త్రిశంకు స్వర్గంలో అమరావతి ప్రజలు, ఎవరు కారణం?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల ప్రభావం రాజధాని ప్రాంత ప్రజలపై తీవ్రంగా పడిందని, ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు త్రిశంకు స్వర్గంలో ఉన్నారని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) రాష్ట్ర మహాసభలు ఈ నెల 27, 28, 29 తేదీల్లో తాడేపల్లిలో జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం మంగళగిరి నగరంలోని మార్కండేయ కళ్యాణ మండపంలో ‘ప్రభుత్వ విధానాలు- ప్రజలపై ప్రభావాలు’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.చెంగయ్య అధ్యక్షత వహించారు.
ముఖ్య ఉపన్యాసకుడిగా హాజరైన సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు మాట్లాడారు.
“రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజధాని ప్రాంతంగా అమరావతి మెగాసిటీ అవుతుందని అనుకున్నారు. అయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడి పనులు అక్కడ అర్ధంతరంగా ఆగిపోవడంతో వేలాది మందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతికూలమైన ప్రభావం పడింది. నాడు రాజధాని అమరావతిలో పెట్టాలన్న నిర్ణయం అనివార్యంగా జరిగిపోయింది. అసలు రాజధాని నిర్ణయం తప్పో ఒప్పో అనే సంగతి పక్కన పెడదాం.. ఈ రాజధానిని ఎలా నిర్మించాలనే విషయమై బోలెడు చర్చలు జరిగాయి. ఎక్కువ మంది రైతులకు నష్టం జరగకుండా గరిష్టంగా 5 వేల ఎకరాలు తీసుకునివుంటే ఓ చక్కటి రాజధాని నిర్మాణం జరిగి ఉండేది. చంద్రబాబునాయుడు మన మాట వినలేదు. అయితే, అమరావతిని ఓ పెద్ద సింగపూర్ సిటీ కావాలని చంద్రబాబునాయుడు కలలుగన్నాడు. ప్రపంచంలో హేమాహేమీలైన ఆర్కిటెక్ట్ లను తీసుకువచ్చారు. చివరకు బాహుబలి డైరెక్టర్ను తీసుకువచ్చారు. సెట్టింగులతోనైనా నింపుదామనుకున్నాడు. అన్నీ విఫలమై చివరకు నాలుగుదు భవనాలు కట్టేసరికి ఆయన గద్దె దిగిపోయాడు.
“ఆ రోజు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే మూడు రాజధానుల ప్రకటన చేశారు. అమరావతి, వైజాగ్, కర్నూలు మూడు రాజధానుల ప్రకటన చేయడంతో ఎక్కడి పనులు అక్కడి ఆగిపోయి ఈ ప్రాంతం సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం రాజధాని ప్రాంత రైతులు న్యాయంస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రలో ఉన్నారు… రాజధాని సమస్య అనేది పాదయాత్రలో ఉన్న ఒక్క రైతులదే కాదు… రాష్ట్ర ప్రజలందరిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ జీవోను వెనక్కి తీసుకోవడంతో సంతోషించాం. అయితే, మూడు రాజధానులపై మళ్లీ కొత్త జీవో తెస్తానంటోంది. వెనకటికి ఓ సామెత ఉంది… ‘తిక్క కుదిరింది.. తలకు రోలు చుట్టమన్నారంట’ చందంగా ఇంత పెద్ద వ్యతిరేకత వచ్చిన పరిస్థితుల్లో రాజధాని ప్రకటనపై వెనక్కి తగ్గివుంటే గౌరవప్రదంగా ఉండేది.. పాల్స్ ప్రెస్టేజీకి పోయి మరింత గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకువెళుతున్నారు. ఇంత గందరగోళ పరిస్థితులు బహుశా రాజధాని విషయంలో ఎక్కడా జరిగి ఉండదు.
“ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం వైఖరి కూడా మరింత డోలాయమాన పరిస్థితిల్లో తీసుకువెళుతోంది. ఈ స్థితి ఒక్క రాజధాని విషయంలోనే కాదు… ఇంకా దేశంలో తాండవిస్తున్న అనేక సమస్యలకు కారణమవుతోంది. సాగుచట్టాలపై రైతుల సుదీర్ఘ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ప్రజామద్దతు లభించడంతో మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు,” అన్నారు.
కరోనాతో కుంటుపడిన ప్రజల ఆర్థిక పరిస్థితులు…
సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ,  “కరోనా రెండు దశల వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఆర్థికపరిస్థితులు కుంటుపడ్డాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం పెద్దఎత్తున ధరలు పెంచేసింది. పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల అన్నీ ధరలు పెరిగిపోయాయి. కేంద్రం విధానాలు కార్పొరేటు వర్గాలకు అనుకూలంగా మారాయంటూ ఆయన ధ్వజమెత్తారు. త్వరలో జరగబోయే సీపీఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి,”అని  పిలుపునిచ్చారు.
ఇంకా ఈ సదస్సులో సీపీఎం జిల్లా నాయకులు జేవీ రాఘవులు, ఎం.రవి, మంగళగిరి, తాడేపల్లి నాయకులు ఎం.జ్యోతిబసు, బూరుగ వెంకటేశ్వర్లు, డి.వెంకటరెడ్డి, వై.కమలాకర్, జె.బాలరాజు, పెద్దసంఖ్యలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత కళ్యాణమండపం ఆవరణలో ప్రజానాట్యమండలి కళాకారుల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *