ప్రజా సమస్యల గొంతుక చెన్నా అజయ్ కు నివాళి…

( రేకా చంద్రశేఖరరావు)

చెన్నా అజయ్ గాను, ఇంకా అజయ్ గాను పిలువబడే చెన్నా అజయ్ కుమార్
20 సంవత్సరాల క్రితం నాకు ఎప్పుడు పరిచయం అయ్యాడో గుర్తు లేదు ,
మా పరిచయం ఆత్మీయ స్నేహంగా కొద్ది రోజులలోనే మారింది, నా కంటే చాలా చిన్న వాడయినప్పటికీ మంచి స్నేహితులం అయ్యాము.

అజయ్ పేద,చేనేత కార్మిక కుటుంబంలో , కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టాడు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలలో ఆనాటి వుమ్మడి
సిపిఐ ప్రధాన కార్యదర్శిగా వుంటూ మరణించిన అజయ కుమార్ గారి పేరు అనేక మంది పిల్లలకు ఆరోజులలో పెట్టేవారు.

చెన్నా అజయ్ అంటే చిన్న కెమెరా మెడలో తగిలించుకుని మంగళగిరి మరియు చుట్టు పక్కల గ్రామాలలో వున్న సమస్యలను తన కెమేరాలో బంధించే మనిషి.

12 వ వార్డులో రోడ్లు అధ్వాన్నం అని, ఒక ఫొటో దాని కింద ఒక రైటప్ లేక చిన్న కవిత, వర్షాలకు రత్నాల చెరువులో చేనేత కార్మికుల మగ్గం గుంటలలో కి నీళ్ళు, ఎర్రబాలెంలో వరకట్న హత్య, చిన కాకాని హైస్కూలు విద్యార్ధుల వెతల కతలు, నీరు కొండలో దళితులపై మారణ కాండ, నిడమర్రు చార్వాక ఆశ్రమంలో నాస్తిక మేళా సభ, మంగళగిరి బౌద్ద సంఘం వారు రెండు వేల మందితో బుద్ద జయంతి వేడుకల నిర్వహణ,
ఆయేషా హత్యను ఖండిస్తూ వేలాది విద్యార్ధులతో మంగళగిరి పట్టణంలో ప్రదర్శన, కోట్లాది డబ్బులు దండుకునేందుకు చారిత్రక పురాతన కట్టడం అయిన మంగళగిరి గాలి గోపురం అక్రమ కూల్చి వేతకు కుట్ర,
పాత మంగళగిరి కీర్తి విద్యానికేతన్ పిల్లల అపురూపు ఎగ్జిబిషన్, రోగుల ప్రాణాల పట్ల శ్రధ్ద లేని నిర్లక్ష్యా పూరిత హాస్పటల్స్ , భారీ ఫీజులతో విద్యార్దుల తల్లితండ్రులను దోచు కుంటున్న కార్పోరేట్ విద్యా సంస్తలు,
భగత్ సింగ్ వర్ధంతికి పిడిఎస్ వొ నాయకత్వంలో విద్యార్థుల కాగడాల ప్రదర్శన, అధిక ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్ది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ప్రదర్శన – అధికారులకు మెమొరాండం.

అజయ్ కుమార్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్.కే). అజయ్ కుమార్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం తో పాటు కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం, నివేశన స్థలం మంజూరుకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆర్.కే.
చెన్నా అజయ్ కుమార్ కు. నివాళులు అర్పించిన ఏఐటీయూసీ నాయకులు, చేనేత సంఘం నాయకులు అన్నవరపు ప్రభాకర్,నందం బ్రహ్మస్వరరావు,గండికోట దుర్గారావు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, బత్తూరి మోహనరావు, గోలి మోహనరావు

ఈ రకంగా మంగళగిరిలో “చెన్నా అజయ్ కలం “
ఆగకుండా కదుల్తూనే వుండేది, అంతే కాదు వాటిని దృశ్యీకరించి పత్రికలలో ప్రచురించే వాడు. ఇంకా అంతే కాదు తాను పని చేసే సిబార్ ఛానల్ ద్వారా వాటిని విస్తృత ప్రచారం చేసే వాడు. తాను ఉద్యోగస్తుడు మాత్రమే అయినప్పటికీ ఆ సిబార్ ఛానల్ అజయ్ ఛానల్ అన్నంతగా గుర్తింపు పొందాడు.

చంద్ర శేఖర్ మాస్టారూ! మన దేశంలో సోషలిజం ఎప్పటికి
వస్తుందండీ, మా వంటి పేద కుటుంబాల బాధలు ఎప్పుడు పోతాయి, మరల తానేవచ్చినప్పుడు వస్తుంది, మన పని మనం చేయాలి గదా!

మాస్టారూ మీకు తెలుసా! మన చార్వాక రామకృష్ణ మాస్టారు నాస్తికుడు అనే పేరే గానీ ఆయన కమ్యూనిస్టండీ!

అయినా మీరు నా కంటే చాలా సీనియర్ గదా మీకు తెలియ కుండా ఎలా వుంటుంది.

మాస్టారూ!
మీరు హైదరాబాదు వెళ్ళి చాలా పొరపాటు చేశారు, మీరు లేని లోటు మన మంగళగిరిలో కనపడుతున్నది.

మనం ఎన్ని కార్యక్రమాల్లో కలసి పని చేశాం !

శ్రీశ్రీ, భగత్ సింగ్, గుర్రం జాషువా, గురజాడ, అంబేద్కర్, ఫూలే, వేమన ,
సిపి బ్రౌన్……..
ర్యాగింగ్ వ్యతిరేక కార్యాచరణ కమిటీ,
ఆయేషా హత్య, వైష్ణవి హత్య, అలాటి కార్యక్రమాలకు మీలాగా పూనుకుని చేసేవారు లేరండీ,
వేమన సాహిత్య వేదిక పెట్టి ఎన్ని కార్యక్రమాలు ,
పేరు సాహిత్య సంస్తే కానీ అవసరమైన
ప్రజల సమస్యలు అన్నిటిలో నిత్యం
వేమన సాహిత్య వేదిక గొంతు
విన పడేది.

ఇలా సాగేది కలసినప్పుడు
అజయ్ సంభాషణ.

మూడు సంవత్సరాల నాడు మా స్కూలు పనిమీద మంగళగిరి వెళ్ళినప్పుడు, అజయ్ అనుకోకుండా కనపడితేవిషయం చెబితే మీరు వుండండి మాస్టారు నేను ఆ పని చేయడం చాలా సుళువు అని చొరవగా మాట్లాడి
ఆ పని చేశాడు.


అజయ్ అజయ్ అజయ్
చెన్న అజయ్

సిద్ధం చేసిన
ఆహ్వాన పత్రికల్లోంచి
ఒకటి ఎగురుకుంటూ
వెళ్ళిపోయింది !

అమ్ములపొది లోని
అస్త్రాల్లో ఒకటి
నింగికెగసిపోయింది !

నేనున్నా…
నేనోస్తున్నానంటూ…
పరామర్శించే కంఠం
ముగబోయింది !

ఉగాదిన ఉదయించిన
నేస్తం తెలుగంటే
పడిచచ్చే నేస్తం
దోపిడీ,పీడనలపై
భగ్గు మనే నేస్తం
నా నేస్తం నా నేస్తం
చావు ఒడిలో
ఒదిగిపోయాడు
జరుగుతున్న దారుణాలు
చూడలేనంటూ…
గత స్మృతులను
నెమరువేసుకోమంటూ
తరలిపోయాడు…
నేస్తం నానేస్తం నా నేస్తం
అజయ్…అజయ్…అజయ్
చెన్న అజయ్

గోలి మధు,
చైతన్య సాహితీ వేదిక
మంగళగిరి


 

శ్రీశ్రీ, , భగత్ సింగ్, చండ్ర రాజేశ్వర రావులు అంటే విపరీత అభిమానం వున్న చెన్నా అజయ్, తనకు పరిచయం అయిన ఏ వ్యక్తిలో అయినా
కమ్యూనిష్టు భావాలు వుంటే పసిగట్టి వారితో స్నేహం చేసేవాడు.
సిపిఐ, సిపియమ్, సిపిఐ యమ్ యల్ ఎవరయినా అందరితో నిముషాలలో స్నేహం చేసేవాడు. అతడికి ఒక పార్టీ వుంటే వుండ వచ్చును,

కానీ!

కొంతమందిలో వుండే , ఐక్యతకు అడ్జమయ్యే
“మా పార్టీ చాలా గొప్పది, మిగతా అన్ని కమ్యూనిష్టు పార్టీల కంటే గొప్పది”
వంటి అతిశయాలు అజయ్ ఎప్పుడూ పోయేవాడు కాదు, అతడు ఒక పార్టీ తరఫు మనిషిలాగ ఎప్పుడూ నాతో మాట్లాడే వాడు కాదు, “ మన కమ్యూనిష్టులు అని మాత్రమే
అనే వాడు”బహుశా ఆ కారణం రీత్యానే కావచ్చు అన్ని పార్టీల కమ్యూనిష్టులు అందరూ అతడిని ఎంతో అభిమానంగా
“ అజయ్! అజయ్! “ అని పిలుస్తారు.

మంగళగిరి ప్రాంత ప్రజలకు ఎంతో ఆత్మీయంగా వుండే అజయ్
కడు పేదరికంలో, నలుగురు ఆడపిల్లల తండ్రిగా
అనేక అవస్తలు పడ్టాడు, దానికి తోడు కిడ్నీలు దెబ్బ తిని గత సంవత్సరం నుండి అనారోగ్యంతో వుంటూ, ఇటీవల కోలుకున్నాడు అనే వార్తల తర్వాత
ఈ రకంగా మన నుండి అజయ్ దూరమయ్యాడు.

మంగళగిరికి అజయ్ లేని లోటు పూడ్చ లేనిది , అతడు వున్నప్పటి కంటే లేని కాలంలో అతడి విలువ మంగళగిరికి స్పష్టంగా తెలుస్తుంది.

అత్యంత పేదరికంలో వుంటున్న అజయ్ కుటుంబానికి
జర్నలిస్టుల కోటాలో ప్రభుత్వం చేయ వలసిన సహాయాన్ని పొందేలాగ
మంగళగిరి జర్నలిస్టుల సంఘం పూనుకుని చేయాలి, ఇందుకు
ఇతర ప్రజా వుద్యమ సంస్తలు కూడా సహకరించాలి.

అజయ్ భార్యా, పిల్లలు కుటుంబ సభ్యులు అందరికీ
నా సంతాపం తెలుపుతున్నాను.

జోహార్!
చెన్నా అజయ్ కుమార్
జోహార్ ! జోహార్!

(సీనియర్ జర్నలిస్ట్ రచయిత,కళాకారుడు,
విశాలాంధ్ర రిపోర్టర్, చెన్న అజయ్ కుమార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు)

 

అజయ్ ఇక లేడు.. అన్న ‘నిజం’ అబద్ధమైతే బాగుండు!

చెన్నా అజయ్ కుమార్ ది కమ్యూనిస్టు నేపథ్యమున్న చేనేత కుటుంబం. చిన్ననాటి నుంచే కష్టాలతో సహవాసం. అలా ఎదుగుతూనే సమాజాన్ని అధ్యయనం చేశాడు. విద్యార్థి ఉద్యమాల్లోనూ పాలుపంచుకున్నాడు. డిగ్రీ వరకు చదివిన అజయ్ జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. సమాజంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్టాలను తాను స్వయంగా అనుభవించడం వల్ల వాటినే ఇతివృత్తాలుగా ఎంచుకున్నాడు. సామాజిక సమస్యలే తన సమస్యలుగా మమేకమై కవిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగాడు.

తను తీసుకువచ్చిన తొలి కవితా సంపుటి ‘నిజం’, మలి కవితాసంపుటి ‘ప్రతిబింబం’. రెండింటిలోనూ సామాజికి ఇతివృత్తాలే తన కవితాంశాలుగా మలిచాడు. ఆరోగ్యాన్ని సయితం లెక్కచేయకుండా తన లక్ష్యం వైపు అస్త్రాలు సంధించాడు. అతడు మన మధ్య ఇకలేడు అన్న ‘నిజం’ అబద్ధమైతే ఎంత బాగుండు.

అజయ్ నేపథ్యం…

మంగళగిరికి చెందిన చెన్నా సత్యనారాయణ, వెంకటరత్నం దంపతులకు 1968 మే 18న అజయ్ జన్మించాడు. వీరిది కమ్యూనిస్టు కుటుంబం. వెంకట్, శ్రీనివాస్, మురళి తమ్ముళ్లు. అజయ్ అర్ధాంగి మహాలక్ష్మి, నలుగు కుమార్తెలు మోనిక, త్రివేణి, భూమిక, మహిమ.

అవ్వారు శ్రీనివాస్

అజయ్ చదువుకునే తొలినాళ్లలో ఎస్ఎఫ్ఐలో పనిచేశాడు. ఆ సమయంలో కామ్రేడ్ జేవీ రాఘవులు రాజకీయ జ్ఞానం వ్యాసాలు, రాసే విధానం నేర్పించిన గురువు. తదుపరి కాలంలో అజయ్ తన మిత్రుడు సుభాని ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ వైపు మళ్లాడు. అలా కమ్యూనిస్టు భావజాలంతో విద్యారంగ సమస్యలపై గళమెత్తాడు అజయ్.

పత్రికారంగంలోకి సీనియర్ జర్నలిస్టు పాతర్ల రమేష్ ప్రోత్సాహంతో ఆంధ్రప్రభ తాడేపల్లి విలేకరిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాతి కాలంలో విజేతలోనూ పనిచేశాడు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అజయ్ స్థానికంగా సిబార్ చానల్, తేజ న్యూస్, ఎన్టీవీ రిపోర్టరుగా సేవలందించాడు. విశాలాంధ్ర విలేకరిగా ప్రస్థానం కొనసాగస్తున్న అజయ్ జర్నలిస్టుల సమస్యలపై పోరాటాల్లోనూ ముందుండేవాడు.

వృత్తి జర్నలిజం అయినప్పటికీ సాహిత్యం, నాటక రంగం ప్రవృత్తిగా స్వీకరించిన అజయ్ అభిరుచులు చిత్రలేఖనం, మిమిక్రీ, నాటకరంగం.. ఇష్టమైనది స్నేహం.. నిజాన్ని కలిగిన రచనలు, దోపిడీపై రచనలు చేయడం ధ్వేయంగా పెట్టుకుని ఆ దిశగా పయనించాడు. తను రాసిన… ఎత్తుగడ, రాంబాబు పెళ్లి, ఆదర్శం, పాపం మాస్టారు నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. అలాగే, అన్నపూర్ణమ్మ ఇంటిలో ఆకలిచావులు, ఉలిపికట్టె, ఈ చరిత్ర ఏసిరాతో, ఈ విద్యకు కట్టండి సమాధి, జరుగుతున్న చరిత్ర నాటికల్లో నటించి మెప్పించాడు.

నేడు అనంతలోకాలకు తరలివెళ్లిన కామ్రేడ్ చెన్నా అజయ్ కుమార్ కు లాల్ సలామ్…

– అవ్వారు శ్రీనివాస్, మంగళగిరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *