ఓ మరపురాని మధుర రాజకీయ జ్ఞాపకానికి నేటికి 30 ఏళ్ళు

*ఏలూరు నుండి నెల్లిమర్లకి కార్మికోద్యమ విస్తరణ తీరు భావి కార్మికోద్యమాల నిర్మాణ ప్రయత్నాలకి స్ఫూర్తి.
(ఇఫ్టూ ప్రసాద్- పీపీ)
ముప్పై ఏళ్ళ క్రితపు ఓ సంఘటన కార్మికోద్యమ చరిత్రలో మరపురానిది. అది గత సంస్మరణకే పరిమితం కాదు. రేపటి కార్మికోద్యమ గమనానికి ఉపకరిస్తుంది. విలువైన పాఠాల్ని అందిస్తుంది.
నేటికి సరిగ్గా 30 ఏళ్ల క్రితం 30-9-1991వ తేదీ. అది ఏలూరులో ఇఫ్టూ అనుబంధ జూట్ మజ్దూర్ యూనియన్ ఆఫీసు. జూట్ మిల్లు సమీపాన పాత సత్రంలో మేడ మీద చిన్న అద్దె గది. చిక్కగా కూర్చుంటే, అతి కష్టంగా ఇరవైమంది కూర్చోవచ్చు. సాయంత్రం సుమారు 7 గంటల సమయం. ఇఫ్టూ కార్యకర్తలు చిక్కగానే కూర్చున్నారు. ఓ విషాద సందర్భంలో ఇఫ్టూ జూట్ కామ్రేడ్స్ కలయిక..
దానికి ఒక్కరోజు ముందు 29-9-1991న ప్రముఖ విప్లవ కార్మికనేత శంకర గుహ నియోగిని పెట్టుబడిదారీ వర్గపు కిరాయి హంతక ముఠా హత్య చేసింది. దానిపై సంస్మరణ సమావేశమది. ప్రసంగం పూర్తిచేశా. దాని మీద చర్చ సాగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి గుమ్మం వద్ద కొద్దిసేపటి నుండి నిలబడి వున్నాడు. ఆ సమావేశం ముగిశాక ఏలూరు జూట్ కామ్రేడ్స్ లో ఒకరి ద్వారా తాను నెల్లిమర్ల నుండి వచ్చిన విషయాన్ని తెలిపాడు. ఆయనే మొకర వెంకట రమణ! నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికుడు.
ఏలూరు జూట్ మిల్ లో ఉత్తరాంధ్ర మూలాలు గల కార్మికవర్గం ఉంది. ఇఫ్టూ జూట్ క్యాడర్ లో కూడా ఉంది. ఆనాటి సంస్మరణ సమావేశానికి హాజరైన వారిలో కూడా నెల్లిమర్ల ప్రాంతీయులు వున్నారు. K. పొలారి, K. అప్పారావులతో పాటు నెల్లిమర్ల ప్రాంతీయులైన కొందరు ఇఫ్టూ కార్యకర్తల భాగస్వామ్యంతో ఆ నెల్లిమర్ల కార్మికుడితో చాలాసేపు మాట్లాడాం. ఐతే అదేదో ఆషామాషీ వ్యవహారం కాదు. అది కార్మికోద్యమానికి కొత్త రకం పరీక్షను పెట్టింది.
ఏలూరు జూట్ మిల్ నుండి నెల్లిమర్ల జూట్ కార్మికరంగంలోకి ఇఫ్టూ నాయకత్వాన్ని తీసుకెళ్లే కోరికను వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత ఆకాంక్షతో ఏలూరురాలేదు. నెల్లిమర్ల జూట్ కార్మికవర్గంలో క్రియాశీల పాత్రధార్లుగా, ప్రభావశీలురుగా గుర్తింపు పొందిన బృందపు సమిష్టి నిర్ణయం మేరకి ఏలూరు వచ్చాడని తెలిసింది. నెల్లిమర్ల జూట్ మిల్లు యాజమాన్యానికి, దానితో కుమ్మక్కైన స్థానిక ఫ్యూడల్ పెత్తందారీ రాజకీయ నాయకత్వానికి తెలియకుండా పై బృందం చర్చించుకుని, వెంకట రమణను రహస్యంగానే ఏలూరుకు పంపింది. అందుకే కాబోలు, “గోడకు చెవులు వుంటాయేమో” అన్నంత అప్రమత్తతను ఆరోజు కనపరిచాడు.
నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికవర్గం అంతవరకూ ప్రధాన రాజకీయ పార్టీల వెనక రెండు వర్గాలుగా చీలిఉంది. దాన్ని ఆసరా చేసుకుని స్థానిక ఫ్యూడల్ రాజకీయ శక్తులు జూట్ మిల్ యాజమాన్యానికి సేవ చేసి పెడుతున్నాయి. కార్మికవర్గం తీవ్రంగా నష్ట పోతోంది. వరస లాకౌట్ల ద్వారా కార్మికుల దుస్థితి జీతం కోతలకి సైతం దారి తీసింది. అది వారి మధ్య ఐక్యతకు బీజం వేసింది. అదే వెంకటరమణ నాడు ఏలూరు రాకకు మూలం.
అప్పటికే గత పదేళ్లుగా ఏలూరు జూట్ కార్మికుల్లో ఉద్యమ నిర్మాణ కృషి సాగుతోంది. లాకప్పులు, జైళ్లు, లాఠీ చార్జీలు, గూండా చట్టాల ప్రయోగం వంటి దశల్ని అధిగమించి ఇఫ్టూ నిలదొక్కుకుంది. ఆ క్రమంలో 5-10-1990 నాటి గుర్తింపు ఎన్నికల్లో ఇఫ్టూ యూనియన్ ని 1400 ఓట్ల ఆధిక్యతతో ఏలూరు జూట్ కార్మికులు గెలిపించుకున్నారు. నాటి నుండే నెల్లిమర్ల జూట్ కార్మికవర్గం పై ఏలూరు జూట్ ఉద్యమ ప్రభావం పడుతూ వచ్చింది. ఐతే మరోసారి 1991 వేసవిలో నెల్లిమర్ల జూట్ మిల్లుకు అక్రమ లాకౌట్ వేసి, జీతం కోతతో తెరిచిన నేపథ్యం నెల్లిమర్ల కార్మికుల దృష్టిని ఏలూరు పైకి మళ్లించింది. అంతవరకు చీల్చి ఉంచిన పార్లమెంటరీ రాజకీయ సంకుచిత అవరోధాల్ని అధిగమించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యం వారిని తాత్కాలికంగా ఐక్యం చేసింది. పై రెండు రాజకీయ స్రవంతులకు చెందిన విశ్వసనీయులు రహస్య సమావేశం జరిపి, తమ పరస్పర ఐక్యతకు ప్రతినిధులుగా ఉరిటీ ఉమామహేశ్వర్ రావు @ ఉమా అండ్ దంతులూరి అప్పలరాజుల్ని ఎంపిక చేసుకున్నారు. ఏలూరు జూట్ కార్మికోద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇఫ్టూ నాయకత్వాన్ని నెల్లిమర్ల ఆహ్వానించాలని ఏకగ్రీవ నిర్ణయం చేశారు. (ఉమా అప్పటికే ఉద్యమ అనుభజ్ఞుడు) ఆ నిర్ణయం మేరకు వెంకట రమణ ఏలూరు రావడమైనది.
ముప్పై ఏళ్ళ క్రితం ఇదే రోజు చిన్నగదిలో వెంకట రమణతో మాట్లాడిన మాటలే చరిత్రాత్మకమైన వీరోచిత నెల్లిమర్ల కార్మిక పోరాటానికి ఓ పునాది రాయి వేస్తుందని నాడు ఊహకు కూడా అందనిది. ఐదుగురి కార్మిక యోధుల అమరత్వంతో భారత కార్మికోద్యమ చరిత్రలో అదో పుటని లిఖిస్తుందని నాడు ఎవరూ ముందస్తు అంచనా వేయలేనిది.
వెంకట రమణతో మాట్లాడిన కొద్ది రోజులకే ముందస్తు నిర్ణయం మేరకి 1991 అక్టోబర్ మొదటి వారంలో రాజమండ్రిలో ఇఫ్టూ రాష్ట్ర రాజకీయ తరగతులు జరిగాయి. ఆ సందర్భంగా ఇఫ్టూ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగి నెల్లిమర్ల నుండి వచ్చిన అభ్యర్ధన పై చర్చించింది.
విజయనగరం జిల్లాలో అంతవరకూ ఇఫ్టూ లేదు. అది కొత్త ప్రాంతమే కాక, సుదూర ప్రాంతం కూడా! పైగా ఫ్యూడల్ రాజకీయ వ్యవస్థ బలంగా ఉన్న ప్రాంతమది. ఆ సుదూర ప్రాంతానికి ఇఫ్టూ విస్తరణ ఓ సంక్లిష్ట సమస్యే! దానికి దిగే ముందు ఆచితూచి అడుగులు వేయాలి. ఇవి అన్నీ నాటి రాష్ట్ర కమిటీ లోతుగానే చర్చించింది. తుదినిర్ణయానికి ముందు నెల్లిమర్ల క్షేత్రస్థాయిలోని వాస్తవ భౌతిక స్థితిగతుల పరిశీలనకై ఒక బృందాన్ని పంపాలని ఇఫ్టూ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఏలూరులోని నెల్లిమర్ల ప్రాంతీయుల ప్రాతినిధ్యం కూడా ఉండేలా బృందం ఎంపికకి నిర్ణయించింది.
ఏలూరు మిత్రులతో తో చర్చించి పై బృందాన్ని ఎంపిక చేయడమైనది.
బృందం సభ్యులు:–
1-NV సత్యనారాయణ (నాడు PDSU లీడర్, నేడు న్యాయవాది)
2-U.వెంకటేశ్వర్రావు(UV)
(నాడు PDSU నేత, నేడు ఇఫ్టూ రాష్ట్ర కోశాధికారి)
3-కాకర్ల అప్పారావు (నాడు ఏలూరు జూట్ కార్మిక నేత, నేడు ఇఫ్టూ రాష్ట్ర కమిటీ సభ్యుడు)
4-ఇజ్రోతు చిన్నారావు (నాడు ఏలూరు జూట్ యూనియన్ లీడర్, నేడు రిటైర్డ్ వర్కర్)
5-మెట్టు తవితయ్య (నాడు ఏలూరు జూట్ యూనియన్ ఆర్గనైజర్, నేడు రిటైర్డ్ వర్కర్)
గమనిక:–చివరి ముగ్గురు నెల్లిమర్ల మూలవాసులే. అప్పారావుది నెల్లిమర్ల కాగా, చిన్నారావు, తవిటయ్యలది మాజీ మంత్రి సాంబశివరాజు గారి గ్రామం ‘మొయిద’)
పై బృందం నెల్లిమర్ల ప్రాంత కార్మిక గ్రామాల్లో 1991 అక్టోబర్ మూడో వారంలో నాలుగు రోజుల పర్యటన చేసింది. గొప్ప ఆదరణ లభించింది. (ఆ వివరాల్లోకి వెళ్లడం లేదు) అదో నివేదిక ఇచ్చింది. తిరిగి ఇఫ్టూ రాష్ట్ర కమిటీ చర్చించింది. సుదూరపు కొత్త ప్రాంతమైన నెల్లిమర్ల వెళ్లి, కార్మిక నాయకత్వం చేపట్టినప్పటికీ, ఒకవేళ ఇఫ్టూ వంటి విప్లవ కార్మిక సంస్థ మీద పెట్టుబడిదారీ వర్గం, వారి అనుకూల ఫ్యూడల్ రాజకీయ శక్తుల నుంచి దాడులు, వత్తిళ్ళు వచ్చినప్పటికీ, నెల్లిమర్ల కార్మికవర్గం ఐక్యంగా నిలిచి ఎదిరించగలదనే ప్రాధమిక అంచనాకు అది వచ్చింది. ఫలితమే ఇఫ్టూ నెల్లిమర్లలో ప్రవేశం!
4-11-1991న కార్మిక గ్రామాల వారీగా 200 మందితో విజయనగరం లో పరిచయ సమావేశం. ఆచరణలో అది 2000 మందితో జరిగింది.
8-11-1991న నెల్లిమర్ల లో ప్రవేశ కార్మికసభకు ఐదు వేల మంది హాజరు.
20-11-1991న ఐదు వేల మంది కార్మికులతో అమరజీవి నెక్కలపూడి రామారావు గారు రిటర్నింగ్ అధికారిగా నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికసంఘం (NJMKS) జనరల్ బాడీలో కమిటీ ఎన్నికకి ఏకగ్రీవ తీర్మానం.
30-11-1991న ఐదు వేల మంది జనరల్ బాడీ సభ NJMKS కమిటీ ఎన్నికకి ఏకగ్రీవామోదం.
ఏలూరుకీ, నెల్లిమర్లకీ మధ్య దూరం 350 కిలో మీటర్లు. విజయనగరం జిల్లాలో అంతవరకూ ఇఫ్టూ వాసన కూడా లేదు. నెల్లిమర్లలో నాయకత్వం చేపట్టే ముందు అనేక సందేహాలు చర్చకు వచ్చాయి. ఆ అన్నింటిని కార్మికవర్గం పటాపంచలు చేసింది. శ్రామికవర్గం పట్ల విశ్వాసం ఉంచి, వారితో మమేకమై పని చేస్తే, అది అవసరమైన అసాధారణ త్యాగనిరతిని ప్రదర్శించి పెట్టుబడిదారీవర్గాన్ని ఎదిరించి నిలబడగలదని వీరోచిత నెల్లిమర్ల జూట్ కార్మికోద్యమ చరిత్ర నిరూపించింది.
సరైన సానుకూల భౌతిక పరిస్థితుల్లో, సరైన శ్రామికవర్గ దృక్పథంతో, సరైన విధానాలతో, సరైన ఉద్యమ కార్యాచరణను రూపొందించుకొని, సరైన విప్లవాదర్శాలతో శ్రామిక వర్గంలో పనిచేస్తే, “భౌతిక దూరం”, “కొత్త ప్రాంతం”, “కొత్త కార్మికులు” వంటి ఆటంకాలు ఏవీ సమస్యే కాదని నెల్లిమర్ల ఉద్యమ చరిత్ర రుజువు చేసింది. అది ఓ అనుభవమూ, ఓ గుణపాఠమూ!
నేడు దేశంలో పదికోట్లకి పైగా వలస కార్మికవర్గం ఉంది. ఇంతవరకూ కార్మిక సంఘాలు సైతం లేకుండా అసంఘటిత కార్మికవర్గం పదుల కోట్లల్లో ఉంది. ఆ స్థలాలు కార్మిక సంఘాలకి నేటికీ కొత్తవే. ఈ తరహా కొత్త చోట్ల కూడా భౌతిక పరిస్థితులు సమరశీల నిర్మాణాత్మక కార్మికోద్యమ నిర్మాణానికి భౌతిక వనరు గా ఉంది. “భౌతిక దూరం” “కొత్త రంగం” “నూతన ప్రాంతం” “తెలియని కార్మికులు” అనేవి అక్కడ పని చేయడానికి ఆటంకం కాజాలవు. అదే సమయం లో యధాలాపంగా కృషి చేస్తే కూడా సాధ్యం కాదు. బయటకు అసాధ్యంగా కనిపించే చోట్ల కూడా నిర్దిష్ట భౌతిక స్థితిగతుల ఆధారంగా ప్రణాళికాబద్ద వ్యూహంతో నియమబద్ద కార్యాచరణను సాగిస్తే, సుసాధ్యం చేయొచ్చని చెప్పడమే ఇక్కడి ముఖ్య సందేశం. 30 ఏళ్ల క్రితం ఏలూరు నుండి నెల్లిమర్ల కి కార్మికోద్యమ విస్తరణ జరిగిన నాటి సంఘటన అందించే సందేశం యిదే!
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
30-9-2021
గమనిక:–ఏలూరు నుండి నెల్లిమర్లకు కార్మికోద్యమ విస్తరణ జరిగిన తీరుతో పాటు వివిధ ఘట్టాలపై ఇంతవరకూ ఓ పుస్తకం కూడా రాలేదు. నెల్లిమర్ల అమరత్వానికి 25 ఏళ్ల సభ (29-1-2019) రోజు ప్రచురించి ఆవిష్కరించే యత్నం నిలిచిపోయింది. నెల్లిమర్లలో కార్మికోద్యమ నిర్మాణం జరిగిన తీరు, సాధారణ గృహస్త స్త్రీలని కార్మికోద్యమంలోకి సమీకరించిన తీరు, అనేక వినూత్న పోరాట రూపాల ప్రక్రియ, ఉల్లిపాయల పోరాటం నుండి కార్మిక అమరత్వం ప్రభవించిన సమరశీల రైల్ రోకో వరకు వీరోచిత పోరాట ఘట్టాలపై వ్యాసాలు, కథనాలు, వీరగాధలు, ఉజ్వల సన్నివేశాలతో సుమారు 200 పేజీలలో పుస్తకాన్ని ప్రచురించే గత నిర్ణయం పెండింగ్ లోనే ఉంది. దాన్ని పాఠకులకి అందించ గలిగి ఉంటే, ముప్ఫై ఏళ్ళ క్రితం నాటి ఈ సంఘటన విస్తృతి, గాఢత, లోతుల్ని తేలిగ్గా మిత్రులు అర్ధం చేసుకునే వారు. 2022 జనవరి 29 నాటికి ప్రచురించే ఒక ప్రయత్నం జరుగుతోందని మిత్రుల దృష్టికి తెస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *