బెజవాడలో ‘చిన్ని చిన్ని సంగతులు’

కృష్ణానదీతీరంలో మంగళవారం సాయంత్రం సాహిత్య చిరుజల్లుల నడుమ కవులు, రచయితలు సేదదీరారు. అదెలా అంటే… ప్రముఖ కవి, రచయిత పి.శ్రీనివాస్ గౌడ్ ‘చిన్ని చిన్ని సంగతులు’ కవితాసంపుటి ఆవిష్కరణకు ఠాగూర్ స్మారక గ్రంథాలయం వేదిక అయింది. ఆ వేదికను ఏపీ సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి ముఖ్యఅతిథిగా అలంకరించగా… సాగర్ శ్రీ రామకవచం సభాధ్యక్షత బాధ్యతను స్వీకరించగా ‘చినుకు’ రాజగోపాల్ పుస్తకాన్ని సమీక్షించారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కంచెల నాగరాజు, డాక్టర్ ఘంటా విజయ్ కుమార్, కవి, స్పెషల్ బ్రాంచ్ సీఐ కంఠా బంగార్రాజు వేదికను పంచుకున్నారు.
నవ్యాంధ్ర రచయిత సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ నేతృత్వంలో జరిగిన ఈ సాహిత్య వేడుకలో శ్రీనివాస్ గౌడ్ ‘చిన్ని చిన్ని సంగతులు’ లో పాలుపంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సాహిత్యంతో అనుబంధం పెనవేసుకున్న కొత్తపల్లి సురేష్ (అనంతపురం), కేవీ రమణారెడ్డి (మార్కాపురం), దగ్గుమాటి పద్మాకర్, సోలోమన్ విజయ్ కుమార్ (నెల్లూరు), బెజవాడ సాహితీమిత్రులు అరసవిల్లి కృష్ణ, అనిల్ డ్యానీ, అలెక్స్, చిదంబరం, సీహెచ్ రాఘవేంద్రశేఖర్, వీఎన్ఎస్ శర్మ, కేఎల్ఎన్ఎస్ శర్మ, మందరపు హైమావతి, వైష్ణవ శ్రీ, మంగళగిరి నుంచి అవ్వారు శ్రీనివాసరావు, సందుపట్ల భూపతి ఇంకా పలువురు హాజరయ్యారు.
ముఖ్యఅతిథి శ్రీలక్ష్మి ‘చిన్ని చిన్ని సంగతులు’ కవితాసంపుటిని ఆవిష్కరించి… చిన్ననాటి నుంచి సాహిత్య ప్రయాణం ఎలా సాగిందీ… రాజకీయ రంగంలోకి వెళ్లాక.. మధ్యలో విరామం.. మళ్లీ నేడు సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ గా సాహిత్య రంగానికి సేవచేసే భాగ్యం కలగడం వంటి అంశాలను చక్కగా వివరించారు. ఆ వివరాలు చైర్ పర్సన్ శ్రీలక్ష్మి మాటల్లోనే..
Andhra  Pradesh Sahitya Academy
ప్రసంగిస్తున్న సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి
‘‘నవ్యాంధ్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు సోదరుడు శ్రీనివాస్ గౌడ్ రచించిన కవితా సంపుటి ‘చిన్ని చిన్ని సంగతులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నేను కూడా మీతో భాగస్వామ్యం కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. గౌడ్ రచించిన ఈ పుస్తకాన్ని చదివాను. చాలా సరళమైన భాషలో హృదయాన్ని హత్తుకునేవిధంగా రాసిన తన శైలి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను సాహిత్యమంటే ప్రాణమిచ్చే వ్యక్తిని. మా కుటుంబంలో సాహిత్యరంగంలో ఎవరూ లేకపోయినప్పటికీ మరి ఎందుకనే సాహిత్యమంటే విపరీతమైన ఇష్టం. సమాజంలో మంచి వ్యక్తిత్తం గల వ్యక్తిగా నన్ను నిలబెట్టింది… నేను ఆనాడు చుదువుకున్న సాహిత్యమేనని నేను సగర్వంగా చెప్పగలను. సాహిత్యం చదవడమేకాకుండా నేను కూడా కవితలు, కథలు ఎన్నో రాశాను.
Andhra Pradesh Sahitya Academy
సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మిని సన్మానిస్తున్న సాహితీవేత్తలు సాగర్ శ్రీరామకవచం, ఘంటా విజయ్ కుమార్, కలిమిశ్రీ, కొత్తపల్లి సురేష్
తర్వాత నా తండ్రి కోర్కె మేరకు రాజకీయాల్లో ఉన్నతస్థానం చేరుకోవాలనే లక్ష్యంతో రాజకీయ ప్రస్థానం కొనసాగించినపుడు సాహిత్యానికి కొంత దూరమయ్యాను. ఈ క్రమంలో అనుకోకుండా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు మొన్న ప్రకటించిన కార్పొరేషన్లలో సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ గా నాకు అవకాశం కల్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమించి, అభిమానించి, నేను ఎంతో కృషిచేసిన సాహిత్య రంగాన్ని నేను వదిలేసి వేరే రంగం వైపు వెళ్లిపోయినా, ఇప్పుడు సాహిత్యానికి సేవచేయాలని, మీ లాంటి సరస్వతీపుత్రులకు నేను అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని, ఆ సరస్వతి మాత కటాక్షంతో తిరిగి నేను సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ గా మీ ముందుకు వచ్చాను.
సాహిత్య అకాడమీ కవులు, రచయితలను ప్రోత్సహిస్తుంది. యువకవులు, మహిళలను ప్రోత్సహిస్తుంది. విద్యార్థుల్లో కూడా రచనారంగాన్ని వ్యాపించేవిధంగా సాహిత్య అకాడమీ కృషి చేస్తుంది. మరుగున పడిపోతున్న గ్రంథాలను సేకరిస్తుంది. ముద్రణకు నోచుకోని పుస్తకాలను ముద్రించే బాధ్యతను సాహిత్య అకాడమీ తీసుకుంటుంది. ప్రభుత్వానికి, మీకు వారధిగా నిలుస్తుంది.
పూర్వకాలం నుంచి కూడా సమాజంలో నెలకొన్న అంటరానితనం, అస్పృస్యత, మూఢనమ్మకాలపై, అలాగే దేశభక్తిని తమ రచనల ద్వారా ప్రేరేపించి ప్రజలను జాగృతం చేసిన గొప్ప గొప్ప కవులు, రచయితలు గల దేశం మనది. అటువంటి రచనారంగంలో ఉన్న మీరు సగర్వంగా తలఎత్తుకుని తిరిగేలా, గర్వంగా నిలిచేలా సాహిత్య అకాడమీ కృషి చేస్తుందని అకాడమీ చైర్ పర్సన్ గా మీకు హామీ ఇస్తున్నాను.
జ్ఞానసంపన్నులైన మీలాంటి గొప్పవాళ్లను గుర్తించి, సరి అయిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నా పై ఉంది. మీ ఆశయాలకు తగినవిధంగా రచనారంగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రతి ఒక్కరి ప్రతిభకు సరి అయిన గుర్తింపును తీసుకువస్తానని తెలియచేస్తున్నాను. కవులు, రచయితలు సాహిత్య అకాడమీ ద్వారా ఏమి కోరుకుంటున్నారో రిప్రజంటేషన్ ఇస్తే.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అందుకు విశేష కృషి చేస్తాను’ అని సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి హామీఇచ్చారు.
కవిత్వం, కథ, విశ్లేషణల్లో విశేష కృషి…
సన్నిహిత మిత్రుడు పి.శ్రీనివాస్ గౌడ్ కవిత్వం, కథ, విశ్లేషణల్లో విశేషంగా కృషిచేస్తున్నారు. వృత్తిరీత్యా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో ఉన్నారు. గౌడ్ ఆరు కవితా సంపుటాలు ప్రచురించారు. కథలు, అనువాదాలు త్వరలో రానున్నాయి. సాహిత్యం మనుషుల్లోని మాలిన్యాలను శుద్ధి చేస్తుందని నమ్ముతారాయన. మనుషులను కలిపి ఉంచుతుందని విశ్వసిస్తారు.
సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మితో పుస్తక రచయిత పి.శ్రీనివాస్ గౌడ్
సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మితో పుస్తక రచయిత పి.శ్రీనివాస్ గౌడ్
శ్రీనివాస్ గౌడ్ ప్రచురించిన పుస్తకాలు
ముంజంత మృదువైన హైకు (జనవరి 2001)
దిగులు వర్ణాలు (అక్టోబరు 2003)
ఇదీ జీవితం (ఫిబ్రవరి 2007)
వెలుతురు వలయాలు (జనవరి 2008)
ఒక మెలుకవ (ఏప్రిల్ 2011)
ధైర్యవచనం (మార్చి 2021)
చిన్ని చిన్ని సంగతులు (నవంబరు 2021)
శ్రీనివాస్ గౌడ్ సాహిత్య సేద్యం నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా..
-అవ్వారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *