నంద్యాల మండలం కానాల గ్రామంలోని నారాయణ పాండే పబ్లిక్ స్కూల్ ఆవరణలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో గురువారం నాడు మహిళలకు అవగాహన సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…
మహిళల చైతన్యంతోనే రాయలసీమ వెనుకబాటుతనం తొలగించవచ్చని ఆయన తెలిపారు. మన అవగాహన లోపం వలననే 1951 వ సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును సిద్దేశ్వరం వద్ద నిర్మించకుండా నందికొండ వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్మించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశాయని దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా సాగు, త్రాగు నీటిలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. 70 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాయలసీమలో నిర్మాణంలో ఉన్న హంద్రీ – నీవా, గాలేరు- నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలు మరియు ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొనడం రాయలసీమకు ఒక వరం అని అన్నారు. కాని రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏర్పడిన కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో ఈ ఏడు ప్రాజెక్టులను అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొనడం రాయలసీమకు తీవ్ర నష్టం కలుగ చేస్తుందని తెలిపారు. ఈ ఏడు ప్రాజెక్టులకు ఆరు నెలల కాలంలో అనుమతులు పొందకపోతే ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయినప్పటికీ వీటికి చుక్క నీరు కూడా విడుదల చేయమని కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో పేర్కొనడం బాధిస్తోందని ఆయన అన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన ఈ ఏడు ప్రాజెక్టులకు కృష్ణా నది యాజమాన్య బోర్డులో అనుమతులకై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తో దౌత్యం చేయాలని కోరారు.
ఏడు దశాబ్దాల నిరీక్షణ తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు లభించే హక్కుకు కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డతుంటే రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ మోనంగా ఉండటం తీవ్రంగా కలిచి వేస్తుందని అన్నారు.
రాయలసీమ నాలుగు జిల్లాల నుండి నాలుగు ప్రధాన పార్టీలకు అధినేతలు ఉన్నా, రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై చోద్యం చూస్తూ మౌనంగా ఉండటంతో రాయలసీమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.
పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అంటూ కృష్ణా నది పరీవాహక ప్రాంతం కాని విశాఖపట్నం లో KRMB ని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కృష్ణా నది నీటి పంపిణీలో కీలకంగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో వున్నందున కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.
పై విషయాలపై రాయలసీమ సమాజానికి అవగాహణ లేకపోవడంతోనే రాయలసీమ భవిష్యత్తుకు కీలకమైన ఈ అంశాల పట్ల నిర్లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి అని విమర్శించారు. రాయలసీమ సమాజం జాగృతి కావలసిన సమయం ఆసన్నమైంది అని పేర్కొన్నారు.
రాయలసీమ సమాజం అవగాహనతో రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడం మొదలు పెట్టకపోతే 70 సంవత్సరాల క్రితం సిద్దేశ్వర ప్రాజెక్టును పోగొట్టుకున్నట్లే, నేడు నిర్మాణం లో ఉన్న ఏడు ప్రాజెక్టులకు చుక్క నీరు అందకుండా పోయే ప్రమాదం ఉందని వివరించారు.
ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాలలో ప్రజలను జాగృతం చేసేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కానాల గ్రామంలో ఎక్కువ మంది మహిళలు తరలిరావడం అభినందనీయమని ఆయన అన్నారు. రాయలసీమ సాగునీటి సాధన ఉద్యమంలో మహిళలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. మహిళలు కూడా పొదుపు, ఐక్య సంఘాల సమావేశాలలో సాగు, త్రాగునీటిపై చర్చించి అవగాహన పెంచుకోవాలని దశరథరామిరెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో అపర్ణ, రామచెన్నమ్మ, సునీత, జమాలమ్మ, వెంకటసుబ్బమ్మ, నాగమ్మ, కృష్ణవేణి, మస్తానమ్మ, లహరి రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు సుధాకర్ రావు, రమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, నారాయణ పాండే పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసపాండే , ప్రతాపరెడ్డి మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.