అగ్గి రాజేస్తున్న శ్రీబాగ్ ఒడంబడిక-1

(వి. శంకరయ్య)
గత ఏడెనిమిది ఏళ్లుగా నవంబర్ మాసం వస్తే రాయలసీమలో అలజడి రేగుతోంది.
రాయలసీమ ప్రయోజనాల పరిరక్షణకు 1937 నవంబర్ 16 వతేదీ జరిగిన శ్రీ బాగ్ ఒడంబడిక రాచ పుండులాగా మానని గాయంలాగా ఇప్పటికీ కెలుకుతోంది. గత రెండు ఏళ్లుగా కొంత స్థబ్దత వున్నా ఈ ఏడు సీమలో ఎవరికి వారు పలు ప్రజా సంఘాలు నవంబర్ 16 వతేదీ శ్రీ బాగ్ ఒడంబడిక అమలు చేయాలని డిమాండ్ చేసేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు యువత పలు పట్టణాల్లో ప్రచారంలో భాగంగా పోస్టర్లు కర పత్రాలు ఉపయోగిస్తున్నారు. ఈ ఒడంబడికకు కేంద్ర బిందువు 1929 లో ఆంధ్ర యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ విజయవాడ నుండి అనంతపురం కాకుండా వైజాగ్ కు తరలించడం. తద్వారా రాయలసీమ వాసుల్లో ఏర్పడిన అపనమ్మకాలు పోగొట్టి అవిభక్త మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కోస్తా జిల్లాల నేతలు ప్రధానంగా భోగరాజు పట్టాభి సీతారామయ్య బులుసు సాంబమూర్తి లాంటి వారు చేసిన కృషి లో భాగంగా ఈ ఒడంబడిక 1937 నవంబర్ 16 వతేదీ ఆంధ్ర పత్రిక అధినేత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నివాసం (మద్రాసు) శ్రీ బాగ్ భవనంలో జరిగింది. కాబట్టి దీనికి శ్రీ బాగ్ ఒడంబడిక అని పేరు స్థిర పడింది. ఎన్నో దశాబ్దాలు గడచి పోయినా ఈ ఒడంబడిక చట్ట బద్దత లేకున్నా స్థిరమైన చారిత్రక ప్రాధాన్యత మాత్రం కోల్పోలేదు. అందుకే మానని గాయంగా సలుపుతోంది.
1926 ఏప్రిల్ 26 వతేదీ ఆంధ్ర యూనివర్సిటీని బెజవాడ (అప్పటి పేరు) లో అభిభక్త మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రాజమండ్రిలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. ఇదిలా వుండగా సామాజికంగానే కాకుండా విద్యాపరంగా వెనుక బడి వున్న రాయలసీమ వాసులు ఆంధ్ర యూనివర్సిటీని అనంతపురంలో నెలకొల్పాలని గట్టిగా డిమాండ్ చేశారు. 1927 లో ఆంధ్ర మహాసభ అనంతపురం లో జరిగింది ఈ సభలో ఆంధ్ర యూనివర్సిటీని అనంతపురం మార్చాలని తీర్మానం చేశారు. అంతేకాకుండా ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ కూడా ఆంధ్ర యూనివర్సిటీని అనంతపురం కు మార్పు చేయాలని తీర్మానం చేసింది. కాని మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 1929 లో ఆంధ్ర యూనివర్సిటీని బెజవాడ నుండి వైజాగ్ కు మార్పు చేస్తూ రాయలసీమలోని కాలేజీలనన్నింటిని మద్రాసు యూనివర్సిటీకి అనుబంధం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిణామంతో కోస్తా రాయలసీమ నేతల మధ్య అపనమ్మకాలు బల పడ్డాయి.
మరో వేపు 1934 లో రాయలసీమ పరిరక్షణ పేరుతో జస్టిస్ సి. యల్. నరసింహా రెడ్డి కె. సుబ్రహ్మణ్యం చొరవతో రాయలసీమ మహాసభ ఏర్పాటు చేశారు. 1934 జనవరిలో మద్రాసులో తొలి సభ జరిగింది. కడపకు చెందిన నెమలి పట్టాభిరామా రావు సభకు అధ్యక్షత వహించగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సెంట్ మెంట్ ను వ్యతిరేకించే తమిళ కాంగ్రెస్ నేత యస్. సత్య మూర్తి సభను ప్రారంభించారు. రాయలసీమ ప్రాంత కాలేజీలను ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధం చేయకూడదని మద్రాసు యూనివర్సిటీ లోనే కొనసాగించాలని అవసరమైతే ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు కోరుతూ తీర్మానం చేశారు. తిరిగి 1935 సెప్టెంబర్ లో రెండవ సభ కడపలో జరిగింది. కాని ఈ రెండు సభలకు రాయలసీమకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కడప కోటి రెడ్డి గాడిచర్ల హరిసర్వోత్తమ రావు పప్పూరి రామాచార్యులు హాజరు కాలేదు.
1937 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వారి చేత జస్టిస్ నరసింహా రెడ్డి సుబ్రహ్మణ్యం ఓడి పోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినది.
సి. రాజ గోపాలాచారి ముఖ్యమంత్రిగా మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన మంత్రి వర్గంలో కోస్తా ప్రాంతం నుండి టంగుటూరి ప్రకాశం పంతులు బెజవాడ గోపాలరెడ్డి వి. వి. గిరి మంత్రి వర్గ సభ్యులుగా చేర్చ బడ్డారు. కాని రాయలసీమ ప్రాంతం నుండి మంత్రి వర్గంలో ఒక్కరికి స్థానం లభించ లేదు. కోస్తా నేతల వలననే ఈ పరిస్థితి ఏర్పడిందనే అసంతృప్తి రాయలసీమ నేతల్లో నెల కొనింది. 1937 ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు అధ్యక్షులుగా భోగ రాజు పట్టాభి సీతారామయ్య ఎన్నికైనారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం తీవ్రతరం చేశారు. అయితే రాయలసీమ ప్రాంత నేతల సహకారం లేనిదే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించడం సాధ్యం కాదని కోస్తా కాంగ్రెస్ నేతలు గుర్తించారు. అందుకు రాయలసీమ నేతలు సిద్దంగా లేరు. ఆంధ్ర యూనివర్సిటీ అంశంలోనూ రాజాజీ మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం విషయంలోనూ రాయలసీమ నేతలు బాగా అసంతృప్తికి లోనైనారు.
ఈ పరిస్థితుల్లో 1937 అక్టోబర్ లో విజయవాడలో ఆంధ్ర మహాసభ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. గమనార్హమైన అంశమేమంటే ఈ ఉత్సవాలకు రాయలసీమకు చెందిన కడప కోటి రెడ్డి అధ్యక్షత వహించగా హలా హర్వి సీతారామ రెడ్డి ప్రారంభించారు. ఇరువురు కూడా రాయల సీమ నుండి శాసనసభ్యులుగా వున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సహకరించాలంటే రాయలసీమ ప్రయోజనాలకు రక్షణ ఇవ్వ వలసినదిగా ఇద్దరూ కోరారు. ఈ మహాసభలో జరిగిన చర్చలు పరస్పరం భావాలు ఇచ్చి పుచ్చుకున్నందున శ్రీ బాగ్ ఒడంబడిక కుదరడానికి పునాది రాయి పడింది.
ఈ నేపథ్యంలో 1937 నవంబర్ 16 తేదీన మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నివాసమైన శ్రీ బాగ్ లో కోస్తా రాయలసీమ ప్రాంతాలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు. రాయలసీమ నేతల్లో వున్న అనుమానాలు పోగొట్టేందుకు చర్చలు జరిగాయి. పర్యవసానంగా ఒక ఒప్పందం కుదిరింది. అదే శ్రీ బాగ్ ఒడంబడిక. ఈ ఒప్పందంలో కడప కోటిరెడ్డి (కడప) కల్లూరు సుబ్బారావు (అనంతపురం) యల్. సుబ్బరామి రెడ్డి (నెల్లూరు) భోగరాజు పట్టాభి సీతారామయ్య (కృష్ణ) కొండా వెంకటప్పయ్య (గుంటూరు) పప్పూరి రామాచార్యులు (అనంతపురం) ఆర్. వెంకటప్ప నాయుడు (నెల్లూరు) హలాహర్వి సీతారామి రెడ్డి (కర్నూలు)
సంతకాలు చేశారు.
ఒప్పందంలో ముఖ్యాంశాలు
1)ఆంధ్ర యూనివర్సిటీ రెండు కేంద్రాలు ఏర్పాటు చేయడం. ఒకటి – వైజాగ్ లోనూ రెండవది అనంతపురంలో నెలకొల్పడం.
2)రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో వ్యవసాయ రంగంలో ఆర్థికాభివృద్ధి కోస్తా ప్రాంతంతో సమానంగా సాధించేందుకు తుంగభద్ర కృష్ణ, పెన్నా నదులపై నిర్మించే పెద్ద ప్రాజెక్టుల ప్రయోజనాలు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి.
3) చట్ట సభల్లో రిజర్వేషన్ స్థానాలు మినహా జరనల్ స్థానాలు జిల్లా స్థాయిలో సమానంగా వుండాలి.
4)రాజధాని హైకోర్టు వేర్వేరు ప్రాంతాల్లో వుండాలి. ముందు ఛాయిస్ రాయలసీమకు ఇవ్వాలి.
మద్రాసు రాష్ట్రం నుండి విడగొట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఈ సమావేశం మద్రాసు శాసన సభకు మెమోరాండం సమర్పించింది. 1938 ఏప్రిల్ లో గవర్నమెంట్ మెంట్ ఆఫ్ ఇండియాకు మెమోరాండం పంపబడింది. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే ఆలోచన లేదని తిరస్కరించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు అంగీకరించలేదు. స్వాతంత్య్రం రాకముందు నుండి దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రలు ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సూత్ర ప్రాయంగా అంగీకరించినా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసే వరకు కేంద్ర ప్రభుత్వం దిగి రాలేదు. అనంతరమే నెహ్రూ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేందుకు అంగీకరించి భాషా ప్రయుక్త రాష్ట్రల కమిషన్ నియమించారు.
(ఇంకా వుంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *