రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం” ను అక్టోబర్ 1, 2021 న దత్తమండలాలకు రాయలసీమగా నామకరణం చేసిన చారిత్రక నంద్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
నంద్యాలలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం నుంచి సంజీవనగర్ జంక్షన్ వరకు ర్యాలిగా బయలుదేరి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు Y.N.రెడ్డి ,ఏర్వ రామచంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్యలు మాట్లాడుతూ…
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతం వివక్షకు గురి అవుతున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర సాధనకు 1931 లోనే బీజం పడిందని అన్నారు. రాయలసీమ జిల్లాల సహకారం లేనిదే ఆంధ్ర రాష్ట్ర సాధన జరిగదని భావించిన ఆంధ్ర మహాసభ పెద్దలు, నూతన తెలుగు రాష్ట్రంలో రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తామని “శ్రీబాగ్ ఒడంబడికను” నవంబర్ 16, 1937 న చేయడం జరిగిందని తెలిపారు.
శ్రీబాగ్ ఒడంబడికలో కీలకమైన అంశాలు:
1.రాజధాని/ హైకోర్టు ను రాయలసీమ లో ఏర్పాటు చెయ్యడం, 2.కృష్ణా తుంగభద్ర జలాలను రాయలసీమ సంపూర్ణ అవసరాల కోసం వినియోగించడం. ప్రత్యేక తెలుగు రాష్ట్రంలో శ్రీబాగ్ ఒడంబడిక అమలు జరిగి రాయలసీమ అభివృద్ధి చెందుతుందని భావించి, రాయలసీమ వాసులు ఆంధ్ర నాయకులతో కలసి అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1, 1953 న సాధించారన్నారు.
కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం 1953 నుండి 3 సంవత్సరాలు కొనసాగింది. అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంతో జత కలవడంతో నవంబర్ 1, 1956 లో హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుండి జూన్ 2, 2014 లో విడిపోవడంతో అక్టోబర్ 1 1953 లో సాదించుకున్న భూభాగంతో ఆంధ్రప్రదేశ్ నేడు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో ఏర్పడిన తెలుగు రాష్ట్రంలో రాయలసీమ హక్కుల పత్రం లోని ఏ ఒక్క అంశాన్ని ఈ రోజు వరకు అమలు పరిచకపోవడంతో రాయలసీమ ఆర్థికంగా, సామాజికంగా మరింత వెనుకబడి పోయిందని తమ ఆవేదనను వ్యక్తపరిచారు.
1953 లో ఏర్పడిన తెలుగు రాష్ట్రం భూభాగాలుతోనే నేటి అంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతున్నందన్న, ఈ రాష్ట్ర అసలైన అవతరణ దినం అక్టోబర్ 1వ తేదీనే. అయితే గత ప్రభుత్వం తెలంగాణా అంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన జూన్ 2 న అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహించిందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తెలంగాణా ఆంధ్ర రాష్ట్రంతో కలసిన నవంబర్ 1 న అంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్విహిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం శ్రీ బాగ్ ఒడంబడికను గౌరవిస్తున్నామని శాసనసభ సాక్షిగా ప్రకటించినా, ఆ దిశగా కార్యాచరణ చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న నిర్వహించక పోవడం, తద్వారా రాష్ట్ర అవతరణకు కీలకమైన శ్రీ బాగ్ ఒడంబడికను ప్రజల స్మృతి పధం నుండి తుడిచి వేసే చర్యగా రాయలసీమ వాసులు భావిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సంధర్భంగా అక్టోబర్ 1 ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేసారు. తెలుగు రాష్ట్ర సాధనకు కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని, అన్ని రాజకీయ పార్టీలు అక్టోబర్ 1 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించేలాగా, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందటానికి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో పట్నం రాముడు, మునగాల చంద్రశేఖర్ రెడ్డి, రాఘవేంద్ర గౌడ్, మహమ్మద్ పర్వేజ్, జూపల్లి గోపాల్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, భీమశంకర్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, మనోజ్ కుమార్ రెడ్డి, రైతునగరం భాస్కర్ రెడ్డి, తూము శివారెడ్డి, షణ్ముకరావు, M.V.రమణారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.