ఒక పాట, ఒక చెరగని జ్ఞాపకం : జి ఆనంద్

అనుకోకుండా  ఈ మధ్య కొంత మంది మిత్రులు ఈ పాట షేర్ చేశారు. ఎపుడో మరచిపోయిన పాటలు, ఫోటోలు, పుస్తకాలు ఒక్కొక్క సారి ఉన్నట్లుండి కళ్లముందు ప్రత్యక్ష మవుతుంటాయి, సోషల్ మీడియా పుణ్యాన.ఇలా ఉన్నట్లుండి ఒక రోజు రాత్రి పొద్దుపోయాక కళ్ల ముందు వాలిన  పాటయే ‘ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక’  ఈ పాట ఇక్కడ వినండి.

ఇది 1976లో వచ్చిన ‘అమెరికా అమ్మాయి’ చిత్రంలోనిది. గేయరచయిత మల్లవరపు గోపి. గాయకుడు జి. ఆనంద్ (1954-2021), సంగీతం జికె వెంకటేశ్ (21 సెప్టెంబర్ 1927- 17 నవంబర్ 1993 17).

ఈ పాట ఆ రోజులో బాగా హిట్టయింది. ఇపుడు కూడా హిట్టే. ఆహ్లాదకరంగా వినదగిన పాట. గేయం, సంగీతం, గాత్రం అన్నీ చల్లగాలిలా పాకుతూ వచ్చి మన శరీరంలోకి, మనసులోకి ప్రవేశిస్తాయి. మనసంతా ఆక్రమించుకుంటాయి. సాహిత్యం సంగీతం అన్నీ గొప్పగా ఉంటాయి. దీనికి ఆనంద్ గళం ఏ మాత్రం తీసిపోకుండా ఉంది.

ఆనంద్ (67) ను మొన్న మే నెలలో కరోనా కాటేసింది. ఆయన కరోనాతో ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆక్సిజన్ స్థాయి బాగా పడిపోయింది. ఆక్సిజన్ కోసం ట్విట్టర్ లో అర్థించారు. ఎక్కడా దొరకలేదు. చనిపోయాడు. స్వర ధురి పేరుతో ఒక ట్రూప్ ఏర్పాటు చేసుకుని ప్రపంచమంతా దాదాపు 6500 సంగీత కచేరీలు నిర్వహించి లక్షలాది మందిని అలరించిన ఆయన గొంతక ఆక్సిజన్ అందక అలా వాడిపోయింది. ఆనంద్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడు.

ఆనంద్ కిది తొలిపాట. తొలిపాటతోనే ఆయన మనుసుదోచేశాడు.

ఆనంద్ చిత్ర రంగప్రవేశం చిత్రంగానే జరిగింది. చంద్రమోహన్ భార్య పేరు జలంధర. ఆమె బాగా పేరున్న రచయిత. ఆమె తండ్రి పేరు డాక్టర్ గాలి బాలసుందరరావు. మద్రాసులో ఆయన పేరున్న డాక్టరే. అయితే, ఆయన కు నాటకాల పిచ్చి.  నాటకాలు వేసేందుకు వేయించేందుకు ఆయన  ‘మధుర కళానికేతన్ ’అనే సంస్థను తెరిచారు.  1960 దశకంలో మద్రాసు పాండిబజార్ లోని తన ఇంటిలోనే ఆయన ఒక మిని ధియోటర్ కూడా కట్టారు.

1976లోఒక రోజున ఒక యువ గాయకుడి ప్రదర్శన ఉండింది. ఆరోజు ముఖ్య అతిధిగా ప్రముఖ నిర్మాత నవత కృష్ణంరాజు ధియోటర్ కు వచ్చారు. ఆమెరికా అమ్మాయి సినిమా నిర్మాత ఆయనే. అపుడే  చిత్ర నిర్మాణం సాగుతూ ఉంది. చిత్రానికి దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు. ఈ యువ గాయకుడి పాటలు విని నవత కృష్ణం రాజు బేష్ అనుకున్నారు. మరుసటి రోజు ఆ యువ గాయడిని పట్టి తీసుకురాపో అని తన అసిస్టెంట్ డైరెక్టర్ మేడిశెట్టి అప్పారావును పురమాయించారు. ఆ కుర్రవాడే జి. ఆనంద్.

ఒక నిర్మాతనుంచి పిలుపురావడంతో ఆనంద్ లోలోన ఉబ్బితబ్బిబ్బవుతన్నాడు. పిలుపు ఎందుకో అర్థం కావడం లేదు. మొత్తానికి జంకుతూనే  టి.నగర్, రామన్ స్ట్రీట్ లో ఉన్న నవత అర్ట్స్ కార్యాలయానికి వచ్చాడు. కృష్ణం రాజు ఆయనను సంగీత దర్శకుడు జికె వెంకటేశ్ కు పరిచయం చేసారు.  జికె వెంకటేశ్ పూర్తి పేరు తెలుసా? గురజాడ కృష్ణ దాస్ వెంకటేశ్.  ఆయనను తెలుగు సినిమా రంగం ఆదరించలేదు. కన్నడిగులు, తమిళులు సొంతం చేరుకున్నారు. సరే ఇది విషయం. జికె వెంకటేశ్ ను కలుసుకున్నపుడు గాని ఆనంద్ కు అర్థం కాలేదు, తన జీవితం కొత్త మలుపేదో తిరుగబోతున్నదని.

జికె వెంకటేశ్ ఆనంద్ ని కొన్ని పాటలు పాడమన్నాడు. అమెరికాఅమ్మాయి చిత్రంలో ఒక పాట పాడే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు.  చాన్స్ కోసంచూస్తున్నాడు. ఈ లోపు హీరో కు ఉన్న పాటలన్నీ రికార్డయిపోయాయి. ఆనంద్ లో జంకు మొదలయింది. ఉండబట్టలేక ఆయన తన చాన్స్ మాటే మిటని జికె వెంకటేశ్ ని అడిగేశాడు. ఆయనేమో ‘పాడనా తెలుగుపాట’ ప్రాక్టీస్ చేయమన్నాడు. ఆ పాట రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి.

నిజానికి ఆయన కేవలం ప్రారంభ వాక్యాలు మాత్రం మొదట రాసి పంపారు. మిగతా పాట కూడా రాసి ఉంటారు, పోయి తీసుకురా పో అని కృష్ణ శాస్త్రి దగ్గిరకు ఆనంద్ నే పంపించారు. ఆయన పాట ఇంకా రాస్తూ ఉన్నారు. కొన్ని లైన్లు తనని పాడమన్నారు. ఇది సినిమాలో మహిళ పాడే పాట. ఈ పాటని తనని ఎందుకు పాడమంటున్నారో ఆనంద్ కి అర్థం కాలేదు. కృష్ణ శాస్త్రిని ‘నాకంటూ ఒక పాటలేదా చిత్రంలో’ అని అడిగేశాడు. కృష్ణ శాస్త్రి ఒక చిరునవ్వు నవ్వేసి,  ‘నీకు ఒక పాట ఉంది, కొంచెం ఓపిక పట్టు,’ అన్నారు.

చివరిక్షణంలో ఒక పాటను జోడించారు. బహుశా అది ఆనంద్ కోసమే అనుకోవాలి. సినిమాలోని ఒక హీరో (శ్రీధర్)మీద చిత్రీకరించాల్సిన పాట. పాటని కృష్ణ శాస్త్రి కాదు రాసింది. మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి అలియాస్ గోపి. గోపి యాక్టర్ అవుతామని మద్రాసు వచ్చాడు. అంతకు ముందు ఆయన పిని శెట్టిశ్రీరామ్మూర్తి రాసిన ‘పల్లెపడుచు’ అనే నాటకంలో నటించాడు. ఆయన నటనకు బాగా ప్రశంసలొచ్చాయి. ఇదే ఆయనను మద్రాసుకు రప్పించింది.అయితే, గేయరచయితగా సెటిల్ కావలసి వచ్చింది. ప్రఖ్యాత నటి సావిత్రి ఆయనను గేయ రచయితను చేసింది. 1969లో తాను దర్శకత్వం వహించిన ‘చిరంజీవి’ చిత్రానికి ఆయన గేయాలందించారు. సుమారు 250 పాటలు రాశారు. ఆయన అందించిన  ఆణిముత్యాలలో ’అమెరికా అమ్మాయి’ కోసరి రాసింది మేటి అని చెప్పుకోవచ్చు.అదే ‘ఒక వేణువు వినిపించెను’ పాట. గోపి గీతం, జికె వెంకటేశ్ సంగీతం, ఆనంద్ గాత్రం  ఈ పాటను తెలుగు సినిమాఅందించిన గొప్పగేయాల్లో ఒకటిగా చేశాయి.

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక,

ఒక రాధిక సంధించెను నవరాగమాలిక,

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో,

నవమాలిక చినబోయెను చిరునవ్వు సొగసులో,

వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెను,

రేరాణియే నా రాణికి పారాణి పూసెను,

ఈ నింగికి ప్రభవించెను నీలాల  తారక,

నాగుండెలో వినిపించెను సింగార దీపిక,

ఒక వేణువు…

జికె వెంకటేశ్ తన ఇద్దరు సహాయకులు, ఎల్ వైద్యనాథన్, ఇళయరాజా లతో కలసి ఈపాట   ప్రసాద్ స్టూడియోస్ రికార్డు చేశారు. ఈ పాటతో జికె వెంకటేశ్ సంతృప్తి చెందారు. అయితే, ఆనంద్ సంతృప్తి చెందలేదు. ఎందుకంటే, ఆయన ఇంత స్లోగానడిచే పాటఅంటే ఇష్టంలేదు. హీరోల దూకుడు పాటకావాలనుకున్నాడు. చిత్రంలో అలాంటి పాటలన్నీ ఎస్ పి బాలు యే పాడారు.  ఆనంద్ అసంతృప్తిని గమనించిన జికె ఆయన భుజం తట్టి, “ ఒరేయ్ మూర్ఖుడా, ఈ పాట గొప్పదనమేమిటో నీకే తెలుస్తుంది. ఇదే నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది,’అన్నారు. నిజంగా ఈపాట నాటికి నేటికి సంగీత ప్రియుల తనివి తీర్చేపాట.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *