అధికారికంగా సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

తెలంగాణ  సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని సెప్టెంబర్ 26న అధికారికంగా ప్రతీ ఏడు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  జివో 2086 ను విడుదల చేసింది.

ఈనెల 26న అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్ని నిర్వహిస్తారు.  ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని బిసిసంక్షేమం మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లో తెలిపారు.

ప్రభుత్వం రజకులకు పూర్తి అండగా ఉంటుందని, రజకుల సంక్షేమం కోసం ఆధునిక దోబీ ఘాట్లు, 250 యూనిట్ల ఫ్రీ కరెంటు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.

జీవో కాపీని ఆయన రజక సంఘాలకు అందజేశారు.


ఇవి కూడా చదవండి

*చాకలి ఐలమ్మ జీవితం నాలుగు ముక్కల్లో…

*’చాకలి అయిలమ్మ పోరాట చరిత్రని పాఠ్యాంశంలో చేర్చాలి‘


 

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాట స్పూర్తి అని, తెలంగాణ యావత్ సమాజానికి భానిసత్వాన్ని బద్దలు కొట్టే చైతన్యాన్ని అందించిన ఉద్యమ జ్వాల అని కొనియాడారు.

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్ణాపురం లో 1895 సెప్టెంబర్ 26న జన్మించిన ఐలమ్మ భూస్వామ్య పెత్తందారి వ్యవస్థలకు, భానిస వెట్టిచాకిరి విముక్తికి ఎనలేని పోరాటం చేసారని అన్నారు.

పండించిన పంటపై ప్రాణం పోయినా హక్కుల్ని వదులుకోనని భూస్వామికి వ్యతిరేకంగా పంటను తీసుకొచ్చి రక్షణగా కొడవలి ఎత్తి నిలిచి నాడు చేసిన ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా చైతన్య స్పూర్తిని రగిల్చిందని అన్నారు.

కొడుకుని కోల్పోయినా, కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసినా మొక్కవోని సంకల్పంతో నాటి విస్నూర్ దేశ్ముక్ రాపాక రాంచంద్రారెడ్డికి ఎదురునిలిచి చేసిన పోరాటం అనన్యసామాన్యం.  ఐలమ్మ పోరాటం ఫలితంగానే నాడు తెలంగాణలో భూపోరాటం ఉధృతమయ్యి దాదాపు 10లక్షల ఎకరాల భూమి నిరుపేద వెనుకబడిన వర్గాలకు దక్కింది. ఈ వీరవనితను స్మరించుకోవడం, ఆస్పూర్తిని కొనసాగించడం ఆనందంగా ఉంది, అని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో పాటు అక్కరాజు శ్రీనివాస్,(రజక సంఘాల రాష్ట్ర చైర్మన్), కొండూరు సత్యనారాయణ (రాష్ట్ర రజక సంఘాల చీఫ్ adviser), పూసల శ్రీకాంత్( రజక సంఘం కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ), రజక సంఘం యువ నాయకులు గంగాధర చందు, ఫోకస్ శ్రీనివాస్,చింతల శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *