‘ఆత్మహత్యలు మాని ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోండి’

 (వడ్డేపల్లి మల్లేశము)
దేశంలో ఎక్కడో ఏ మూలనో అన్నదాతలు బలికాని రోజంటూ లేనేలేదు. పాలకులు మాత్రం సభలు, సమావేశాలు, ఎన్నికల సంబరంలో మునిగితేలుతూ ప్రజలను విస్మరిస్తూ రైతు ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు. నిజమా? కాదా?
దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం మేలు చేసే చట్టాలను చేసినమన్న కేంద్ర ప్రభుత్వం రైతులు సంవత్సరకాలంగా చేసినటువంటి ఉద్యమానికి తలవంచి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకున్న సంగతి మనందరికీ తెలిసినదే.
రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి కేంద్ర చట్టాలను సమర్థించి మరొకసారి కేంద్ర చట్టాలపై విమర్శించి ప్రజలను రైతులను సందిగ్ధంలో పెట్టడమే కాకుండా ఇటీవల ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బాధ్యతంతా కేంద్రం పైననే నెట్టి మరికొంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైనది.
  ప్రజలు తెరాస వెంటనే ఉన్నాట్లా?

గత నెల రోజులుగా సాగుతున్నటువంటి శాసనమండలి సభ్యుల ఎంపిక డిసెంబర్ 14వ తేదీతో ముగిసింది. శాసన సభలో బలం ఉన్న కారణంగా స్థానిక సంస్థల బాధ్యులు ఎక్కువగా టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నందున 12 స్థానాలకు గాను 12 స్థానాలను తెరాస పార్టీ గెలిచింది. డిసెంబర్ 10వ తేదీన స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎంపికకు గాను జరిగిన ఓటింగ్లో ఆరు స్థానాల్లోనూ అధికార పార్టీ గెలిచినప్పటికీ అధికార పార్టీ ఓట్లు స్వతంత్రులకు, కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగిన విషయాన్ని మరిచిపోయినారు.

ఆరు స్థానాల ఫలితాలు రాగానే ప్రజలు తెరాస వెంటనే ఉన్నారని ఒకరు, పరిపాలనకు నిజమైన తార్కాణమని మరొకరు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని మరొక మంత్రి ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించడం బుద్ధి జీవులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులను ఆశ్చర్యపరుస్తున్న ది.
ఎన్నికలలో సామాన్య ప్రజానీకం ఓట్లు వేయలేదు. శాసన సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాత్రమే ఓట్లు వేసి 12 సీట్లను కైవసం చేసుకున్నoత మాత్రాన ప్రజలు తెరాస వెంట ఉన్నారన డానికి ఆధారాలు ఎక్కడివి? ఈ ఎన్నికల విధానము, విషయం అసలు సామాన్య ప్రజానీకం తెలియనే తెలియదు.
హుజురాబాద్ ఎన్నికలతో ఆరు మాసాలు, శాసన మండలి సభ్యుల ఎన్నికలతో నెలకు పైగా ప్రభుత్వము తన సమయాన్ని ఎన్నికలపైనే ఖర్చుపెట్టి మనసంతా గెలుపు మీదే ఉంచినప్పుడు రాష్ట్రంలో నిజంగా పరిపాలనకు ఆటంకం జర్గలేదా?
వరి ధాన్యం కొనుగోలు విషయంపై సుమారుగా రెండు మూడు మాసాలుగా బిజెపి తెరాస మధ్య యుద్ధం కొనసాగుతుంటే మార్కెట్లోకి వచ్చినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత తాత్సారం చేసి రైతుల ఓపికను పరీక్షించినట్లు అయింది .
దాని పర్యవసానంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల లోనే వివిధ కారణాలతో పది మంది వరకు రైతులు చనిపోతే గత రెండు మాసాలలో 200 మంది రైతులు, గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో 1000 మంది వరకు రైతులు చనిపోయినట్లు ప్రసార మాధ్యమాల గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
రైతుబంధు ఇచ్చినా ఆత్మహత్యలు ఆగలేదు 

రైతుబంధు భారతదేశంలోనే అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి?. ఒక అంచనా ప్రకారం గా రైతుల ఆత్మహత్యల్లో ఎక్కువభాగం కరువు రైతుల వే. ఇక రైతు బంధు ద్వారా సంవత్సరానికి కేటాయిస్తున్నటువంటి 15,000 కోట్ల రూపాయలలో సామాన్య, సన్నకారు, చిన్నకారు రైతులకు దక్కేది నామమాత్రమే.

కాగా అగ్రభాగం భూస్వామ్య వర్గానికి చెంద డంవల్ల ఈ పథకం ఏ రకంగా ప్రయోజనమో ప్రభుత్వం ఇప్పటికీ జవాబు ఇవ్వలేదు. పైగా ఉచితంగా ఎరువులను సరఫరా చేస్తానని మాట ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోగా మరింత ధరలను పెంచిన కారణంగా కూడా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి, ఒకేసారి రుణమాఫీ జరగని కారణంగా, కౌలు రైతులకు రైతుబంధు వర్తించని కారణంగా ఈ ఆత్మహత్యలు జరుగుతున్న విషయం ప్రభుత్వానికి తెల్వదా?
సభలు-సమావేశాలు ,ప్రారంభోత్సవాలు, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం, పరస్పర ఆరోపణలతో ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న యుద్ధం వంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వానికి రైతుల ఇబ్బందులు రైతుల ఆత్మహత్యలు కనబడకుండా చేస్తున్నాయా? ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి ప్రజలు ప్రభుత్వం వెంటే ఉన్నారని ప్రకటించడం, హుజురాబాద్ వంటి చోట ఓడిపోయిన సందర్భంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసి ప్రజల సానుభూతి పొందడానికి ప్రయత్నం చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందా? రైతులారా!! ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి!
ఇటీవలి రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా కావాలి

రైతులకు సంబంధించిన సమగ్రమైన విధానాన్ని ప్రకటించే ముందు శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు, రైతు సంఘాలు, అఖిల పక్షాలతో రాష్ట్రప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది .కానీ అలాంటి సమీక్ష, సమావేశం జరగకపోగా ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు అంతులేకుండా పోయింది.

పైగా “దళిత బంధు” అని ప్రకటించి హుజురాబాద్ ఎన్నికలలో సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించి నవంబర్ 4వ తేదీనుండి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని మాట ఇచ్చి ఇప్పటికీ మరిచిపోవడం దేనికి సంకేతం? “ఎద్దు ఏడ్చిన నేల, రైతు కన్నీరు కార్చిన దేశం పాలకుల చరమ గీతానికి సూచిక” అని అనేకమంది పెద్దలు చెబుతూ ఉంటారు.
ప్రచార ఆర్భాటాలు, రాజకీయ లబ్ధి , ఎన్నికల ప్రయోజన మీదనే ప్రభుత్వాలు దృష్టి నిలిపితే ఏ ప్రభుత్వానికి అయినా అది మంచిది కాదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ప్రభుత్వ వైఫల్యానికి సూచికగా భావిస్తే తప్ప మెరుగైన పాలనను రాష్ట్రంలో చూడలేము.
 కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై నినదించండి. గొంతెత్తండి!. ప్రభుత్వం వెంటపడితే తప్ప పాలకులు కళ్లు తెరవరు.
ఆత్మహత్యల గురించి ఆలోచించరు. రైతు సమస్యలకు పరిష్కారాలు వెతకరు. ఇదంతా సక్రమంగా రాష్ట్రంలో జరగాలంటే కలిసి వచ్చే అఖిల పక్షాలు ప్రజా సంఘాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఒకే రాజధాని కోసం చేస్తున్న ఉద్యమం లాగా పిడికిలి బిగించి పోరాడితే తప్ప రైతు సమస్యలు పరిష్కారం కావు. అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వానికి ప్రజలు రైతులు సామాన్య జనం ఎవరి వెంట ఉన్నారనేది. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతో అవకాశం ఉంది. దానిని సద్వినియోగం చేసుకుంటే ప్రజలు మిమ్ములను ఆదరిస్తారు. లేకుంటే చీ కొడతారు.
ప్రజలు, రైతులు ,ఆదివాసీలు, తదితరుల పక్షాన పోరాడి నిజమైన ప్రజానాయకులు గా మిగిలిపోతారా? లేక ఉదాసీనంగా వ్యవహరించి ప్రజల ఆగ్రహానికి గురవుతారా? మీరే తేల్చుకోండి.
Farmers suicides Telangana
Vaddepalli Mallesam
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట (చౌటపల్లి) తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *