పాలించే పార్టీయే నిరసనలు తెలిపితే రాష్ట్రంలో పాలన సరిగా ఉన్నట్టా లేనట్టా? అధికార పార్టీ చర్యలు ప్రజలకు వ్యతిరేక సంకేతాలు కావా? రాష్ట్రప్రభుత్వం ఆలోచించుకోవాలి.
(వడ్డేపల్లి మల్లేశము)
అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు భిన్నంగా, బాధ్యతాయుతంగా, నిండు దనముతో, సమయస్ఫూర్తిగా వ్యవహరించవలసి ఉంటుంది. దూకుడుతనం, దౌర్జన్యం, రౌడీయిజం, ప్రతిపక్షాలను ఇష్టారాజ్యంగా విమర్శించి చిన్న పుచ్చడం పాలక పార్టీకి తగదు. కానీ ఇటీవలి కాలంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పాలక తెరాస ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు ప్రతిపక్షాలపై అన్ పార్లమెంటరీ భాషలో నిందా పూర్వకంగా మాట్లాడి చులకన చేయడం అనేది కళ్ళారా చూస్తున్నాం. ఇది ఏ రాష్ట్రం లోనూ ఇంత స్థాయిలో లేకపోవడం విచారకరం. ప్రభుత్వ దురుసుతనం, అవమానించే మాటలు ప్రతిపక్షాలను కూడా పరోక్షంగా రెచ్చగొట్టి నట్టుగా అవుతున్నది.
ప్రధానమైన విషయం ఏమిటంటే పాలనా పార్టీగా ఉన్నటువంటి తెరాస ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల కోసమని ప్రజల మెప్పు పొందడానికి 20 డిసెంబర్ 2021 సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.
నిరసన అందించే సంకేతం ఏమిటి?
గత నవంబర్ మాసంలో కూడా ఇదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన తెరాస పార్టీ శ్రేణులు మంత్రులు శాసనసభ్యులు ముఖ్యమంత్రి తో సహా నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. వీరి నిరసన ఎవరికి అనుకూలం? ఏ వర్గాలకు వ్యతిరేకం? అధికారం లో ఉన్నతెరాస శ్రేణులు నిరసన తెలపడం పరోక్షంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా చేసినట్లే కదా?
భారతదేశంలోని అధికారంలో ఉన్న పార్టీ శ్రేణులు ఈ రకంగా నిరసన ఉద్యమం నిర్వహించడం అరుదు.ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం కత్తిరించినoదుకు నిరసనగా ఢిల్లీ ముఖ్యమంత్రి గతంలో ధర్నా చేసి తన నిరసన వ్యక్తం చేసినాడు.
ఇంకా ఒకటి రెండు చోట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు ఇలాంటి నిరసనలు 1,2 జరిగి ఉండవచ్చు.
కానీ రాష్ట్ర రైతాంగం పండించిన టువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ఆ సమస్యలను భూతద్దంలో చూపి దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, తమకు ఏమి సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ నిరసన తెలపడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడమే అవుతుంది.
అంతేకాకుండా కంచే చేను మేసినట్లు ప్రజల దృష్టిని మళ్లించదానికే ఈ నిరసనలు అని మనకు అర్థం అవుతున్నాయి. రెండు మాసాలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షాకాలం పంట తో రైతులు ఇబ్బందులు పడుతుంటే కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేసి కొనుగోలు వేగవంతం చేయకుండా బాధ్యతను మరొకరిపై నెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. ఇది పూర్తిగా కేంద్ర వైపల్యమే అనలేం. తెలంగాణ ప్రభుత్వం బాధ్యత ఎంత?
ప్రజానుకూల ఆలోచన చేయాలి
రబీ పంట ధాన్యాన్ని భవిష్యత్తులో కొనుగోలు చేస్తారా ? లేదా? అనే ఏకైక డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేస్తూ ధర్నాలు నిరసనలతో రాష్ట్రంలో పాలనను మాత్రం పక్కదారి పట్టిస్తున్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలు, పెండింగు లో ఉన్న అనేక సమస్యలు, పండించిన ధాన్యం తక్షణ కొనుగోలు వంటి విషయాలను పక్కనపెట్టి కేంద్రంతో తలపడడం ప్రజాస్వామిక దృక్పథం కాదు.
బెదిరింపులతో కేంద్రంతో బేరసారాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఇచ్చిన హామీల పైన రాష్ట్ర ప్రజానీకం, ప్రజాసంఘాలు, అఖిలపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతకు మించి బెదిరించడానికి నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాల గురించి రాజ్యాంగ తో పాటు అనేక కమిషన్లు కూడా మార్గదర్శకాలు వెలువరించాయి. నిబంధనల మేరకు ప్రాతినిధ్యాలు, చర్చలు, స్థానిక పరిస్థితులు, ప్రత్యామ్నాయ విషయాలను చర్చించి హుందాగా వ్యవహరించవలసిన ది పోయి “మెడలు వంచుతాం, వెంటపడతాo, వదిలిపెట్టే సమస్య లేదు,” అని చులకన మాటలు రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో మాట్లాడడం పూర్తిగా అసందర్భం.
రాష్ట్ర ప్రజానీకం రాష్ట్రంలోని ప్రతిపక్షాలు రాష్ట్రంలోని ప్రజా సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించాలి. అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిజమైన తెలంగాణ ప్రభుత్వంగా భాసిల్లుతోంది.
అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రులు మాట్లాడుతున్నారు. అవును బాధ్యతను విస్మరించి ఇతరులపై నెట్టివేసి కేంద్రంతో ఘర్షణ పడే ధోరణిలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొదటి ర్యాంకు లో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. “తన ముఖాన్ని తాను చూసుకోకుండా ఇతరుల ముఖాన్ని అవమానించి ఆడిపోసుకుంటూ ఉంటే ఏ రకంగా చులకనవుతారో “అదే రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఉన్నది. ప్రత్యామ్నాయ విధానాలపై ఆలోచన లేదు. ఎందుకు?
ఇంత కాలంగా రాష్ట్రంలో పంటలు పడుతూనే ఉన్నాయి. చెరువులు వర్షాధారంగా పండించే పంటల వలన ఉత్పత్తి గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఇటీవల తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ప్రాజెక్టులను నిర్మించడం వలన ప్రాజెక్టు క్రింది భూములన్నీ జాలి పట్టి నీటితో నిరంతరం ఉండటం వలన వరి పంటకు తప్ప ఏ పంట కూడా వేయడానికి యోగ్యంగా ఉండవు. నీటి సౌకర్యం పెరిగితే పెరిగే దిగుబడిని కొనుగోలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందనే ఆలోచన ముందుగా ఈ ప్రభుత్వానికి లేదా? ప్రాజెక్టులు కట్టినప్పుడు నీటి సౌకర్యాన్ని కల్పించినప్పుడు ప్రజలకు కోటి ఎకరాల మాగాణి అని హామీ ఇచ్చినప్పుడు కేంద్రంతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిoదా?
అత్యవసరమైన టువంటి ఆహార ధాన్యాలు, సంబంధ ధాన్యాలు, వాణిజ్యపంటలు మొదలగు వాటి విషయంలో రాష్ట్రంలో నిర్లక్ష్యం జరుగుతూ కేవలం వరి పంట పైనే దృష్టి పెట్టడం జరిగింది. అనాదిగా జరుగుతున్న ఈ పద్ధతి కారణంగా కొన్ని రకాల గింజలు, ధాన్యాలు పంటలు అందుబాటులో లేక అసమతుల్యత ఏర్పడుతుంది. అలాంటప్పుడు అత్యవసరమైన పంటలను ఎంపిక చేసి పండించడానికి రైతులను ప్రోత్సహించడం ద్వారా కొరత ఉన్నటువంటి ఆ రకాలను అవసరానికి సరిపోయే స్థాయిలో పండించుకోవచ్చు కదా! ఈ ఆలోచన వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో ప్రభుత్వం ఏనాడైనా చర్చించినదా? అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసినదా? లేదు!!
అందుకే రాష్ట్రంలో నీతిమంతమైన సుపరిపాలన ప్రజలకు అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు అఖిల పక్షాలు ప్రజా సంఘాలతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి పెద్దరికాన్ని చాటుకోవాలి . సమస్యలపైన ఏకాభిప్రాయానికి రావాలి .అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించే ప్రభుత్వాలుగా మనగలుగుతాయి. ఇకనైనా ప్రజల దృష్టి మళ్లించే ఎన్నికలు, ఫలితాలు, పార్టీ కార్యక్రమాలు వంటి అసందర్భ సమస్యలను పక్కనపెట్టి ప్రజల సమస్యల పైన దృష్టి పెట్టాలి. అదే నిజమైన పరిపాలన అవుతుంది. ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ తామే గెలిచిన మని, ప్రజలు మా వైపే ఉన్నారని ప్రగల్భాలు పలకడం లో అర్థం లేదు.
మెజారిటీ సభ్యులు అధికార పార్టీ వాళ్లే ఉండటం వలన శాసనమండలి స్థానాలను కూడా తెరాస చేజిక్కించుకోవడం లో ప్రత్యేకత ఏమీ లేదు.బదులుగా అధికార పార్టీకి చెందిన ఓట్లు ప్రతిపక్షాలకు చీలిపోయిన విషయం పైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎన్నికల ఫలితాలతో నే ప్రజలు తమ వెంట ఉన్నారని చెప్పుకోవడంలో అర్థం లేదు .ఆ విషయాన్ని ప్రభుత్వం మరిచి ప్రజల గురించి పట్టించుకోవడం ఇకనైనా కొనసాగించాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ)