ఇది 55 ఏళ్లుగా నడుస్తున్న సూపర్ హిట్ దోసె అడ్డా

Rural Street Food 

రాజమ్మ దోశెకు యాభై ఐదు యేళ్లు. ఐదు దశాబ్దాలు దోసెలువేసి  పైసల్లో కాదుగాని, ఆదరాభిమానాల్లో రాజమ్మ సంపన్ను రాలయింది.

(భూమ‌న్‌)

అదేమి వ‌శీక‌ర‌ణ మంత్ర‌మో కానీ, తిరుప‌తి నుంచి మ‌ద‌న‌ప‌ల్లెకు బ‌స్సులో, కారులో, బైకులో పోయినా చిన్న‌గొట్టిగ‌ల్లు చెరువుకు ముందుగా, ఎడం వారిప‌ల్లె ద‌గ్గ‌ర, భార‌తం మిట్ట ఎదురుగా ఉండే రాజ‌మ్మ టిఫిన్ సెంట‌ర్ వ‌ద్ద విధిగా ఆగ‌క త‌ప్ప‌దు.

రాజ‌మ్మ టిఫిన్ సెంట‌ర్ దాదాపు 55 సంవ‌త్స‌రాలుగా బాట‌సారుల క‌డుపాత్రం తీరుస్తున్న‌ది. పెద్దాయ‌న త‌రువాత రాజ‌మ్మ‌, ఆమె కోడ‌లు జ‌యంతి అత్యంత దిగ్విజ‌యంగా న‌డుపుకొస్తున్నారు. పెళ్లయిన ఏడేళ్లకే ఆమె దోసె సెంటర్లో ప్రవేశించిందట. భర్తకి ఏమీ చేయలేడని ఆమె వ్యాపారంలోకి దిగింది. అప్పటినుంచి ఆమెయే సొంతంగా నెట్టుకొస్తూ ఉంది. ఇపుడు కోడలు జయంతి తోడయింది.  విరామమెరగని జీవనపోరాటం ఆమెది. వీళ్లంతా నిత్యజీవిత  వీరవనితలు

యాభై ఏళ్ళుగా ఈ దారిలో నేను వంద‌ల సార్లు ప్ర‌యాణం చేసినా, ఈ అద్భంత‌మైన టిఫిన్ సెంట‌ర్ ప‌దేళ్ళ క్రిత‌మే ప‌రిచ‌య‌మైంది. Simply I am mad at it . ప్ర‌యాణాల్లోనే కాకుండా అదే ప‌నిగా 40 కిలోమీట‌ర్ల దూరం పోయి దోసెలు తినొచ్చిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు.

వంటలన్నీ కట్టెలపొయ్యి మీదే

ఈమె అదేం మాయ చేస్తుందో తెలియ‌దు కానీ, క‌ట్టెల పొయ్యిమీద స‌న్న‌ని మంట మీద దోసెలు అన్ని వైపులా కాలి బ్రౌన్ రంగుకు వ‌చ్చిన త‌రువాత‌నే ప్లేట్‌లోకి దించుతుంది. ఇహ దాంతోపాటు ఆమె వేసే ఆ చెనిగ్గింజ‌ల ఊరుబిండి నా సామిరంగా ఇంత వ‌ర‌కు నేనెక్క‌డా అట్లాంటి రుచిని ఆస్వాదించ‌లేదు.

అద్వితీయ‌మైన కాంబినేష‌న్‌. రెండు చాల‌నుకున్న వాళ్ళు ఒక మెట్టు పైకెగ‌బాక‌వ‌ల‌సిందే. ఆ ఊరుబిండిని ప్ర‌త్యేకంగా కొనుక్కుపోయే వారిని ఎంద‌రినో చూసినాను. సాదా దోసె, గుడ్డు దోసె, కారం దోసె, ఇడ్లీ, వ‌డ దొరుకుతాయి. వ‌రుస‌గా 20, 35, 25, 8,7 రూపాయ‌ల‌కు అమ్ముతుంది. నా అనుభ‌వంలో మ‌నిషిని బ‌ట్టి ధ‌ర‌ల్లో మార్పు ఉంటుంది. నా మ‌టుకు ధ‌ర‌ల ఊసే రాదు. అంత‌టి రుచికి ధ‌ర దిగ‌దుడుపే. మ‌రీ ఆ ఊరుబిండిలో ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా దంచ‌డం వ‌ల్ల మిర‌ప‌కాయ‌లు అక్క‌డ‌క్క‌డా ప‌చ్చిగా క‌నిపిస్తూ సంద‌డి చేయ‌డ‌మే గాకుండా, జిహ్వ చాప‌ల్యాన్ని మ‌రింత తీరుస్తుంది.

ఆ ఆపేక్ష‌కు రెండు దోసెలు ఎక్స్‌ట్రా తినాల్సిందే ఎవరైనా…

ర‌హ‌దారికి ఆనుకుని ఉండ‌టంతో ఆ దుమ్ము , ధూళిలో ఏం తింటాములే అనే ఆలోచ‌నే ఇంత‌మ‌టుకు రాలేదు. వేడి వేడిగా ఆ కారం ద‌సెతో క‌న్నీళ్ళు కారి, ఊరుబిండిలో ప‌డి ప‌లుచ‌గా త‌యార‌యి నంజుకు తింటుంటే ఉంటుంది మ‌జా- ఆ ఘ‌టోత్క‌చుడు దిగిరావాల్సింది.

అతిగా అనుకోమాకండి. నేను చూసిన‌, రుచి చూసిన‌, అనుభ‌వించిన Street foods లో అత్యంత రుచిక‌ర‌మైన‌ది రాజ‌మ్మ హోట‌ల్‌. నేను పోయిన‌ప్పుడ‌ల్లా రాజ‌మ్మా నీ దెబ్బ‌కు పొట్ట‌పెరిగేట్టుగా ఉందంటే, దాన్దేముందిలే సారూ తిరిగి తిరిగి క‌రిగించుకుందురుగాని, ఇంత దూరం వ‌స్తున్నారు అని కొస‌రివ‌డ్డిస్తున్న ఆ రాజ‌మ్మ ఆప్యాయ‌త‌కు, ఆపేక్ష‌కు రెండు దోసెలు ఎక్స్‌ట్రా తినాల్సిందే.

కొసరి కొస‌రివ‌డ్డించడం రాజ‌మ్మ మర్యాద

ఇడ్లీ, వ‌డ ఎంత బాగున్నా, నాక‌యితే ఆ దోసె, ఊరుబిండి ముందు దిగ‌దుడుపే. ఎప్పుడు ఏ గంట‌కు పోయినా తొక్కిడిగానే ఉంటుంది. పేప‌రు మీద ఇస్త‌రాకు ప‌రిచి ఇస్తున్న‌ది. హైజినిక్‌గా ఉంటున్న‌ది. కొన్ని ప‌దుల సంఖ్య‌లో కార్లు ఆగ‌డం, అటు బెంగుళూరు, బ‌ళ్ళారి, తిరుప‌తి నుండి వ‌చ్చే వాళ్ళ‌తో పొద్దున 7 గంట‌ల నుండి ఉరువులు అయిపోయేంత‌వ‌ర‌కు కిట‌కిట‌లాడుతుంటుంది మా కిష్ట‌మైన రాజ‌మ్మ సెంట‌ర్‌.

కుర్రాళ్లూ ఎగబడుతుంటారు….

అంతే కాదు, మ‌ద‌న‌ప‌ల్లెలో నా భార్య వాళ్ళింట్లో పోరుకు కూడా కార‌ణం రాజ‌మ్మే. టిఫిన్‌కు ఈ ప‌దేళ్ళ‌లో ఎప్పుడూ అక్క‌డికి పోయింది లేదు. నిష్టుర పోతున్నారు. పైగా తిరుగు ప్ర‌యాణంలో త‌ప్ప‌నిస‌రిగి రాజ‌మ్మ ద‌గ్గ‌ర పులుంట‌లు; వీటిని పులిబొంగ‌రాలు అంటారు తిని రావాల్సిందే. అదే మా డిమాండ్‌. పులుంట‌లు ఎవ‌రైనా, ఎక్క‌డైనా ఇంత‌క‌న్నా బావుంటాయ‌నుకుంటే అదొక ఛాలెంజ్‌.

ఎపుడూ రష్షే …

 

 సీనియర్ సిటిజన్లకు ఒక మాట

సీనియర్ సిటిజన్లు ఆహారం విషయంంలో జాగ్రత్తగానే ఉంటారు. ఉండాలి కూడా. అయితే, రాజమ్మ టిఫిన్ సెంటర్లో సీనియర్ సిటిజన్లు నిస్సంకోచంగా దోసెలు, ఇడ్లీలు, చట్నీలు ఆరగించవచ్చే. ఇందులో అన్ని దినుసులు సమపాళ్లలోనే ఉన్నాయి. ఉప్పు కారం ఎంత ఉండాలో అంతే ఉన్నాయి. ఏ విషయంలో అతి లేదు. నూనె కూడా మంచినూనే వాడుతున్నది. నూనే విషయంలో కూడా రాజమ్మ జాగ్రత్త తీసుకుంటూనే ఉంది. అందువల్ల వయసుతో నిమిత్తం లేకుండా  క్యాలరీలులెక్కేసుకోకుండా హాయిగా సీనియర్ సిటిజన్లు కూడా రాజమ్మ టిపిన్ సెంటర్ కు రావచ్చు. రాజమ్య మాటకారి తనం,  హంగుల్లేని చిన్న  సింపుల్ హోటల్… ఒక అందమయిన స్పెక్టకిల్ అంటే నమ్మండి…

టూరిజం వాళ్లు, ఆర్టీసి వాళ్లు ఇలాంటి రూరల్ టిఫిన్ సెంటర్లను ప్రోత్సహించాలి.

స్ట్రీట్ ఫుడ్స్ క‌ల‌కాలం వ‌ర్దిల్లు గాక‌. రాజ‌మ్మ దోసె ముందు ముందు ఇదే ప‌ద్ధ‌తిలో కొన‌సాగుతూ, రాబోవు త‌రాల వారిని త‌రింప చేస్తుంద‌ని ఆశిద్దాం.
జ‌య‌హో రాజ‌మ్మ దోసె.

(భూమన్,చరిత్ర పరిశోధకుడు, సామాజిక ఉద్యమకారుడు, అన్నింటికి మించి ప్రకృతి ప్రేమికుడు, తిరుపతి)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *