వేణుగోపాలుడి అలంకారంలో అమ్మవారు

తిరుపతి :తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలోశ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.

అమ్మవారికి గాజులు విరాళం

తిరుపతికి చెందిన శ్రీ పొన్నాల సుధాకర్, శ్రీ ఉదయ్ అనే భక్తులు సోమవారం ఉదయం 100 డజన్ల గాజులు, హుండీ బట్టలు విరాళంగా అందించారు. వీటిని జెఈఓ శ్రీ వీరబ్రహ్మంకు అందజేశారు. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసూధన్, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *