శ్రీశ్రీ ప్రపంచ కవి : మహాప్రస్థానం ఆవిష్కరణ సభలో వేల్చేరు నారాయణ రావు
(రాఘవశర్మ)
“మహాప్రస్థానం వినదగ్గదే కానీ చదవదగ్గది కాదు. శ్రీశ్రీ అంతటి మహానుభావుడు వినదగ్గంత కవిత్వం రాశాడు. భాష తెలియని వారికి కూడా మహాప్రస్థానం గొప్పదనాన్ని తెలుసుకునేలా చేశాడు. శ్రీశ్రీ ఒక్క తెలుగు భాషకు మాత్రమే చెందినవాడు కాదు . మొత్తం ప్రపంచానికంతటికీ చెందిన వాడు” అని ప్రముఖసాహితీ వేత్త, (తొంభై ఏళ్ళ) వేల్చేరు నారాయణ రావు అన్నారు.
మావో రెడ్ బుక్‌లా, జేబులో పట్టేంత చిన్నదిగా మానవ వికాస వేదిక అచ్చేసిన మహాప్రస్థానాన్ని మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో మంగళవారం ఉదయం వేల్చేరు నారాయణ రావు ఆవిష్కరించారు.
భూమన్ అధ్యక్షతన జరిగిన ఈ ఆవిష్కరణ సభలో వేల్చేరు నారాయణ రావు మాట్లాడుతూ, “మహాప్రస్థానం పద్యాలు అచ్చుకాక ముందు శ్రీశ్రీ వాటిని చేత్తో రాసి జేబులో పెట్టుకుని అయిదారేళ్ళు తిరిగాడు. ఆ పద్యాలు అచ్చు కాక ముందు అచ్చు అవసరం లేదని తెలుగు ప్రజలు వాటిని రాసి జేబులో పెట్టుకుని తిరిగారు. డెబ్బై ఏళ్ళ క్రితమే తెలుగు కవిత్వం జేబులోకి వచ్చేసింది. మంచి కవిత్వం ఇప్పుడు జేబులో పట్టేంత వచ్చేసింది” అని శ్రీశ్రీ గొప్పతనాన్ని వివరించారు.
“శ్రీశ్రీ అమెరికా వెళ్ళినప్పుడు తెలుగులోనే మాట్లాడాడు. అక్కడి రేడియోల్లో, సభల్లో మాట్లాడాల్సి వచ్చినప్పడు తెలుగులోనే మాట్లాడాడు. శ్రీశ్రీ కవిత్వం తెలుగులోనే రాశాడు. శ్రీశ్రీ ప్రపంచ భాషలో రాశాడు. శ్రీశ్రీ ప్రపంచ భాషలో మాట్లాడాడు. తెలుగు ప్రపంచ భాష” అంటూ తెలుగు ఔన్నత్యాన్ని కీర్తించారు.
“ఇప్పటి పిల్లలకు తెలుగు రావడం లేదు. మహాప్రస్థానాన్ని వారికి వినిపించండి. తెలుగును మర్చిపోకుండా ఉంటారు. వాళ్ళు మళ్ళీ తెలుగులోకి వచ్చేస్తారు. ఇప్పుడు నేను చేసింది మహాప్రస్థానం ఆవిష్కరణ కాదు. మహాప్రస్థానం జేబులో ఉన్నప్పుడే నిజమైన ఆవిష్కరణ” అన్నారు.
జేబులో డైనమెట్ : శివారెడ్డి
ఈ ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి కె. శివారెడ్డి మాట్లాడుతూ, “జీవితానికి సంబంధించిన సత్యాన్ని చెప్పేదే కవిత్వం. కవిత్వానికి మనుషులను మార్చే శక్తి ఉంది” అన్నారు.
“మహాప్రస్థానం జేబులో పెట్టుకు తిరగడం కాదు. అది డైనమెట్. చదవండి. పెద్దగా చదివినప్పుడు దాని శక్తి తెలుస్తుంది ” అని వివరించారు.
ఝంఝామారుతం : భూమన్
“మహాప్రస్థానం బేబులో తుఫాను కాదు.ఝంఝామారుతం” అన్నారు సభకు అధ్యక్షత వహించిన రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్,మానవ వికాస వేదిక అధ్యక్షులు, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, “నేను కొద్దిగానైనా మనిషిగా ఉన్నానంటే మహాప్రస్థానమే కారణం. సమాజం ఒక్క రోజులో మారదు. కనీసం మనుషులుగానైనా మిగులుదాం. అందుకునే మహాప్రస్థానం చదువుదాం ” అన్నారు. మానవ వికాస వేదిక కన్వీనర్లు శైలకుమార్, సాకం నాగరాజు సభలో ప్రసంగించారు.
“మహా ప్రస్థానం పైన విద్యార్థుల కు తరగతులు నిర్వహించం డి. లక్ష రూపాయలు ఇస్తా ను” అని సభను చూసి స్పందించిన పీలేరు లో ఒక ప్రయివేటు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రకటించారు.
పల్లకిలో శ్రీశ్రీ చిత్రపటం, మహాప్రస్థానం
మహాకవి శ్రీశ్రీ చిత్రపటాన్ని, మావో రెడ్‌బుక్ లా అచ్చేసిన మహాప్రస్థానాన్ని సాహితీ వేత్తలు, సాహిత్యాభిమానులు గొప్పగా అలంకరించిన పల్లకీలో ఘనంగా ఊరేగించారు.
అంబేద్కర్ విగ్రహం నుంచి సభాప్రాంగణం వరకు సాగిన ఈ పల్లకీని కవి శివారెడ్డి సహా పలువురు సాహితీవేత్తలు మోశారు.
ఈ ఊరేగింపులో శ్రీశ్రీ గీతాలను ఆలపించారు.
మహాప్రస్థానానికి లభించిన ఈ గౌరవం బహుశా గతంలో దేనికీ లభించి ఉండక పోవచ్చు.
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి)