‘బకాసుర’ కథ! చెప్పే పాఠాలు (2)

(దివి కుమార్)
రాజ్యవ్యవస్థ పుట్టింది కుటుంబమూ-వ్యక్తిగత ఆస్తులూ ఏర్పడిన సామాజిక పరిస్థితుల నుండి. అంటే సమాజంలో వర్గ విభజన (భారతదేశంలో అదే వర్ణ విభజన కూడా) ఏర్పడిన తర్వాత. అది అత్యధికుల పాలిట ముఖ్యంగా సమాజ అవసరాలైన ఆహారం, వ్యవసాయ, యుద్ధపరికరాలు ఉత్పత్తిచేసే శ్రామిక ప్రజానీకం పట్ల అణచివేత సాధనం. కనుకనే బకాసురుని కంటే రాజ్యం దుర్బలమైనదని మూలరచయితలు కలిగించిన భావనకు విరుద్ధంగా బకాసురుణ్ణే దుర్భలమైనవానిగా కొ.కు. చెప్పారు. ప్రజలపాలిట నిజమైన అసలు పీడకశక్తి రాజ్యమేనన్న భావం కొ.కు. కలిగించారు.
ప్రజలపాలిట బకాసురునిది అదనపు పీడన. లేక సరికొత్త విపత్తు. అలాంటివిపత్తులు సంభవించినపుడు ‘రాజ్యం’ ఏం చేస్తుంది? దాన్నుండి తక్షణం ప్రజల్ని కాపాడి వారికి శాంతి-భద్రత కలిగిస్తుందా? అలాచేయటం ‘వర్గ’ రాజ్యం యొక్క లక్షణం కాదు. కొత్త విపత్తును తనకు అనుకూలంగా మలుచుకోవటమే రాజ్యం యొక్క లక్షణం తప్ప తనప్రయోజనాల్ని వీడి ప్రజల్ని కాపాడేయటం దాని స్వభావం కాదు, అని కొ.కు. చెప్పదలిచారు. అందుకే రాజు — వాడు (అనగా బకాసురుడు) తిండి దొరక్క మరో ఊరు వెతుక్కుంటూ పోతాడేమోనన్న భయంతో నేను నిద్రపట్టక చస్తున్నాను అంటాడు. అందుకు మంత్రి మనం రాక్షసుణ్ణి మచ్చిక… చెయ్యాలి అని, తన అనుభవంలో అలా మచ్చికై తన ఆహారానికి తాను పడాల్సిన కనీస కష్టంకూడా పడనంత సోమరిగా తయారైన పిల్లి, తనకు అందుబాటులో కొచ్చిన ఎలుకల్ని కూడా చంపకుండా ఎలావుండేదో ఉదహరిస్తాడు.
ఇరుగుపొరుగు రాజ్యాల్నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవటమే తమ సమస్యగా రాజు భావించటం, అందుకు బకాసురుడిని
తమ రాజ్యం పాలిమేరల్లోనే నిలుపుకోవటానికై పకడ్బందీ సూచనలూ, ఏర్పాట్లూ మంత్రి చేయటం ఈ కథలో మనం చూస్తాం.
అదే సమయంలో రాజ్యంలోని ప్రజల సంగతేమిటి? ఆ ప్రజలను తమకనుకూలంగా మలుపుకోవటం ఎలా? ఆనే కీలకమైన ప్రశ్నలకు కొ.కు. రెండురకాలుగా పరిష్కారం చూపారు.
1. బకాసురుని సమస్యతో ముడిపడిన చిక్కులను సమాజంలోని ధనిక (ఉన్నత వర్గ) శ్రేణికి సున్నితంగా వివరించి, రాజ్యం తీసుకోనున్న చర్యలు వారికి నష్టం కలిగించేవి కావని నమ్మించి, అంతోయింతో లాభాన్ని కూడా చూపించి, వారికీ ‘రాజ్యం’ ప్రయోజనానికీ నడుమ వైరుధ్యం లేదని ఒప్పించటం.
2. మేధావి అనే పాత్రను సృష్టించి రాజ్యానుకూల భావజాల ప్రచారం (మన కాలానికి మీడియా, సాంస్కృతిక రూపాలు) ఎలా సాగిస్తుందో తనదైన వ్యంగ్యాన్ని జోడించి కొ.కు. చెప్పారు.
ఆ క్రమంలోనే బకుడు – బకాసురేశ్వరుడుగా – బకాసురోత్తమునిగా –రాక్షసేశ్వరులుంగారుగా– ఎలా పరిణామం చెందాడో కూడా మనం ఈ కధలో చూడొచ్చు.
మనదేశంలో ఆకురౌడీలు — మాఫియాలుగా, ప్రజాప్రతినిధులుగా మారుతుంటారు. వారిని అంతరంగికంగా వాడు, వీడు అనుకుంటారు. కానీ బహిరంగంగా గౌరవనీయ పదజాలమైన వారు, వీరు, తమరుగా ఎలా మారిపోతుందో మనకు తెలుసు. బాల్‌ధాక్రే లాంటి వారికి భారత రాజ్యం ఎంత లొంగిపోయిందో జ్ఞాపకం పెట్టుకుంటే రాజ్యానుకూల ‘మేధాని” నిర్వహించే పాత్ర స్వభావం మనకు స్పష్టంగా అర్ధమవుతుంది. సమస్త మూఢవిశ్వాసాలనూ రాజ్యానుకూలంగా, ప్రజలను నిమిత్తమాత్రులుగా మలచి ప్రచారం గావించటం మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని పాలకవర్గ మేధావుల లక్షణం గా కొ.కు. చిత్రీకరించారు. ఉదాహరణకు గత 22 ఏళ్ళుగా మన దేశాన్ని పట్టిపీడిస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణమనే (బకాసురుడు లాంటి) మహావిపత్తుని దృష్టిలో పెట్టుకుంటే భారతరాజ్యం దానిపట్ల ఎలా వ్యవహరిస్తోందో మనకు తెలును.
ప్రపంచీకరణానికి లొంగిపోయిన రాజ్యం, రాజకీయ పార్టీలు, మీడియా మొత్తం కలసి — దాన్ని మనం ఎదుర్కోలేము. దానితో సర్దుబాటు చేసుకొని బతకాల్సిందే – దాన్నుండి మనకు ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో తెలుసుకొని మెలగటమే ‘విజ్ఞుల’ లక్షణం అన్నట్లు వ్యవహరిస్తున్న తీరుని గ్రహిస్తేగానీ కొ.కు. ‘బకాసుర’ కథలోని ‘రాజ్యం’ యొక్క అసలు స్వరూపం మనకు అర్ధం కాదు.
రాజ్యం అంటే కేవలం ప్రభుత్వమని భావించేవారు కొందరున్నారు. ధనిక ఆధిపత్య వర్గాలూ, పాలక వర్గం‌లోని ప్రతిపక్ష పార్టీలు, మాఫియా శ్రేణులూ, నిరంకుశాధికారవర్గం, రక్షకభటవర్గాలూ, న్యాయస్థానాలూ, ద్రవ్య వ్యవస్థా, పాలకముఠాలూ, విద్యావ్యవస్థా, వీరందరికీ ప్రచార యంత్రాంగంగా దోహదపడే మీడియా– అంతా కలగలిస్తేనే ‘రాజ్యం’ అవుతుంది. మహాభారత కాలం నాడు నేడున్నంత సంక్లిష్టత లేదు కనుక, రాజు-మంత్రి- నగర ప్రముఖులూ- మేధావి వరకు చూపిస్తే సరిపోయింది.
కొ.కు. సృష్టించిన మరొక ముఖ్యమైన పాత్రపేరు “అజ్ఞాని. అలా పేరు పెట్టటంలోనే ఆయన నేటి వ్యవస్థను వ్యంగ్యంగా విమర్శించదలుచుకున్నాడు. ఎవరీ అజ్ఞాని? కేవలం నిజాలు మాట్లాడేవాడు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన అభిప్రాయాల్నిచెప్పేవాడు. ఖచ్చితంగా ప్రజాప్రయోజనాలకు కట్టుబడినవారిని ‘అజ్ఞాని’గా ఈ వ్యవస్థ పరిగణిస్తుంది.
ఉదాహరణకు సామ్రాజ్యవాదం మీద ఆధారపడకుండా మనకాళ్ళమీద మనం నిలబడివుండే పారిశ్రామిక-వ్యవసాయ-విద్యా విధానాన్ని మనం అనుసరించాలి అనటం, అజ్ఞానులు మాట్లాడేది గానే నేటి మన భారత ప్రధాన స్రవంతిలోని మీడియా అంతా పరిగణిస్తోంది. దేశ జనాభాలో అత్యధికులుగా వుండే — నిరక్షరాస్యులతో సహా గ్రామీణ, పట్టణ పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల ఆధారంగా “మాతృభాషలోనే విద్య” ను గరపాలని ప్రతిపాదిస్తే…. అమెరికా వెళ్ళదలుచుకున్న కొద్దిమందికి ఇంగ్లీషు మీడియం అవసరమని (నిజంగా ఆ అవసరం లేదు. అది ఇంగ్లీషు భాషని వ్యాపారం చేస్తున్న వారికి మాత్రమే అవసరం) నేటి ప్రపంచీకరణ పరిస్థితుల వాస్తవాన్నుండి మాతృ భాషా మాధ్యమం వారు విషయాలను చూడలేని ‘అజ్ఞానులన్నట్లుగా పరిగణించటం ఎంత సహజంగా వుంది!!. కనుక అజ్ఞాని పాత్ర ద్వారా… ప్రజాభిప్రాయానికి ప్రజా అవసరాలకి ప్రాతినిధ్యం వహించే భావజాలాలుంటాయి. అవి కేవలం
వ్యక్తుల అభిప్రాయాలు కావు. ప్రత్యామ్నాయ దృక్పథానికి అవి ప్రాతినిధ్యం వహిస్తుంటాయని చెప్పటమే కొ.కు. ఉద్దేశంగా మనకు స్పష్టమవుతుంది. (మిగతాది మూడో భాగంలో)

 

ఈ వ్యాసం మూడో భాగం ఇక్కడ చదవండి

 

‘బకాసుర’ కథ! చెప్పే పాఠాలు (3)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *