ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన దేనికి సూచిక

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
“ఒక నిప్పురవ్వ ఓ మహాగ్నిని సృష్టిస్తుంది” అనే మావో సూక్తి స్థల, కాలాదులకి లోబడింది. అదో నిర్దిష్ట స్థితిగతుల్లో సాధ్యం. అవి తటష్టించిన చోట్ల మహాగ్ని జ్వాల సాధ్యమే. గత శనివారం ఆర్మీ కాల్పుల్లో ఆరుగురు నాగా బొగ్గు గని కార్మికుల ప్రాణత్యాగం అలాంటి ఓ కొత్త భౌతిక పరిస్థితికి దారి తీస్తోంది.
“సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం” (AFSPA) కాశ్మీరీ స్త్రీలపై అత్యాచారాలని గుర్తు చేస్తుంది. ఇరోమ్ షర్మిల దీక్షనీ, మణిపూర్ స్త్రీల దిగంబర నిరసన ప్రదర్శననీ గుర్తు చేస్తుంది.
AFSPA ఓ ఫాసిస్టు సైనిక చట్టం. దానిపై పోరు పాతదే. BSF పర్యవేక్షణ ప్రాంత పరిధిని విస్తరించి ఫెడరలిజం పై కొత్తదాడికి కేంద్రం దిగే కాలంలో నాగా జాతిపై మోడీ ప్రభుత్వ తాజా ఫాసిస్టు దాడి కొత్త ప్రతిఘటనకు కారణం.
4-12-2012 శనివారం నాగాలాండ్ గని కార్మికుల పై ఆర్మీ కాల్పులు ప్రజా ప్రతిఘటనకి దారి తీసింది. దాన్నుండి క్రింది 5 ధోరణుల్ని చూడొచ్చు.
1-కాల్పులు జరిపిన సైనిక దళాలపై పోలీసులే “సువో మోటో” కేసు నిన్న తిజిత్ పోలీసు స్టేషన్ నమోదు చేసింది. అది మియన్మార్ సరిహద్దులో మాన్ జిల్లా లో జరిగింది. ఇది కేంద్రానికీ, రాష్ట్రాలకీ మధ్య ఘర్షణకు చిహ్నం. “హత్య” & “హత్యా ప్రయత్నం” సెక్షన్ల క్రింద నమోదైన ఆ కేసు FIR లో క్రింది వాక్యాల్ని చూద్దాం.
“సైనిక దాడికి స్థానిక పోలీస్ గైడ్ గానీ, గైడ్ కోసం పోలీస్ స్టేషన్ కి సైనిక అభ్యర్ధన గానీ లేవని FIR పేర్కొన్నది. గాన ఆర్మీకి పౌరుల్ని హత్య చేసే, గాయపరిచే ఉద్దేశ్యం ఉందని FIR పేర్కొన్నది”
సైనిక దాడికి స్థానిక పోలీస్ స్టేషన్ నుండి సాయం పొందాలనే ఓ కంటితుడుపు క్లాజు AFSPA చట్టంలో ఉంది. అది ఏనాడూ అమలు జరగలేదు. పిర్యాదుదార్ల నుండి పిర్యాదు లేకుండా పోలీసులే పిర్యాదుదార్లు గా మారి, సువోమోటో కేసు దాఖలు చేయడం విశేషం! న్యాయవ్యవస్థ సువో మోటో పద్ధతిని అవలంబిస్తుంది. దాన్ని నాగా పోలీస్ వ్యవస్థ అనుసరించడం రేపటి చరిత్రకి నాంది కాబోలు!
2-మృతుల అంత్యక్రియ సందర్భంగా నాగాలాండ్ ముఖ్యమంత్రి AFSPA చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసాడు. ఆ సందర్భ ప్రకటనలో క్రింది కీలక వ్యాఖ్యని చేశారు.
“ఈ బొగ్గు గని కార్మికులు నాగా జాతి కోసం తప్ప భారతదేశం కోసం ప్రాణ బలిదానం చేయలేదు”
నాగా ముఖ్యమంత్రి ప్రతిస్పందనలో నాగా ప్రజల చారిత్రిక దృష్టి దాగి ఉంది. ఇండియా పరాయి దేశమనే మానసిక భావన వారిది. 1947 లో విలీన సమయంలో చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. భారత్ తమది కాదనే భావమిది.
(స్థూలంగా రెండు ఇండియాలు:- A-ఫాసిస్టు ఇండియా! B-ప్రజాతంత్ర ఇండియా! ఫాసిస్టు పాలక రాజనీతిది ఒకటి. దానికి భిన్నంగా గణతంత్ర, ప్రజాతంత్ర విధానాలకి ప్రాతినిధ్యం వహించేది మరొకటి. నాగా జాతి ఆకాంక్షల్ని అణచివేసే భారత పాలక వర్గాల విస్తరణవాద, ఆధిపత్య, ఫాసిస్టు రాజనీతి నుండి దేశ ప్రజలు వేరుపడక పోతే, నాగా జాతీయుల దృష్టిలో ఒకే ఇండియాగా నిలుస్తుంది)
3-ఈశాన్య రాష్ట్రాల్లో AFSPA రద్దుకై ఉద్యమ నిర్మాణానికి నేడు పునాది పడింది. మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా నిన్న AFSPA రద్దుని కోరాడు. బిజెపి సంకీర్ణ నేతగా ఇలా అన్నాడు.
“AFSPA చట్టం రద్దు చేయబడాలని పార్టీగా మరియు వ్యక్తిగతంగా మేము భావిస్తున్నాం”
మాన్ జిల్లా బిజెపి అధ్యక్షుడు న్యావాంగ్ కొన్యాక్ గని కార్మికుల మరణ వార్తవిని ఆ ప్రదేశ సందర్శనకి మేనల్లుడు, ఓ మిత్రుడు, డ్రైవర్ తో ఓ కారులో వెళ్లాడు. కారుపై బిజెపి జండా వున్నా ఆర్మీ కాల్పులకి దిగిందని వాపోయాడు. బీజేపీ పార్టీ బీజేపీ నేతను రక్షించలేని కొత్త ఫాసిస్టు రాజనీతిని వెల్లడించే పరిణామమిది. ఆ సంఘటనపై కొన్యాక్ క్రింది వ్యాఖ్య చేసాడు.
“తన ఓటింగ్ గ్రామానికి చెందిన ఆరుగురు గని కార్మికుల్ని సైన్యం చంపిన వార్త విని అటు వెళ్తున్నా. ఆర్మీ కాల్పులు జరిపి నా సహచరుణ్ణి చంపింది”
ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ బిజెపి మిత్రపక్షాలు కాల్పుల ఖండనకే కాక, AFSPA చట్టం రద్దుని డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి రేపటి చరిత్ర నడకకి సూచిక! రాజ్యాంగం పై; ఫెడరలిజం పై; గణతంత్ర వ్యవస్థ పై ఫాసిస్టు దాడి క్రమంలో దేశ రాజకీయ వ్యవస్థలో మున్ముందు వచ్చే మార్పులకి చిహ్నం. నేటి బీజేపీ, బిజెపియేతర పక్షాల మధ్య గీత చెరిగి, ఫాసిస్టు అనుకూల, ఫాసిస్టు వ్యతిరేక పక్షాల మధ్య గీతగా మారొచ్చు. కొత్త సంఘర్షణ రూపం ధరించ వచ్చు. రేపటి కాలానికి ఇదో సూచిక!
4-నాగాలాండ్ లో ఆదివాసీల పెద్ద పండగ “హార్న్ బిల్”! విభిన్న ఆదివాసీ తెగల ప్రజలు అశేష సంఖ్యలో హాజరై పది రోజులు జరిగే మహా పర్వదినమది. (సమ్మక్క, సారలక్క జాతర వంటిది) విదేశాల నుండి సైతం నాగాలు హాజరవుతారు. డిసెంబర్ 1 నుండి10 వరకి జరిగేది. ఆదివాసీ ప్రజలు సంతాపంగా స్వచ్ఛందంగా పండగని నిలిపి వేశారు. రాష్ట్రంలో ఆరు పెద్ద ఆదివాసీ తెగల సంఘాలు మిగిలిన రోజుల్లో కూడా పండగని నిలిపి వేద్దామని ప్రజలకి నిన్న విజ్ఞప్తి చేసాయి. నాగా ఆదివాసీ ప్రజల్లో సైన్యం పై; AFSPA చట్టం పై ఎంత క్రోధం వుందో ఊహించవచ్చు. ఆబాల గోపాలం ఆటపాటతో తన్మయత్వం పొందే సాంప్రదాయ పండగని 14 మంది హత్యకి నిరసనగా నిలిపి వేత అసాధారణమైనది.
5-నాగా విద్యార్థి సమాఖ్య (NSF) పిలుపు మేరకు ఇప్పటికే ఆరు గంటల రాష్ట్ర బంద్ జరిగింది. వివిధ ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులతో ఏర్పడ్డ ఈశాన్య విద్యార్థి సంస్థ (NORTH EAST STUDENTS ORGANISATION NSF) రంగంలోకి దిగి, AFSPA చట్టం రద్దుకై 9-12-2021న ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన దినం పిలుపు ఇచ్చింది.
లోక్ సభలో హోమ్ మంత్రి క్షమాపణ; AICC నలుగురి టీమ్ ఎంపిక; తృణమూల్ ఆరుగురు ఎంపీల బృందం ఎంపిక; మానవ హక్కుల సంస్థ (NHRC) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు ఇవ్వడం; రొటీన్ పద్ధతికి విరుద్ధంగా తాము సిట్ వేసి నెలలో దర్యాప్తు పూర్తి చేస్తామని సైన్యం హామీ వంటివి ఘటన తీవ్రతని వెల్లడి చేస్థాయి. ఐనా ఆచరణలో ఫలితం లేనివే. పై ఐదు అందుకు పూర్తిగా భిన్నమైనవి.
ఓవైపు మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకున్న మోడీ షా ప్రభుత్వానికి ఇది మరో పెద్ద ఎదురు దెబ్బ! ఉపా చట్టం రద్దు, NIA చట్టం రద్దు; “సాయుధ దళాల (జమ్మూ& కాశ్మీర్) ప్రత్యేక అధికారాల చట్టం-1990” రద్దు లకై దేశవ్యాప్త హక్కుల ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన కర్తవ్యానికి స్ఫూర్తినిచ్చే పరిణామం యిది. గిట్టుబాటు ధర; విద్యుత్ బిల్లు వాపసు; నాలుగు లేబర్ కోడ్స్ రద్దు, SKM పెండింగ్ డిమాండ్స్ పై ఉద్యమ కొనసాగింపుకి యిది స్ఫూర్తినిస్తుంది.
నలుపు రెండింటికి చిహ్నం. నల్ల బ్యాడ్జీ సంతాపానికీ, నిరసనకీ సింబల్. చరిత్రలో నిన్న డిసెంబర్ 6 ఓ బ్లాక్ డే! నలుపు అంబేద్కర్ మృతికీ చిహ్నం. బాబరీ మసీదు విధ్వంస చర్యకూ చిహ్నం. అదే చీకటి దినం. (బ్లాక్ డే) గత చరిత్రలో విషాదం మిగిల్చిన ‘బ్లాక్ డే’ రేపటి చరిత్ర గమనం లో వెలుగు ఇచ్చే ‘బ్రైట్ డే’ గా మారుతుందా? ఔనుమరి, ఆర్మీ ఫాసిస్టు చర్యపై పీడిత నాగా జాతి తరపున “తిజిత్” పోలీసు స్టేషన్ లో నిన్న నమోదు చేసిన సువో మోటో కేసు ఫెడరలిజం పరిరక్షణకై; రాజ్యాంగ పరిరక్షణ కై; పీడిత జాతుల స్వేచ్చా స్వాతంత్యాల పరిరక్షణకై; ఫాసిస్టు విధానాలపై న్యాయ పొరులో ప్రేరేపక రాజకీయ సంఘటనగా మారకుండా ఉంటుందా?
నాగాలాండ్ కాల్పుల్లో ఆరుగురు గని కార్మికుల హత్య, మరో 8 మంది ఆదివాసీల హత్యాకాండ పై సాధారణ నిరసన ప్రచారం సహజమే. దాని కంటే అందులో దాగిన పై ఐదు అంశాల ప్రత్యేక రాజకీయ ప్రాసంగీకతని గుర్తించి బట్టబయలు చేయాల్సి ఉంది. నాగా జాతి గత నేపధ్య చరిత్ర అధ్యయనమూ చేద్దాం.
370, 35Aరద్దు తర్వాత ఈశాన్య రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీసే కుట్రలకు కూడా మోడీ సర్కార్ దిగింది.
ఓపెన్ స్టేట్ పై దాడికి నేడు ఫాసిస్టు స్టేట్ గా రూపొందిన డీప్ స్టేట్ ని మోడీ షా ప్రభుత్వం ఓ సాధనంగా మార్చింది. గవర్నర్లుగా రాజకీయ నాయకుల్ని నియమించే సాంప్రదాయానికి పూర్తి విరుద్ధంగా డీప్ స్టేట్ కి చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో (IB) అధికార్లని రిటైర్ అయ్యాక చేస్తోంది. 2014 లో IB డైరెక్టర్ గా రిటైరైన RN రవిని తన ఆధ్వర్యంలోని జాయింట్ ఇంటిలిజన్స్ కమిటీ చైర్మన్ ని మోడీ చేసాడు. ఐదేళ్లకి 1-8-2019 న నాగాలాండ్ గవర్నర్ ని చేసింది. (కాశ్మీర్ 370 రద్దుకు నాలుగు రోజుల ముందు) రవి ద్వారా నాగా స్వయం ప్రతిపత్తి రద్దుకి మోడీ ప్రభుత్వం పావులు కదిపింది. నేటి వరకు భారతదేశ జండా తో సమాంతరంగా నాగా జాతీయ జండా ఎగిరేది. దాన్ని తొలగించే పధకం బెడిసి కొట్టింది. పైగా సాయుధ నాగా గెరిల్లా సంస్థల్ని “సాయుధ గుండా గ్యాంగులు” గా రవి ఆరోపించడంతో తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఓవైపు నాగా సాయుధ సంస్థల నుండి, మరోవైపు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం నుండి రవికి వ్యతిరేకత పెరిగి నాగా జాతి ప్రజల ప్రతిఘటన పెరిగింది. ఈ క్రమంలో మోడీ సర్కార్ కుట్రలు బెడిసి కొట్టి, నాగా తిరుగుబాటు సంస్థలతో చర్చలకి తలొగ్గింది. ఐతే రబీని గవర్నర్ గా తప్పిస్తే తప్ప కేంద్రంతో చర్చల్లో తాము పాల్గొనేది లేదని అవి షరతు విధించాయి. గత్యంతరం లేక మోడీ ప్రభుత్వం గత సెప్టెంబర్ రెండో వారంలో రవిని తమిళనాడు గవర్నర్ గా బదిలీ చేసింది. అది మోడీ సర్కారు అహాన్ని దెబ్బతీసింది. ప్రతీకారంగా ఆర్మీతో వ్యూహాత్మకంగా ఈ తరహా భయోత్పాత చర్యల్ని మోడీ సర్కారు చేపట్టిస్తున్నదనే తీవ్ర ఆరోపణలున్నాయి. అది చరిత్రే తేల్చుతుంది.
రైతుల ఎదుట మోడీ షా ప్రభుత్వం ఓడింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ పడుతోంది. అక్కడ కూడా దేశ ప్రజల శత్రువైన ఫాసిస్టు సర్కార్ రాజకీయ ఓటమి కోసం ఈశాన్య రాష్ట్రాల ప్రజలకి దేశప్రజలు సంఘీభావ అండదండల్ని ఇవ్వాల్సి ఉంది. మన వంతు బాధ్యతని చేపడదాం.

(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *