చేనేత కార్మికుల మజూరి 15% పెరుగుదల

మంగళగిరి నగరంలో చేనేత కార్మికుల మజూరి 15 శాతం పెరిగింది. ఈ మేరకు మంగళవారం రాత్రి మాస్టర్ వీవర్స్, చేనేత కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య మజూరి పెంపుదలపై జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరింది. చేనేత కార్మికుల మజూరి పెరుగుదల రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. వాస్తవానికి గతేడాదే మజూరి పెరగాల్సివున్నా కరోనా మహమ్మారి వల్ల అమలు కాలేదు. ఇప్పటికీ అదే పరిస్థితులున్న నేపథ్యంలో ఉభయ వర్గాల మధ్య జరిగిన చర్చల్లో మాస్టర్స్ వీవర్స్ ప్రతినిధులు 10 శాతం పెంచుతామని స్పష్టం చేయగా అందుకు చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఒప్పుకోలేదు. తదుపరి 15 శాతం మజూరి పెంపునకు అంగీకారం కుదిరింది.
ప్రస్తుతం చేనేత కార్మికులకు వివిధ రకాల పచ్చాలకు రూ.2 వేల నుంచి రూ. 5వేల వరకు మజూరీలు ఉండగా, వాటికి అదనంగా 15 శాతం పెరుగుదలతో మజూరి లభించనుంది. ఈ పెంపుదలతో మంగళగిరి నగర, పరిసర ప్రాంతాల్లోని 2400 చేనేత మగ్గాలపై ఆధారపడిన కార్మికులతోపాటు మంగళగిరి మాస్టర్ వీవర్ల నుంచి ఉపాధి పొందిన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని దాదాపు 5 వేల మంది చేనేత కార్మికులకు మజూరి పెంపు లబ్ధి చేకూరనుంది.
చర్చల్లో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ప్రతినిధులు పిల్లలమర్రి బాలకృష్ణ, రామనాథం పూర్ణచంద్రరావు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, గుత్తికొండ ధనుంజయరావు, జగ్గారపు సుబ్బారావు, కూరపాటి కోటేశ్వరరావు, భీమిశెట్టి బాలపేడేరు, డోకిపర్తి రామరావు, కౌతరపు వెంకటేశ్వరరావు, బత్తూరి మోహనరావు, గోలి వెంకటేశ్వర్లు, ఇమంది రామారావు, బొడ్డు శివరామారావులు పాల్గొనగా, మాస్టర్ వీవర్స్ ప్రతినిధులు జొన్నాదుల వరప్రసాదరావు (మణి), రావెల సత్యనారాయణ, ఊట్ల సుబ్బారావు, నందం సాంబశివరావు, కొల్లి శ్రీనివాసరావు, పణిదపు వీరాస్వామి పాల్గొన్నారు.
మంగళగిరి నగరంలో చేనేతకార్మికుల మజూరి పెంపు ప్రాతిపదికగా చేనేత కేంద్రాలు అయిన పెడన, చీరాల తదితర ప్రాంతాల్లోని మాస్టర్ వీవర్స్ కూడా చేనేత కార్మికుల మజూరీలు పెంచే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *