కార్మికుల నిజమై వుప్పులూరి సుబ్బారావు

(సిహెచ్.ఎస్.ఎన్.మూర్తి)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా  ఉత్తరాంధ్రలో, తూర్పు, పశ్చిమగోదావరి, జిల్లాల్లో మిలిటెంటు కార్మిక పోరాటాల నిర్మాత,  ప్రయోగశీలి, ఉత్తమ కమ్యూనిస్టు యోధుడు, అత్యంత నీతి,నిజాయితీలు,  ప్రజ్ఞా పాటవా లు గల నేత కామ్రేడ్ వుప్పులూరిసుబ్బారావు (1924-98)వేలాది మందికి చిరపరిచితులే.  ఆర్టీసీ ఎన్ఎంయూ ఉమ్మడి రాష్ట్ర వైస్ ప్రెసిడెంటుగా పనిచేసారు. భారత-చైనా మిత్ర మండలి(ICFA) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉండి  చైనాతో మైత్రి భారతప్రజలకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం,  సమ సమాజం సాధించాలన్నలక్ష్య సాధనకు తగినట్టుగా కార్మికోద్యమాన్ని మలచాలని కలలు కని, దానికై జీవిత సర్వస్వం ధారపోసారు. ఆ లక్ష్యంలో భాగంగానే 1980లలో వుప్పులూరి వివిధ యూనియన్లను ఐక్యం చేసి స్వతంత్ర కార్మిక సంఘాల సమాఖ్య (FEDERATION OF INDEPENDENT TRADE UNIONS-FITU) ను స్థాపించి, బోసు,మూర్తి తదితరుల తో కలిసి  ఉమ్మడి నాయకత్వ టీముని తయారుచేసి, 1998 వరకు నడిపారు. తర్వాత కా.బోసు అధ్యక్షుడిగా 2012 వరకు పని చేసారు.’తిరుగులేని’ నాయకుల వల్ల  ట్రేడు యూనియన్లలో   ఆచరణలో  కొరవడిన ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టి, పాటించారు. ఆ ఒరవడి లోనే  ఈ వ్యాసకర్త మూర్తి కార్యదర్శిగా సమాఖ్యనేటికీ పనిచేస్తున్నది. వుప్పులూరి స్వతంత్రంగా ఎన్నో విశిష్టమైన కార్మిక పోరాటాలను నడిపి, వేలాది కార్మిక కుటుంబాలకు  “గురువు” గారిగా వారి గౌరవాభిమానాలను పొందారు.
ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ప్రజాస్వామిక విధానాల అమలుకు మారుపేరు; దళారి,  పెత్తందారీ, కుల తత్వ నాయకత్వాలకు సింహస్వప్నం ఆయన పేరు. ళిత బహుజనులతో సహా అనేకమంది కార్యకర్తలు,  నాయకులు వుప్పులూరి శిక్షణలో అభివృధ్ధిఅయి త్యాగశీలంగా మెరుగైన సమాజం కోసం పనిచేసారు, చేస్తున్నారు. కార్మిక వర్గం జీతభత్యాల పోరాటాలకు పరిమితం కాకుండా విప్లవరాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకుని, బలమైన, స్వతంత్రమైన రాజకీయశక్తిగా అభివృధ్ధి కావాలని నిరంతరం బోధించేవారు.  కార్మికుల కుటుంబాలే తన కుటుంబంగా, యూనియన్ కార్యాలయాలే ఇల్లుగా,  కార్మిక పోరాటాలే ఊపిరిగా వుప్పులూరి సుబ్బారావు జీవించారు.  తమకోసం ఆయన ఏమి చేసారన్నది ఎన్నడూ ఆలోచించకుండా, వారి భార్యా బిడ్డలు ఆయన ఉద్యమ జీవితానికి సంపూర్ణ సహకారం అందించారు. 
రాజమండ్రి పేపరుమిల్లులో యూనియన్ల మధ్య చీలికలు యజమానులకు తోడ్పడకుండా ఉమ్మడి నెగోషియేటింగు కమిటీలను ఏర్పాటు చేసారు.  కాకినాడ గోదావరి ఫెర్టిలైజర్సు లో పర్మనెంటు యూనియను తో పాటు కాంట్రాక్టు కార్మికులనూ ఆర్గనైజు చేసారు. ఏడాదిలో కొన్నినెలలే పని చేసే షుగర్ మిల్లుల్లో(పిఠాపురం,సామర్లకోట)టెంపరరీ కార్మికులకు సీజనల్ పర్మనెంటు పధ్ధతిని సాధించారు. పిఠాపురంలో చెరకు రైతుల సమస్యలనూ చేపట్టి, కార్మికసంఘంతో సమన్వయం చేసారు .  తాడేపల్లిగూడెంలో అక్కడి కార్మికనేత కామ్రేడ్ కే. యెస్. బోసుతో కలిసి  కొత్త ఒరవడులు తెచ్చారు.  ఫుడ్    ఫ్యాట్స్  కంపెనీలో శాస్త్రీయంగా వేతన స్కేల్సుని, రోజుకూలీ బంటాలకూ, అనేక హక్కులను సాధించారు .అక్కడి రైసు మిల్లుల్లో టెంపరరీ కార్మికులనే పేరిట యూనియన్లు  దశాబ్దాలుగా విస్మరించిన ఇయెస్ఐ, పిఎఫ్ వంటి హక్కులను సాధించారు.  ఇలా అనేక రంగాల్లో వేలాది కార్మికులకు నాయకత్వం అందించారు.  
గోర్కీ  నవల “అమ్మ” ఆయనపై ప్రగాఢ ముద్రవేసింది; కార్మిక నాయకుడిగా ప్రభావితం చేసింది. ఆ రోజుల్లో  పాతికేళ్ల యువకుడుగా వుప్పులూరి కమ్యూనిస్టు పార్టీలోచేరి,  ఆ సిధ్ధాంతాలను లోతుగా వంట బట్టించుకున్నారు.  
స్వస్థలం పిఠాపురంప్రాంత జమీందారీ వ్యతిరేక రైతాంగ పోరాటాలలో చురుకుగా పాల్గొన్నారు.1948 ప్రకాశం ఆర్డినెన్సు కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. కమ్యునిస్టులను పట్టుకొని కాల్చిచంపే 1948-51 నిర్బంధ కాలంలో రహస్య జీవితాన్ని గడుపుతూ,  ఉద్యమంలో పాల్గొన్నారు. నాటి పార్టీ ఆంధ్ర అంతటా మునిసిపల్ కార్మికులను ఆర్గనైజు చేసింది. అందులో భాగంగా ఆయన పిఠాపురంలో దళిత పాకీ కార్మికులతో మమేకమై,  వారి హక్కుల కొరకు, ఆ కుటుంబాలు తరతరాలుగా మరచిపోలేని విధంగా పోరాడారు. నాటి కుల కట్టుబాట్లను, తండ్రిని ధిక్కరించి, తాను పుట్టిన బ్రాహ్మణ కులతత్వాన్ని వ్యతిరేకించి, ఆ కార్మికులను తన గదిలోకి రానిచ్చి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. నేడు కొందరు కులవాదులు ఆరోపిస్తున్నట్టుగా కాక, బొంబాయిలో వలె కాక, తెలుగు ప్రాంతాల కమ్యూనిస్టులు  భిన్నంగా పనిచేసారు. తెలంగాణ పోరాటం సరే సరి. దానితో  వుప్పులూరి ఉత్తేజితులైనారు.  తర్వాత దశలో  ఒడిషా రూర్కెలా ఉక్కుఫ్యాక్టరీలో చిరుద్యోగంచేసి, 1960 ల్లో స్వస్థలానికి తిరిగి వచ్చారు.  నాటి నుండి తుది శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమానికి, కార్మిక పోరాటాలకు తన జీవితం అర్పించారు. 1998లో ఆయన అంతిమ యాత్రలో వేలాది మంది  ప్రజలు పాల్గొన్నారు.  
యూనియన్లలోపనిచేస్తూనే కమ్యూనిస్టుల్లో విభేదాలు, చీలికల గురించి అధ్యయనం; ఆ క్రమంలో  విప్లవ ధోరణులకు దగ్గరై కొద్దికాలం(1989-1992)  ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ -IPF  మరియు ఎఐసిసిటియు సంస్థల అఖిల భారత అధ్యక్షుడుగా పని చేసారు. కార్మికులకు రాజకీయాలుండాలనిచెప్పి, జాతుల సమస్యలపై ఆ సంస్థలతో విభేదించి, స్నేహపూర్వకంగా విడిపోయారు. 1994లో ఎఫ్ఐటియు పునర్నిర్మాణం; భారత దేశంలో కార్మికవర్గ నాయకత్వంలో ప్రజాతంత్ర విప్లవ కార్యక్రమానికి సంబంధించి-ముఖ్యంగా జాతుల సమస్యపై-ఆయన అవగాహనతో ఉన్న “రాజకీయతీర్మానం ఆమోదం మైలురాళ్లు.
ఉపఖండంలోని ప్రజలు తెలుగు తదితర  “భాషాజాతుల” కు చెందిన వారనీ, బ్రిటిష్  వలస దోపిడీ కై ఢిల్లీ కేంద్రంగా నిరంకుశ రాజ్యాన్నిఏర్పాటుచేసి, భాషాజాతుల స్వయంనిర్ణయాధికారాన్ని, అభివృధ్ధిని అడ్డు కొన్నారని,  ప్రస్తుత రాజ్యాంగం కూడా ఈ నిరంకుశ విధానాన్నేకొనసాగిస్తోందని తీర్మానించారు.   (కేంద్రంలో రక్షణ, విదేశీ వ్యవహారాల వంటి అత్యంత పరిమితమైన అధికారాలు మాత్రమే ఉండేటువంటి) “స్వతంత్ర జాతీయ రిపబ్లిక్కుల భారత సమాఖ్య” గా భారత రాజ్యాన్ని పునర్నిర్మాణం చేసుకోడానికి కార్మికవర్గం రైతాంగం, తదితర ప్రజలతో ఐక్యమై పోరాడాలని ఆ తీర్మానం ద్వారా వుప్పులూరి పిలుపు నిచ్చారు. దున్నేవానికే భూమి-భూస్వామ్య విధానం రద్దుకోసం సాగే వ్యవసాయ విప్లవోద్యమానికి కూడా కార్మికవర్గం నాయకత్వం వహించాలని పేర్కొన్నారు.  1992లో తెలుగు ప్రజల జాతీయ వేదికగా “ తెలుగు జాతీయ మహాసభ” అనే వేదికను, దాని కొక ప్రణాళికను ప్రతిపాదించారు: 1996 కాకినాడ ప్రథమ మహాసభలో అది ఆమోదింప బడింది.
పైక్రమంలోనే భారత కమ్యూనిస్టు విప్లవ అగ్రనేతలు కామ్రేడ్స్   దేవులపల్లి వెంకటేశ్వరరావు,  తరిమెల నాగిరెడ్డి గార్లు రూపొందించిన విప్లవ ప్రజాపంథా ను, వారి రచనలను వుప్పులూరి అత్యంత శ్రద్ధతో అధ్యయనం చేసారు. భారత ప్రజల ప్రజాతంత్ర విప్లవ కార్యక్రమం, ఎత్తుగడల పంథా, దళారీ, జాతీయ బూర్జువా వర్గాలు, జాతుల స్వయం నిర్ణయాధికారం, కార్మిక వర్గ నాయకత్వ సమస్య, ఇలా అనేక సమస్యలపై దేవులపల్లి శాస్త్రీయమైన వివరణను ఇచ్చారని గ్రహించారు. వారు స్థాపించిన విప్లవ సంస్థ యుసిసిఆర్ఐ-ఎంఎల్ తో 1992 నుండి 1998 లో చివరిశ్వాస తీసేవరకూ సన్నిహిత సంబంధాలను నెరపారు. ఈ సంస్థతో కలిసి పనిచేసి, కార్మికులలో విప్లవ రాజకీయ చైతన్య అభివృధ్ధికి అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అహరహం కృషిచేసారు.  కామ్రేడ్  వుప్పులూరి సుబ్బారావు జీవితం, ఆలోచనలు, దీక్షల ఆదర్శం తో దేశంలో కార్మికుల, వివిధ జాతుల విముక్తి ఉద్యమాలను నిర్మించడమే ఆయనకు నివాళి!

( 2021  నవంబర్ 26న కామ్రేడ్ వుప్పులూరి సుబ్బారావు 97వ జయంతి సందర్భంగా)

(సిహెచ్.ఎస్.ఎన్.మూర్తి, ప్రధాన కార్యదర్శి , ఎఫ్.ఐ.టి.యు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *