చాకలి ఐలమ్మ జీవితం నాలుగు ముక్కల్లో…

తెలంగాణ సాయుధపోరాట నిప్పురవ్వ

( పి. సోమయ్య)

నైజాం తొత్తు, మధ్య యుగాల భూస్వామ్య వ్యవస్థ ప్రతినిధి, నరరూప రాక్షసుడైన విసునూరు దేశ్‌ముఖ్‌ను ఎదిరించిన మట్టి మనిషి చాకలి ఐలమ్మ. ‘నీ కాళ్ళు మొక్కుత దొరా! నీ బాంచెన్‌ దొరా!’ అన్న తెలంగాణ రైతు కూలీ బిడ్డలు, ఆ దొరలకు వ్యతిరేకంగా గుతపలు, వడిసెల, తుపాకులతో తిరగబడ్డారు. ఐలమ్మ ఆ మహత్తర తిరుగుబాటుకు స్ఫూర్తి, సంకేతం. ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండా పట్టింది. పోరాడింది. పంటను, భూమిని దక్కించుకుంది. దొరలనెదిరిస్తే కష్టాలు తప్పవని, ప్రాణాలు తీస్తారని ఆమెకు తెలుసు. అయినా, లొంగి బతకడం కన్నా, పోరాడి మరణించటమే మేలనుకుంది.

పరమ దుర్మార్గుడు రామచంద్రారెడ్డి. 40 వేల ఎకరాల ఆసామి, 60 గ్రామాలకు అధిపతి. నైజాంకు నమ్మినబంటు. ఇతని కొడుకు బాబుదొర (జగన్‌మోహన్‌ రెడ్డి) దుర్మార్గాలకు, ఆగడాలకు పెట్టింది పేరు. చాకలి, మంగలి, చేతివృత్తుల వారు, రైతులు, కూలీలు వీరి పీడనలో పీల్చి పిప్పి చేయబడ్డారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదు. నైజాం రాజు, రజాకార్ల నాయకుడు ఖాశీం రిజ్వీ, భూస్వాముల, దేశ్‌ముఖ్‌ల అధికారాలకు, దుర్మార్గాలకు, అత్యాచారాలకు అంతేలేదు. ప్రజల నుంచి కొల్లగొట్టిన సంపదతో భోగలాలస జీవితాలు గడిపేవారు. ఈ పూర్వ రంగంలో పీడించబడిన ఆ మట్టి మనుషుల జీవితాలకు ఆనాడు సంఘం (ఆంధ్ర మహాసభ) ఎర్రజెండా ఆశాకిరణంగా ముందుకొచ్చింది.

ఐలమ్మకు స్వంత భూమి లేదు. మల్లంపల్లి భూస్వామి కొండల్‌రావు దగ్గర నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుంది. కుల వృత్తిమీద వచ్చే మాన్యం గింజలతో పాటు, కౌలు వ్యవసాయం మీద వచ్చే ఆదాయం ఐలమ్మ కుటుంబానికి ఆసరాగా ఉండేది. సంఘం నాయకులు చెప్పే విషయాలన్నీ ఐలమ్మ జాగ్రత్తగా వినేది. గ్రామంలో జరుగుతున్న విషయాలన్నీ అర్థం చేసుకునేది. పాలకుర్తిలో సంఘం కార్యక్రమాలకు ఐలమ్మ ఇల్లే కేంద్రమైంది. భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు ఐలమ్మ తన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి పాల్గొన్నది. మహాసభ ఐలమ్మలో చైతన్యాన్ని రగిలించింది.

ఇంత కాలం తమకు ఎదురు లేకుండా విర్రవీగుతున్న దేశ్‌ముఖ్‌, భూస్వామ్య దోపిడీగాళ్ళకు సంఘం పేరుతో పేదలు సంఘటితం కావడం, ఎదురు తిరగటం వారిలో కలవరం లేపాయి. ”సంఘాన్ని” విచ్ఛిన్నం చేయాలని దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి తన ప్రయత్నాలు ప్రారంభించాడు. తన కింద వందమందికి పైగా ప్రయివేటు సైన్యాన్ని, గూండాలను పోగేసుకున్నాడు. యీ గూండాల దాడులను ప్రతిఘటించడం కోసం గ్రామాలలో పేదలు ఆంధ్ర మహాసభ శాఖలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు.

  1. పోలీస్‌ పటేల్‌ దాడి

పాలకుర్తిలో వీరపనేని శేషగిరిరావు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డికి నమ్మినబంటు. ఈయన పోలీస్‌ పటేల్‌. ఎప్పటికప్పుడు పాలకుర్తి విషయాలన్నీ దేశ్‌ముఖ్‌కు చేరవేస్తూ, సంఘం బలపడకుండా ప్రయత్నాలు ప్రారంభించాడు. దేశ్‌ముఖ్‌ తన పొలంలో ఐలమ్మ కుటుంబం అంతా వచ్చి పని చేయాలని మనుషులను పంపించాడు. ఐలమ్మ వ్యతిరేకించింది. ఐలమ్మ తన మాట వినడం లేదని, కమ్యూనిస్టులకు, సంఘం కార్యకర్తలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తున్నదని, సంఘాన్ని నామ రూపాలు లేకుండా చేయమని దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి ఆజ్ఞాపించాడు. ఐలమ్మ ఇంటిపైకి శేషగిరిరావు తన గూండాలను పంపించాడు. ఐలమ్మ ప్రతిఘటించింది. గూండాలు ఇంటిని లూటీచేసి భీభత్సం సృష్టించారు. సజ్జలు, జొన్నలు, యింట్లో సామాగ్రి అంతా ఎత్తుకెళ్ళారు. నిరుపేద అయిన ఐలమ్మ లొంగిపోలేదు. సంఘం అండతో మరింత పట్టుదల, కసితో దొరకు ఎదురు నిలబడింది.

2. పోలీసుల చిత్రహింసలు

పాలకుర్తిలో శివరాత్రి ఘనంగా జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలకు వస్తుంటారు. ఉత్సవాలలో సభ జరపాలని సంఘం నాయకులు నిర్ణయించారు. ఎట్టి పరిస్థితులలోనూ సభ జరగనీయవద్దని, అడ్డుకోవాలని, వచ్చిన నాయకులపై దాడి చేయాలని, అవసరమైతే హత్య చేయాలని దేశ్‌ముఖ్‌ తన గూండాలను పాలకుర్తికి పంపించాడు.
ఐలమ్మ ఇంటి ముందు సభ జరుగుతున్నది. దేశ్‌ముఖ్‌ గూండాలు గొంగళ్ళు కప్పుకొని వాటి మాటున గొడ్డళ్ళు, కత్తులు పట్టుకొని సభకు వచ్చారు. యీ ప్రమాదాన్ని పసిగట్టిన ఐలమ్మ భర్త నర్సయ్య, కొడుకులు సోమయ్య, లచ్చయ్యలు వెళ్ళి గూండాలను అడ్డుకున్నారు. జనం గూండాలను తరిమికొట్టారు. గూండాలలో ఒకతనికి దెబ్బలు బాగా తగిలాయి. రెచ్చిపోయిన దేశ్‌ముఖ్‌ పోలీసులతో ఐలమ్మ భర్త, ఇద్దరు కొడుకులతో పాటు, గ్రామంలోని సంఘం కార్యకర్తలందరిపైన హత్యాయత్నం కేసులు బనాయించాడు. పోలీసుల చిత్రహింసలకు, కొట్టిన దెబ్బలకు ఐలమ్మ భర్త నర్సయ్య చెయ్యి పడిపోయింది. ఇద్దరు కొడుకులు పోలీసుల దెబ్బలకు తల్లడిల్లిపోయారు. దీర్ఘకాలం ఐలమ్మ కుటుంబం అంతా కోర్టుల చుట్టూ తిరిగింది.

3. భూమి కోసం

దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి దృష్టి మొత్తం ఐలమ్మ కుటుంబంపై పడింది. పోలీసుల చిత్రహింసలకు, కేసులకు కూడా ఐలమ్మ లొంగకపోవడంతో మరింత రెచ్చిపోయాడు. ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని కాజేయాలని రామచంద్రారెడ్డి ప్లాన్‌ వేశాడు. గత ఇరవై ఏండ్లుగా ఐలమ్మ సాగుచేస్తున్న మల్లంపల్లి భూస్వామి కొండల్‌రావు భూమిని తనకు కౌలుకు యిచ్చినట్లు కొండల్‌రావుతో కాగితం వ్రాయించుకున్నాడు. యీ దెబ్బతో ఐలమ్మ తన చేతుల్లోకి వస్తుందని దేశ్‌ముఖ్‌ భావించాడు. అప్పటికే భూమిలో ఐలమ్మ సాగు చేసుకున్న పంట వుంది. ఆ పంటను కాజేయాలని కుట్ర చేసాడు. ఐలమ్మ బెదరలేదు. రెవెన్యూ, పోలీసు అధికారులందర్నీ కలిసింది. తన గోడునంతా చెప్పుకున్నది. అరవై ఊళ్ళ ఆసామి, నైజాం నమ్మిన బంటు రామచంద్రారెడ్డి కావడంతో, ఏ ఒక్క అధికారీ ఐలమ్మ పక్షాన నిలబడలేదు. పంటను కోసుకొని రావాలని దేశ్‌ముఖ్‌ తన గూండాలను ఐలమ్మ పొలం పైకి పంపించాడు.

పండిన ధాన్యాన్ని దేశ్‌ముఖ్‌ అపహరించకుండా ఐలమ్మ ఇంటికి చేర్చాలని సంఘం ఆదేశించింది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరిరావు, ధర్మ భిక్షం తదితర కార్యకర్తలు పాలకుర్తికి చేరుకొని, ఐలమ్మ పొలంలోకి దిగారు. ఐలమ్మ సంఘం నాయకులతో కలిసి దేశ్‌ముఖ్‌ గూండాలను ఎదుర్కొన్నది. నాలుగు వందల మంది దేశ్‌ముఖ్‌ గూండాలను సంఘం కార్యకర్తలు తరిమికొట్టారు. బిత్తరపోయిన గూండాలు పారిపోయారు.

”ఈ భూమి నాది… పండించిన పంట నాది… తీసుకెళ్ళడానికి దొరెవ్వడు?… నా ప్రాణం పోయాకే యీ పంట, భూమి దక్కించుకోండి” అంటూ ఐలమ్మ మాటలను తూటాలుగా పేల్చింది. సంఘం నాయకులు పండించిన ధాన్యాన్ని, మోపులు కట్టి, కొట్టి ఐలమ్మ ఇంటికి చేర్చారు.

రామచంద్రారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. జరిగిన పరిణామాలను జీర్ణించుకోలేకపోయాడు. పోలీసులను పురమాయించాడు. ”ధాన్యాన్ని నా ఇంటికి తేండి. సంఘం నాయకులను చావగొట్టండి” అని హుకుం జారీచేశాడు. తన పొలంపై దాడిచేసి కమ్యూనిస్టులు ధాన్యాన్ని దొంగతనంగా తీసుకెళ్ళారని పోలీసులతో కుమ్మక్కై కేసు బనాయించాడు. సంఘం నాయకులు భీమిరెడ్డి నర్సింహారెడ్డి తదితరులను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. మూత్రం తాగించారు. తలల్ని వంట పొయ్యిలో పెట్టారు. ఆసనాల్లో కారం చల్లారు. యీ చిత్రహింసల్ని, తప్పుడు కేసుల్ని ఆంధ్ర మహాసభ తీవ్రంగా ఖండించింది.

ఐలమ్మ భూ పోరాటం మొత్తం తెలంగాణ నైజాం సంస్థానంలో భూ పోరాటాలకు ఊపునిచ్చింది. పోరాటాలు విస్తృతమయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న నాయకులకు అన్నం పెట్టేందుకు ఐలమ్మ పడరాని పాట్లు పడ్డది. గంపల్లో తీసుకెళితే పోలీసులు పట్టుకుంటారని చాకలి బట్టల మూటల్లో అన్నం తీసుకెళ్ళి కమ్యూనిస్టు దళాలకు పెట్టింది. సాహసం, ధైర్యం ఐలమ్మ ఊపిరి. ఐలమ్మ భూ వివాదంలో ఓటమి పాలైన దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి పాలకుర్తిపై అనేకసార్లు దాడులు జరిపించాడు. బాబు దొర పోలీసులతో ఐలమ్మ ఇంటికొచ్చి ”కమ్యూనిస్టులకు ఎందుకు సాయం చేస్తున్నావు” అని ప్రశ్నించాడు. ఐలమ్మ బెదరలేదు. రోకలి బండను అందుకున్నది. బాబు దొర తోక ముడిచాడు.

4. రజాకార్ల దాడులు

సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతంగా జరుగుతున్న యీ కాలంలోనే ఐలమ్మ ఇంటి మీద రజాకార్లు, దేశ్‌ముఖ్‌ గూండాలు దాడి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. గాబులు, కుండలు, కాగులు పగులగొట్టారు. ధాన్యాన్ని దోచుకున్నారు. ఐలమ్మ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఐలమ్మ బిడ్డ సోమనర్సమ్మ దుర్మార్గులకు దొరికింది. రజాకార్లు సోమనర్సమ్మను ఆగం చేశారు. ఈ పోరాటంలో ఐలమ్మ కుటుంబం చెల్లాచెదురైంది. అష్ట కష్టాలు పడ్డది. అయినా ఐలమ్మ ధైర్యంగానే నిలబడ్డది.

ఐలమ్మ ఇంటిపై రజాకార్ల దాడి అనంతరం పాలకుర్తి ప్రజలు ఆగ్రహంతో పోలీస్‌ పటేల్‌ శేషగిరిరావు ఇంటిపై దాడి చేసి కూల్చివేశారు. భూస్వామి వీరారెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. ఆంధ్ర మహాసభ ఈ ఘటనల్లో కీలకపాత్ర వహించింది. ప్రజలు నూతనోత్తేజంతో విసునూరు, కడవెండి గడీలపై దాడి చేశారు. కడవెండిలో ప్రజలపై విస్నూరు దొర గూండాలు, నైజాం రజాకార్లు జరిపిన కాల్పుల్లో 1946 జూలై 4న దొడ్డి కొమరయ్య ప్రాణాలు కోల్పోయి అమరుడైనాడు.

ఐలమ్మ భూమి కోసం, నమ్మిన ఆశయం కోసం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరాడింది. ఎన్ని కష్టాలు వచ్చినా చలించలేదు. ఎర్ర జెండాను ఎత్తుకున్నది. 1985 సెప్టెంబర్‌ 10న పాలకుర్తిలో తన మనుమరాలి ఇంట్లో మరణించింది. ఆ విప్లవమూర్తి, పోరు తల్లికి విప్లవ జోహార్లు.

(నవ తెలంగాణ సౌజన్యం)

 

One thought on “చాకలి ఐలమ్మ జీవితం నాలుగు ముక్కల్లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *