సీమకు ‘సిఫార్సు’ లేవీ అమలు కావు, ఎందుకంటే…

(అరుణ్)
ప్రజల ఆకాంక్షలు ఉద్యమరూపం తీసుకోకుండా కాలయాపన జేస్తూ, వాటిని నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి, వాటి అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెబుతూ, ప్రజల డిమాండ్లపై పాలకులు కమిటీలను నియమించడం కొత్తేమీకాదు.
సాధారణంగా ఆ కమిటీలో మెజారిటీ సభ్యులు పాలకుల మనసెరిగిన వారే వుంటారు. ఆ నివేదిక తమకనుకూలంగా వస్తే, దాన్ని అమలుజేస్తారు. పొరపాటున పాలకులు అనుకున్నవాటికి భిన్నంగా వుంటే, ఆ నివేదిక ప్రాచీన దస్తావేజుల భాండాగారం(archives) లో చేరుతుంది.
పై విధానపు నేపథ్యం లో ఆంధ్ర ప్రదేశ్ విభజన కాలoలో,ఆ తర్వాతనూ నియమించిన కమిటీల నివేదికలను,వాటి అమలునూ పరిశీలిoచడమే ఈ వ్యాస ఉద్దేశ్యం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాలంలోనూ, ఆ తర్వాత పలు కమిటీలను నియమించాయి. ఆ కమిటీలు రాయలసీమ ప్రాంత విషయంగా వివిధ అభిప్రాయాలను వెలిబుచ్చుతూ, పలు సూచనలు, సిపారసులు చేశాయి.
నేడు రాష్ట్రంలో పాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చజరుగుతున్న నేపథ్యంలో ఈసూచనలు, సిపారసులు వెనుకబడిన రాయలసీమకు విషయంలో ఏ మేరకు అమలయ్యాయో చూద్దాం.
శ్రీ కృష్ణ కమిటీ- రాయలసీమ:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఇది. వివిధ ప్రాంతాల ప్రజాసంఘాల అభిప్రాయాల సేకరించి పై కమిటీ తన నివేదికను సమర్పించింది.(అప్పుడు రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో రాయలసీమ విద్యావంతుల వేదిక ఒక సమగ్ర నివేదికను సమర్పించింది).
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నాయకులు చేసుకున్న శ్రీ భాగ్ ఒప్పందాన్ని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ప్రస్తావించి అనుబంధంగా ఒప్పంద పత్రాలను సమకూర్చింది. వివిధ రంగాలలో సీమ ఏ స్థాయిలో వెనుకబడిందో గణాంకాలతో పేర్కొనింది.  1951లో సీమవాసులు కృష్ణా- పెన్నార్ ప్రాజక్టును కోల్పోయిన అంశాన్ని ప్రస్తావించింది. పోతిరెడ్డిపాడు వద్ద వరద నీటి కొసం సామర్థ్యం పెంచుకోవలసిన విషయాన్ని గుర్తుచేసింది. సీమలో ప్రస్తుతం ఉన్ననీటి సరఫరా కాలువలు అధ్వాన్నంగా ఉన్నాయనే విషయాన్ని తెలిపింది .
రాయలసీమ పట్టణీకరణ విషయంలో చాలా వెనుకబడిందని అభిప్రాయపడింది.  వలసలు అత్యధికంగా ఉన్నాయనే విషయాన్ని ప్రస్తావించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమవాసులు నష్టపోతామని భావిస్తున్నారoది.
హైదరాబాద్ రాజధానిగా అభివృద్ధి చెందగా,1956 తర్వాత కోస్తాంధ్ర నీళ్ళు పోందాయని, తెలుగు వారి ఐక్యతకు త్యాగం చేసినా సీమకు దక్కింది ఏమి లేదని సీమవాసుల అభిప్రాయమని కమిటీ తెలిపింది.
విభజన జరిగితే ఆంధ్ర ప్రాంతంతో చేరేందుకు సీమవాసులు పరోక్షంగా ఇష్టపడటం లేదనే విషయమూ స్పస్టం చేసింది.
• రాష్ట్రం లోని మూడుప్రాంతాలలో రాయలసీమ ప్రాంతం బాగావెనుకబడింది.నీటికోసం,విద్యకోసం,ఉపాధికోసం తెలంగాణలో చేరడానికి సుముఖత కనబరచవచ్చని అభిప్రాయపడింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, రాయలసీమలోను ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం వచ్చే వీలుందనే భావనకు కమిటీ వచ్చింది. రాయలసీమ రాష్ట్రం కూడా ఇచ్చి హైదరాబాదునే ఉమ్మడి రాజధానిగా చేయవచ్చని అన్నారు.
కొత్త రాజధానితో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రూపొందే అవకాశం ఉంది. సాగునీటి కోసమే ఇది జరుగుతుందని కూడా చెప్పింది. .
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ కూడా ప్రాంతీయ మండలిని అడిగే అవకాశం ఉందని తెలిపింది.
సాగునీటి అంశాల పట్ల సరైన చర్యలు,యాజమాన్య బోర్డులను ఏర్పాటు అవసరాన్ని సూచించింది.
“వాస్తవాలను,నిజాలను సరిగా ఎదుర్కొనని పక్షంలో వాటిని నిర్లక్ష్యం చేసిన పక్షంలో,అవి తమ‌ ప్రతీకారం తీర్చుకోగలవు” అనే సర్దార్ వల్లభాయ్ పటేల్ వాక్యంతో కమిటీ నివేదిక ముగిసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం- రాయలసీమ-హామీల అమలు.
కేంద్రం విభజన చట్టంలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతం బాగోగులకోసం కొన్ని అంశాలను పేర్కొన్నారు.
విభజన చట్టం సెక్సన్ -6 లో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో “విభిన్న ప్రత్యామ్నాయల అధ్యయనం కోసం నిపుణుల సంఘం” నియమించాలి. .
సెక్షన్-84 నుండి 91 వరకు జలవనరుల అంశాలు,
85- 7 (ఇ) లోని 11వ షెడ్యూల్ ప్రకారం నీళ్ళ విషయంగా కేంద్రప్రభుత్వం అప్పగించిన విధులను బోర్డు నిర్వర్తించాలి.
11 వ షెడ్యూల్ 10 వ అంశంలో వెనుకబడిన ప్రాంతాలలో ఉండే హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టుల కేంద్రం చేపట్టి పూర్తిచేయాలి.
అయితే,చట్టం చేసి 7 సం. లు గడిచినా పై హామీలేవీ అమలుకాలేదు. కాగా, చంద్రన్న ప్రభుత్వం గాని,జగనన్న ప్రభుత్వం గాని, చివరకు ఏ రాజకీయ పార్టీ వాటి అమలుకయి చిత్తశుద్ధితో పనిజేయక పోవడం గమనార్హం. పోగా, కృష్ణా నదినిర్వహణ బోర్డ్ నియమ, నిభందనల ప్రకారం, వున్న అందుతున్న నీటికే ఎసరుపెట్టే పరిస్థితి. విభజన చట్టంలో నిర్దేశించిన స్ఫూర్తితో రాయలసీమకు కరువు పీడిత ప్రాంతాల ప్రాజక్టుల నీటిహక్కులు పరిరక్షించాలి.
సెక్షన్ – 93-13 వ షెడ్యూల్ – కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతికి, సుస్థిర అభివృద్ధి కోసం కేంద్రం పదేళ్ళలో తీసుకోవలసిన చర్యలను తెలిపారు.
పై విషాయాలలో ఎలాంటి పురోగతి లేదు. పదకొండు జాతీయ ప్రాధాన్యత ఉన్న విద్యాసంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి.
వీటిని ఎక్కడ నిర్మించాలనే విషయం రాష్ట్రానికే వదిలారు.
రాష్ట్ర ప్రభుత్వం కింది విధంగా వాటిని నిర్ణయించింది.
ఐ.ఐ.టి- తిరుపతి; ఐ.ఐ.యస్.ఇ.ఆర్- తిరుపతి;
సెంట్రల్ యూనివర్శిటీ- అనంతపురము;
ఐ.ఐ.ఐ.టి – కర్నూలు;  ఐ.ఐ.యం- విశాఖపట్నం; ఐ.ఐ.పి.ఇ -విశాఖపట్నం;  గిరిజన విశ్వవిద్యాలయం- విజయనగరం;
ఎన్. ఐ.టి – తాడేపల్లి గూడెం; అగ్రికల్చరల్ యూనివర్శిటీ-గుంటూరు;  ఎ.ఐ.ఐ.యం.యస్ – మంగళగిరి; ఎన్.ఐ.డి.యం-
విజయవాడలలో స్థాపించారు. కొన్నింటిలో మాత్రమే పురోగతి కనిపిస్తుంది.
రాయలసీమలోని అనంతపురం లో ఎయిమ్స్ ను స్థాపిస్తామని మొదట ప్రకటించారు. ఆ తర్వాత మంగళగిరికి తరలించారు.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో సమగ్ర ఉక్కు కర్మాగారం విషయంగా సెయిల్ ఇంతవరకు ముందడుగు వేయలేదు. గత టిడిపి, నేటి వైఎస్ఆర్ పి ప్రభుత్వాలు ఆ కర్మాగార నిర్మాణానికై చేసిన, చేస్తున్న ప్రయత్నాలు శూన్యం. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదించారు. ఆ వైపుగా అడుగులు పడలేదు.
కొత్త రైల్వేజోన్ కేటాయింపు విషయం చూద్దాం. దీన్ని రాష్ట్రానికి కేటాయించింది, కానీ చట్టంలో నిర్ధిష్ట స్థలాన్ని సూచించలేదు. అయితే, అన్ని రాజకీయ పార్టీలు ఏక కంఠంతో రైల్వేజోన్ ను, వెనుకబడిన ప్రాంతమయిన సీమలో గాక, ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ లో ఏర్పాటు జేయాలని కోరడంలో, ఆ పార్టీలు వెనుకబడిన ప్రాంతామయిన సీమపట్ల చూపుతున్న వివక్షత స్పష్టమవుతుంది. సీమప్రజలకు ఏ రాజకీయపార్టీ న్యాయం చేయదని, తమకు ఉద్యమాలే శరణ్యమని ఇప్పటికే అర్థమయింది.
శివరామకృష్ణ కమిటి:  రాయలసీమ
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం పరిశీలించేందుకు శివరామన్ కమిటి ఏర్పాటు చేసింది.30 ఆగష్టు 2014 న కమిటీ నివేదిక ఇచ్చింది. రాయలసీమ విషయంగా ఈ కమిటీ ప్రతిపాదనలు.
ఈ కమిటి రాజధాని వ్యవసాయ భూములలో కాకుండా ప్రభుత్వ భూములలో ఉండాలని సిపారసు చేసింది.
కొన్నిశాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు, డైరెక్టరేట్లు, కార్పొరేషన్లు, సంస్థలు అయా జిల్లాల వారిగా నెలకొల్పాలి. హైకోర్టు సచివాలయం ఒకే చోట అవసరం లేదని తెలిపింది.
హైకోర్టు వైజాగ్ లో, బెంచ్ ను కర్నూలు లో సూచించింది.
గతంలో రాజధానిగా ఉన్న కర్నూలుకు అభివృద్ధిలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కృష్ణానదినీటిని పున:సమీక్ష చేసి సీమకు ప్రయోజనం కలిగించాలని పేర్కొంది. శ్రీ కాళహస్తి అభివృద్ధి అవకాశం ఉన్న ప్రాంతంగా పేర్కొని – నడికుడి దాకా రైల్వేలైన్ తో పాటు, బళ్ళారి- కృష్ణపట్నం రైల్వేలైన్ నిర్మించాలని తెలిపింది.,
హైదరాబాదు-అనంతపురము- బెంగుళూరు, అనంతపురము- చెన్నై- బెంగుళూరు రహదారుల మధ్య రాయలసీమ ఆర్క్ గా పేర్కొంది. ప్రత్యేక శ్రద్ధతో దక్షిణాదిలో కీలకంగా అభివృద్ధి అవకాశం ఉన్న ప్రాంతంగా రాయలసీమ ఆర్క్ ను పేర్కొన్నారు.
శివరామన్ కమిటి రాయలసీమకు కృష్ణా జలాలలో ప్రధాన ప్రాతినిథ్యం, రవాణ సౌకర్యాలను, మౌళిక వసతుల కల్పన ద్వారా సీమను అభివృద్ధిని సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు, పరిపాలన వికేంద్రీకరణను ప్రధానంగా పేర్కొన్నది. సీమలో హైకోర్టు కోర్టు బెంచ్, కీలక శాఖలు, కార్యాలయాలు కూడా నెలకొల్పాలనే సూచనలు చేసింది.
చంద్రన్నకు పై సూచనలు అంగీకారం లేకపోవడంతో ,తన మంత్రి నారాయణ తో ఒక కమిటీ వేశాడు. రాజుగారి మనసెరిగిన మంత్రిగా, పై సూచనలకు పూర్తిగా విరుద్ధంగా మూడు పంటలు పoడే అమరావతీ ప్రాంతాన్ని ఎంపిక జేసుకోవడమే గాక, అన్నిశాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు, డైరెక్టరేట్లు, కార్పొరేషన్లు, సంస్థలు హైకోర్టు, సచివాలయం–అన్నిటినీ అమరావతి కేంద్రంగా ఏర్పాటుజేయాలని ఆ కమిటీ సూచనలిచ్చింది. చంద్రన్న తలూపడం, ప్రభుత్వం లో భాగస్వామి అయిన కమలనాథులతో పాటు,దానికి ప్రతిపక్షంతో సహా అన్నీ రాజకీయపార్టీలు తలలూపడం జరిగిoది.
ఇక ప్రధానమంత్రి మోదీ 1 ఏప్రిల్ లో శంకుస్థాపన స్వయానా జేశాడు.ఇదంతా సీమకు ద్రోహం చేయడం గాక మరేమవుతుంది. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు జేసిన కమిటీ సలహాలను, సూచనలకు ఆవగింజంతయినా ప్రాధాన్యమివ్వనపుడు కమిటీలు వేయడం ఎవరిని మోసాగించేందుకు? (ఇప్పుడుకమలనాథులతో పాటు,ప్రతిపక్షాలు కర్నూల్ లో హైకోర్ట్ ఏర్పాటుజేయాలని కోరడం గమనార్హం.వైఎస్ఆర్ పి ఏకంగా మూడు రాజధానుల చట్టం చేసింది. ఇదీ రాజకీయపార్టీల అవకాశవాదంగాక మరేమవుతుంది.)
జి.యన్ రావు కమిటి: రాయలసీమ
సీమకు చంద్రన్న జేసిన ద్రోహాన్ని తాను సరిదిద్దుతానని ముందుకు వచ్చిన జగనన్న నిర్వాహకం చూద్దాం.
రాజధాని,అభివృద్ధి వికేంద్రీకరణపై సూచనల కోసం జి.యన్ రావు కమిటీని నేటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.ఈ కమిటీ నివేదికలో విశాఖపట్నం లో సచివాలయం, వేసవికాల అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, సి.యం క్యాంప్ కార్యాలయాలు; అమరావతి లో చట్టసభ అంటే ,అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, గవర్నర్, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, మంత్రుల భవనాలు; మంగళగిరి, నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతాలలో శాశ్వత భవనాలు ఉండాలని తెలిపింది.
ఇలాగే కర్నూలులో శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు, అనుబంధ కోర్టు. కర్నూలు అనంతపురములలో ప్రధాన హెచ్.ఓ.డి కార్యాలయాలను నెలకొల్పి అసమానతలు తగ్గించాలని సూచించించింది.
రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలలో ప్రాంతీయ కమిషనరేట్లు ప్రతిపాదించింది.ఇందులో భాగంగా రాయలసీమకు ఒక కమిషనరేట్ ఉంటుంది . అనంతపురము జిల్లాలో ఉద్యాన పంటలు, ఐటీ , ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు.
కర్నూలు జిల్లాలో నీటిపారుదల, సిమెంట్, స్టీల్ పరిశ్రమలు, ఉద్యాన పంటలు, వక్ఫ్ కమిషనర్ కార్యాలయం.
కడప జిల్లాలో నీటిపారుదల, గనులు, ఆరోగ్య రంగం, స్టీల్, సిమెంటు ప్లాంట్ లు, సోలార్ పార్క్, పరిశ్రమలు .
చిత్తూరు జిల్లాలో నీటిపారుదల, పర్యాటకం,స్మార్ట్ సిటీ, యాత్రాస్థలంగా సూచించారు.
ఈ కమిటీ సీమలో సాగునీటి ఆవశ్యకతను ప్రత్యేకంగా గుర్తుచేసింది.
సీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజక్టు లను పూర్తి చేయాలి.గొలుసుకట్టు చెరువులు, చిన్ననీటి వనరులు కాపాడాలి.
పై సిపారసులలో,కేవలం తన అధీనం లో లేని హైకోర్ట్ ఏర్పాటు తప్ప, మిగతా సూచనలేవీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు.హైకోర్ట్ ఏర్పాటు విషయం లోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిజేసిన దాఖలాలు లేవు. పోగా,టివి డిబేట్ లో బిజేపి,వైఎస్ఆర్ పి నాయకులు ఒకరిమీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు.ఈ లోగా హైకోర్ట్ అదనపు భవనానికి గుంటూర్ లో శంఖు స్థాపన జరగడం గమనార్హం.సీమ ప్రజలు ఎవరిని నమ్మాలి?ఎవరిని నిందించాలి?
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ – రాయలసీమ:
పై నివేదిక తన రాజకీయ ప్రయోజనాలకనుకూలంగా లేకపోవచ్చుననుకున్నాడో ఏమో,జగనన్న ,జి.యన్ రావు కమిటీకి సమాంతరంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై మరింత అధ్యయనంకోసమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ని నియమించారు.అమెరికా కమిటీ కదా! విశ్వసనీయత వుంటుందనుకున్నాడో ఏమో? ఏమైనా మనవాళ్లు అమెరికా మానస పుత్రులు కదా!3 జనవరి 2020 న నివేదిక అందించింది.
ఈ కమిటీ రెండు ఆప్షన్లు ఇచ్చంది.
మొదటి ఆప్షన్
*విశాఖపట్నంలో సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, అత్యవసర అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, 15 విభాగాధిపతుల కార్యాలయాలు.
*అమరావతిలో శాసనసభ, హైకోర్టు బెంచ్, 15 విభాగాధిపతుల‌ కార్యాలయాలు.
*రాయలసీమలో హైకోర్టు, రాష్ట్ర కమీషన్లు, అప్పిలేట్ అథారిటీలు.
రెండవ ఆప్షన్
* విశాఖపట్నానికి మొదటి ఆప్షన్ లోని అన్ని అంశాలతో పాటు, మొదటి ఆప్షన్ లో అమరావతికి కేటాయించిన 15 విభాగాధిపతుల కార్యాలయాలను కూడా సూచించారు.
*అమరావతి,రాయలసీమలలో మొదటి ఆప్షన్లో పేర్కొన్నవే ఉన్నాయి.
రాష్ట్రంలో ఆరు శాటిలైట్ కమిషనరేట్లను సూచించారు.
చిత్తూరు, కడప తూర్పు రాయలసీమగా, కర్నూలు, అనంతపురం పశ్చిమ రాయలసీమగా సీమలో మొత్తంగా రెండు శాటిలైట్ కమిషనరేట్ లు ఉంటాయి.
అనంతపురం, చెన్నై, కడప, నెల్లూరు లతో అమరావతి అనుసంధానానికి ఐదు ఎక్స్‌ప్రెస్ హైవేలు, చెన్నై-కలకత్తా జాతీయ రహదారితో ఇతర జాతీయరహదారుల అనుసంధానం
హైదరాబాదు కు ప్రత్యామ్నాయంగా కర్నూలు ను, బెంగుళూరు కు ప్రత్యామ్నాయంగా అనంతపురం ను అభివృద్ధి చేయాలని సూచించారు.
వెనుకబడిన ఏడు జిల్లాలలో పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి పెట్టాలని సూచించారు.
కృష్ణా గోదావరి డెల్టా లో 60 నుండి 80శాతం సాగునీటి సదుపాయం ఉండగా, రాయలసీమలో 20 శాతానికి మాత్రమే సాగునీటి సదుపాయం ఉందని తెలిపారు.
గోదావరి – పెన్న అనుసంధానం, కాలువల సామర్థ్యం పెంచడం ద్వారా సీమలో సాగునీటి సౌకర్యాలను కల్పించాలి.
వాటర్ గ్రిడ్లను ఏర్పాటు చేయాలని సూచించింది.
తూర్పు రాయలసీమ లోని కడప, చిత్తూరులలో ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం, ఉక్కుకర్మాగారం, అనుబంధ పరిశ్రమలు, ఆధునిక పద్ధతిలో టమోటా సాగు, బెలూం గండికోటలను కలిపి సాహస పర్యాటక సర్క్యూట్, ఎకో అడ్వెంచర్ అభివృద్ధిని సూచించారు.
పశ్చిమ రాయలసీమ లోని అనంతపురము, కర్నూలులో వస్త్ర,లాజిస్టిక్స్ పరిశ్రమలు, వాహన విడిభాగాలు, జాతీయ రహదారుల అనుసంధానం, పెనుకొండ- రాయదుర్గం చారిత్రక టూరిజం సర్క్యూట్, సేంద్రీయ ఉద్యాన సాగు, బిందు సేద్యం తదితర అంశాలను సూచించారు.
ఈ సిపారసుల మేరకు -శాటిలైట్ కమిషనరేట్లు,ఐదు ఎక్స్ ప్రెస్ హైవేలు,హైదరాబాదు కు ప్రత్యామ్నాయంగా కర్నూలును, బెంగుళూరుకు ప్రత్యామ్నాయంగా అనంతపురంను అభివృద్ధి, వాటర్ గ్రిడ్లను ఏర్పాటు, ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం, ఉక్కుకర్మాగారం, అనుబంధ పరిశ్రమలు, ఆధునిక పద్ధతిలో టమోటా సాగు, వస్త్ర, లాజిస్టిక్స్ పరిశ్రమలు, వాహన విడిభాగాలు,సేంద్రీయ ఉద్యానసాగు, బిందు సేద్యం, సీమలో సాగునీటి సౌకర్యాలను కల్పించాలి.
పాపం ఇంత అభివృద్దిని సీమ ప్రజలు ఒక్కసారిగా భరించలేరనే ప్రభుత్వo అనుకున్నట్టుంది. అంబలి తాగే వాళ్లకు పిడికెడు సద్దన్నం వేస్తే చాలని, వేయకపోయినా వేస్తానని హామీ ఇస్తే చాలని, అలాంటి వారికి షడ్రసోపేత బోజనం పెడితే అరగదని, మన రాజకీయనాయకుల ,మరీ ముఖ్యంగా సీమ రాజకీయనాయకులు బావించారేమో –అందుకే జగనన్న మరో కమిటీ, ఈ సారీ తన మనసెరిగిన వారితో వేశాడు.దాంతో, బోస్టన్ కమిటీ నివేదిక ‘బోస్టన్ టీ పార్టీ’ అయింది.
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన తొమ్మిది మంది మంత్రులు, నలుగురు అధికారులతో హైపవర్ కమిటీ 19 జనవరి న తుది నివేదిక ఇచ్చింది. వారెంతో శోధించి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసారు.  20 జనవరి 2020 న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమoటే,పై కమిటీల సిఫారసులన్నీ ముందుగా జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ఏర్పాటు సమర్థించేవిగా ఉండటం.,
-వికేంద్రీకరణ బిల్లులో కర్నూలులో న్యాయ రాజధాని- అమరావతి శాసన రాజధాని
-విశాఖ పాలన రాజధాని. న్యాయస్థానాలు అడ్డుపడడంతో ప్రస్తుతం దాన్ని రద్దుజేశారు. తిరిగి సమగ్రమైన బిల్లు పెడుతారట.
ఈ మాత్రం దానికి, మూడు కమిటీలెందుకో? కేబినెట్ నిర్ణయం పేరుతో జగన్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తే పోలా?
పోతే, బోస్టన్ గ్రూప్, జి ఎన్ రావు కమిటీలు తమ విశ్వషనీయత కోసం, ప్రభుత్వ ఆలోచనలకు అదనంగా కొన్ని సూచనలు జేశాయి.అవన్నీ వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి దోహదపడేవే. కానీ, జగన్ ప్రభుత్వం తన కనుకూలంగా వున్న సిపారసుల ఆమోదించిం, మిగతా వాటిని అటకెక్కించింది..మళ్ళీ ఎన్నికల సమయం లో బయటకు తీసినా తీయవచ్చు. ఏమైనా,భవిష్యత్తులోనైనా సీమప్రజల ఆకాంక్ష ‘రాజధాని’ ‘న్యాయ’ అనే ఉపసర్గ (prefix)తో, నామామాత్రంగా నైనా నెరవేరుతుందా? లేక మరలా ఎన్నికల మేనిఫెస్టోలలో చూడాలా?
కేవలం మూడు రాజధానుల సిపారసులకే పరిమితం గాకుండా,జగన్ తాను వేసిన కమిటీల మిగతా సిపారసులలో కొన్నైనా అమలుజేసే ప్రయత్నంజేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కలుగుతాయి. నిరక్షరాస్యులు గల్ఫ్ దేశాలకో,అటు బెంగళూరు,మద్రాసో,ఇటు హైదరాబాదుకో,పొట్ట చేతపట్టుకొని వలసలు వెళ్ళాల్సిన అవసరం తప్పుతుంది.
విద్యావంతులైన యువకులకూ ఉద్యోగాలు లభిస్తాయి.ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం,కేంద్ర సహాయం తో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని ఆశించగలమా?
అయితే,పైకమితీల సిపారసులగురించి రాష్ట్రప్రజలలో ఇంతవరకు చర్చజరగాక పోవడం విచిత్రం.అందులోనూ ఏ రాజకీయ పార్టీ మూడు రాజధానుల అంశాన్ని తప్ప ,మిగతా సిపారసుల అమలుకై ఉద్యమం ఎలాగున్నా,కనీసందిమాండ్ చేయకపోవడం వారికి ప్రజలపట్లవున్న నిబద్ధతను తెలియజేస్తుంది.
చివరకు చంద్రన్న తన అమరావతీ రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకతను కొంతమేరకైనా తగ్గించేందుకు పై కమిటీల సిపారసుల అమలుజేయాలని ప్రజలముందుంచేప్రయత్నాలు జేయకపోవడం ఎత్తుగడల రీత్యా ఆ పార్టీ వైఫల్యాన్ని సూచిస్తుంది. ఏమైనా అన్ని పార్టీలు రాష్ట్రప్రజల్ని అమరావతీచుత్తో తిప్పుతూ మిగతా అభివృద్ధి వికేంద్రీకరణ అంశాల్ని మరుగు పరచగాలిగాయి.
సీమ ఎన్నాళ్ళు రాజకీయపార్టీల హామీలనే ఎండమావులవెంట పరుగెత్తాలి? వారి ఎత్తుగాలకు బలవ్వాలి? చరిత్రనుండి గుణపాటాలు నేర్చుకొనకపోతే భవిష్యత్ తరం మనల్ని క్షమిస్తుందా?.

(వివిధ కమిటీల సిపారసుల తెలపిన మిత్రులు అప్పిరెడ్డి హరినాథరెడ్డిగారికి కృతజ్ఞతలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *