ఒకపుడు ఇక్కడో లైబ్రరీ ఉండింది…

ఆ లైబ్రరీ ప్రత్యేకత ఏంటంటే, అది మహిళలకు, పిల్లలకు మాత్రమే.  14 సంవత్సరాలు దాటిన మగ పిల్లలకు ఆ గ్రంధాలయం లో ప్రవేశం లేదు అని లైబ్రరీ బోర్డులో రాసి ఉండేది.

-సీఎస్ సలీం బాషా

లైబ్రరీల ప్రాధాన్యం తగ్గి పోతావుంది. లైబ్రరీలకు వెళ్లే వల్క సంఖ్య బాగా పడిపోయింది.ప్రజలే కాదు పార్లమెంట్ సభ్యులు కూడా లైబ్రరికి వెళ్లడం లేదు. ఎంపీల ప్రస్తావన ఎందుకోచింద్దంటే కోట్లు ఖర్చు పెట్టి వారి కోసం పార్లమెంటులో అసియాలోనే పెద్దదని పేరున్న లైబ్రరీ కట్టారు. కనీసం రోజుకు అరడజను ఎంపీలు కూడా ఈ లైబ్రరీకి వెళ్లారు. ఇక వీధి లైబ్రరీ గురించి చెప్పాల్సిన పనిలేదు. జనం రాక, నిధుల్లేక, కొత్త పుస్తకాలు తెప్పించక లైబ్రరీలు మూత పడుతున్నాయి.ఇలాంటి వాటిలో కర్నూల్ బి.క్యాంప్ లైబ్రరీ ఒకటి.

ఆ లైబ్రరీ ప్రత్యేకత ఏంటంటే, అది మహిళలకు, పిల్లలకు మాత్రమే.  14 సంవత్సరాలు దాటిన మగ పిల్లలకు ఆ గ్రంధాలయం లో ప్రవేశం లేదు అని లైబ్రరీ బోర్డులో రాసి ఉండేది.

గ్రంథాలయానికి రమ అక్క లైబ్రేరియన్. ఆమెకి సహాయకుడిగా” మౌళి”. తెల్ల చొక్కా, తెల్ల పైజామా మణికట్టుకి ఎర్ర దారం, మనిషి కాస్త నలుపు. అయితే నవ్వు మాత్రం స్వచ్ఛమైన తెలుపు. మౌళి రూపం నా మెదడులో శాశ్వతంగా నిక్షిప్తమై ఉంది.

అతను చందమామ పుస్తకం వచ్చినప్పుడు శ్రద్ధగా దానిపైన బ్రౌన్ కలర్ అట్టను వేసే పద్ధతి ఒక సర్జన్ ఆపరేషన్ చేసినట్లే ఉండేది. చిన్న పిల్లలకు బట్టలు తొడిగి నట్టు ఉండేది. తర్వాత దానిమీద గ్రంథాలయం ముద్రవేసి ఇచ్చేవాడు. అట్టముక్క వాసన, చందమామ పేజీలు తిప్పుతుంటే వచ్చే వాసన ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. బీ.క్యాంప్ లోని ఒక B టైప్ ఇంట్లో(B/B 44) ఆ లైబ్రరీ ఉండేది. బెడ్ రూమ్ లో వందల సంఖ్యలో పుస్తకాలు ఉండేవి. ఆ గదిలోకి ఆడవాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉండేది. ఆ ఇంట్లోని వంట గదిని మాత్రం గా మార్చారు. హాల్లో ఐదారు బెంచీలు ఉండేది. అందులో మగపిల్లలు కూర్చొని చదువుకోవచ్చు
నా విజ్ఞానికి మొదటి మెట్టు పునాది ఆ లైబ్రరీ.

రచయితగా, ఉపాధ్యాయునిగా, లెక్చరర్ గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక శాస్త్రవేత్త గా నేను మారడానికి, రాణించడానికి ఆ లైబ్రరీ ఏ కారణం.
.1965 నుండి 1974 వరకు ఆ లైబ్రరీ యే నా జీవితం. అది విజ్ఞానాన్ని విస్తరించకోవడానికి ఉపయోగపడిన ఒక గొప్ప స్థలం. చిన్నప్పుడు కాకి-నక్క కథల పుస్తకం నుంచి, యువ మాస పత్రిక, ఆంధ్ర ప్రభ, పత్రిక దీపావళీ సంచికలు అన్ని మాకు ఎంతో వినోదాన్ని ఇచ్చేవి. వాటికోసం ఎదురు చూడ్డం లో ఎంతో థ్రిల్ ఉండేది. యద్దనపూడి సులోచనారాణి నవలలు, ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రికలో వచ్చే ధారావాహికలు చదవడం కోసం కొట్లాడుకునే వాళ్ళం.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదివారాలు, జాతీయ పండగలప్పుడు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసే సినిమాలు, డాక్యుమెంటరీలు వాటి కోసం ఎదురు చూసే వాళ్ళం. కాలనీలో చిన్న పెద్ద అందరు కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం.

రమ అక్క గురించి చెప్పాలంటే చాలా ఆప్యాయంగా పుస్తకాలను ఇచ్చేది. ఏ పుస్తకం ఎక్కడ ఉందో ఆమె చెప్పడం నాకు ఫ్యాసినేటింగ్ ఉండేది. పెద్దయ్యాక ఆమె లాగా జ్ఞాపకశక్తి ఉండాలని అనుకునేవాణ్ణి. పర్వాలేదు ఇప్పుడు ఉంది. అలాగే మౌళి అట్ట వేసే పద్ధతి నేర్చుకోవడం కూడా నా జీవిత లక్ష్యంగా ఉండేది ఆ ఇంట్లో ఒక గదిలో కేవలం మహిళలకు, ఆడపిల్లలకు మాత్రమే ప్రవేశం ఉండేది అయితే నాకు తెలిసి నేనొక్కడినే మగ పిల్లవాడిని ఆ గదిలోకి వెళ్లేవాణ్ణి. పుస్తకాల దొంతరగా పేర్చడానికి అక్క కు సహాయం చేయడానికి. నాకు రమ అక్క అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. అందరినీ బాబు అంటే నన్ను మాత్రం పేరుతో పిలిచేది. ఆ రూపం ఇప్పటికీ నా జ్ఞాపకాల పొరలో శాశ్వతంగా ఉండిపోయింది.

ఒకరోజు మాత్రం నేను బాగా బాధపడి ఏడ్చిన సందర్భం నా గ్రంధాలయం లోనే జరిగింది. రమ అక్క నన్ను పిలిచి సలీం నువ్వు ఇంకా ఈ గ్రంథాలయానికి రాకూడదు బాబు. ఎందుకంటే నీకు 14 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి. అని చెప్పడమే దానికి కారణం. సరే తర్వాత కూడా నేను గ్రంధాలయానికి చాలా సార్లు వెళ్ళాను కానీ అప్పుడు వెళ్లడానికి తర్వాత వెళ్ళడానికి స్పష్టంగా తేడా ఉండేది. ఆ గ్రంథాలయం చుట్టుపక్కల మనోరమ, సయ్యద్ అహ్మద్, క్రాఫ్ట్ సారు శ్రీ రాములు గ్రంథాలయం తర్వాత రెండో ఇంట్లో (మగ్గం సార్ అనేవాళ్ళం) ఉండేవాడు.

ఇప్పుడు కూడా నేను గ్రంథాలయం వీధిలోనే నడుస్తాను. ఆ జ్ఞాపకాలను నెమరు చేసుకుంటాను. రమ అక్క, మౌళి ( జ్ఞాపకాల్లో కాకుండా) ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది. కానీ దాంట్లో లైబ్రరీ మాత్రం లేదు

(ఇది నేను రాస్తున్న ” B/B 213-బి క్యాంప్ కాలనీ” పుస్తకంలో ఒక అధ్యాయం నుండి)

(సలీం బాషా రచయిత, కవి, మూవీ క్రిటిక్, వ్యక్తిత్వ వికాసం నిపుణుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *