– కిమిడి కళా వెంకట్రావు
జగన్ రెడ్డి విడతల వారీగా కరెంటు చార్జీలు పెంచుతూ రెండు విడతల కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారు.
తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని పాదయాత్రలో ప్రతి ఊరు తిరిగి చెప్పిన జగన్ మాట తప్పి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 5 సార్లు కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం 6 వ సారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్దమైంది.
వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలన, అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి. విద్యుత్ బిల్లులు చూసి ఇళ్లల్లో గుడ్డి దీపాలు వాడుతున్నారు. విద్యుత్ వంక చూస్తేనే షాక్ కొట్టేలా బిల్లులు వేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
గతంలో వంద రూపాయల బిల్లు వస్తే ఇప్పుడు వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి.ఉన్నదంతా ఊడ్చి బిల్లులు కడితే మహిళలు ఏ విధంగా సంసారాలు నడుపుకోవాలి. రెండున్నరేళ్లలోనే రూ. 11,611 కోట్లు విద్యుత్ ఛార్జీల భారం మోపారు.
రెండున్నరేళ్లలో 5సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ప్రభుత్వం:
2020 ఫిబ్రవరి లో 500 యూనిట్లు దాటిన వారిపై యూనిట్ పై (పాత రేటు రూ. 9.05 పైసలు) 90 పైసలు పెంచి (కొత్త రేటు రూ.9.95 పైసలు) జగన్ రెడ్డి ప్రభుత్వం రూ. 1300 కోట్లు భారం ప్రజలపై మోపారు.
2020 ఏప్రిల్, మే నెలలో స్లాబులు మార్చి కరోనాతో ప్రజలకు పూట గడవడమే ఇబ్బందిగా ఉన్న పరిస్ధితుల్లలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై రూ. 1500 కోట్లు భారం మోపారు. 2021, ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ ఆర్డర్ ను తీసుకొచ్చి కిలో వాట్ కు రూ.10 ఛార్జీలతో 20 శాతం ఛార్జీల ను పెంచింది.
స్థిర ఛార్జీలు లేవంటూనే కిలోవాట్ కు రూ. 10 వడ్డనతో 20 శాతం బిల్లులు పెంచారు. దీనితో వినియోగదారులపై దాదాపు రూ. 2600 కోట్ల వరకు భారాన్ని మోపారు. తర్వాత ప్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్ మెంట్ పేరుతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి పెరిగిన విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ప్రజల వద్ద నుండి వసూలు చేయాలని నిర్ణయించారు.
ట్రూఅప్ ఛార్జీల పేరుతో వినియోగదారుల నుండి రూ. 3669 కోట్లు వసూలు చేసేందుకు ఆంధ్రప్రదేశ విద్యుత్ నియంత్రణ మండలి (ఏ.పి.ఈ.ఆర్.సి) డిస్కంలకు అనుమతులిచ్చింది. ట్రూ అప్ ఛార్జీలు పెంచి నెల కూడా తిరక్కముందే మరోసారి ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.2542 కోట్లు పెంచనున్నారు.
6వ సారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది
డిస్కంలు మరోసారి ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.2542.70 కోట్ల భారాన్ని ప్రజలపై మోపనుంది.
దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏ.పీ.ఎస్.పి.డీ.సీ.ఎల్) పరిధిలో రూ. 1841.58 కోట్లు, తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏ.పీ.ఈ.పీ.డి.సి.ఎల్) పరిధిలో రూ. 701.12 కోట్లు ప్రజల నుండి వసూలు చేసేందుకు డిస్కంలు ఏ.పి.ఈ.ఆర్.సి లో ట్రూఅప్ పిటీషన్ ధాఖలు చేశాయి.
2019-20 లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు తగ్గినా ప్రభుత్వం సర్ధుబాటు (ట్రూఅప్) ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం దుర్మార్గం. అనుమతించిన 41,604.68 మిలియన్ యూనిట్ల కంటే 1259.63 మిలియన్ యూనిట్లు తక్కువ కొనుగోలు చేసినా డిస్కంలకు ఛార్జీలు పెంచాల్సిన దుస్థితి జగన్ ప్రభుత్వం కల్పించింది.
సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, బొగ్గు కొరత, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి సరిపడా విద్యుత్ రాబట్టలేకపోవడమే రూ.2542.70 కోట్ల సర్ధుబాటు ఛార్జీలకు కారణాలు అంటూ డిస్కంలు ట్రూఅప్ పిటీషన్ లో పేర్కొన్నాయి.
దీనితో టారిఫ్ ఆర్ధర్ అనుమతించిన 203.56 మిలియన్ యూనిట్ల కు బదులు 1084.11 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరకు కొనుగోలు చేయడం. ఏ.పీ.ఈ.ఆర్.సి బహిరంగ మార్కెట్ లో యూనిట్ విద్యుత్ ధర రూ. 2.97 లకు కొనాలని అనుమతించినా ఇష్టానుసారం అధిక రేట్లకు విద్యుత్ కొన్నారు.
రెనెవబుల్ ఎనర్జీ (సౌర, పవన) విద్యుత్ పిపిఏ లను రద్దు చేయొద్దని తెలుగుదేశం మొత్తుకున్నా జగన్ రెడ్డి మొండివైఖరితో వ్యవహరించడం వల్లే నేడు ప్రజలపై రూ.2542.70 కోట్లు అధనపు భారం పడుతుంది. ముందు కరెంట్ చార్జీలు పెంచమని పోలవరం పునరావాస కాలనీల్లో సైతం విద్యుత్ బిల్లులతో జగన్ రెడ్డి ప్రజల నడ్డి విరుస్తున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 24,491 కోట్లు అప్పు తెచ్చినా ఆ అప్పు తన అవినీతికి, దుబారాకు జగనార్పణం చేసారు. పెంచిన విద్యత్ చార్జీలను వెంటనే తగ్గించాలి.
( కిమిడి కళా వెంకట్రావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి)