శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం చేస్తున్న బర్డ్ ఆసుపత్రికి దాతలు భారీగా విరాళాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు దాతలు ఖరీదైన యంత్రాలు ( మిషనరీ)ని విరాళంగా అందించారు.
నోయిడా , న్యూఢిల్లీ కి చెందిన ధర్మపాల్, సత్యపాల్ లిమిటెడ్ సంస్థ రూ. 3.38 కోట్ల విలువ చేసే అధునాతన సిటి స్కాన్ యంత్రాన్ని విరాళంగా అందించింది.
హైదరాబాద్ కు చెందిన ఆర్ ఎస్ బ్రదర్స్ సంస్థ రూ. 1.3 కోట్ల విలువ చేసే ఎక్స్ రే మిషన్ విరాళంగా ఇచ్చింది.దీంతోపాటు హైదరాబాద్ కు చెందిన పిచ్చమ్మయ్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ రూ. 54 లక్షలతో మొబైల్ ఎక్స్ రే మిషన్ అందించింది. చెన్నై కి చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ రూ. 20 లక్షలతో ఎకో మిషన్, రూ. 6 లక్షలతో నాలుగు ఇ సి జి మిషన్లు విరాళంగా అందించారు.
ఆసుపత్రి అవసరాల కోసం ముంబై కు చెందిన టెక్ మహీంద్రా ఫౌండేషన్ అనే సంస్థ రూ.80 లక్షలు ఖర్చు చేసి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ నిర్మించి ఇచ్చింది. చెన్నై లోని శ్రీ టాలెంట్ ప్రో ఇండియా హెచ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 21. 44 లక్షలతో 13 కిలో లీటర్ల క్రయో జనిక్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి ఇచ్చింది.
టీటీడీ చేస్తున్న వైద్య సేవలకు మెచ్చి అనేకమంది దాతలు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే టీటీడీ, బర్డ్ ఆహ్వానం మేరకు దేశంలోని పలువురు ప్రముఖ వైద్యులు ఆసుపత్రికి వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తున్నారు.