జగన్ కు లోకేష్ ఆగ్రహ లేఖ

ఎయిడెడ్ స్కూల్స్ మూసివేత‌ అనాలోచిత‌, మూర్ఖ‌పు నిర్ణ‌యం అని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ రాశారు. అది ఉన్నది ఉన్నట్లు ఇక్కడ ఇస్తున్నాం.
అయ్యా!
ముఖ్య‌మంత్రి గారూ… మీ ప్ర‌భుత్వం తీసుకున్న‌ అనాలోచిత‌, మూర్ఖ‌పు నిర్ణ‌యాల‌తో ఎయిడెడ్ స్కూళ్లు డెడ్ అవ్వ‌డ‌మే కాదు… లక్షలాది మంది విద్యార్థుల భ‌విష్య‌త్తుకి మ‌ర‌ణ‌శాస‌నం కావ‌డం చాలా విచార‌క‌రం. అన్ని వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేయాల‌నేది పాల‌కుడి ల‌క్ష్య‌మైతే… ఒకే ఒక్క విద్యా వ్య‌వ‌స్థ‌ని ధ్వంసం చేస్తే చాలని త‌త్వ‌వేత్త మాకియ‌వెల్లి అన్నారు. మీలాంటి విధ్వంస ఆలోచ‌న‌లున్న పాల‌కుల గురించి హెచ్చ‌రించి చెప్పిందే మీరు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. విద్యా వ్య‌వ‌స్థ‌పై మీరు చేస్తోన్న దాడి చూస్తుంటే, అన్ని వ్య‌వ‌స్థ‌ల ధ్వంసానికి తెగ‌బ‌డుతున్న‌ట్టే. అమ్మ ఒడి ఇవ్వ‌డానికి ..కొడుకు బ‌డిని బ‌లిపీఠంపై ఎక్కించ‌డం భావ్య‌మేనా అని నేను ప్ర‌శ్నిస్తున్నాను. గొప్ప‌ల‌కు పోయి, త‌ప్పులు చేస్తూ, అప్పుల్లో కూరుకుపోయి ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీల భూములు, విద్యా సంస్థల ఆస్తులు చేజిక్కించుకునేందుకు మీరు తీసుకున్న ప్ర‌మాద‌క‌ర‌మైన నిర్ణ‌యంతో వేలాది విద్యార్ధుల భవిష్యత్ నాశ‌నం అవుతోంది. మొన్న వైజాగ్, నిన్న కాకినాడ, నేడు గుంటూరు, రేపు మరో ప్రాంతం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠ‌శాల‌ల మూసివేత‌కు వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులు రోడ్లెక్కి నిర‌స‌న తెలియ‌జేస్తోన్న ..ఇంకా మీ మూర్ఖ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకుంటున్నారంటే ఏమ‌నుకోవాలి?
టీఆర్ఎస్ ప్లీన‌రీలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా మీరు చేస్తోన్న విధ్వంసాన్ని “క‌ల‌లు క‌నే ధైర్యం లేని ద‌య‌నీయ‌స్థితిలో ఆంధ్రులున్నారు“ అని ఎద్దేవ చేయ‌డం ముఖ్య‌మంత్రిగా మీకు అవ‌మానం అనిపిస్తుందో లేదో కానీ, ఐదుకోట్ల ఆంధ్రుల‌కు మాత్రం ఆ వ్యాఖ్యలు తీర‌ని అవ‌మాకరంగా భావిస్తున్నారు.
మీ ఎయిడెడ్ సూళ్ల ఆస్తుల‌పై మీ క‌న్నుప‌డ‌టంతో అవి మూసివేత‌కు దారి తీసి రాష్ట్ర వ్యాప్తంగా 2,203 పాఠశాలల్లో 1,96,313 మంది విద్యార్ధులు, 182 జూనియర్ కాలేజీల్లో 71,035 మంది విద్యార్ధులు, 116 డిగ్రీ కాలేజీల్లో 2.50 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ ప్రశార్ధకం కానుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ సంస్థ‌ల‌లో ప్ర‌భుత్వ‌ వేతనాలతో పాఠశాలల్లో 7,238 మంది, జూనియర్ కళాశాలల్లో 721, డిగ్రీ స్థాయిలో 1,347 మంది బోధన సిబ్బంది పని చేస్తున్నారు. ప్ర‌భుత్వానికి ఆస్తులు-సిబ్బందిని అప్ప‌గించ‌ని యాజ‌మాన్యాలు ఇలా మూసివేత ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంటే అటు విద్యార్థులు, ఇటు సిబ్బంది ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైతే, ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.
ఎయిడెడ్ విద్యా సంస్థలను డెడ్ చేసి, వాటిపరిధిలోని ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకొని, 90 శాతం మంది బడుగు, బలహీన విద్యార్థులకు చ‌దువుని దూరం చేసే మీ కుయుక్తుల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. దీని ఫ‌లిత‌మే వేలాది మంది రోడ్ల‌పైకి వ‌స్తూ ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఎన్నోఏళ్ల నుంచి లక్షలాది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థలను ఆ నిరుపేద‌ల‌కు దూరం చేయ‌డాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. తాము అనుకున్న‌దే నివేదిక‌లా ఇచ్చే తూతూ మంత్ర‌పు క‌మిటీని వేసి, వారు ఎవ‌రితోనూ చ‌ర్చించ‌కుండానే ప్ర‌భుత్వ పెద్ద‌లు కోరిన నివేదిక ఇవ్వ‌డం చాలా అంశాల మాదిరిగానే ఎయిడెడ్ విష‌యంలోనూ జ‌రిగింద‌ని తేల‌తెల్ల‌మైంది. ఎయిడెడ్ ఆస్తుల‌పై క‌న్నేసిన ప్రభుత్వం నియమించిన రత్న కుమారి కమిటీ ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారితల్లిదండ్రులతో చర్చలు జ‌ర‌పకుండానే ప్ర‌భుత్వం కోరిన నివేదిక ఇచ్చింద‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ జ‌ర‌పాల‌ని కోరుతున్నాను. ఈ నివేదిక ఆధారంగా చేసుకుని జీవోనెం 42, 50, 51 జీవోలివ్వడం ముమ్మాటికీ ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల్ని డెడ్ చేసి ఆ ఆస్తులు స్వాధీనం చేసుకునే కుట్ర‌గానే తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మూసివేత‌కు సిద్ధ‌మైన‌ ఎయిడెడ్ అధ్యాపకులను ప్రభుత్వ డిగ్రీకళాశాలలకు బదిలీచేయాలని నిర్ణయించిన తరువాత, అంతకుముందు అక్కడపనిచేసే దాదాపు 750మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను అకస్మాత్తుగా తొలగించడం మ‌రో దారుణ‌మైన నిర్ణ‌యం. అటు ఎయిడెడ్ అధ్యాప‌కులు గాల్లో వుంటే, కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్లు త‌మ ఉద్యోగాల్నే కోల్పోయారు. కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల‌కు ప‌ర్మినెంట్ చేస్తామ‌ని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన మీరు వారి కొలువుల‌కే ఎస‌రు పెట్ట‌డం తీర‌ని అన్యాయం చేయ‌డ‌మే అవుతుంది.
మాకు అమ్మ ఒడి వద్దు మా పిల్ల‌లు చ‌దువుకునేందుకు పాఠశాల మాకు కావాలి అంటోన్న విద్యార్ధుల త‌ల్లిదండ్రుల‌కు ఏం స‌మాధానం చెబుతారు సీఎం గారూ! మేం చ‌దువుకోవ‌డానికి బ‌డి లేకుండా చేయ‌డం న్యాయం కాద‌య్యా అంటూ రోడ్ల మీదకు వచ్చి రోదిస్తున్న పిల్ల‌ల‌కు ఏం భ‌రోసా ఇస్తారు ముఖ్య‌మంత్రి గారూ? ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల ఆస్తుల‌పై క‌న్నేసిన మీరు, ల‌క్ష‌లాది మంది విద్యార్థుల భ‌విష్య‌త్తు గురించి ఆలోచించ‌క‌పోవ‌డం చాలా దుర్మార్గ‌మైన నిర్ణ‌యం. ఎయిడెడ్ సంస్థ‌ల్ని య‌థావిధిగా కొన‌సాగించాలి. ఏ ఒక్క స్కూలూ మూత‌ప‌డకుండా చూడాలి. తొల‌గించిన కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. అదే విధంగా ఏ ఒక్క పేద విద్యార్ధికి ప్రభుత్వం చదువును దూరం చేసి నష్టపరిచినా చూస్తూ ఊరుకోం.. నష్టపోయిన వారికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది.
ఇట్లు
నారా లోకేష్‌
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *