తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం రాత్రి హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీ దేవి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను ”పరమహంస”లుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధు, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.