కేంద్రంపై మీ యుద్ధం ఏమైంది?

పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి వచ్చి పది రోజులు గడుస్తున్నా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై ఎందుకు యుద్ధం చేయడం లేదెందుకు? ధాన్యం కొనుగోలు గాలికొదిలేసినట్టేనా?
*టిఆర్ఎస్ ఎంపీలను ప్రశ్నించినా భట్టి విక్రమార్క*
ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా
ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తామని పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి వచ్చి పది రోజులు గడుస్తున్నా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై ఎందుకు యుద్ధం చేయడం లేదని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తాటతీస్తాం.. మెడలు వంచుతామని ప్రగల్బాలు పలికిన ఎంపీలు హైదరాబాద్ వచ్చాక మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. పార్లమెంటు సమావేశాలు బహిష్కరించి వచ్చి రైతులతో కలిసి రాస్తారోకోలు, ధర్నాలు, రైతు దీక్షలు, రైతు కల్లాల వద్ద ఆందోళన చేస్తారని ఆశించగా అందుకు భిన్నంగా ఉండటంపై తీవ్రంగా తప్పు పట్టారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పార్లమెంటు సమావేశాల్లో ప్రతిరోజూ ఆందోళన చేయాల్సిన టీఆర్ఎస్ ఎంపీలు సమావేశాలను బహిష్కరించి బాధ్యతారహితంగా వ్యవహరించారని అన్నారు.
పార్లమెంటులో కేంద్రంపై కొట్లాడక, రైతులతో కలిసి బయట పోరాటం చేయకుండా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ఫూల్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవంబర్ 29 నుంచి ప్రారంభమైన శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేవలం వారం రోజుల పాటు మొక్కుబడిగా ఆందోళనల పేరిట పార్లమెంట్ హౌజ్ లో టీఆర్ఎస్ ఎంపీలు టైంపాస్ చేశారని ఎద్దేవా చేశారు. దాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం కావాలని, రైతులు ఆనందంగా ఉండాలని టీఆర్ఎస్ ఎంపీల్లో నిజాయితీ ఉండి ఉంటేఈ నెల 23న పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకూ హౌస్ లోనే ఉండి వివిధ రూపాల్లో ఆందోళనలు చేసేవారన్నారు.
దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఆందోళన చేయాలన్న చిత్తశుద్ధి సీఎం కేసీఆర్ కు, టిఆర్ఎస్ ఎంపీలకు లేదని, ప్రధాని మోడీ ఆగ్రహానికి గురి కాకుండా ఉండటం కోసమే పార్లమెంటు సమావేశాలను సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ ఎంపీలతో బహిష్కరణ చేయించారని ఆరోపించారు.
ఢిల్లీలో తెలంగాణ ఎంపీలతో ధర్నా చేయిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ ఎంపీలను తిరిగి ఎందుకు హైదరాబాద్‌కు రప్పించాడని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు పై స్పష్టత రాకుండానే పార్లమెంటును బహష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారంటేనే తెరవెనుక టిఆర్ఎస్ బిజెపిల మధ్య ఏదో ఒప్పందం జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయాలు చేస్తూ రైతుల ప్రాణాలను హరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
70 రోజుల్లో 206 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ ఆత్మహత్యల తెలంగాణగా మార్చుతున్నాడని ధ్వజ మెత్తారు వానాకాలంలో సాగైన సుమారు 62లక్షల ఎకరాల్లో వరి దిగుబడి కోటి 3 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి రైతులను మూడు నెలలుగా అరిగోస పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ సర్కార్ చేసిన ధాన్యం కొనుగోలు జాప్యం వల్ల బెంగ పడిన రైతులు సిద్దిపేట, ఏటూరునాగారం, కామారెడ్డి జిల్లాలో ధాన్యం కుప్పల వద్ద గుండె పగిలి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా 20 శాతం వరి కోతలు మిగిలి ఉన్నాయని, మరో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి 1982 కొనుగోలు కేంద్రాలను మూసి వేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన, చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. వానాకాలం పంటను చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తానని ప్రకటించిన సీఎం కెసిఆర్ తన మాటను నిలుపుకోవాలని, లేనిపక్షంలో రైతులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
2018 డిసెంబర్ 11వరకు ఉన్న క్రాప్ లోన్లు (వడ్డీ, అసలు కలిపి) రూ. లక్ష వరకు మూడేండ్లలో మాఫీ చేస్తామని ఎన్నిక‌ల సమయంలో టిఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీని ఈ క్లిష్ట పరిస్థితుల్లో వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 40.66లక్షల రైతులకు సంబంధించి రూ.25,936 కోట్ల క్రాఫ్ లోన్స్ ఉండగా, గడిచిన మూడేండ్లలో కేవలం 4 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 732.24 కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఇంకా 36.66 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 25,203 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకుల్లో కొత్త అప్పు పుట్టక, అధిక మిత్తికీ ప్రైవేటు వ్యాపారుల వద్ద తెచ్చు కుని తిరిగి తీర్చలేక మనస్తాపంతో రైతులు ప్రాణాలు వదులుతున్న ఘటనలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *