84 వ సమస్యనే, అసలు సమస్య

(సలీమ్ బాషా)
ఈ ప్రపంచంలో సమస్యలు (problems) లేని వాళ్ళు ఉంటారా? దాదాపుగా ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఉంది. నాకు తెలిసి చిన్నపిల్లలు, పిచ్చోళ్ళు, చచ్చిపోయిన వాళ్ళకి పెద్దగా సమస్యలు ఉండవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పై ముగ్గురిలో చచ్చిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఏ సమస్య ఉండదు. అందుకే చాలామంది సమస్య(లు) వచ్చినప్పుడు చావే పరిష్కారం అనుకుంటారు. కొంత మంది ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అలా చేసుకునే వాళ్ళకి ఒక విషయం అర్థమైతే ఆత్మహత్య చేసుకోవడం మానేసే అవకాశం ఉంది. అదేంటంటే ఈ ప్రపంచంలో బతికున్న ఏ మనిషికైనా సమస్యలు ఉండడం చాలా సహజం. మనం బతికి ఉన్నానంటే సమస్యలతో సహజీవనం చేస్తున్నట్లే.
ఈ ప్రపంచంలో చాలామందికి ఒక ముఖ్యమైన సమస్య (84 వది)ఉంటుంది. అది ఏంటో తెలుసుకోవాలంటే బుద్ధుడి జీవితంలో నుంచి తీసుకున్న ఈ కథ గురించి తెలుసుకోవాలి..
ఒకసారి బుద్ధుడు దగ్గరికి ఒక రైతు వచ్చి “నాకు చాలా సమస్యలు ఉన్నాయి. మీరు జ్ఞానులు. నాకు ఏదైనా పరిష్కారం చెప్తారని వచ్చాను.” అంటూ వరుసగా తన సమస్యలను ఏకరువు పెట్టడం మొదలుపెట్టాడు. ” నా కొడుకు నాకు గౌరవం ఇవ్వడం లేదు. నా మాట అసలు వినడం లేదు. నా భార్య కూడా అంతే. వారికి బుద్ధి రావాలంటే ఏం చేయాలి?.” అన్నాడు. అప్పుడు బుద్ధుడు ప్రశాంతంగా ” నీ సమస్యకు నా దగ్గర పరిష్కారం లేదు” అన్నాడు.
అప్పుడు ఆ రైతు ” నా పంట చేతికి వచ్చే సమయానికి, కోతుల పంటలను నాశనం చేస్తున్నాయి. దానికి ఏం చేయాలో చెప్పండి” అన్నాడు. బుద్ధుడు దానికి కూడా తన దగ్గర పరిష్కారం లేదు అని చెప్పాడు. రైతు ” ఆయన దగ్గర చాలా మంది అప్పు తీసుకున్నారు, ఎంత చెప్పినా తీర్చడం లేదు. దీనికి ఏదైనా పరిష్కారం చూపండి.” అన్నాడు. బుద్ధుడు మళ్లీ ప్రశాంతంగా నేనేమీ చేయలేను అని చెప్పాడు. దాంతో రైతుకు విపరీతమైన కోపం వచ్చింది. ” మీరు గొప్ప జ్ఞాని. నాకు ఏదో పరిష్కారం చూపిస్తారు అనుకుంటే. ఇలా మాట్లాడుతున్నారు” అన్నాడు
బుద్ధుడు అతని కోపాన్ని పట్టించుకోకుండా నవ్వుతూ, ప్రశాంతంగా ఇలా చెప్పాడు. ” జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు 84 సమస్యలు ఉంటాయి. అయితే అందులో 84వ సమస్య ముఖ్యమైనది. దానికి పరిష్కారం కనుక్కుంటే, మిగతా 83 సమస్యలు పరిష్కారం అయినట్లే”.
దానికి ఆ రైతు” నా 84వ సమస్య కు పరిష్కారం చెప్పండి” అన్నాడు. దానికి బుద్ధుడు ” మొదట నీ 84వ సమస్య ఏమిటి అన్నది నువ్వు తెలుసుకోవాలి.” అన్నాడు.
” ఆ సమస్య ఏమిటి?” అని రైతు అడిగితే
బుద్ధుడు మరింత ప్రశాంతంగా ఆ రైతు కళ్ళల్లోకి చూస్తూ,” నీ 84వ సమస్య ఏంటంటే, నువ్వు మొదటి 83 సమస్యలు ఎప్పుడూ ఉండకూడదు అనుకుంటున్నావ్. అదే నీ 84వ సమస్య. దీనిని అర్థం చేసుకుంటే మీ మిగతా సమస్యలన్నీ సులువుగా పరిష్కారమవుతాయి. నువ్వు ఎప్పుడైతే నాకు 83 సమస్యలు ఉండకూడదని అనుకుంటావో, అప్పుడు నీ అసలు సమస్య మొదలవుతుంది. జీవితంలో సమస్యలు అనేవి ఎప్పుడు ఒక భాగంగా ఉంటాయి ఒక సమస్యను పరిష్కరించుకుంటే ఇంకో సమస్య ఉంటుంది. ఎవరి జీవితంలో అయినా సరే 83 సమస్యలు ఉంటాయి అని అర్థం చేసుకుని ముందుకు సాగడమే 84వ సమస్యకు పరిష్కారం. అప్పుడు నీకు ఎటువంటి సమస్య ఉండదు.” అన్నాడు.
ఈ కథలో చెప్పినట్టు ప్రతి మనిషి సమస్యలు లేని జీవితాన్ని కోరుకుంటాడు. అదే అందరికీ అతి పెద్ద సమస్య. అది అసాధ్యం. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. ఇవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు.
సమస్యలు అనేక రకాలు. సహజంగా మనకు వచ్చేవి, మనం కోరి తెచ్చుకునేవి, ఇతరులు మనకు సృష్టించేవి.
నిజానికి చాలాసార్లు అసలు సమస్య ఉండదు. చాలామంది లేని సమస్య ఉన్నట్లు భావించి దాని గురించే అలోచిస్తూ, ఆ సమస్య తాలూకు పరిమాణాలను ఊహించుకొని, ప్రశాంతతను పోగొట్టుకుంటారు.
లండన్ నగరంలో జరిగిన ఒక సంఘటన దీనికి ఉదాహరణ. ఒక బస్సులో ప్రతిరోజు జాన్ అనే ఒక వ్యక్తి ఎక్కేవాడు. కండక్టర్ టికెట్ అడిగితే ” జాన్ టికెట్ తీసుకోడు” అని సమాధానం ఇచ్చేవాడు. కండక్టర్ బక్కపలచని మనిషి.జాన్ ని చూస్తే బాగా దిట్టంగా బలంగా ఉన్నాడు. దాంతో కండక్టర్ ఏమీ అనలేకపోయేవాడు. అలా చాలా రోజుల పాటు జరిగింది. కండక్టర్ కి ఏం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఆ సమస్య గురించే ఆలోచిస్తూ కుంగి కృశించి పోయాడు. ఒక రోజు ధైర్యం చేసి ” ఎందుకు టికెట్ తీసుకోవు” అని నిలదీశాడు. అప్పుడు జాన్ నవ్వి,” నా దగ్గర పాస్ ఉంది!” అన్నాడు అదీ విషయం.
“A well defined problem is half solved” అని ఇంగ్లీషులో ఒక నానుడి. దీని అర్థం ఏ సమస్యనైనా పూర్తిగా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం దొరికినట్లే.
సమస్య ఉందని అనిపించినప్పుడు, కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే అసలు సమస్య ఉందో లేదో తెలుస్తుంది. సమస్య వచ్చినప్పుడు బెంబేలు పడిపోతే, పరిష్కారం కూడా అంత తొందరగా దొరకదు. ఒకవేళ దొరికిప్పటికీ అది సరైన పరిష్కారం కాకపోవచ్చు.
Problem solving(సమస్య- పరిష్కారం )అన్నది చాలా సింపుల్ విషయం. అందరూ అనుకుంటున్న అంత కష్టమేమీ కాదు. దానికి కొంత కామన్ సెన్స్ అవసరం. దాదాపుగా పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కొన్నిసార్లు సమస్య లోనే పరిష్కారం ఉండే అవకాశం ఉంది. ఎవరో చెప్పినట్లు ” సమస్య- పరిష్కారం నాణేనికి బొమ్మా బొరుసు లాంటివి”
సమస్య పరిష్కారం లో ఎన్నో పద్ధతులున్నాయి. ఒకటి రెండు ఇక్కడ ప్రస్తావిస్తాను. అందులో ఒకటి ” గ్లాసు ను పక్కన పెట్టేయాలి” అన్నది. నీళ్ల తో నిండిన ఒక గ్లాస్ ను ఒక నిమిషం పట్టుకుంటే ఏమీ కాకపోవచ్చు. ఒక 10 నిమిషాలు పట్టుకుంటే కొంత ఇబ్బంది అనిపించవచ్చు. అదే ఒక గంట పట్టుకుంటే చేయి నొప్పిగా అనిపించవచ్చు. అదే 5 గంటలు పట్టుకుంటే, చేయి మొద్దు బార వచ్చు. రోజంతా పట్టుకుంటే చేయి పనికి రాకుండా పోవచ్చు. సమస్య కూడా అంతే. నీటితో నిండిన గ్లాసు లాంటిది. దాన్ని ఎక్కువసేపు పట్టుకోకూడదు. ఈ సూత్రం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, సమస్య గురించి ఆలోచించకూడదు అని కాదు. దాన్ని మోయకూడదు. దాన్ని పక్కన పెట్టి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి అని అర్థం.
“We cannot solve our problems with the same thinking we used when we created them.” … అని చెప్పాడు ఐన్స్టీన్. దీని భావం ఏమిటంటే, మన ఒక సమస్యను సృష్టించుకున్నప్పుడు ఉన్న ఆలోచనా విధానం తోనే పరిష్కారం సాధించలేము. చాలామంది ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కన్నాసమస్యను గురించి ఆలోచించడం లోనే ఎక్కువ సమయం వృధా చేస్తారు.
సమస్యలు పరిష్కరించడంలో ఆచరించదగ్గ మరో పద్ధతి గురించి ప్రస్తావిస్తాను. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ కథ ఉపయోగపడుతుంది. ఒక గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి ” అయ్యా, నాకు సమస్యలు ఎక్కువ అయిపోయాయి, జీవితం దుర్భరంగా తయారయింది. ఏం చేయాలో తోచడం లేదు.” అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆ గురువు శిష్యుడిని ఒక చెంచాడు ఉప్పు తీసుకొని గ్లాసు నీళ్లలో కలిపి అదే చెంచాతో తాగమన్నాడు. శిష్యుడు అలాగే చేశాడు. అప్పుడు గురువు నీళ్ల రుచి ఎలా ఉంది అని అడిగితే, శిష్యుడు చాలా ఉప్పగా ఉన్నాయి అని చెప్పాడు. తర్వాత గురువారం ఒక చిన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళి మళ్లీ ఒక చెంచాడు ఉప్పు చెరువులో కలపమన్నాడు. శిష్యుడు అలాగే చేశాడు. అప్పుడు గురువు అదే చెంచాతో చెరువులో నీళ్లు తాగమన్నాడు. శిష్యుడు తాగాడు. గురువు “నీళ్లు ఉప్పగా ఉన్నాయా?” అని అడిగితే శిష్యుడు ” లేదు మామూలుగానే ఉన్నాయి” అన్నాడు.
అప్పుడు గురువు” సమస్యలు ఉప్పు లాంటివి. అవి మారలేదు. గ్లాసులు వేస్తే ఉప్పగా ఉన్నాయి. చెరువులో వేస్తే ఉప్పు జాడ లేదు. సమస్యను మనం స్వీకరించే పద్ధతి ఎలా ఉంటే సమస్య కూడా అలానే ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు మన ఆలోచన విధానం గ్లాస్ లాగా చిన్నగా కాక, చెరువు లాగా విశాలంగా ఉంటే సమస్య మనల్నిఇబ్బంది పెట్టదు.. ” అన్నాడు. అదీ విషయం.
సమస్య పరిష్కారం గురించి ఇంకాస్త మరోసారి చూద్దాం.
saleem basha
Saleem Basha CS
(సలీమ్ బాషా, లైఫ్ కోచ్, కర్నూలు, ఫోన్ నెంబర్ 1 93937 37937)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *