తెలంగాణ సాహితీవేత్త కపిలవాయికి నివాళి

చంధోబద్దమయిన సాంప్రదాయ కవిత్వం భావప్రకటనకు ఏ మాత్రం అడ్డంకికాదని గేయస్వర్ణయుగంలో కూడా పద్యానికి పట్టం కట్టిన  గొప్ప కవి కపిలవాయి లింగమూర్తి.
ఆయన ఆన్ని సాహిత్య ప్రక్రియలలో అంటే కవితలు, గీతాలు, వచనాలు, శతకాలు, వచన శతకాలు, కావ్యాలు, ద్విపద, నాటకం, ఉదాహరణలు, స్థలచరిత్రలు, బాలసాహిత్యం మొదలైన ప్రక్రియలలో రచనలు చేసిన ప్రజ్ఞా శాలి. అంతేకాదు,
మరుగున పడ్డ తాళ పత్రాలను వెలికి దీసి దానిలోని వ్యాఖ్యా విశేషాలను వివరిస్తూ పరిష్కరించి ఆనాటి తరం కవులను ఈ తరానికి పరిచయం చేశారు. సాహిత్యంలోని అనేక విషయాలను అవలీలగా వివరించే ‘విద్వన్మణి’. అనేక స్థలచరిత్రలు, దేవాలయాల కథలకు ప్రాణం పొసిన ‘పరిశోధకుడు’.  తెలంగటాణ సాహిత్య వనం లో పూసిన  వాడిపోని  ఎపుడూగుభాళించే  అరుదైన పూవు..   కపిలవాయికి మూడవ వర్ధంతి సదర్భంగా నివాళి.
(వడ్డేపల్లి మల్లేశము)
తెలంగాణ పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు, దేవాలయాలు స్థల మూలాలు తెలిపే పరిశోధనలు చేసి చరిత్రకు ఆనవాళ్ళు అందించిన అగ్రశ్రేణి కవి కపిలవాయి. కవి కేసరి అనే బిరుదు గల వీరు శ్రీశ్రీ, తిలక్ లాగానే తొలినాళ్లలో పద్యరచన తో ప్రారంభమైన ఆ తర్వాత అన్ని ప్రక్రియల్లో రచనలను కొనసాగించి సాహిత్యాన్ని శక్తిమేరకు సుసంపన్నం చేసినారు. ప్రధానంగా కథారచన, విమర్శ, జానపద సాహిత్యంపై పరిశోధన నేటి కవులకు ఎంతో ఉపయుక్తమైన రచనలు చేయడం పరిశోధన చేసే వారికి కూడా తోడ్పడుతుంది. వీరి జీవితము సాహిత్యంపై ఇప్పటికే నలుగురైదుగురు పరిశోధకులు పరిశోధన
పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.
ఒక రచనపై పరిశోధకుడు పరిశోధించాలి అంటే మరింత లోతుగా వెళ్లడం ద్వారా భాష ,సాహిత్యం, సంస్కృతి, చరిత్ర ఆనవాళ్లను జనానికి అందుబాటులోకి తేవడమే అవుతుంది. ఇలాంటి పరిశోధనలు చేసే పరిశోధకులకు ప్రభుత్వపరంగా అనేక రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు భరోసాను ప్రభుత్వపరంగా ఇవ్వవలసిన అవసరం ఉన్నది.
కపిలవాయి భావన- రచనలు
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు భాషా సాహిత్యాలకు అంతేకాకుండా ప్రజల జీవితాలకు కొంత అన్యాయం జరిగిందని తపనపడే కపిలవాయి ప్రజలతో పేచీ లేదు కానీ నిర్వహణ వల్లనే ఈ దౌర్భాగ్యం తలెత్తినట్లు అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో తెలుగు అధికార భాషగా కొనసాగక పోవడం పట్ల చాలా ఆవేదన చెందేవారు. అంతేకాకుండా పరిపాలన తెలుగులో జరగాలని ,ఉత్తర్వులు తెలుగులో వెలువడాలి అని, బోధన తెలుగు మాధ్యమంలోనే కొనసాగాలని ఆశించేవారు. ఆకాంక్షించే వారు.
ఈ సందర్భంలో ఒక మాట! కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ,మంచి భోజనం, అంతకుమించి ప్రారంభ, ముగింపు సమావేశాలు ఘనంగా నిర్వహించి అతిథులను భారీఎత్తున సన్మానించుకున్నా, తెలంగాణలో స్వరాష్ట్రంలో ఇప్పటికీ కపిలవాయి ఆకాంక్షలు నెరవేరలేదు. రాష్ట్రం ఏదైనా తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం,ఉత్తర్వులన్ని ఆంగ్లంలోనే రావడం, తెలుగు భాషకు ఏ రకంగానూ ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పాలనలో దాని ప్రస్తావనే లేకపోవడం బాధాకరమే కాకుండా కపిలవాయి ఆలోచనలను తుంగలోతొక్కినట్లే.
కొన్ని రచనలు వివరణ
ఆయన 80 కిపైగా రచనలు చేశారు. ఇందులో అముద్రితాలు  25 రచనలు. ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా పనిచేస్తూనే చివరివరకు తన రచనా రంగాన్ని మొక్కవోని ధైర్యంతో అలుపెరగకుండా కొనసాగించడం నేటి కవులకు, యువకులకు, వర్తమాన కవులకు ఒక పాఠంగా స్వీకరించవలసిన అవసరం ఉన్నది. అది మనందరి యొక్క సామాజిక బాధ్యత.
అనుభవాలు అనుభూతులు తో కూడిన స్వీయ రచనలతో పాటు, పాలమూరు జిల్లా దేవాలయాలు 2010లో సమగ్ర పరిశోధన చేసి రచించారు. వీరి సంపాదకత్వంలో అనేక పుస్తకాలు రావడమే కాకుండా కొన్ని అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించడంతో పాటు కఠినమైన అంశాలకు వ్యాఖ్యానాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కావ్యాలు, గీతాలు, శతకాలు ,వచన సాహిత్యం, స్థల పురాణాలు, బాలసాహిత్యం మొదలైన ప్రక్రియలలో శతాధిక గ్రంథకర్త గా పేరుగాంచిన కపిలవాయి లింగమూర్తి సాహిత్యంపై ఇప్పటికే  ఉస్మానియా, మధురై, తెలుగు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలనుంచి  సిద్ధాంత గ్రంథాలు ఆరు వెలువడ్డాయి.
కపిలవాయి జీవితము కొన్ని ఘట్టాలు

ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించిన కవుల జీవిత చరిత్రలు కూడా మనకు శిరోధార్యమే.ప్రతికూల పరిస్థితుల్లోనూ, తమను ఏ రకమైన పరిస్థితులు ప్రభావితం చేసింది, ధైర్యంతో ఏ రకంగా సామాజిక బాధ్యత నిర్వహించడానికి కొనసాగించినది వారి జీవిత చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందుకే కవులు ,కళాకారులు, పరిశోధకులు, మేధావులు, శాస్త్రవేత్తలు, ప్రజా నాయకుల జీవిత చరిత్రను అధ్యయనం చేయడం అనివార్యం. ప్రతి వారికి అవసరం కూడా!

ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట తాలూకా బల్మూర్ మండలం లోని జీను కుంట అనే గ్రామంలో మాణిక్యమ్మ వెంకటాచలం దంపతులకు మార్చి 31 1928 సంవత్సరంలో వీరు జన్మించినారు. అతి పిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరిగి పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తిచేశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి అనంతరం ఉస్మానియా  నుండి ఎమ్మే పట్టా పొంది నాగర్కర్నూల్ పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరారు. తర్వాత మాస్టర్ ఆఫ్ ఓరియంటల్ లర్నింగ్ (MOL)పూర్తి చేశారు.  1972 నుండి 83 లో ఉద్యోగ విరమణ చేసే వరకు వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు.
సన్మానాలు బిరుదులు ప్రశంసలు

1983 లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ఆ తర్వాత నారా చంద్రబాబునాయుడు, రాజశేఖర్ రెడ్డి వీరి సాహిత్య కృషికి ఘనంగా సన్మానించారు. అలాగే తెలంగాణ ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావుతో సన్మానించబడడం ద్వారా నలుగురు ముఖ్యమంత్రులతో సన్మానించబడిన ఏకైక తెలుగు కవి, పరిశోధకులుగా కపిలవాయి లింగమూర్తి మిగిలిపోయారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం, బ్రౌన్ సాహిత్య పురస్కారం, నోరి నోరి నరసింహశాస్త్రి పురస్కారం., కందుకూరి రుద్రకవి పురస్కారం, పులికంటి సాహితీ పురస్కారం, బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం వీరికి లభించినాయి.

వీరి ఉత్తమ సాహిత్యాన్ని గుర్తించిన వెన్నెల సాహిత్య అకాడమీ సంస్థ వీరి జీవితము సాహిత్యంపై” కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి” అనే పేరుతో డాక్యుమెంటరీని నిర్మించగా 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ ఉత్తమ డాక్యుమెంటరీ గా నంది అవార్డును ప్రకటించడం సంతోషకరం. 1992 లో కవితా కళానిధి పరిశోధనా పంచానన, 96 లో కవి కేసరి, 2005లో వేదాంత విశారద, 2010లో గురు శిరోమణి, 2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి వంటి అనేక బిరుదులు లభించడాన్ని బట్టి సాహిత్య రంగంలో వీరి సేవలు, కృషిని మనం అర్థం చేసుకోవచ్చు.
వారి జీవితాన్ని సాహిత్యాన్ని మనసుపెట్టి అధ్యయనం చేయడానికి వారి రచనలు పుస్తకాలను వెతకాలంటే చదవాలని ఆత్రుత మనలో ఉండాలి. ఆరాటం ఉంటేనే పోరాటం ఉంటుంది.అప్పుడే జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ సామాజిక లబ్ధి కోసమే ఈ చిరు ప్రయత్నం.6వ నవంబర్2018 రోజున తనువు చాలించినా సాహిత్యరంగం స్మరిస్తున్న ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, కవి, రచయిత ,అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *