UN లో ఇండియా, పాక్, చైనాల ఐక్యత !

 

ఐక్యరాజ్య సమితిలో లో ఇండియా, పాక్, చైనా ల ఐక్యత దేనికి సంకేతం?కొత్త ఆలోచనల్ని రేకెత్తించే సందర్భం పై ఒక చిన్న వ్యాఖ్య!

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

ఉక్రెయిన్ సమస్య పై నిన్న బుధవారం రాత్రి UNO సాధారణ సభ అసాధారణ స్థాయిలో ఏర్పాటైనది. ఇలా UNO చరిత్రలో అత్యవసరంగా జరగడం ఇది 11వ సారి! UN జనరల్ అసెంబ్లీ (UNGA ఉంగా) లో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ చర్యని వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం పై గత రాత్రి ఓటింగ్ జరిగింది. 193 దేశాలకు 141 దేశాలు తీర్మానానికి అనుకూల ఓటు వేసాయి. దీనిని సహజంగానే రష్యా వ్యతిరేకించింది. రష్యాతో పాటు బెలారస్, ఉత్తర కొరియా, సిరియా, ఏరిట్రియా దేశాలు కూడా వ్యతిరేక ఓటు వేసాయి. చైనా, ఇండియా, పాకిస్థాన్ లతో సహా 35 దేశాలు ఓటింగ్ కి దూరంగా OBSTAIN చేశాయి. (ఉక్రెయిన్ పై గత శుక్ర, ఆదివారాల్లో కూడా UNOలో ఇండియా ఇదే విధంగా ఓటింగ్ కి దూరంగా ఉంది)

నిన్న రాత్రి UNGA ఆమోదించిన తీర్మానం పై విశ్లేషణ చేయడం లేదు. దానిపై నేను వ్యాఖ్యలు, వ్యాఖ్యానాల్లోకి వెళ్లడం లేదు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. దాని ప్రస్తావన కే పరిమితమవుతా.

పర్యావరణ వంటి రాజకీయేతర అంశాల పై UNOలో జరిగే తీర్మానాల మాట మాట్లాడటం లేదు. వాటిపై భిన్న అగ్రరాజ్యాల మధ్య ప్రపంచం చీలిన ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సైతం ఏకగ్రీవ తీర్మానాలు సాధ్యమే! కానీ ప్రపంచం భిన్న వైఖర్లతో చీలిన ఉక్రెయిన్ సమస్యపై ఈ మూడు పొరుగు దేశాల మధ్య ఐక్యత ఎలా సాధ్యమైనది? ఇది రాజకీయ పరిశీలకుల్ని అత్యంత దిగ్భ్రాంతికి గురి చేసే సమస్య!

1947 లో దేశ విభజన జరిగింది. నాటి నుండే ఇండియా, పాకిస్థాన్ ల విదేశాంగ విధానాలు పరస్పర విరుద్ధంగా ఉండేవి. ముఖ్యంగా 1960 దశాబ్ది చివరకు నాటి రష్యా (USSR) వైపు ఇండియా మొగ్గింది. 1947 నుండే అమెరికా వైపు పాకిస్థాన్ నిలిచింది. ఇది 1970 దశాబ్దంలో స్పష్టంగా రెండు దేశాల వైదేశిక విధానాలు పరస్పర వ్యతిరేక దిశలో సాగాయి. అదో దశ!

1991లో USSR పతనం చెందింది. రెండు ధృవాల ప్రపంచ వ్యవస్థ తాత్కాలికంగా ముగిసి పోయింది. ఆ తర్వాత ఏర్పడ్డ ఏకద్రువ ప్రపంచ వ్యవస్థలో ఇండియా, పాకిస్థాన్ ల విదేశాంగ విధానాల్ని అమెరికాయే శాసించే కొత్త పరిస్థితి ఏర్పడింది. మరో కొత్త దశ ఉనికిలోకి వచ్చింది. ఈ రెండు పొరుగు దేశాల మధ్య స్థానికంగా కార్గిల్ తరహా యుద్దాలు సైతం జరిగేవి. వాటిపై UNOలో వైరుధ్యం సాగేది. అదే సమయంలో ఇరాక్, యుగోస్లోవేకియా వంటి సందర్భాలలో అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకి లాభించే తీర్మానాలకు కలిసికట్టుగా ఆమోద ముద్రలు వేసేవి. అంతర్జాతీయ రంగంలో అమెరికా అగ్రరాజ్య పాత్రని బలపరుస్తూనే తమతమ దేశాల ప్రజల్ని వంచించే నాటకీయ వైఖరిని అవి చేపట్టేవి. నిజానికి రెండు పొరుగు సోదర దేశాలు మూడవ ప్రపంచ దేశాలై ఉండి పరస్పరం ఘర్షణ పడే విధానం సరికాదని రెండు దేశాల్లోని దేశభక్తియుత, ప్రజాతంత్ర శక్తులు చెబుతుండేవి. ఇలా సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు మొదటి నుండి తమ వాణిని వినిపిస్తూనే ఉన్నాయి. ఐనా రెండు దేశాల పాలక వర్గాలు ఏ నాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా మరింత యుద్ధోన్మాదం, కృత్రిమ దేశభక్తి, విద్వేష వైఖర్లను తమతమ దేశాల ప్రజల్లో తీవ్రంగా రెచ్చగొట్టాయి. ఇప్పుడు హఠాత్తుగా ఎలా ఓకేరకం వైఖరిని చేపట్టాయి?

ప్రచ్ఛన్న యుద్ధశకం ముగిసిన తర్వాత చరిత్రలోకి వెళ్తే, ఇరాక్, యుగోస్లోవేకియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలపై UNO లో ఇండియా, పాకిస్థాన్ దేశాల్ని ఓకే దారిలో అమెరికా నిలబెట్ట గలిగింది. (అరుదుగానైనా చైనాని సైతం UNO లో అమెరికా ప్రభావితం చేసింది. అంతర్జాతీయ విధానాల్లో మూడూ ఏక దారిలో నడిచిన అరుదైన సందర్భాలూ ఉన్నాయి) కానీ ఎన్నడూ అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేక దారిలో అవి కలిసికట్టుగా నడిచిన చరిత్ర దాదాపు లేదనే చెప్పొచ్చు. కానీ అనూహ్యంగా UNO లో అలా జరిగింది. ఇదెలా సాధ్యమైనది?

ఇది ప్రపంచాన్ని కుదిపి వేసే రాజకీయ సమస్యల పై మాట! ఇలా మూడు పొరుగు దేశాలు అమెరికా చొరవతో UNO లో నిన్న ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఐక్యంగా స్పందించడం గమనార్హం! పరస్పరం చర్చించుకొని ఐక్యంగా నిలిచాయా? లేదంటే ఎవరికి వారే చేపట్టిన వైఖర్లా? అనేది ప్రశ్న కాదు. వైదేశికంగా తుది ఫలితం ఏమిటనేదే ప్రశ్న! ఇంత తీవ్ర యుద్ధ సమస్య పై ఓకే విదేశాంగ విధానం ఈ మూడు దేశాలకు ఎలా సాధ్యం అయ్యుందనేదే ప్రశ్న!

ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక తీవ్ర రాజకీయ సమస్యపై UNO వేదికలో అమెరికాని ఏకగొంతుతో విబేధించి ఉత్తర, దక్షిణం వంటి దేశాలు ఈ ఐక్యత ఎలా ప్రదర్శించాయి? వర్తమాన ప్రపంచంలో ఏ మార్పులకు సంకేతమిది? రానున్న కాలంలో ఇది ఏఏ మార్పులకు సూచిక? భౌగోళిక ప్రపంచ పటంలో అనివార్యంగా మార్పులు సంభవించి తీరాల్సిన పరివర్తనా కాలంలో ఈ అనూహ్య, అసాధారణ ఐక్యతను ఎలా విశ్లేషణ చేయాలి?

దీనిపై విశ్లేషణలోకి ఇప్పుడు వెళ్లడం లేదు. అదే సమయంలో విధిగా విశ్లేషణ చేసి తీరాల్సిన రాజకీయ సందర్భంగా భావిస్తున్నా. అటువైపు మన దృష్టి సారిద్దాం. కొత్త చూపుతో, భిన్న దృష్టితో వర్తమాన అంతర్జాతీయ పరిణామాల్ని నిశితంగా పరిశీలిద్దాం. ఈ కీలక సందర్భంలో మిత్రులకు చేసే విజ్ఞప్తి యిదే!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *