాలు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తెరవకపోవడంతో రైతులు మిల్లర్ల వద్దకు పోతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు మిల్లర్లు క్వింటాలు వడ్లను 1300 నుండి 1660 రూపాయలలోపే కొనుగోలు చేస్తున్నారు. తెచ్చిన అప్పులను తీర్చేందుకు, కుటుంబ అవసరాల కోసం రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్లు చెప్పిన ధరకే వడ్లు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది. దీంతో రైతాంగం క్వింటాలు వడ్లకు 300 నుండి 660 రూపాయల దాకా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.

• రాష్ట్రంలో యాసంగి పంట ద్వారా ఈసారి కోటి మెట్రిక్ టన్నుల వడ్ల ఉత్పత్తి జరిగింది. కనీస మద్దతు ధర దక్కకపోవడంవల్ల రైతులు వందల కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ స్కాంలో ప్రభుత్వ పెద్దలకు ప్రతి క్వింటాలుకు వంద రూపాయల చొప్పున వందల కోట్ల కమీషన్ ఇచ్చేలా కొందరు రైస్ మిల్లర్ల మాఫియా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.

• కనీస మద్దతు ధర దక్కకపోతే రైతుల నుండి పెద్ద ఎత్తున ఆగ్రహం పెల్లుబికే అవకాశం ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పెద్దలు కేంద్రం వడ్లు కొనేందుకు సిద్దంగా లేదనే దుష్ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చి నిరసనలు, ఆందోళనల పేరిట రాజకీయ డ్రామాలాడుతున్నారు. కేంద్రాన్ని బదనాం చేయడం ద్వారా టీఆర్ఎస్ పైకి వ్యతిరేకత రాకుండా చూసుకోవడంతోపాటు తద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా వందల కోట్ల రూపాయల కమీషన్లను మిల్లర్ల నుండి దండుకోవచ్చనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ డ్రామాలకు తెరదీశారు. విజ్ఝులైన రైతు సోదరులు వాస్తవాలను గమనించాలని కోరుతున్నా.

• వడ్ల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది. తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి గింజను కొనేందుకు సిద్దంగా ఉంది. ఈ విషయంలో ప్రతి ఏటా దేశమంతటికీ అవలంబిస్తున్న విధానాన్నే కేంద్రం ఈసారి కూడా అనుసరిస్తోంది. కల్లాల వద్ద వడ్లు సేకరించి మిల్లింగ్ చేసి బస్తాలు నింపి మిల్లులకు తరలించి బియ్యం ఆడించేదాకా అవసరమయ్యే సుతిలీ, కాంటా, రవాణా, హమాలీ ఛార్జీలు సహా వడ్లు బియ్యంగా మారి ఎఫ్ సీఐకి చేరే వరకు అయ్యే ప్రతి రూపాయి కేంద్రమే చెల్లిస్తోంది. ఈ బాధ్యతను నెరవేర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అదనంగా కమీషన్ కూడా చెల్లిస్తోంది.

• కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుండి ఈ ఏడాది ఖరీఫ్ నాటికి వడ్ల కొనుగోలు కోసం తెలంగాణ ప్రభుత్వానికి గత ఏడేళ్లలో 97 వేల 575 కోట్ల రూపాయలకుపైగా చెల్లించింది. బియ్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. దేశంలో ఎక్కడా లేని వడ్ల కొనుగోలు సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? కేవలం రాజకీయ లబ్ది కోసం కేసీఆర్ స్రుష్టించిన సమస్యే తప్ప మరొకటి కాదని రైతు సోదరులు అర్ధం చేసుకోవాలని కోరుతున్నా.

• రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను గత ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెబుతున్న కేసీఆర్… ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయిస్తున్నారు? ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు మూసివేశారు? వడ్లు సేకరించి బియ్యంగా మార్చి కేంద్రానికి అప్పగిస్తామని ఖరీఫ్ కు ముందే ఎఫ్ సీఐతో ఒప్పందం చేసుకున్న కేసీఆర్ మాట తప్పారు. యాసంగి పంట కొనుగోలుకు సంబంధించి కేంద్రం ఈ ఏడాది(2022) ఫిబ్రవరి 25న అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత బియ్యం పంపుతారనే వివరాలను కూడా సమర్పించకుండా కేంద్రమే కొనాలంటూ కిరికిరి పెడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడం సిగ్గు చేటు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే నాటి సమావేశ మినిట్స్ వివరాలను వెల్లడించాలి. లేనిపక్షంలో ఆ వివరాలను వెల్లడించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.

• కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కూడా 2021 అక్టోబర్ 4న కేంద్రంతో ఒప్పందం చేసుకుని సంతకం చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి బాయిల్డ్ రైస్ మాత్రమే పంపుతామని చెబుతోంది. పైగా మెడమీద కత్తి పెడితే సంతకం చేశామంటూ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్దాలు చెబుతూ తెలంగాణ పరువు తీస్తున్నడు. అసలు ఒప్పందం ప్రకారం బియ్యం ఇవ్వాలని చెబుతున్న కేంద్రం ద్రోహినా? ఒప్పందాన్ని ఉల్లంఘించి తప్పుడు ప్రచారం చేస్తూ బాయిల్డ్ రైస్ మాత్రమే పంపుతామని కిరికిరి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ద్రోహినా?

• రైతులకు, బాయిల్డ్ రైస్ కు ఏం సంబంధం? రైతులు పండించేది వడ్లు. అవి కొని బియ్యంగా మార్చి కేంద్రానికి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది మాత్రమే. డిమాండ్ లేని, ఎవరూ తినేందుకు ఇష్టపడని బాయిల్డ్ రైస్ ను కేంద్రానికి అంటగట్టాల్సిన అవసరం కేసీఆర్ కు ఎందుకొచ్చింది? కొంతమంది బ్రోకర్లతో కుమ్మక్కై కేంద్రాన్ని బదనాం చేస్తూ రాష్ట్ర రైతాంగాన్ని అయోమయంలోకి నెడుతున్నరు.

• తెలంగాణ నుండి రా రైస్ (ముడి బియ్యం) ఎంతైనా కొంటామని స్వయంగా కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిండు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రా రైస్ గా మార్చి ఇస్తే తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?

• దేశంలోని చాలా రాష్ట్రాలు రైతుల పండించిన పంటకు కేంద్రం కనీస మద్దతు ధర ఇస్తుంటే….అదనంగా క్వింటాలకు 200 నుండి 500 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ చెల్లిస్తూ రైతులను ఆదుకుంటున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ పాలకులు రైతులకు బోనస్ ఇచ్చి ఆదుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోగా… బాయిల్డ్ రైస్ పేరిట రాజకీయం చేస్తూ కొనుగోలు కేంద్రాలు మూసివేసి బోనస్ సంగతి దేవుడెరుగు కనీస మద్దతు ధర కూడా అందకుండా రైతులకు తీవ్ర నష్టం చేస్తోంది.

• వరి విషయంలో కేసీఆర్ ఆడినన్ని అబద్దాలకు అంతూపొంతూ లేదు. రైతులు ఇకపై సన్న వడ్లు మాత్రమే పండించాలని 2020 అక్టోబర్ 31న ప్రకటన చేశారు. సన్న వడ్లు పండిస్తే కనీస మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.150 వరకు రైతు సమితిల ద్వారా ఎక్కువ ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నమ్మి వరి పండించిన రైతాంగాన్ని నట్టేట ముంచిన ఘనుడు కేసీఆర్.

• 2021 సెప్టెంబర్ 12న ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి వరి వేస్తే ఉరేసుకోవడమే, యాసంగిలో వరి పంట వేయొద్దని, ఎవరైనా వరి పండిస్తే వాళ్లకు ‘రైతు బంధు’ కట్ చేస్తానని ప్రకటించి యావత్ రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసిన దుర్మార్గుడు కేసీఆర్.

• గత ఏడాది నవంబర్ 29న మంత్రులతో కలిసి ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రకటించడమే కాకుండా యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లు చెప్పి రైతులను అయోమయంలో పడేసిన నీచుడు కేసీఆర్.

• వడ్ల విషయంలో మమ్ముటికీ తప్పు చేసింది ముఖ్యమంత్రి కేసీఆరే. ఆ తప్పును సరిదిద్దుకుని విజ్ఝత ప్రదర్శించాల్సిన సీఎం అందుకు భిన్నంగా రాజకీయ లబ్ది కోసం కేంద్రాన్ని బదనాం చేస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తున్నరు. రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తూ సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నరు. యాసంగి పంట చేతికొచ్చే సమయంలో రైతులు తమ పంటను ఎట్లా అమ్ముకోవాలో తెలవక బాధపడుతుంటే…. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రే ఢిల్లీకి పోయి ధర్నాలు, ఆందోళనల పేరిట రాజకీయం చేస్తూ సమస్యను మరింత జఠిలం చేయడం ఎంతవరకు కరెక్ట్ ?

• వడ్ల పేరుతో మరోసారి ‘తెలంగాణ సెంటిమెంట్’ ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డ్రామాలను తెలంగాణ రైతాంగం గమనించాలి. మంచి చేస్తాడని ఓట్లేస్తే… లేని సమస్యను స్రుష్టించి రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీ నేతలకు తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. విజ్ఝులైన తెలంగాణ రైతు సోదరులారా…. న్యాయ నిర్ణేతలు మీరే….ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ మెడలు వంచేందుకు బీజేపీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నా….

(తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రైతులకు రాసిన బహిరంగ లేఖ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *