(యనమల రామకృష్ణుడు)
జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలను జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా అణచివేస్తోంది. గడచిన 27 నెలల్లో బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఒక్క పథకమైనా ప్రవేశపెట్టారా.? బీసీలను జగన్ రెడ్డి అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారంటూ వైసీపీ నేతలు మాట్లాడడం బీసీలను మోసం చేసే ప్రచారం మాత్రమే.
1. జీవో నెం.217తో మత్స్యకార సొసైటీలను నిర్వర్యం చేస్తూ.. సొసైటీ ఆదాయం మొత్తాన్ని అధికార పార్టీ నేతల చేతుల్లో పెట్టాలనుకోవడం నిజం కాదా?
2. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం.. ఆయా కార్పొరేషన్లకు కేటాయించిన నిధులెన్ని, చేసిన ఖర్చు ఎంత ?
3. చేనేతలకు నేతన్న నేస్తం అంటూ హడావుడి చేస్తూ.. రూ.లక్షకు పైగా అందే సబ్సిడీలను, ప్రోత్సాహకాలను నిలిపివేయడం నేతన్నలను దెబ్బతీయడం కాదా?
4. ఆదరణ పనిముట్లు లబ్దిదారులకు ఇవ్వకుండా తుప్పుపట్టించారు. బీసీలు చెల్లించిన డిపాజిట్లను కూడా తిరిగి ఇవ్వకపోవడం ద్రోహం కాదా?
5. బీసీ విద్యార్ధులు ఎక్కువగా లబ్ది పొందుతున్న విదేశీ విద్యను నిర్వీర్యం చేయడం వారి భవిష్యత్తును బుగ్గిపాలు చేయడం కాదా?
6. బీసీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం బీసీల భవిష్యత్తును నాశనం చేయడం కాదా?
7. దేశ వ్యాప్తంగా బీసీ జన గణన కోసం ఆందోళనలు చేస్తుంటే జగన్ ప్రభుత్వం బీసీ జన గణన గురించి నోరు మెదపకపోవడం బీసీలను వంచిస్తోందనడానికి నిదర్శనం కాదా.?
8. సెంటు పట్టా పేరుతో బీసీల వేలాది ఎకరాల అసైన్ మెంట్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం బీసీలను బలహీనపరచడం కాదా.?
9. మడ అడవుల్ని నాశనం చేసి వేలాది మంది మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసింది నిజం కాదా?
10. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34% నుండి 24%కి కుదించి 16,800 మందిని రాజకీయ పదవులకు దూరం చేయడం బీసీలను ఉద్దరించడమా.. ద్రోహం చేయడమా?
11. వెనుకబడిన వర్గాలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కోరుతుంటే.. జగన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదు?
12. రిజర్వేషన్లు 50శాతం దాటకూడదని సుప్రీంకోర్టు పేర్కొనడంతో మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలు 50శాతం పరిమితి తీసేయాలంటూ విన్నవించాయి. ఈ విషయంలో మీరెందుకు నోరు తెరవడం లేదు?
13. బీసీ కాంపోనెంట్ ప్లాన్ ద్వారా రుణాలిచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కార్పొరేషన్ల నుండి రూ.18,226 కోట్లు దారి మళ్లించి కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడం బీసీ ద్రోహం కాదా.?
14. నిధులు, విధులు ఉన్న నామినేటెడ్ పదవులు, సలహాదార్లలో బీసీలకు అత్యల్ప స్థానమిచ్చి.. సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం బీసీలను అణగదొక్కడం కాదా?
15. మీ అవినీతి దాహానికి బలహీన వర్గాలను బలి చేశారు. ఉచిత ఇసుకను రద్దు చేసి.. 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. చేపలు, మాంసం అమ్మకాల పేరుతో ఆయా వృత్తులపై దశాబ్దాలుగా ఆధారపడిన బీసీల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
16. రెండేళ్లలో 254 మంది బీసీలపై దాడులకు పాల్పడ్డారు. ఆస్తులు విధ్వంసం చేశారు. 11 మంది టీడీపీ బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు. వేధిస్తున్నారు. ఇదేనా బీసీలకు మేలు చేయడం?
17. అనర్హుల పేరుతో రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగిస్తున్న జాబితాలో బీసీలే అధికంగా ఉన్నారన్నది వాస్తవం కాదా.? రేషన్ పెన్షన్ కూడా అందకుండా చేయడం బీసీలను అవస్థలకు గురి చేయడం కాదా?
అడుగడుగునా బీసీలను వంచిస్తూ.. బీసీలను ఉద్దరించేస్తున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ఇకనైనా మానుకోవాలి. బీసీలకు మేలు చేస్తున్నామన్న మాట నిజమే అయితే ఈ ప్రశ్నలకు సమాధానమివ్వండి.
(యనమల రామకృష్ణుడు,టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు)