సిద్దిపేట ఒక్కటి అభివృద్ధి చెందితే చాలా?

(వడ్డేపల్లి మల్లేశము)

సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలను మాత్రమే అభివృద్ధిచెందిన ప్రాంతాలుగా అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఆమోదించడం, ప్రచారం చేయడం ఈ మధ్య ఎక్కువయింది. ఈ ప్రచారంలో జిల్లా కలెక్టర్లు అంతర్భాగంగా ఉండడం ఇటీవలి కాలంలో పరిపాటి అయిపోయింది.అంటే మిగతా నియోజకవర్గాలు అభివృద్ధి చెందలేదనేనా అర్థం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురైందని మాట్లాడిన మన పాలకులే తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ  మూడు నియోజకవర్గాల మాత్రమే అభివృద్ధి చేయడంలో ఆంతర్యము ఏమిటి?

ఇతర ప్రాంతాలకు, ఈ మూడు నియోజవర్గాలకు వ్యత్యాసం కళ్ళకు కొట్టొచ్చినట్లుగా  కనపడుతున్నది. ఈ విషయాన్ని మాటవరసకి కూడా ప్రస్తావించడానికి బుద్ధిజీవులు, విద్యార్థులు, మేధావులు భయపడుతున్నారా? ఈ భాషను ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించక పోవడం విచిత్రం.

ప్రపంచం చూపు ను ఆకర్షిస్తున్న సిద్దిపేట అంటూన్నకలెక్టర్

సిద్దిపేట జిల్లా అభివృద్ధికి సంబంధించిన  ఒక సమావేశంలో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి  అభివృద్ధి గురించి ప్రపంచమంతా సిద్దిపేట వైపు చూస్తున్నదని అభివృద్ధికి సిద్దిపేట చిరునామాగా మారింది అని ప్రశంసించారు.

జిల్లాలో భూసేకరణ చేసి పలు ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు అన్ని వసతులతో కూడిన మోడల్ కాలనీలను అభివృద్ధి చేయడమనేది స్వయాన ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి పర్యవేక్షణలో జరగుతున్నదని కలెక్టర్ విస్మరిస్తున్నారా?  అయినా సరే, ఆయన ఆనందం వ్యక్తం చేయడాన్ని ఏ రకంగా చూడాలో రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ లాగా రాష్ట్రంలోని ఇతర జిల్లా కలెక్టర్లు ఎందుకు ఆనందం వ్యక్తం చేయడం లేదు? అక్కడ ముఖ్యమంత్రి చొరవ,  జిల్లా మంత్రి పర్యవేక్షణ ఎందుకు లేదు?

కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ ప్రాధాన్యతనిచ్చి మిగతా అన్ని జిల్లాలకు ఈ వివక్షత కొనసాగితే సంభవించే పరిణామాలకు స్థానిక మంత్రులు బాధ్యులు కాక తప్పదు.

సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలోని కావా?

సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సిద్దిపేట లో మంత్రి హరీష్ రావు గజ్వేల్ నియోజక వర్గానికి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనుక ఆ ప్రాంతాలకు మాత్రమే అధిక నిధులు కేటాయించడం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దానికి తోడు సిద్దిపేట జిల్లా వైపు ప్రపంచం చూస్తున్నదని మాట్లాడిన జిల్లా కలెక్టర్ మాటలు అభివృద్ధిని తెలిపేవి కాకుండా మిగతా ప్రజానీకాన్ని కించ పరిచేదిగా ఉన్నది.  ముఖ్యమైన శాఖలు ఉంచుకున్న మంత్రులు అధినేత అండతో తమ ప్రాంతాలను  అభివృద్ధి చేసుకోవడం,  మిగతా నియోజకవర్గాల ప్రజల మీద ఇలాంటి శ్రద్ధ చూపక పోవటాన్ని ఎలా చూడాలి?

ముఖ్యమంత్రి స్వగ్రామం చింతమడక లో ప్రతి ఇంటికి పది లక్షల రూపాయల ని ప్రకటించడం అమలు చేయడం సబబేనా?  1,2 గ్రామాలను మాత్రమే ముఖ్యమంత్రి దత్తత తీసుకొని ఊరంతా భోజనాలు పెట్టి అభివృద్ధికి పూనుకుంటే మిగతా ప్రాంతాల ప్రజానీకం మాటేమిటి?

ముఖ్యమంత్రి గానీ మంత్రులు కానీ రాష్ట్రం మొత్తానికి బాధ్యులు కానీ ఒక ప్రాంతానికి కాదు అనే విషయాన్ని వీళ్లకి తెలియదా? ఇక ముఖ్యమంత్రి మంత్రుల కనుసన్నల్లో పని చేసే కలెక్టర్లు అధికారులు అనేక ప్రయోజనాలను ఆశించి అభివృద్ధి గురించి ప్రకటనలు చేయడం కూడా వాంఛనీయం కాదు.

హుస్నాబాద్ లో  ఎంజరిగిందో చూడండి

మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమై, అసెంబ్లీలో ఏనాడు కూడా నిలబడి ప్రశ్నించని, మాట్లాడని శాసనసభ్యులు అనేక మంది ఉన్నారు. ఇక అలాంటి వారు నిధులు ఎలా తెస్తారు? ఎలా అభివృద్ధి సమకూర్చుతారు? ఉదాహరణకు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో అభివృద్ధి గురించి ఒక సారి నిరసన వ్యక్తమైంది. బస్సు డిపో వైపుగా ఉన్న రోడ్డు గురించి ప్రజలు డిమాండ్ చేశారు.తన పర్యటన సందర్భంగా ఈ  చిరకాల డిమాండ్ మీద మంత్రి స్పందించారు. రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు నిర్మాణం జరిగిపోయింది. శాసన సభ్యుని చొరవతో ఇది జరగలేదని అందరికీ తెలిసిపోయింది.   అప్పటి నుండి ఈ రోడ్డును మంత్రి నిర్మించారు అనే ప్రచారం జోరుగా కొనసాగడం శాసనసభ్యుని స్థాయిని దిగజార్చడమే కదా?

ఈ అభివృద్ధి అన్ని ప్రాంతాలకు అవసరం లేదా?

పైన తెలిపిన మూడు నియోజకవర్గ కేంద్రాలలో రోడ్లు, చెట్లు, లైట్లు, ఆస్పత్రులు, ఇతర కార్యాలయాల అభివృద్ధి చూసి మిగతా జిల్లాల అభివృద్ధిని అంచనా వేసినప్పుడు చాలా తేడా కనిపిస్తుంది. ఆ ప్రాంతాల శాసనసభ్యులు ప్రశ్నించే వాళ్ళు కాదు. నిధుల కోసం నిలదీసే వాళ్లు కాదు. మాట్లాడితే మర్యాద పోతుందనుకునేవారితో,మాట్లాడానికే భయపడే వారితో అభివృద్ధి ఎలా సాధ్యం.

ఎమ్మెల్యేగా హరీష్ రావు సిద్దిపేటను మాత్రమే అభివృద్ధి చేసి  స్థానిక ప్రజల ఆదరాభిమానాలు పొందవచ్చు. కాని ఆయన సిద్దిపేట ఎమ్యేల్యే మాత్రమే కాదు, రాష్ట్రానికి ఆర్థిక మంత్రి.  పదే పదే సిద్ధిపేట అభివృద్ధి ప్రస్తావన తీసుకువచ్చి మిగతా ప్రాంతాల వారికి ఏ సందేశమిస్తున్నారు.

సిద్దిపేట ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి భూ నిర్వాసితుల సమస్యలు పోరాటాలు పెద్ద ఎత్తున జరిగినప్పుడు ప్రజలను ఉద్యమకారులను అరెస్టు చేసి గొంతు నొక్కిన సందర్భం కూడా ఉంది. సిద్దిపేట లో ఉన్న కోమటి చెరువు అనే చిన్న కుంట వద్ద అంత అభివృద్ధి జరిగినప్పుడు హుస్నాబాద్  ఎల్లమ్మ చెరువు  జలాశయానికి ఆ అదృష్టం ఎందుకు దక్కలేదు. రాష్ట్ర మంతిగా హుస్మాబాద్ ప్రజలకు  హరీష్ రావు ఏ సంజాయిషీ ఇస్తారు.

ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం

“అద్దాలమేడలు రంగుల గోడలు మాత్రమే అభివృద్ధి కాదని నైతిక అభివృద్ధియే దేశాభివృద్ధి” అని గాంధీ మహాత్ముడు ఏనాడో చెప్పాడు. అదే మాదిరిగా రోడ్లను చెట్లను లైట్లను రంగుల గోడలను అభివృద్ధి గా చూపే ఈ అసమ అభివృద్ధి కూడా వాంఛనీయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి లేక నిరుద్యోగులు నిర్వీర్యం అవుతుంటే పేదరికం విలయ తాండవం చేస్తూ అసమానతలు అంతరాలు నిలువెల్లా కొనసాగుతుంటే ఒకరిద్దరు మంత్రులు వాళ్ళ ప్రాంతాలకు చేసుకునే అభివృద్ధి చౌకబారు రాజకీయమే అవుతుంది. ప్రజల ఓపికని పరీక్షించ కుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే స్థిరమైన ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తే తప్పా ప్రత్యేక ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి అర్థం ఉండదు. ఆ ఉద్యమానికి సార్థకత చేకూరదు. ప్రభుత్వమే తమ చర్యలను పునరాలోచన చేసుకొని సుదూర లక్ష్యమైన సమ సమాజంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా తమ అభివృద్ధిని సాధించడానికి పూనుకుంటే ప్రజలు సంతోషిస్తారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

(ఈ వ్యాసకర్త కవి,రచయిత,సా.రా.విశ్లేషకుడు.ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్.జి.సిద్దిపేట.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *