మంగళగిరి నగరంలో చేనేత కార్మికుల మజూరి 15 శాతం పెరిగింది. ఈ మేరకు మంగళవారం రాత్రి మాస్టర్ వీవర్స్, చేనేత కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య మజూరి పెంపుదలపై జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరింది. చేనేత కార్మికుల మజూరి పెరుగుదల రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. వాస్తవానికి గతేడాదే మజూరి పెరగాల్సివున్నా కరోనా మహమ్మారి వల్ల అమలు కాలేదు. ఇప్పటికీ అదే పరిస్థితులున్న నేపథ్యంలో ఉభయ వర్గాల మధ్య జరిగిన చర్చల్లో మాస్టర్స్ వీవర్స్ ప్రతినిధులు 10 శాతం పెంచుతామని స్పష్టం చేయగా అందుకు చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఒప్పుకోలేదు. తదుపరి 15 శాతం మజూరి పెంపునకు అంగీకారం కుదిరింది.
ప్రస్తుతం చేనేత కార్మికులకు వివిధ రకాల పచ్చాలకు రూ.2 వేల నుంచి రూ. 5వేల వరకు మజూరీలు ఉండగా, వాటికి అదనంగా 15 శాతం పెరుగుదలతో మజూరి లభించనుంది. ఈ పెంపుదలతో మంగళగిరి నగర, పరిసర ప్రాంతాల్లోని 2400 చేనేత మగ్గాలపై ఆధారపడిన కార్మికులతోపాటు మంగళగిరి మాస్టర్ వీవర్ల నుంచి ఉపాధి పొందిన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని దాదాపు 5 వేల మంది చేనేత కార్మికులకు మజూరి పెంపు లబ్ధి చేకూరనుంది.
మంగళగిరి నగరంలో చేనేతకార్మికుల మజూరి పెంపు ప్రాతిపదికగా చేనేత కేంద్రాలు అయిన పెడన, చీరాల తదితర ప్రాంతాల్లోని మాస్టర్ వీవర్స్ కూడా చేనేత కార్మికుల మజూరీలు పెంచే అవకాశాలు ఉన్నాయి.