హైదరాబాద్ లో ఇల్లు కొన్నమాజీ సిఎం కిరణ్

తెలంగాణ విడిపోయి, ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం ఏర్పడి దాదాపు ఏడేళ్లు దాటినా  ఆ రాష్ట్రం రాజకీయ నాయకులకు సొంత రాష్ట్రం ఆకర్షణీయంగా  కనిపించడం లేదు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం ఒకబలమయిన కారణం కావచ్చు. అందుకే ఆంధ్ర రాజకీయనాయకులు ఆస్తులను ఇంకా హైదరాబాద్ లోనే కొంటున్నారు.  అమరావతి ఆకర్షణీయంగా లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు కట్టాలనుకున్న కలల రాజధాని తయారువుతుందో లేదో తెలియదు. ఇపుడు ముఖ్యమంత్రి జగన్ రాజధానిని విశాఖకు తరలించే పనిలో ఉన్నారు. కాకపోతే, కోర్టుల జోక్యం వల్ల రాజధాని తరలింపు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయింది. రాజధానిని తరలించవద్దని ఆ ప్రాంతంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇపుడు రాజధాని తరలి వెళ్లక, వైజాగ్ కాక ఆంధ్ర పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రాజధానిపోతుందేమోనని అమరావతిలో భయం, రాజధాని రాదేమోనని వైజాగ్ లో అనుమానం… ఇదీ ఆంధ్ర పరిస్థితి.

రాజకీయనాయకుల సొంతవూరు ఏదయినా మకాం రాజధానిలో ఉంటుంది. రాజధాని నిజమయిన పవర్ సెంటర్. ఇలాంటి పవర్ సెంటర్ ఇపుడు ఆంధ్రాలో లేదు. రాజధాని కాని చోట, అదెంత పెద్ద ఊరైనా రాజకీయ నాయకులు సెటిల్ కాలేరు. పవర్ ఉన్న వాళ్లకు, పవరో లోకి రావానుకుంటున్నవాళ్లకు, పవర్ పోయిన వాళ్లకు, పవర్ నుంచి దూరంగా జరిగినవాళ్లకు రాజధానియే కావాలి.  ఇలాంటి రాజధాని లేకపోవడంతో ఇపుడు ఇద్దరు ప్రముఖులు ఆస్తులను పక్కనున్న హైదరాబాద్ లోనే కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరిముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  హైదరాబాద్ ఖరీదైన ఇల్లుకొన్నారు. బంజారా హిల్స్  ప్రాంతంలో రు. 11 కోట్లు పెట్టి ఆయన ఈ ఇల్లును కొన్నారు. 1147చదరపు గజాలలో కట్టిన ప్రాపర్టీ ఇది. ఇందులో బిల్ ఆప్ ఏరియా2,877 చదరపు అడుగులు. ఈ భవనాన్ని ఆయన సేబులప్రాపర్టీ హోల్డిండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసినట్లు మనీ కంట్రోల్ రాసింది.

కిరణ్ కుమార్ రెడ్డి వార్తల్లో లేక చాలా రోజులయింది. తెలంగాణ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి అయిన తన అభీష్టానికి వ్యతిరేకంగా  రాష్ట్ర విభజన జరగడంతో ఆయన తట్టుకోలేకపోయారు. కాంగ్రెస్ నుంచి దూరం జరిగారు. అయితే, మరొక పార్టీకి దగ్గిర కాలేక పోయారు.  హఠాత్తుగా ముఖ్యమంత్రి అయి, హఠాత్తుగా కనుమరుగయిన నాయకుడాయన. నిజానికి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాగా పనిచేస్తున్నాడని పేరు తెచ్చుకున్నాడు. 2008లో ప్రతిపాదనకొచ్చి, మూలన పడిన ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టు మెంటు  రీజియన్ (ITIR) ప్రాజక్టు దుమ్ముదులిపి  2012లో తాను సిఎం గా ఉన్నపుడు డిపిఆర్ తయారు చేసి కంద్రానికి పంపారు. అదింకా పరిశీలనలో ఉండగానే తెలంగాణ వచ్చింది. నిజానికి ఈ ప్రాజక్టు చాలా మంచిదని టిఆర్ ఎస్ ప్రభుత్వం కూడా గురించింది. ఐటి మంత్రి కెటిరామారావు దీనిని పునరుద్ధరించాలని కేంద్రానికి లేఖ కూడా రాశారు.

ఇలాంటి ప్రాజక్టులతో ప్రశంసలందుకుంటున్నపుడు రాష్ట్ర విభజన ఆయన రాజకీయ జీవితాన్ని ఉన్నట్లుండి ఛిద్రం చేసింది. ఆయన ఎక్కడా కనిపించకుండా కనుమరుగయ్యారు. తర్వాత కాంగ్రెస్ లోకి తిరిగొచ్చినా, మనిషి మాత్రం పత్తా లేకుండా పోయారు. ఆయన తమ్ముడు టిడిపిలో చేరారు.

రాష్ట్ర విభజన వల్ల రాజకీయాలకు దూరమయిన వాళ్లలో ఆయన ప్రముఖుడు. అపుడపుడు మెరుపులాగా ఎక్కడో కనిపించి చిన్న వార్త అవుతుంటారు. ఇపుడు మనీ కంట్రోల్ న్యూస్ తో మళ్లీ వార్తల్లోకి వచ్చారు.

కిరణ్ కుమార్ కొన్న  ప్రాపర్టీ  2021 సెప్టెంబర్ 16 న రిజిస్టర్ అయిందని  ఈ వెబ్ సైట్ రాసింది.

ఇదే విధంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్ జూబిలీ హిల్స్లో ప్రాపర్టీకొన్నారు.  676 గజాలలో స్థలంలో కట్టిన బంగళా అది. Zapkey.com  సేకరించిన వివరాల ప్రకారం ఈ ప్రాపర్టీ ధర రు. 12 కోట్లు అని ఈ సైట్ రాసింది. ఉండటానికి కొన్నా, భవిష్యత్తులో మంచి ధర వస్తుందని కొన్నా, ఆంధ్రా నాయకులకు హైదరాబాద్  మీద మక్కువ పోలేదు. ఆంధ్రమీద నమ్మకం పెరగడం లేదని ఈ ఇద్దరు రాజకీయ ప్రముఖుల  కొనుగోళ్లతో అర్థమవుతుంది..

పవన్ కల్యాణ్ జనసేన పార్టీఅధినేత. అధికారంలోకి వచ్చేందుకు ఆయన చాలా ప్రయత్నిస్తున్నారు. మొన్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా పరాజయం పాలయినా ఆయనకు అధికారంలోకి వస్తామనే ధీమా ఉంది. ఈ మధ్య ఆయన రాజకీయంగా కొంత చురుకయ్యారు. ఆంధ్రలో తుఫాన్ సృష్టిస్తానంటున్నారు.  ఇలా ఆంధ్రలో అధికారంలోకి రావాలనుకుంటూ హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనడం కొంత వింతగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *