బూతులు తిట్టుకుంటూ ప్రజలను వంచిస్తున్నారు…

 పరస్పర వాగ్యుద్దాలతో ప్రజలను వంచిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు రైతు ప్రజాసంఘాలు ఏకమై ప్రభుత్వాల ఆధిపత్యాన్ని ప్రతిఘటించాలి.

 

(వడ్డేపల్లి మల్లేశము)

ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రభుత్వ అధినేతలు చాలా కీలక పాత్ర పోషించాలి. చౌకబారు మాటలు, అశ్లీల పదజాలం ఇతరుల గౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడడం అవివేకమే కాదు నేరం కూడా. ఇoదుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. పాలనా పరమైన అంశాలపై మనస్పర్ధలు, అభిప్రాయభేదాలు, సంఘర్షణలు ఎదురు కావచ్చు. వాటిని పెద్ద మనసుతో, జాగరూకతతో ,విశ్లేషణ పూర్వక జ్ఞానంతో, నిపుణులు మేధావుల సహకారంతో త్రై పాక్షిక సమావేశాల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇది విజ్ఞత అనిపించు కుంటుంది.
రాష్ట్రంలోనూ దేశంలోనూ కొనసాగుతున్నది ఏమిటి?
రాజ్యాంగానికి భిన్నంగా ప్రభుత్వ పెద్దలు తమ వ్యక్తిగత ఎజెండాతో రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగాన్ని సైతం పక్కనపెట్టి చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ స్వప్రయోజనాలకు పాల్పడుతున్నారు. ఇక్కడే ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, బుద్ధిజీవులు, మేధావులు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ అధికారం శాశ్వతమని అధికారం ఇచ్చిన ప్రజలను కూడా బానిసలుగా చూచె సంప్రదాయానికి ఒడి గట్టడం తో ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ఉన్న నాయకుల్లో ఆధిపత్యం, అహంభావం, అహంకారం పొంగిపోతుంది. ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల పై నిర్బంధాలు అణచివేతను కొనసాగిస్తూ ప్రశ్నించేవారు లేకుండా చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.
ప్రజల మధ్య ఉండాల్సిన బుద్ధిజీవులు మేధావులు మానవ పౌర హక్కుల కార్యకర్తలు నేరారోపణ పైనే సంవత్సరాల తరబడి జైలు పాలవుతున్నారు. ఇక నేరస్తులు, కార్పొరేటు శక్తులు, పెట్టుబడిదారులు చట్టసభల నిండా చేరి తమ ప్రాబల్యం తో పాటు ఆస్తులను రక్షించుకోవడానికి అధికారంలో కొనసాగుతున్నారు. అలాంటప్పుడు వారు ప్రజల సంక్షేమ, అభివృద్ధి ఎలా కోరుతారు?
తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లలో…
అప్పట్లో వైసిపి పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు పైన వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన విషయం మనందరికీ తెలిసినదే. వైసీపీ పార్టీలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని విమర్శించినందుకుగాను ఆయనకు ఈ శిక్ష తప్పలేదు. అంటే ఒక పార్టీలో కొనసాగుతున్న ప్పుడు పార్టీ నాయకునికి పూర్తిగా విధేయుడిగా చేతులు కట్టుకొని మౌనం గా ఉండాలని దీని అర్థం.
ఇదేనా ప్రజాస్వామ్యం?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత జీవితంలోకి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని అవమానించిన సందర్భాలు అనేకం. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు తల్లిని దూషించి అవమానించి చివరికి క్షమాపన వేడుకున్న సంగతి మనందరికీ తెలిసినదే. అవమానం భరించలేక చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కన్నీరు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి చట్ట సభలో మాత్రం చిరునవ్వులతో మౌనం గా ఉన్నట్టు నటించడం.. అధికార పార్టీలు ఎంతకు దిగజారుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో అనేక ఆకాంక్షల మేరకు సాధించ బడిన కొత్త రాష్ట్రం పై కోటి ఆశలు పెట్టుకున్న ప్రజానీకానికి నాయకత్వం వహించడానికి తెరాస పార్టీ ముందుకు వచ్చినప్పుడు అనేక హామీలు, వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా ఇప్పటికీ అమలు చేయకపోవడం ఒక వైపు ఉండనే ఉన్నది. పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించి కాంగ్రెస్ ఇతర పార్టీలను అధికార పార్టీలో చేర్చుకుని ప్రతిపక్షం లేకుండా చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే. ఎవరు కోరకుండానే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని, హామీ ఇచ్చి మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రకృతి విధ్వంసాన్ని ఆపుతామని, మాట ఇచ్చి ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. క్రియాశీలక అంశాలు ఉన్నప్పుడు అఖిల పక్షాలతో ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పరచి నిర్ణయం తీసుకుంటానని ఇచ్చిన హామీని ఏనాడు కూడా ఖాతరు చేయలేదు. ఆచరణలో ఇలా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం క్రమక్రమంగా ప్రజల దృష్టిలో విశ్వాసాన్ని కోల్పోతున్న సందర్భంగా ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన ఎత్తుగడగానే వరిధాన్యం విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ప్రతిపక్షాలు.
వరి ధాన్యం కొనుగోలులో  తిట్ల పురాణం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయ రంగం మీద స్పష్టమైన అవగాహన తో పాటు సంబంధిత రైతు సంఘాలు, వ్యవసాయరంగ నిపుణులు ,ప్రతిపక్షాలు, ప్రభుత్వ పెద్దల సమక్షంలో ఏటా వ్యవసాయ విధానాన్ని ఏర్పరచుకుంటే నే ఇలాంటి సమస్యలు లేకుండా రైతులు పండించే పంట సజావుగా అమ్మకాలకు ఏ ఆటంకాలు ఉండవు. గత ఏడు సంవత్సరాలుగా ఏనాడు కూడా ప్రభుత్వము వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు ఎందుకు అనే విషయాలు తెరమీదికి రాలేదు. పైగా 2020 సంవత్సరం లో రాష్ట్ర ప్రభుత్వం ఒక సారి కేంద్ర చట్టాలను ఆమోదించి మరొకసారి విమర్శించడం జరిగింది. అలాగే ఒక దశలో రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. నెల రోజుల తర్వాత తిరిగి మాట మార్చి ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తి లేదని తన ఇష్టం ఉన్నట్లు అమ్ముకోవచ్చని ప్రకటించి బాధ్యతలు మరిచారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వర్షాకాలం పంట సగానికి పైగా కల్లాలు, రోడ్లపైన ఆరబోసుకుంటూ రైతులు రోడ్డు ప్రమాదాలు ఆవేదన గుండెపోటుతో అనేక మంది చనిపోయారు. ఇంకా సగం వరి కోతలు కానేలేదు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో త్వర పడాల్సిన టువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కన పెట్టి యాసంగి పంట గురించి కేంద్రాన్ని నిలదీస్తూ మెడలు వంచుతామని, ఊరుకోమని, ఘర్షణ పడుతూ పరస్పర ప్రదర్శనలు ధర్నాలు పికెటింగ్లతో రాష్ట్రం పరువును దేశవ్యాప్తంగా చులకన చేశారు.
ఇటీవల ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఎలాంటి చర్చ జరగకుండానే తిరిగివచ్చిన ముఖ్యమంత్రి ఆ తర్వాత మంత్రులతో కొనుగోలు చేసే సమస్య లేదని కేంద్ర మంత్రులు చెప్పిన తర్వాత నిన్న రెచ్చిపోయి ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పై అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం మాత్రం ప్రజాస్వామిక పరిభాషలో నేరమే. ఒక రాష్ట్ర అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి గారు భాషా సంస్కృతి సంప్రదాయాల విషయంలో రాష్ట్రానికి ఆదర్శంగా ఉండవలసినది పోయి అటు కేంద్రాన్ని, కేంద్ర మంత్రిని, పార్టీని” దద్దమ్మలు, సన్నాసులు, తెలివి తక్కువొడా, రండ, సిగ్గు లేదా “వంటి అన్ పార్లమెంటరీ పదజాలాన్ని ప్రయోగించడం బాధాకరం. ఎదుటి పార్టీ కూడా అదే రకంగా సిద్ధపడి 1 కి 4 మాటలు అంటే యుద్ధమే కదా సంభవించేది!.
నాయకత్వంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం సామరస్య పూర్వకంగా సమన్వయపరిచే ధోరణిలో అఖిల పక్షాలను ప్రజా సంఘాలను వ్యవసాయరంగ నిపుణులు రైతు సంఘాలను పిలిచి కేంద్ర రాష్ట్ర అధికారుల సమక్షంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి .నిర్ణయాల కారణంగా పరిపాలన చేయాలి. కానీ తెగించిన మాటలతో బజారుకు ఎక్కడం పరువు పోగొట్టుకోవడం రాష్ట్ర ప్రజానీకాన్ని బజార్ లో తాకట్టు పెట్టినట్లు అవుతుంది.
ప్రజలు ఎంత మాత్రం సిద్ధంగా లేరు
కయ్యానికి కాలుదువ్వే విధానం రాజకీయాలకు మంచిది కాదు. అందులో స్వతంత్ర రాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షలను పక్కనపెట్టి ఘర్షణ పూరిత వాతావరణంలో పరిపాలన చేయడం కుదరదు. ప్రజలు ప్రజా సంఘాలు రైతు కూలీలు రైతులు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేరు. పైగా ఇలాంటి ఘర్షణ తో ప్రజల నిజమైన సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతున్నది కనుక ఇచ్చిన హామీలను చేస్తున్న వాగ్దానాలను అమలు చేయించుకోవడం కోసం ప్రజలు, ప్రజా సంఘాలు, అఖిల పక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
బాధ్యత మరుస్తున్న ప్రతిపక్షాలు
రాష్ట్రంలో గత నెల రోజులుగా కేంద్ర రాష్ట్ర అధికార పార్టీ ల మధ్యన ఘర్షణ మంటలు రాజుకుంటుంటే ఇతర ప్రతిపక్ష పార్టీలు తమకు సంబంధం లేదని కేవలం ఆ రెండు పార్టీల సమస్యగానే భావించడంతో పాటు ప్రధానమైన సమస్య రైతులు పండించిన వరి దాన్యం విషయంలో స్పందించవలసిన స్థాయిలో స్పందించడం లేదు. కాంగ్రెస్ పార్టీ కొంత రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేయడానికి సిద్ధమే మీరు చేస్తారా? అని ప్రభుత్వానికి సవాల్ విసిరిన విషయాన్ని కూడా మనం మరచిపోరాదు. మిగతా కమ్యూనిస్టు పార్టీలు ,చిన్నాచితక అన్ని పార్టీలు ప్రజా సంఘాలు, రైతు సంఘాల తో కలుపుకొని ఒక ప్రజా మహోద్యమాన్ని నిర్మించడానికి ఎందుకు ఉపక్రమించడం లేదని విజ్ఞులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.
కేవలం రైతులు పండించిన వరి ధాన్యానికి సంబంధించిన విషయమే కాదు. చేసిన హామీలు, వాగ్దానాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్బంధాలు ,ఆధిపత్యం, అణచివేత,అనుత్పాదక రంగాలపై ఎక్కువగా ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన విధానాలపైనా ,నిరుద్యోగం, పేదరికం, ఆకలిచావులు, ఆత్మహత్యలు నిరంతరంగా కొనసాగుతున్నప్పటికీ కార్యాచరణకు పూనుకోక పోవడం ప్రతిపక్షాల బాధ్యతా రాహిత్యమే. ఏ పార్టీకి ఆ పార్టీ తమ ఉనికి కోసం మాత్రమే పోరాటాలు చేయడం పత్రికా ప్రకటన ఇవ్వడం నిష్ప్రయోజనం. కౌన్సిల్ ఎన్నికల విషయంలో, ఇతరత్రా ఉపఎన్నికలు తదితర సన్నివేశాలలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని మరిచి ఉన్నత వర్గాల తోనే పదవులు నింపే ఆధిపత్య ధోరణి పట్ల బహుజనులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. హామీ ఇచ్చిన దళిత బంధు అడుగు కూడా జరగలేదు. రైతు బందుతో ఉన్నత వర్గాల ప్రయోజనాలే నెరవేరుతున్నాయి తప్ప చిన్న కమతాలు గలవారికి ప్రయోజనం ఏమీ లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ వర్గ ప్రయోజనం కోసం పాకులాడుతున్నదో అర్థం చేసుకోవాలి. దాన్ని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రం మెడలు వంచుతాం అని ఏరకంగా ప్రతిన బూని నదో అట్లే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడానికి సిద్ధంగా ఉండాలి. లేకుంటే రాష్ట్ర ప్రతిపక్షాలు కూడా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు . పైగా భవిష్యత్తులో ఆ పార్టీలకు ఎదురయ్యేది చేదు అనుభవాలే.
Farm Laws Telangana
Vaddepalli Mallesam

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *