భారత్ బంద్ కు జగన్ మద్దతు, అవాక్కయిన బిజెపి

 

కాంగ్రేస్, వామపక్షాలు, కొన్ని రైతు సంఘాలు ఇచ్చిన భారతబంద్’కు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మద్దతు పలకడం పట్ల ఏపీ బిజెపి అధ్యక్షుడు  సోము వీర్రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రధాన సమస్యలను గాలికొదిలేసి,ప్రభుత్వ పాలన గాడితప్పుతున్న క్రమంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితులు అయోమయంగా ఉన్న నేపధ్యంలో “ప్రజల దృష్టిని మళ్లించడానికే” రేపటి బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాల గురించి మాట్లాడేవారంతా అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బిజెపి కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో ఏ ప్రాంతాల్లో నైనా నేరుగా ఈ- మార్కెటింగ్ విధానం ద్వారా అమ్ముకునే సౌకర్యాలతో పాటు,మధ్య దళారీల బారినుంచి రైతులను రక్షించే విధంగా చట్టాలు తీసుకురావడానికి చేసిన సంస్కరణలను స్వాగతించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా, అవకాశవాద రాజకీయ అజెండా,విదేశీ సంస్థలు, కోర్పొరేట్ సంస్థల సహకారంతో నడిపిస్తున్న కుత్రిమ ఉద్యమానికి మద్దతివ్వడం వైసీపీ ప్రభుత్వ అవకాశవాద విధానాలకు నిదర్శనంగా శ్రీ సోము వీర్రాజు అభివర్ణించారు.

రైతులకు నేరుగా ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనతతో పాటు, దేశవ్యాప్తంగా యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలి పోకుండా నిలువరించి, వేపపూత వున్న యూరియా రైతులకు అందించడం ద్వారా బ్లాక్మార్కెట్ లేకుండా బిజెపి ప్రభుత్వం చేసిందన్నారు.

కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా రైతుల వ్యవసాయ ఉత్పత్తులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి,రవాణా చేయడం ద్వారా రైతులకు మేలు చేసే ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిందని శ్రీ వీర్రాజు పేర్కొన్నారు.

అవకాశవాదమే ఎజెండాగా పనిచేసే వామపక్షాలు, స్వార్ధ రాజకీయాలు కోసం కొన్ని ప్రతిపక్షాలతో కలిసి భారత్ బంద్ కు పిలుపునిస్తే, తమ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉందని, మంత్రి శ్రీ పేర్ని నాని పేర్కొనడం అనైతిక నిర్ణయని,శ్రీ సోము వీర్రాజు ఆక్షేపించారు.

రైతు చట్టాలపై చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు బంద్ కు మద్దతు పలికిన పార్టీలు ఎందుకు చర్చలు జరపడానికి ముందుకు రావడంలేదో ? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ బంద్, రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమం వెనుక, పెద్ద కుట్రే దాగివున్నట్లు, కేంద్రంలోని బిజెపి శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కొన్ని శక్తులు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలతో కలిసి తిప్పికొడతామని హెచ్చరించారు.

వ్యవసాయం దండగ అనడం,రైతులు కరెంటు చార్జీలు, గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమిస్తే, బషీర్ బాగ్ లో, కాల్పులు, జిల్లాల్లో రైతులు పై లాఠీచార్జి చేయించిన చంద్రబాబు / తెదేపా ముసలికన్నీరు కారుస్తూ, ఉనికిని కాపాడుకోవడానికి యత్నిస్తోందని విమర్శించారు.

నష్టాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వాటిలో పనిచేసే సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించేందుకు మాత్రమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీనిపై మాట్లాడే అర్హత వైసీపీ, తెలుగుదేశంపార్టీలకు లేదని శ్రీ సోము వీర్రాజు మండిపడ్డారు.

రైతు సహకార చక్కర ఫ్యాక్టరీలను,సంస్థలను, తనవారికి ఆర్ధిక ప్రయోజనం కల్పించే దురుద్దేశ్యంతో,వాటిని కారుచౌకగా, ఒక్క కలంపోటుతో అమ్మేసి, ప్రైవేటుపరం చేసిన శ్రీ చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారని ప్రశ్నించారు ?

రాష్ట్రంలో సహకార వ్యవస్థ ను నిర్వీర్యం చేసి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని శ్రీ సోము వీర్రాజు తీవ్రంగా దుయ్యబట్టారు.

అవకాశవాద,స్వార్ధ రాజకీయాలు నడుపుతున్న కాంగ్రేస్, వామపక్షాలను ప్రజలు తిరస్కరిస్తున్న విషయాలను గుర్తు చేస్తూ, వాళ్ళతో కలసి నడుస్తున్న తెదేపా పరిస్థితి కూడా రాష్ట్రంలో అదే విధంగా వుందని, వీళ్లంతా కలసి బిజెపి కేంద్ర ప్రభుత్వంపై కుట్రతో చేస్తున్న అనైతిక ఉద్యమానికి దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు  విజ్ఞప్తి చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *