నిజాలు దాచి కల్లలు చెప్పేందుకు కోట్ల ఖర్చు

జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం పెట్రోలు ధరల మీద నిజాలు దాస్తున్నదా! అర్థసత్యాలు చెబుతున్నదా! అబద్దాలు చెబుతున్నదా!

(టి లక్ష్మినారాయణ)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ పేరుతో “పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?” అన్న శీర్షికతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి అన్ని దినపత్రికలలో మొదటి పేజీ అడ్వర్టైజ్మెంట్లు ప్రభుత్వం ఇచ్చింది.

మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టిన శీర్షిక చాలా బాగుంది. సమర్ధనీయం. అదే సందర్భంలో   పిట్టకథలే కాదు, నిజాలను మరుగుపరిచే కళ, నైపుణ్యం కూడా ఆయనకు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ అన్న అనుమానం ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూశాక నాకైతే కలిగింది.

శభాష్! బుగ్గన గారు, మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, సెస్, సర్ చార్జీల రూపంలో రూ.3,35,000 కోట్లు ప్రజల నుండి పిండుకొన్నది వెల్లడించారు. ఉత్తరాది రాష్ట్రాలలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలతో కంగుతిని, భవిష్యత్తులో జరగబోయే యు.పి. తదితర రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కంటి తుడుపు చర్యగా పెట్రోల్ పై రూ.5, డీజల్ పై రూ.10 తగ్గించి దేశమంతా డప్పు మోగించుకొంటున్న కేంద్ర ప్రభుత్వ డొల్లతనాన్ని గణాంకాలతో ఎండగట్టారు.

ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు 41% నిధులను బదిలీ చేయాల్సి ఉండగా ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చిన రూ.47,500 కోట్ల ఆదాయంలో రూ.19,475 కోట్లు మాత్రమే రాష్ట్రాలకు వాటాగా ఇచ్చి, రూ.2,87,500 కోట్ల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం దగా చేసిందని వెల్లడించారు.

2019 మే నెలలో లీటర్ పెట్రోల్ రూ.76.89, లీటర్ డీజల్ రూ.71.50 అయితే 2021 నవంబరు 1 నాటికి లీటర్ పెట్రోల్ రూ.115.99, లీటర్ డీజల్ రూ.108.66 కు పెరగడం వాస్తవం కాదా? అని మీరు మోడీ గారి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ముమ్మాటికీ నిజం. ఈ విషయంపై పార్లమెంటులో మోడీ ప్రభుత్వాన్ని నిగ్గదీయండి.

ఇహ! మన రాష్ట్రం సంగతి పరిశీలిద్దాం. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత ఎంతో కూడా స్పష్టంగా సెలవిస్తే తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.

2020 సెప్టెంబర్ 19 నుండి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై 31% వ్యాట్, లీటరుకు రూ.4 అదనపు వ్యాట్, రూ.1 సెస్ వసూలు చేస్తున్నదని, డీజిల్ పై 22.5% వ్యాట్, లీటరుకు రూ.4 అదనపు వ్యాట్, రూ.1 సెస్ వసూలు చేస్తున్నదని విస్పష్టంగా ప్రకటించారు. గత ప్రభుత్వం కంటే సెస్ రూపంలో రూ.1 మాత్రమే వినియోగదారులపై అదనంగా ఆర్థిక భారం మోపామని వెల్లడించారు.

పెట్రోల్ పై 31% వ్యాట్ + లీటర్ కు రూ.2 అదనపు వ్యాట్ గా ఉంటే దాన్ని 35.20% కు, డీజల్ పై వ్యాట్ ను 22.25% + లీటర్ కు రూ.2 అదనపు వ్యాట్ గా ఉంటే దాన్ని 27% కు పెంచుతూ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
2020 జనవరి 29న జారీ చేసిన జీ. ఓ.ఎం.ఎస్.నెం.19 సంగతి ఎందుకు దాచిపెట్టారు బుగ్గన గారు? ఆ జీ.ఓ. అమల్లో లేదా? ఉపసంహరించారా? ఆ జీ.ఓ. తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ. ఏదైనా ఉంటే దాన్ని బహిర్గతం చేయండి. పారదర్శకత నిరూపించుకొండి.

పెట్రోల్, డీజిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి సంబంధించిన గణాంకాలను కూడా నిజాయితితో వెల్లడించండి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పర్యవసానంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిలువు దోపిడీకి గురౌతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి బాగా క్షిణించింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించాలి. అదనపు వ్యాట్ ను రద్దు చేయాలి.

(టి.లక్ష్మీనారాయణ,సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *