ఈటెల వేడి రాష్ట్రమంతా రాజుకుంటుందా?

(వడ్డేపల్లి మల్లేశము)
 హుజూరాబాద్ ఉప ఎన్నిక పుట్టుకే పెట్టుబడిదారి అక్రమ భూదందాల తో అవినీతి ఆరోపణలతో కూడుకున్నటువంటిది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను అవినీతి ఆరోపణల పైన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి అనివార్యంగా ఉప ఎన్నికను సృష్టించారు.అయితే, ప్రభుత్వ దాడికి తట్టుకుని ఎదురుదాడి చేసే విషయంలో ఈటెల విజయవంతమయ్యారు. హుజూరాబాద్ ఎన్నికను  ఆత్మగౌరవ పోరాటంగా మలుచుకున్నారు. ఈటెలను అవినీతి ముద్రతో తొక్కేయాలనుకున్న ఎత్తుగడ పారలేదు.
తెరాస ప్రభుత్వం ఈటెల అవినీతిని రుజువు చేయలేకపోయింది. హుజురాబాద్ ఎన్నిక అవినీతిపరులెవరు అనే ప్రశ్నప్రజలముందు ఉంచింది. దానికి సమాధానం కూడా చెప్పింది. హుజూరాబాద్ ప్రయోగం రాష్ట్రమంతా వ్యాపిస్తుందా? ఈటెల హుజరాబాద్ సందేశాన్ని రాష్ట్రమంతా తీసుకెళ్తారా?
రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలతోనే కాలయాపన చేసి రాజకీయ లబ్ది పొందుతున్నారు. కానీ ఆరోపణలను రుజువు చేసిన దాఖలాలు చాలా తక్కువ. పరిపాలనలో ఏదో ప్రక్షాళన జరుగుతుందని, అవినీతిపరులను ఏరి వేయడం ద్వారా నీతివంతమైన పాలన ప్రజలకు అందుతుందని ఆశించిన ప్రజలకు సర్వత్రా నిరాశే మిగులుతుంది.
గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వంలోని పెద్దలపై రేవంత్ రెడ్డి మిగతా రాజకీయ పార్టీ నాయకులు నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కానీ న్యాయ వ్యవస్థ గాని అవినీతి నిరోధక సంస్థలు గాని జోక్యం చేసుకుని భరతం పట్టిన దాఖలాలు లేవు. ఇయ్యాల సామాన్య ప్రజానీకం ప్రభుత్వాల అవినీతిని రాజకీయ పార్టీల అక్రమార్జనను ప్రక్షాళన చేసి దోషులను జైల్లో పెట్టే దమ్మున్న ప్రభుత్వం కోసం ప్రజా నాయకుల కోసం ఎదురుచూస్తున్నది.
ఈ అంశం అవినీతిలో కూరుకుపోయినట్లుగా ప్రచారం జరుగుతున్న ప్రభుత్వంలోని అనేక మంది పెద్దలకు మంత్రులకు తీగ లాగితే డొంకంతా కదిలినట్లు భయకంపితం కావలసిందే.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఎలా చూడాలి?
హుజూరాబాద్ ఉప ఎన్నికను, ఆ ఎన్నిక కోసం ప్రతిపక్షాలు ప్రభుత్వము చేసినటువంటి అక్రమ ఖర్చు, అవినీతి సొమ్ము పంపిణీ, ప్రభుత్వ అధికార దుర్వినియోగం, ప్రలోభాలకు గురి చేసినటువంటి సందర్భం అంతా ఇంతా కాదు. తరచుగా మనం గత ఐదు మాసాలుగా ప్రతిరోజు విన్న మాట ఆత్మగౌరవానికి అహంకారానికి ఆధిపత్యానికి జరుగుతున్న పోరు గానే. హుజురాబాద్ ఎన్నికను అలా ఎందుకు చూడాలనే వారికి రాజేందర్ గెలుపు సమాధానం.
ఆత్మగౌరవానికి ప్రభుత్వ ఆధిపత్యానికి జరుగుతున్న ఎన్నిక అని అనేక సార్లు సవాల్ చేసినా ప్రభుత్వ పక్షాన ఏనాడు కూడా ప్రతిస్పందన రాలేదు. పైగా ఈటెల రాజేందర్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అని ప్రభుత్వ పెద్దలు దుష్ప్రచారం చేయడం ద్వారా నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఒకవేళ అభివృద్ధి కానీ విషయం నిజమైతే అందుకు కేవలం ఈటెల రాజేందర్ ఒక్కడే బాధ్యుడెలా అవుతాడు. ఏడేళ్ల పాటు ఒక మంత్రి తన సొంత నియోజకవర్గాని నిర్లక్ష్యం చేసినపుడు ఇంటెలిజెన్స్  శాఖ ఏమయింది? ప్రజల్లో అసంతృప్తి ఎందుకు రాలేదు? ప్రతిసారి ఆయన్నే ఎందుకు ప్రజలు గెలిపిస్తున్నారు?  ఒక నియోజకవర్గం అభివృద్ధి కాకపోతే,  ముఖ్యమంత్రి ,మంత్రివర్గం, ప్రభుత్వం మొత్తం కూడా బాధ్యత వహించాలి కదా?
బెడిసి కొట్టిన టిఆర్ ఎస్ ప్రచారం
పై ఆరోపణను చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం మూడు  నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి కనబడుతున్న విషయాన్ని మనం అందరం గమనించవచ్చు. ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్, ఆర్థిక మంత్రి నియోజక వర్గం సిద్దిపేట, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలే. ఇవే ఎపుడూ వార్తల్లో ఉంటాయి.
నిజానికి సిరిసిల్లా, గజ్వేల్, సిద్ధిపేట లాగా విఐపి  నియోజకవర్గంగా పేరు లేకపోయినా,  వాటి  తర్వాత  ఈటెల రాజేందర్ నియోజకవర్గం హుజురాబాద్ లలో మాత్రమే అంతో ఇంతో అభివృద్ధి కనబడుతున్నది. సరే, దీనికి కారణం వారి చేతిలో అధికారం, నిధులు, ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు బలంగా ఉండటమే. మరి అలాంటప్పుడు మిగతా జిల్లాల్లో నియోజకవర్గాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అంతటా ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఉండరు కదా?
అలాంటప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ప్రాంతాల మధ్య వివక్షతను పెంచి పోషించడమే అని చెప్పక తప్పదు. అదే నిజమైతే ప్రభుత్వ తప్పిదము అంతా ఇంతా కాదు. కనుక ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు అని విమర్శించడం బాధ్యతా రాహిత్యమే కాక అసంబద్ధం కూడా. ఈ ఆరోపణలు, ప్రచారం కూడా తెరాస ఓటమికి బలమైన కారణం అని చెప్పక తప్పదు.
ఆత్మగౌరవం హుజురాబాద్ వరకేనా
అక్టోబర్ 30వ తేదీన జరిగినటువంటి హుజురాబాద్ ఉప ఎన్నిక లెక్కింపు రెండవ తేదీ నవంబర్ నాడు జరగగా తెరాస పార్టీ అభ్యర్థి గే ల్లు శ్రీనివాస్ పై ఆత్మగౌరవంతో పేరుతో పోరాడి ఈటెల రాజేందర్ 23 వేల 855 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం అభినందించతగినదే. అయితే తెరాస పార్టీలో గల అంతర్గత కుమ్ములాటలు లేదా ఆత్మగౌరవ రాహిత్యం కారణంగా తను బయటికి వచ్చి నట్లు ఈ ఉప ఎన్నికలను ఆ తర్వాత కూడా ఆత్మ గౌరవం కోసం పని చేస్తానని హామీ ఇచ్చిన ఈటల రాజేందర్ ఆత్మగౌరవాన్ని హుజురాబాద్ ఎన్నిక వరకే కాకుండా రాష్ట్ర పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా ఆలోచించ వలసి ఉంటుంది. ఆత్మ గౌరవం లేదని తెరాస పార్టీ నుండి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరి ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా బిజెపి పార్టీ లోపల కూడా అంతర్గత స్వేచ్ఛా స్వాతంత్ర్యా లతో కూడుకున్న ఆత్మగౌరవాన్ని పునః స్థాపితం చేయడానికి కూడా ఈటల రాజేందర్ పోరాటం చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆధిపత్యము అహంకారం పైన జరిగిన దాడిగా, గెలుపు గా ఈ ఎన్నికను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు గుర్తిస్తారు హర్షిస్తారు.
స్వప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం అవినీతి ఆరోపణల నుండి రక్షణ పొందడం కోసం మాత్రమే ఎన్నికలు, బీజేపీ పార్టీని వాడుకుంటే ఈటల రాజేందర్ ను, బిజెపి పార్టీ ని ప్రజలు హర్షించరు. సమ్మతించరు.
ఎన్నికలు జరిగిన విధానం, ఎన్నికల సంఘం పనితీరు
రాజ్యాంగబద్ధమైన సంస్థ గా పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో పనిచేస్తూ మౌనంగా ఉన్నట్లు హుజురాబాద్ ఎన్నిక సందర్భంగా రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఎన్నికల సంఘం పనితీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తూ పారదర్శకంగా నిజాయితీగా జరపాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం, ప్రభుత్వమే దగ్గరుండి అవినీతి చర్యలను, డబ్బు, మద్యం పంపిణీ అధికారికంగా నిర్వహించినట్లు గా హుజురాబాద్ ఎన్నికను పరిశీలిస్తే సామాన్యులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
రహస్యంగా అప్పుడో ఇప్పుడో ఓటర్ కు రాజకీయ పార్టీలు ఇచ్చే టువంటి ఆర్థిక లావాదేవీలు, ప్రయోజనాలు ఈసారి బాహాటంగానే కవర్లో పెట్టి పంపిణీ చేయడం ఒక ఎత్తయితే తమ ప్రాంతానికి, తమ వర్గాలకు, కొన్ని కుటుంబాలకు అధికార పార్టీ డబ్బులు పంపిణీ చేయలేదని రోడ్ల మీదికి వచ్చి ఆందోళన చేసిన తొలి సంఘటనగా ఈ ఎన్నికలను గుర్తించవచ్చు. అంత జరిగినా చూస్తూ పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, పరిశీలకులు, కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీస స్పందన కూడా లేదు.
అవినీతి ఆరోపణల పైన బర్తరఫ్ కాబడి ఎన్నికకు మూలకారకుడయిన ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు కనీసమైన విచారణకు నోచుకోక ముందే ఎన్నికలను జరపడం పార్టీ మారడం న్యాయవ్యవస్థ, గవర్నర్ గారు స్పందించకపోవడం చకచకా సాగిపోయిన వి. అదే సందర్భంలో ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలతో పాటు అధికార తెరాస ప్రభుత్వ పక్షాన నిధులను వేలాది కోట్లు మంజూరు చేయడమే కాకుండా, అక్రమంగా పంపిణీ చేసిన కోటాను కోట్ల రూపాయలకు అవినీతి అనే ఆరోపణతో అరెస్ట్ చేసి జైలుకు పంపే అధికార యంత్రాంగం ఈ దేశంలో లేకపోవడం చాలా బాధాకరం.
రావలసిన మార్పు ఏమిటి
ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు అక్రమంగా సంపాదించడానికి వేల రెట్లు అవకాశం ఉన్న కారణంగా అక్రమ సంపాదనను ఎన్నికల్లో ప్రచార రూపంలో ఖర్చు చేస్తూ గెలుపు కోసం పాకులాడుతున్నారు. ఇక్కడ మౌలికమైన విషయం ఏమిటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి బద్ధంగా వచ్చే వేతనము తప్ప అక్రమ సంపాదనకు ఎలాంటి ఆస్కారం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం గనుక ఉంటే అక్రమంగా ఎన్నికల్లో ఖర్చు చేయరు. ప్రజలు కూడా ఆశించరు. పంపిణీ చేయడం తీసుకోవడం అనే రెండు ప్రక్రియలు కట్నం ఇచ్చిపుచ్చుకోవడం వంటి సాక్ష్యాలు లేనటువంటి అక్రమ దందా గా మారిపోయిన నేపథ్యంలో ఈసారి అధికార తెరాస పార్టీ ఆరువేల నోట్లను కవర్లో పెట్టి ఇచ్చినటువంటి అనేక సందర్భాలు వీడియోలు, ఫోటోలు, మనకు దర్శనం ఇచ్చినప్పటికీ సంబంధిత బాద్యులు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
ఎన్నో ఆకాంక్షలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న తెరాస పార్టీ ఆకాంక్షలకు నీళ్లు వదిలి, అవినీతికి పట్టం కట్టి, ఎన్నికల కోసమే పని చేస్తూ ఉంటే అధికార దుర్వినియోగం చేసినట్లు కాదా? అవినీతిని ప్రోత్సహించినట్లు లేదా? అలాంటప్పుడు బంగారు తెలంగాణ అనే పేరుతో ప్రచారం చేసుకుంటూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పుకోవడానికి ఈ పార్టీకి ఉన్న అర్హతలు ఏమిటి?
ప్రభుత్వ ప్రతిస్పందన
ఎన్నికల కోలాహలం జరుగుతున్న సందర్భంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రారంభించడానికి మాత్రమే వచ్చి ఆ తర్వాత ప్రధాన ప్రచారంలో పాల్గొనకపోవడం ని గమనించాలి. రాజకీయ పార్టీల అధ్యక్షులు, ప్రధాన బాధ్యుల ద్వారా జరగవలసిన టువంటి ఎన్నికల ప్రచారం భిన్నంగా మంత్రులను నెలల తరబడి హుజరాబాద్ లోనే మకాం వేసేలా ఉంచి అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఉప ఎన్నిక ద్వారా లభించే ఒక్క సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వమే హుజురాబాద్ లో కనిపించిందా! అన్నట్లు తిష్ట వేయడం తలచుకుంటేనే అవమానం. ఇలాంటి , ప్రభుత్వాలు, లక్షణాలు భారతదేశంలో ఏ పార్టీ కూడా అనుసరించకపోవడం ని తెలంగాణ ప్రజలతో పాటు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అవినీతిని ఎండగట్టడానికి ప్రజలు ఐక్యం కావాల్సిన అవసరం ఉప ఎన్నికలు ఎన్నికల సందర్భంగా ఎంతో ఉన్నది.
మంత్రులు, శాసనసభ్యులు ఎన్నికల ప్రచారంలో పెట్రోల్ ,డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచిన బిజెపి పార్టీకి ఓట్లు ఎట్లా వేస్తారు? అని ప్రజలను అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ భర్తీ లు చేయలేక, నిరుద్యోగ భృతి పేరుకే ప్రకటించి, ఎన్నికల కోసం మాత్రమే దళిత బందును ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు అడగడానికి ఏ రకమైన అర్హత కలిగి ఉన్నదో? విజ్ఞులు ఆలోచించాలి
అంతిమంగా…
ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున ఈటెల రాజేందర్ గెలుపు ప్రభుత్వం యొక్క ఆలోచనను, నిర్లక్ష్యాన్ని, లొసుగులను ఎత్తి చూపిన ది. అదే సమయంలో ఈ ఎన్నిక మాకు చాలా చిన్నది. అని ఈ గెలుపు అంత పెద్ద ముఖ్యం కాదని అప్పుడప్పుడు తరచుగా కేటీఆర్ అంటుండేవాడు. అదే మాటను ఈరోజు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా ఇతర దేశంలో నుండి మాట్లాడుతూ ఎన్నికలో ఈ ఫలితం తో ప్రతిపక్ష అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలవడంతో తమకు ఒరిగేది ఏమీ లేదని పలకడం ప్రజాస్వామ్యాన్ని ,గెలుపును, ప్రజాప్రతినిధులను అవమానించడమే అవుతుంది. ఈ ఫలితం తో నైనా ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా ఎన్నికలకు ఇస్తున్న ప్రాధాన్యతను, ఎన్నికల్లో కుమ్మరిస్తున్న మందు డబ్బును సమీక్షించుకొని తన ధోరణి మార్చుకోవాలి. ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్థిని చెప్పు అని ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలు చెప్పు తో సమానం అని అభ్యర్థులను కుక్క అని సంబోధించడం కేవలం అధికార పార్టీకి చెల్లి నది. ఇప్పటికైనా ఆ విధానాలను మార్చుకోకుంటే రాజకీయ రణక్షేత్రం లో ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రజాస్వామిక వ్యవస్థ ను పునరుద్ధరించు కోవడానికి తెలంగాణ ఆకాంక్షను సాధించడానికి పునరంకిత మై ప్రతిఘటిస్తాయి సుమా!
బిజెపి పక్షాన గెలిచిన ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా చట్టసభలలో, చట్టసభల బయట స్పందించవలసి ఉంటుంది. అధికారంలో ఉంటే ఒక మాట ప్రతిపక్షంలో ఉంటే మరొక మాట లాగా విమర్శలకు అసహనం ప్రదర్శిస్తే ప్రజలు అంగీకరించరు .తమ ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం కోసం ప్రజలు కూడా ప్రతి పార్టీని అన్ని స్థాయిలో ప్రశ్నిస్తారు. అందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో తెరాస బీజేపీతో పాటు ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ను కొంత ఉరికి స్తున్న కొత్త నాయకత్వం కూడా ప్రజాస్వామిక ఆశయాల కోసం పని చేయవలసిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్బంధం, అణచివేత, పౌర హక్కులను కాలరాయడం, ప్రశ్నించడాన్ని నేరంగా పరిగణించడం వంటి అప్రజాస్వామిక లక్షణాలను ఆమడదూరం తరిమి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *