‘బకాసుర’ కథ! చెప్పే పాఠాలు (1)

(దివి కుమార్)
భారత ఉపఖండంలో మహాభారత యుద్ధనేపధ్యమూ, కౌరవ-పాండవ సంగ్రామమూ ఎరుగని వారుండరు. అలాగే వారందరికీ బాగా జ్ఞాపకముండే సంఘటన బకాసుర సంహారం. పాండవులను చంపివేయటానికి పన్నిన లక్కయింటి దహనం కుట్రనుండి తప్పించుకుని బతికి బయటపడిన కుంతి, పాండవులయిదుగురూ రహస్యంగా ఏకచక్రపురం అనే గ్రామంలో తలదాచుకుంటారు. అప్పటికే ఆ గ్రామస్తులు బకాసురుడనే నరమాంస భక్షకుడైన రాక్షసునితో రోజుకొక్కరు చొప్పున వంతుల వారీగా ఆహారంగా వస్తామని ఒప్పందం చేసుకుని వుంటారు. పాండవులు తలదాచుకుంటున్న బ్రాహ్మడి యింటి వంతు వచ్చేదాకా ఈ విషయం కుంతికీ, ఆమె పుత్రులకూ తెలియదు. తెలియగానే భీముడ్ని బకునిపైకి పంపటం, భీముడా రాక్షసుణ్ణి చంపివేయటం మనం బాగా ఎరిగిన కథే!
మూల కథలో బకుని సంహారం సంగతి పాండవులను తలదాల్చుకోనిచ్చిన బ్రాహ్మడికి తప్ప మరెవరికీ తెలియదు.
మహాభారతంలో బకాసుర సంహారానికి వొక ప్రశస్తి వుందని చెబుతారు. భీముడు – దుర్యోధనుడు – జరాసంధుడు –
కీచకుడు – బకాసురుడు: ఈ ఐదుగురూ ఒకే సమయం (కాలం)లో జన్మించారనీ, వీరిలో ముందుగా ఎవరి చేతుల్లో మరొకరు చనిపోతే మిగిలిన ముగ్గురు కూడా తొలి యుద్ధంలో గెలిచి బతికినవాని చేతుల్లోనే చనిపోతారనీ, ఆవిధంగా మహాభారత యుద్ధ ఫలితం బకాసుర సంహారంతోనే తేలిపోయిందనీ చెబుతుంటారు. భీమ, బకాసుర యుద్ధానికి పై కారణంగా ప్రాముఖ్యత హెచ్చి ఎంతో పెద్ద మహాభారతంలో ఇంత చిన్న సంఘటన అయినప్పటికీ అందరూ బాగా జ్ఞాపకం పెట్టుకునే విశేష గాధగా యిది వుంది.
క్రీ.శ 11వ శతాబ్దంలో అనగా వెయ్యిసంవత్సరాల క్రితం తెలుగులోకి అనువాదమైన ఆంధ్రమహాభారతం లో ఈ బకాసురగాధ 49 పద్యాలూ, 25 వచన సంధులతో ముద్రణలో కేవలం 14 పేజీలు మాత్రమే వుంటుంది. కుంతి, పాండవులు కాక మూలగాధలో మరో రెండు పాత్రలే వుంటాయి. అందులో బకాసురునికి ఒక్కనికే మహాభారత రచయితలు పేరు పెట్టారు. మిగిలింది పాండవులకు చోటు చూపించిన బ్రాహ్మణుడు. ఈ కథను తిరగరాయటం ద్వారా కొడవటిగంటి కుటుంబరావు (ఇక నుంచి కొ.కు. ) తన పాఠకులకి ఏం చెప్పదలుచుకున్నారన్నది ప్రస్తుత మనచర్చనీయాంశం.
బకాసుర మూలకథ చదివిన పాఠకులకు కొన్ని సందేహాలు వస్తాయి. అందులో మొదటిది: గ్రామంపైపడి రాక్షసుడు మనుషుల్ని పీక్కుతింటుంటే ప్రజల్ని కాపాడాల్సిన `రాజు’ ఏం చేస్తున్నాడూ అని. ఇది సహజంగా ఎవరికైనా వచ్చే అనుమానమే. కనుక ఏకచక్రపురం రాజు మిక్కిలి దుర్బలుడు అని పాండవులకు ఆవాసం చూపించిన బ్రాహ్మడి ద్వారా మూల రచయిత చెప్పిస్తారు. వెంటనే పాఠకునికొచ్చే మరొక అనుమానమేమంటే అంత దుర్భలరాజ్యాన్ని ఇరుగుపొరుగు రాజ్యాలు ఎందుకు సహించి బతకనిస్తారూ? అని! దీనికి జవాబు కొ.కు. యిచ్చారు. ఏకచక్రపుర రాజ్యాన్ని దుర్బలమైనదిగా కొ.కు. ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. ఒక్క యువకుని చేతిలో చచ్చిన ఒక రాక్షసుణ్ణి సంహరించలేనంత దుర్బలంగా రాజ్యం వుండటం హేతువిరుద్ధమైనది. నిజంగా అలాంటి రాజ్యం వున్నదని మాటవరుసకు అంగీకరించినా అంత బలహీనమైన రాజ్యాన్ని ఇరుగుపొరుగు రాజులు ఆక్రమించుకోకుండా వదిలిపెట్టరు. ప్రజల్నుండి తిరుగుబాబైనా రాకుండా వుండిపోదు. కనుకనే కొ.కు. ప్రజలకంటే, రాజ్యంకంటే ఎంతటి రాక్షసుడైనా, ఒకే ఒక్కడైన బకుణ్ణి బలోపేతమైనవానిగా చూపలేదు.
కొ.కు. ‘బకాసుర’ కథలో రాజుగారి హృదయం ఇట్టే మంత్రికి తెలిసిపోయింది. బకాసురుడు ఏకచక్రపురానికి పెట్టనికోట.
వాడు మూడు అక్షౌహిణుల సైన్యానికి సమానం. వాడే చతురంగ బలాలూను! అందుకే వాడు రాజుగారికి దివ్యమైన అంగరక్ష. వాడు చనిపోవడానికీ, పొలిమేర వీడి పోవటానికీ వీల్లేదు. వాడి ఖర్చు ఏడాదికి మూడువందల అరవైమంది ప్రాణులు. కారుచౌక! యుద్ధాలలో దానికి అయిదింతలు చస్తారు. క్షామాలు అంతకంటే ఎక్కువ బలి తీసుకుంటున్నాయి…. అదృష్టదేవత ఈ రాక్షసుడి రూపంలో వచ్చిందంటే అతిశయోక్తి కాదు… “మన రాజ్యంపై కన్నువేసిన పరిసర రాజులతో పోల్చితే రాక్షసేశ్వరులు దాదాపు మిత్రులనే చెప్పాలి. దాదాపు మిత్రులు” ఇదీ! మంత్రి ఆలోచన!! (ఇంకా ఉంది)
కుంతి, పాండవులు కాక బకాసుర గాధలో మరో రెండు పాత్రలే వుంటాయి. అందులో బకాసురునికి ఒక్కనికే మహాభారత రచయితలు పేరు పెట్టారు. (తరువాయి రెండో భాగంలో)

 

రెండో భాగం ఇక్కడ చదవండి

‘బకాసుర’ కథ! చెప్పే పాఠాలు (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *