ఆధార్ తో ఓటు అనుసంధానం: ఆంతర్యం ఏమిటి?

1. “ఆధార్ తో ఓటు అనుసంధానం” బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో అలా ప్రవేశపెట్టి, ఇలా పది నిమిషాల్లో మూజువాణి ఓటుతో మోడీ ప్రభుత్వం ఆమోదం పొందింది. ఇహ! రాష్ట్రపతి ఆమోదముద్ర ఎంత పని. అది చట్టమైపోతున్నది. ఎన్నికల సంస్కరణలంటే ఇదేనా? మనది ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ. బహుళ పార్టీల వ్యవస్థ పటిష్టంగా వేళ్లూనుకొన్నప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా మనుగడ సాగిస్తుంది. ప్రజలు స్వేచ్ఛా సంకల్పం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేందుకు వ్యక్తులను ఎన్నికలలో ఎన్నుకునే స్వేఛ్ఛాయుత వాతావరణం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది.
2. అధికార దుర్వినియోగం, ధనబలం, కండబలం, మద్యం, కులం, మతం, జాతి, ప్రాంతం, తదితర అంశాలు మన దేశంలో ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చివేశాయి. చట్ట సభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం నవ్వుల పాలౌతున్నది. ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించే ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలే పునాది. నేడు ఆ పునాది అత్యంత బలహీనంగా ఉన్నది. పునాదిని బలోపేతం చేయడానికి సమగ్రమైన ఎన్నికల సంస్కరణలు అవసరం. ఈ అంశంపై గతంలో కేంద్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లు, ఉన్నత స్థాయి కమిటీలు లోతైన అధ్యయనం తదనంతరం సమర్పించిన నివేదికలు, చేసిన సిఫార్సులు ప్రభుత్వ బీరువాల్లో మట్టికొట్టుకు పోతున్నాయి. సమగ్ర ఎన్నికల సంస్కరణలను తీసుకురాక పోవడం పర్యవసానంగా మన మన ప్రజాస్వామ్య వ్యవస్థ భ్రష్టుపట్టి కునారిల్లిపోతున్నది. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసే సమగ్రమైన ఎన్నికల సంస్కరణలకు మోడీ ప్రభుత్వం ఎందుకు పూనుకోలేదన్నది సహేతుకమైన ప్రశ్న.
3. ఓటర్ల జాబితాను మాత్రమే ప్రక్షాళన చేయడానికి, తద్వారా బోగస్ ఓట్లను ఏరివేయడానికే ఈ చట్టాన్ని తెస్తున్నామని మోడీ ప్రభుత్వం చెబుతున్నది. ఆ మాట వినగానే మంచిదే కాదా! అన్న భావన సర్వసాధారణంగా అందరికీ కలుగుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కారణం, ఎన్నికల్లో దొంగ ఓట్ల దుష్ప్రభావంతో విసిగిపోయి ఉన్నాం. కాబట్టి ప్రాథమికంగా అలాంటి స్పందనే ప్రజల్లో సహజంగా ఉంటుంది. అందులో ఆశ్చర్యం లేదు. కాకపోతే కాస్త లోతుగా ఆలోచిస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, బహుళ పార్టీల వ్యవస్థను బలహీనపరిచే కోణం కనపడుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ/పార్టీలు, వాటితో పొత్తులో ఉన్న లేదా వాటికి అడుగులుమడుగులొత్తే పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో లబ్ధిపొందే అవకాశాలను మరింత పెంచే ప్రమాదకర లక్షణాలు కనపడుతున్నాయి. నేటి లోపభూయిష్టమైన వ్యవస్థలో దుష్టరాజకీయ శక్తులకే మెండుగా అవకాశాలున్నాయి. తద్వారా ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రతికూల పరిస్థితులు ఎదురౌతాయి. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే అవకాశాలు మృగ్యమవుతాయి.
4. భారత ఎన్నికల కమిషన్ / రాష్ట్రాల్లోని ఎన్నికల సంఘాల స్వయం ప్రతిపత్తి “నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో” అన్న నానుడిగా తయారైన కాలం. ఓటర్ల జాబితా, ఆధార్ కార్డుల సమాచారమంతా వాటి వద్దే ఉంటుంది. ఆ సమాచారాన్ని గోప్యంగా దాచిపెడతారాన్న విశ్వాసం ఏమాత్రం లేదు. ఎన్నికల నిర్వహణ వ్యవస్థపై విశ్వాసం బాగా సన్నగిల్లిన కాలంలో జీవిస్తున్నాం. ఈ.వి.యం.లపైనే ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న రోజులు. కారణం వాటిని ఉపయోగించే మనుషులపై అపనమ్మకం. మొబైల్ ఫోన్స్, సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్, వగైరా అన్నింటినీ ఆధార్ తో అనుసంధానం చేశారు. ఆ సమాచారాన్ని అధికారంలో ఉన్న పార్టీలు తస్కరించి, దుర్వినియోగం చేసి, ఓటర్లను ప్రలోభపెట్టో, నాయాన్నోభయాన్నో, బెదిరించో, బ్లాక్ మెయిల్ చేసో, ఓటర్లను లొంగదీసుకోవడానికి అవకాశాలు నేటి వ్యవస్థలో పుష్కలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ/వార్డు వాలెంటీర్లను, రాజకీయ పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేసుకొన్న “పెయిడ్ సోషల్ మీడియా గ్రూప్స్” ను ఏవిధంగా దుర్వినియోగం చేసుకొంటున్నారో చూస్తూనే ఉన్నాం.
5. ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమంలో భాగస్వాములైన అధికార యంత్రాంగాన్ని లోబరుచుకొని ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓటర్లను గుర్తించి ఆధార్ తో ఓటు అనుసంధానం చేసుకోలేదనో, మరో వంక పెట్టి గుండుగుత్తగా ఓటరు జాబితాల నుండి నిజమైన ఓటర్లను అక్రమంగా తొలగించే అవకాశాలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నది. ఈ అనుమానాలు ఊహాజనితమైనవి కావు. గత అనుభవాల నుండి పుట్టుకొస్తున్నవే. లోక్ సభ, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలోనూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినప్పుడల్లా పాలక పార్టీ వాళ్ళు చేసే అవకతవకలపై ప్రతిపక్ష పార్టీల నుండి ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
6. ఈ చట్టం అమలు పర్యవసానంగా పౌరుల వ్యక్తి గత సమాచార గోప్యతకు భద్రత కొరవడుతుందన్న ఆందోళనకు తోడు ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక స్వభావానికే ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉన్నదన్న అనుమానాలను తృణీకార భావంతో తిరస్కరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత చట్టసభలపై ఉన్నది. ఓటర్ కార్డులతో ఆధార్ కార్డుల అనుసంధానం చేయడాన్ని చట్టబద్ధం చేసే బిల్లును “సెలక్ట్ కమిటీ”కి పంపించి, లోతైన పరిశీలన, చర్చ, ఓటర్ల వ్యక్తి
T Lakshminarayana
T Lakshminarayana
గత సమాచారానికి సంబంధించిన భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పట్లు చేసి, తదనంతరం చట్టం చేసి ఉంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది. న్యాయబద్ధమైన ఆ డిమాండును కూడా ఆలకించకుండా మోడి ప్రభుత్వం ఈ చట్టాన్ని దేశంపై రుద్దడంలోని ఆంతర్యమేమిటి? ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.
T Lakshminarayana
T Lakshminarayana
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *