కెసిఆర్ ఒక్క మాటతో అంతా కలవరం!

ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అండగా నిలవడం కొత్త చర్చకుదారి తీసింది.
ప్రధాని మోదీని ఎలాగయినా తరిమేయాల్సిందే అన్న కెసిఆర్ మెల్లిగా యుపిఎ వైపు మరలుతున్నారా? అని అనుమానం వచ్చేలా ఆయన  రాహుల్ గాంధీని డిఫెండ్ చేశారు.
మొన్న రాహుల్ గాంధీ మీద అస్సాం బిజెపి ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ అసభ్య కరమయిన వ్యాఖ్యలు చేశారు. హిమంత అంతగా ఎందుకు దిగజారారో అర్థం కాదు. ఎందుకంటే, ఆయన బిజెపిలోకి రాక ముందు కాంగ్రెస్ లోనే ఉన్నారు. బిజెపి ఆయనను ముఖ్యమంత్రి చేసి ఉండవచ్చు. అయినంత మాత్రాన రాహుల్ ను కించపరచడానికి వీల్లేదు. దీనిని బిజెపి ఖండించక పోవడం మరీ దారుణం. దరుసుగా మాట్లాడే హిస్టరీ కూడా హిమంత కులేదు. అదే ఆశ్చర్యం.
అయితే,  ఈ విషయం మీద  కాంగ్రెస్ కంటే ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ చూపడం కాంగ్రెస్ నేతలను ఇరుకున బెట్టింది. తెలంగాణ కాంగ్రె స్ నేతలెవరూ కెసిఆర్ ఖండించేందు వరకు  అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యాలను ఖండించలేదు
ఏమయితే, కెసిఆర్ వ్యాఖ్య చాలా పదునైంది. హిమంత్ మీద కోపం ఆయన ప్రధాని మోదీ మీద చూపారు. మోదీకి వార్నింగ్ ఇచ్చారు. మీదేం హిందూ ధర్మం,  మీదేం భారతీయత, రామాయణం, భారతాలనుంచి మీరేం నేర్చుకున్నారు, భగవద్గీత చెప్పిందేమిటి, మీ వాఖ్యలు చూసి నేను సిగ్గుతో తలదించుకుంటున్నా,  మీకు సిగ్గు శరము ఉంటే  అస్సాం ముఖ్యమంత్రిని పదవి నుంచి  బర్త్ రఫ్ చేయండి, అన్నారు.
ఇందులో కాంగ్రెస్ కు ఏదో మెసేజ్ ఉందని కెసిఆర్ గర్జన విన్నవారందరికి అర్థమవుతుంది.
ఎందుకంటే, కాంగ్రెస్ లేని  బిజెపి వ్యతిరేక కూటమి సాధ్యం కాదని కేంద్రంలో పవార్, మమతా బెనర్జీ లాంటి వారుచేస్తున్న ప్రయత్నాలను బట్టి అర్థం చేసుకోవచ్చు, వాళ్లు ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా కాంగ్రెస్ లేకపోవడంతో అవేవి ఒక రూపం దాల్చలేదు.  వాళ్లెన్ని చెప్పినా, కాంగ్రెస్ పార్టీకి ఘోరా పరాభవాలు, పరాజయాలు ఎదురవుతూ ఉన్నా, మంచికో చెడుకో  దేశంలోొ ఉన్న జాతీయ ప్రతిపక్షం అదొక్కటే.
అంతేకాదు, కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని బెంగాల్, చెన్నయిన వెళ్లినపుడు ఆయనకు అక్కడి ముఖ్యమంత్రులు చెప్పింది కూడా ఒక్కటే, కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమి సాధ్యం కాదు అనే. కాంగ్రెస్ అంటే చాలా చిన్న పార్టీ అనేది చాలా రీజినల్ పార్టీలకు నమ్మకం. అందుకే, కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి ఏర్పాటుచేయాలని ప్రయత్నాలు చేశారు.
కూరకు మొత్తం రుచి రావాలంటే, చిటికెడేయినా సరే ఉప్పు అవసరం. ఉప్పు చిటికెడే వాడుకోవాలి. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఉప్పు అనుకోవాలి, వాడుకోవాలి. చిటికెడే అని చిన్నచూపు చూస్తే పప్పుపనికి రాకుండా పోతుంది.
ఎందుకంటే,  రంగంలో ఉన్నవన్నీ ప్రాంతీయ పార్టీలే. ప్రాంతీయ పార్టీల పాలెగాళ్లకు ఒకరంటే ఒకరు గిట్టదు. ఎవరికి వాళ్లు ప్రధాన మంత్రి అభ్యర్థులనుకుంటున్నారు. అందుకే మమతా బెనర్జీ ఇంట్లో మీటింగ్ జరిగినా, శరద్ పవార్ ఇంట్లో మీటింగ్ జరిగినా భోజన సంతృప్తి తప్ప మరొక అనుభవం మిగలడం లేదు. కాలం మారి కాంగ్రెస్ ఒక నాటి పప్పు స్థాయి నుంచి ఇపుడు ఉప్పు స్థాయికి వచ్చింది. అయినా ఉప్పు లేని పప్పు ఉండదుగా.
ఈ విషయం కెసిఆర్ గమనించారా? కాంగ్రెసు ను  ప్రయోగించి, ఇతర రాజకీయ పార్టీలను  సమన్వయం చేసి తాను యుపిఎ కి ప్రాణం పోయాలనుకుంటున్నారా?
ఏమో తెలియదు. కెసిఆర్ వ్యాఖ్యలతో ఆయన పాత మిత్రుడు కాంగ్రెస్ కు మళ్లీ చేరువ అవుతన్నారేమో అనిపిస్తుంది. నిజానికి బిజెపి  ముప్పు లేనపుడు కాంగ్రెస్ ఆయనకు ప్రధాన శత్రువు. ఇలా ఏడేళ్లు గడిచిపోయాయి.  ఈ కాలంలో మెల్లిగా కాంగ్రెస్ ను మించి తెలంగాణలో బిజెపి దూకుడు  పెరిగినపుడు ఇంకా కాంగ్రెస్ చీరేస్తా, పాతేస్తా అంటూ కూచుంటే, శూలాలు పట్టుకుని బిజెపి సైన్యం దాడి చేస్తుంది.
అందువల్ల కాంగ్రెస్ కు దగ్గరవడం మంచిదేమో అని కెసిఆర్ ఆలోచిస్తున్నారా?
ఇపుడే చెప్పడం కష్టం. మొత్తానికి మీడియా పండితులకు మేత వేసి కెసిఆర్ ఇక తమాషా చూస్తూ కూర్చుంటారు.
అయినా, కెసిఆర్ కు కాంగ్రెస్ పాత చుట్టమే. టిఆర్ ఎస్ రాష్ట్రంలో అధికారం పంచుకున్నది మొదట కాంగ్రెస్ తోనే. అపుడు 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆరుగురు టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలను మంత్రులను చేసింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ ది హవా,  టిఆర్ ఎస్ మైనర్ ఫోర్స్. ఇపుడు టిఆర్ ఎస్ అయిదారుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులను చేయవచ్చు, అపుడు కాంగ్రెస్ మైనర్ ఫోర్స్ అవుతుంది. ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది.
  అప్పటిలాగానే,  కాంగ్రెస్ సహకారంలో కేసిఆర్ జాతీయ స్థాయిలో పాచికలు వేయవచ్చు. అదెటయినా దారి చూపవచ్చు. నిజానికి  కెసిఆర్ కేంద్రంలో మన్మోహన్ సింగ్  మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నపుడు, తెలంగాణ రాష్ట్ర ప్రకటిస్తే, టిఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో  విలీనం చేయాలనుకున్నారు. అంతేకాదు, చాలా పెద్ద పాత్ర పోషించాలనుకున్నారు. అపుడు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, సోనియమ్మ సలహాదారుగా మారి , ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని కెసిఆర్ చాలా సార్లు చెప్పారు.
దీనికి సాక్షులు కాంగ్రెస్ లో ఉన్నారు, టిఆర్ ఎస్ లో ఉన్నారు. రాజకీయాల్లో ఏదయినా సాధ్యమే.  కాబట్టి, కెసిఆర్ మళ్లీ కాంగ్రెస్ తో దోస్తీ కట్టకూడదని రూలేమీలేదు.
దీని మీద రేవంత్ వ్యాఖ్య
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి   కెసిఆర్ వేసిన భ్రాంతిబాణం మీద స్పందించారు.  కెసిఆర్, కాంగ్రెస్ దగ్గిరయితే, రేవంత్ రెడ్డి బాణాలన్నీ మొద్దు బారుతాయి. ఇది కొంచెం ఇబ్బందికరమే. ఇపుడిపుడు లీడర్ గా మాంచి పేరుతెచ్చుకుంటున్న రేవంత్ కు ఇది ఇబ్బందికరమే. రేవంత్ కాంగ్రెస్ కు బలాన్ని స్తున్నారు.  కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేలా ఇంకా కృషి చేయాల్సి ఉంది. అలాంటపుడు కాంగ్రెస్, టిఆర్ ఎస్ దోస్తీ ఏమిటి?  ఈ భయం వ్యక్తమయ్యేలా ఆయన ఈ రోజు స్పందించారు

 

“కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదు. కేసీఆర్ ఒక నమ్మక ద్రోహి. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ ని నమ్మి మోసపోయాం. గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ ని నమ్మం. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నిటికీ కలవవు, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తాం. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు.”
రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే…
“అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ దేశంలో వుండే మాతృమూర్తు లందరిని అవమానించే విధంగా ఉన్నాయి .ప్రధాని మోదీ, నద్దా, రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆయన వ్యాఖ్యల మీద స్పందించకపోవడం దారుణం. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తామని చెప్పుకునే ప్రధాని మోదీ అస్సాం ముఖ్యమంత్రి ని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. రేపు తెలంగాణ లోని 709 పొలీస్ స్టేషన్ లలో అస్సాం ముఖ్యమంత్రి పై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అస్సాం సీఎం పై నేనే స్వయంగా ఫిర్యాదు చేస్తాను
అసహ్యంగా, జుగుప్సాకరంగా దేశ సంస్కృతికి మచ్చ తెచ్చేలా దిగజారి మాట్లాడాడు
ఒక్క రాహుల్ గాంధీ కుటుంబానికి కాదు 140 కోట్ల భారతీయులకు, మాతృమూర్తులకు జరిగిన అవమానం
కేంద్రం అవినీతి పై కేసీఆర్ దగ్గర సమాచారం ఉంటె ఎందుకు బయటపెట్టడం లేదు..
బీజేపీ,టీఆరెస్ రెండు తోడు దొంగలే
దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు దోచుకుంటున్నారు..
ఆయన జాతకం ఈయన దగ్గర ఉంది అంటున్నారు. మరి ఎందుకు భయటపెట్టడం లేదు.
కేసీఆర్ అవినీతి చిట్టా మా దగ్గర ఉందని అంటున్నారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
అవినీతి సమాచారం ఉంటే దాయడం కూడా నేరమే.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *