“ప్రజా ఆగ్రహ సభ ” టైటిల్ అదిరింది, కానీ..!

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ  “ప్రజా ఆగ్రహ సభ ” టైటిల్ ఎంపిక అదిరింది.
జగన్ – మోడీ ప్రభుత్వాలపై…అని కూడా వేదిక బ్యానర్ పై వ్రాసి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చప్పట్లు కొట్టేవారు. ఎందుకంటే…
ప్రత్యేక తరగతి హోదాతో మొదలుపెట్టి రాయలసీమ- ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకం, కడప ఉక్కు పరిశ్రమ, రామాయపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్, పోలవరం డిపిఆర్ -2, రెవెన్యూ లోటు భర్తీ, విశాఖ – చెన్నయ్ పారిశ్రామిక కారిడార్, అన్నింటిలో దగా దగా దగా చేసినందుకు – చేస్తున్నందుకు, అమరావతి రాజధానిపై గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తూ హైకోర్టులో ప్రమాణ పత్రాలు దాఖలు చేసినందుకు, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు బరితెగించినందుకు, మన్నవరం బి.హెచ్.ఈ.ఎల్. – ఎన్.టి.పి.సి. విద్యుత్ పరికరాల పరిశ్రమకు తిలోదకాలు చెప్పినందుకు, ఇన్ని “ఉపకారాలు” ఆంధ్రప్రదేశ్ కు చేసిన మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలు “ఛీ” కొట్టకుండా ఎలా ఉంటారు చెప్పండి!
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశాలపై ఒక్కరైనా ప్రజా ఆగ్రహ సభలో పొరపాటున మాట్లాడతారేమోనని అనుకొన్నా. కానీ, ఒక్కరి నోటి నుండి కూడా మాట వినిపించలేదు. పోలవరానికి పర్యావరణ అనుమతులు ఇచ్చి ఏడేళ్లు గడిచినా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కదా! డి.పి.ఆర్. -2 కు ఎందుకు ఆమోదం తెలియజేయలేదో! నిధులను ఎందుకు సమకూర్చడంలేదో! మాత్రం వివరణ ఇవ్వలేదు.
ప్రసంగాల్లో “హైలైట్” ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న కోటి మంది త్రాగుబోతులు ఓట్లేసి వాళ్ళను అధికారంలోకి తెస్తే రు.50/-లకే మద్యం సరఫరా చేస్తారట.
-టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *