వచ్చే బుధవారం యుద్ధం మొదలవుతుందా?

ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక ఓటమి వర్తమాన ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది.
*ఉక్రెయిన్ నుండి తమ పౌరులు ఖాళీ చేయాలి. 3 రోజుల క్రితం అమెరికా ఆదేశం! తమ రాయబార సిబ్బంది కీవ్ నుండి వెనక్కి రావాలి. 2 రోజుల క్రితం ఆదేశం! విమానాలకై చూడక భూమార్గంలో పోలాండ్ రావాలి. అమెరికా కొత్త హెచ్చరిక! సరిహద్దుల్లో చెకప్ లేకుండా దేశంలో అనుమతిస్తాం. నిన్నటి పోలాండ్ ప్రకటన
*కాంప్ డేవిడ్ నుండి పుతిన్ తో బైడెన్ గంట ఫోన్ కాల్! ఉక్రెయిన్ పై దాడికి రష్యా దిగితే, ఫలితాలు తీవ్రంగా వుంటాయని పుతిన్ కి బైడెన్ హెచ్చరిక! ఇదీ నిన్నటి తాజా వార్తే!
*ఇవన్నీ చద్ది వార్తలే! బుధవారమే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేసే జోస్యాన్ని అమెరికా గతరాత్రే ప్రకటించింది.
*యూరోప్ దేశాల రాయబార సిబ్బంది ఇలా ఖాళీ చేస్తుందని మనం ఊహించామా?
*నేడు నల్లసముద్రం, ఎజోవా సముద్రం, క్రిమియా ద్వీపం, బైలో రష్యా (బెలారస్) లు మూడువైపుల నుండి ఉక్రెయిన్ ముట్టడిస్తోన్న లక్షపైగా రష్యాసేనలు!
*రష్యా సైనికయాత్ర డాన్ బాస్క్ వద్దనే ఆగుతుందా? కీవ్ వరకి సాగుతుందా? పోలాండ్ సరిహద్దు చేరుతుందా? నేటి ఊహాగానాలివి.
*90లో రద్దైన వార్సా కూటమి పునరుద్ధరణ కోసమా? మాజీ USSR రిపబ్లిక్కులతో ఏర్పడ్డ CSTOని సైనిక కూటమి గా మార్చేందుకా? ఇలా సందేహాలు ఎన్నో!
*కజకిస్తాన్ లో జనవరి ఫస్ట్ రెట్టింపు చేసిన ఇంధన ధర! దేశవ్యాప్త వెల్లువ! అణచివేతకై రష్యా సేనకై కజక్ పిలుపు! రష్యా కి పెద్ద ఊపు, అమెరికాకి షాక్!
*USSR పూర్వ దేశాల్లో అమెరికా చేపట్టిన గత రంగు విప్లవాలు చెల్లవని రష్యా ప్రకటన! 2014 రంగు విప్లవమే ఉక్రెయిన్ లో రష్యా అనుకూల సర్కార్ ని కూల్చింది. ఉక్రెయిన్ ముట్టడి దానికి ప్రతీకారమా? ఇవీ నేటి సందేహాలే!
*2008 బీజింగ్ ఒలింపిక్స్ టైమ్ లో నల్ల సముద్ర తీరప్రాంతం ద.ఒసేతియా పై జార్జియాతో అమెరికా సైనిక చర్యని పురి కొల్పింది. నాడు పుతిన్ ఒలింపిక్ ప్రారంభోత్సవ వేడుకని వదిలి ప్రత్యేక విమానంలో మాస్కో చేరి, పై కీలక ప్రాంత స్వాధీనం చేసింది. అది ప్రచ్ఛన్న యుద్ధ ప్రపంచ బీజంగా నాటి ప్రపంచ రాజకీయ పరిశీలకుల విశ్లేషణ! అది కాదిది. ఇది బాహాట యుద్ధమే! అది బీజింగ్ ఒలింపిక్స్ టైమ్ కాగా ఇది బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టైం!
*2014 క్రిమియా సైనిక స్వాధీనం నుండి తన పాత పెరటిదొడ్డిలో రష్యా బలపడుతోంది. 2015 సిరియాలో సైనిక జోక్యం ఓ మలుపు! మొన్న నల్ల సముద్రం దాటి, నిన్న మధ్యధరా తీరం చేరి, నేడు ఏకంగా ఉక్రెయిన్ మీద రష్యా యుద్దానికి దిగుతోంది.
*యూరోప్ సహజ వాయువు అవసరాల్ని నార్డ్-2 పైప్ లైన్ ద్వారా రష్యా తీరుస్తోంది. అది యూరోప్ దేశాల మధ్య ముసలం పుట్టిస్తుంది. జర్మనీ, ఫ్రాన్స్ ల రూట్ మారుతోంది. ఉక్రెయిన్ పై రష్యా అఫెన్స్ కీ, అమెరికా డిఫెన్స్ కీ పైప్ లైన్ ఓ ముఖ్య కారణం!.
*నల్ల సముద్రస్థితి కొద్ధి కాలంలోనే పెద్దమార్పు చెందింది. 90లలో నల్ల సముద్ర ఈశాన్యపు మూలతప్ప అమెరికాదే పట్టు! నేడు పడమరలో బల్గేరియా, రుమేనియా తప్ప అమెరికాకి పట్టు లేదు. దాని తీరంలోని ఉక్రెయిన్ తూర్పుభాగం పై కూడా రష్యాదే పట్టు! దాంతో పెద్ద సరిహద్దు గల టర్కీ అమెరికా చేజారింది. ఈ సముద్రం పై రష్యాదే ప్రధానపట్టు!
*ఎజోవా సముద్రం చిన్నదే! వ్యూహారీత్యా కీలక ప్రాంతంలోనిది. క్రిమియా స్వాధీనంతో దానిపై పట్టు రష్యాదే! ఎజోవా సముద్రానికి ఉత్తరాన డాన్ బాస్కో ప్రాంతంపై రష్యా పట్టు వుంది. దానికి పడమర, దక్షిణాల్లోని క్రిమియాపై సైతం రష్యాదే పట్టు
*”కాస్పియన్ సముద్రం మరో కీలక ప్రాంతమే. అది ఇంధన వనరుల రీత్యా, సైనిక వ్యూహం రీత్యా! 1990లలో కాస్పియన్ సముద్ర వాయవ్య ప్రాంతమే రష్యాది. అమెరికాదే ప్రధాన పట్టు! నైరుతి మూలలో కకేషియన్ దేశాలున్న కొద్ది భాగం తప్ప నేడు అమెరికాకి పట్టులేదు. దక్షిణాదిన ఇరాన్ అమెరికా ప్రత్యర్థి దేశం! అదిరష్యాకి మిత్ర దేశమే! తూర్పు, ఉత్తర దిక్కుల్లోని కజక్ రష్యా మిత్రదేశమే! కాస్పియన్ పై సైతం రష్యాదే పట్టు
*ఆఫ్ఘనిస్తాన్ సాయుధ పోరుముందు తలవంచి అమెరికా తోకమడిచి చైనా లక్ష్యంగా బ్రిటన్, ఆస్ట్రేలియాలతో కలిసి పసిఫిక్ ప్రాంతంలో కొత్త ఆకస్ సైనిక కూటమిని ఏర్పాటు చేసింది. తమ కేంద్రీకరణ యూరోప్ కాక, ఆసియా పసిఫిక్ ప్రాంతమన్నది. నాటో బదులు ఆకస్ కి పెద్ద పీట వేసింది. దానిని అదునుగా ఉక్రెయిన్ లో రెండో యుద్ధ క్షేత్రాన్ని యూరోప్ లోనే రష్యా తెరిచింది. అట్లాంటిక్ లో విరామం తీసుకొని పసిఫిక్ లో సైనిక పాదం మోపే అమెరికా కలల్ని రష్యా వమ్ము చేసింది.
*మూడు ప్రాంతీయ ఉప సముద్రాలపై పట్టు పొంది, ఉక్రెయిన్ ద్వారా కొత్తగా అట్లాంటిక్ మహా సముద్రం పై పట్టు కై రష్యా ప్రయత్నిస్తోంది. డెబ్భై ఏళ్ల అట్లాంటిక్ ని వదిలేసి పసిఫిక్ వేపు అమెరికా నడుస్తుంటే, అట్లాంటిక్ పైకి రష్యా కదలడం గమనార్హం!
*US విదేశాంగ మంత్రి బ్లింకెన్ ఆస్ట్రేలియాలో రెండు రోజుల క్రితం క్వాడ్ దేశాల మీట్ లో ఇండో పసిఫిక్ తమకి ప్రాధాన్యతా ప్రాంతంగా ప్రకటించాడు. (జయ శంకర్ హాజరయ్యాడు) ఉక్రెయిన్ పై బుధవారం యుద్ధం జరుగనుందనే పెంటగాన్ జోస్యాన్ని కాంప్ డేవిడ్ ఆఫీసు లో 24 గంటల్లోనే బైడెన్ వినాల్సి వచ్చింది. ఏమి రాజకీయ వైచిత్రియో!
*మాజీ USSR దేశాలైన ఉక్రెయిన్, మాల్డోవా, జార్జియా ల్ని నాటో లో చేర్చుకునే ప్రతిపాదన అమెరికాది. వాటిని చేర్చుకోననే లిఖిత హామీకై డిమాండ్ రష్యాది. నాటోలోని USSR మాజీ రిపబ్లికుల నుండి నాటో బలాల వాపసు కూడా రష్యాది మరో డిమాండ్! దాన్ని అమెరికా కాదంటోంది. ఘర్షణకి ఇదో కారణం!
*1991లో USSR పతనమైన సమయం లో USSR అధ్యక్షుడు గోర్బచెప్ కి బుష్ రెండు మౌఖిక హామీలిచ్చాడు. A-మాజీ USSR దేశాల్ని నాటోలో చేర్చుకోము. B-యుద్ధాలు లేని శాంతి ప్రపంచ స్థాపన దిశలో తుదకు నాటో ని రద్దు చేస్తాం. వాటికై నాటి “ఎల్సీన్ రష్యా” నిలబడ లేదు. నేటి “పుతిన్ రష్యా” నిలబడింది.*
*తమపాత ప్రాంతాల పునస్వాధీనం రష్యా లక్ష్యం! అవి చేజారని లక్ష్యం అమెరికాది. ఉక్రెయిన్ వేదికైనది.*
*ఆఫ్ఘన్ సైనిక ఓటమి తర్వాత అమెరికా చాలా చోట్ల ఎదురు దెబ్బలు తింటోంది. అదో పెద్దజాబితా! ఒక్క ఉదాహరణ! వింటర్ ఒలింపిక్స్ ని అమెరికా బహిష్కరిస్తే సౌదీ పాల్గొంటోంది. దాన్ని సైతం నిలబెట్టుకోలేని దుస్థితి అమెరికాది. ఈ స్థితి రష్యాకి అదునుగా మారి ఉక్రెయిన్ పై పంజా విసురుతోంది.
*నేటి రష్యా లక్ష్యం USSR పునరుద్ధరణ కాదు. 1917కి ముందు జారిస్టు సామ్రాజ్యవాద రష్యా పునరుద్ధరణే! అగ్రరాజ్యం దెబ్బతినే క్రమాన్ని ఆహ్వానిద్దాం. ప్రపంచ శ్రామికవర్గ విప్లవ పురోగమనానికి ఈస్థితిని సద్వినియోగం చేద్దాం. దానంతట అదే ప్రపంచ శ్రామికవర్గానికి రష్యా పాత్ర చేయూత ఇవ్వదనే అవగాహన శ్రామికవర్గ శక్తులది
*ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకీ సోషలిజానికీ మధ్య వైరుధ్యం కాదు. సామ్రాజ్యవాద ముఠాల మధ్య యుద్ధస్థితే! ఈ మౌలికవైఖరి మనది
*యుద్ధం నిజంగానే జరుగుతుందా? లేదా? అనేది మరో సంగతి. అది వివిధ పరిస్థితులు, కారణాలు, కారకాలపై ఆధారపడుతుంది. నేటి ప్రపంచంలో యుద్ధస్తితి ఉండటమనే భౌతిక సత్యం ముఖ్యమైనది.
*సామ్రాజ్యవాద యుద్దాలు శ్రామికవర్గ విప్లవాల్ని త్వరితం చేస్తే శ్రామికవర్గ విప్లవాలు సామ్రాజ్యవాద శిబిరాల మధ్య వైరుధ్యాల్ని తీవ్రతరం చేస్తాయి. ఇరాక్, లిబియా, ఆఫ్ఘన్ సాయుధ తిరుగుబాట్లు సామ్రాజ్యవాద శిబిరాల వైరుధ్యాల్ని తీవ్రం చేస్తాయి. తీవ్రమయ్యే అంతర్గత యుద్దాలు ప్రపంచ శ్రామికవర్గానికి ఉపకరిస్తాయి. వాటిని ఉపయోగించుకోవడం తప్ప ఉపయోగపడ రాదు. ఈ దృష్టితో ఉక్రెయిన్ పరిణామాల్ని అర్ధం చేసుకుందాం
-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *